Tuesday, June 2, 2026

 *నేనెవరో తెలుసుకోండి*

అధికారమనేది నడమంత్రపు సిరి- ముఖ్యంగా రాజకీయ రంగంలో! నడమంత్రపు సిరి, నరాలమీది కురుపు మనిషిని కుదురుగా ఉండనీయవన్నారు- తమ ఆత్మకథలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. అహంకారానికి అధికారమే పునాది. అధికారానికి అహంకారమే సమాధి. అధికార దురహంకారం నిజానికొక విషపానీయం. 

విషం నిలువెల్లా వ్యాపిస్తే జనం పూడుస్తారు- భూమిలో! జనహితం కోసం కంఠంలో దాచేస్తే- పూజిస్తారు గుళ్లో! ‘ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ చూచి...’ దురహంకారంతో దుర్యోధనుడు దురాగతానికి ఒడిగట్టాడు. 

దాంతో వంశం సమూలంగా నాశనం అయింది- మహాభారతంలో! కొందరు నేతల అధికార మదానికి జనమంతా నట్టేట్లో మునగడాన్ని మనం కళ్లారా చూశాం- ప్రజాభారతంలో! నాయకత్వానికి అర్థం తెలిసిన వారు అహంకారాన్ని అణిచిపెడతారు. 

జాతీయ కాంగ్రెస్‌ మహాసభల ప్రవేశద్వారం దగ్గర ఆపి ‘మీ గుర్తింపు చిహ్నం ఏది’ అని నిలదీసిన సాధారణ కార్యకర్త దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ను నెహ్రూ ‘నేనెవరో తెలుసా’ అని గద్దించలేదు. ‘ఆమె ఎవరో తెలుసుకోండి’ అన్నారు మెచ్చుకోలుగా! నిక్కచ్చితనానికి దక్కిన గౌరవం అది. 

ప్రజా ప్రాతినిధ్యాన్ని- పెత్తనంగా భావిస్తున్న రోజులివి. రాజకీయం- తొలుత పెట్టుబడి, దరిమిలా దోపిడీగా పరిణమించిన కాలమిది. 

పరరాజ్యం పోయి ప్రజారాజ్యమేర్పడినా, అది కొందరికి మజా రాజ్యంగా, చాలామందికి క్షుధా రాజ్యంగా’ మారిందన్నారు మహాకవి జాషువా. 

అడవిలో ఎన్నికల వేళ చెట్లన్నీ తమ ఓట్లు గొడ్డలి గుర్తుకు వేశాయి, గుత్తగా- గొడ్డలికి ఊతం ఇస్తున్నది తమ జాతికే చెందిన కర్ర కాబట్టి! ఆ గొడ్డలే చెట్లన్నీ నరికేసింది. అలాంటప్పుడే జనరాజ్యం- క్షుధారాజ్యంగా మారుతుంది. 

చీరాలలో సమావేశానికి సమయం మించిపోతోందని సహచరులు తొందరపెడుతుంటే ‘పది నిమిషాలు ఆగండ్రా- ఇంకో రెండు కుట్లు ఉండిపోయాయి’ అంటూనే చిరిగిన చొక్కాతో బయటకొచ్చారు- అప్పట్లోనే దేశానికి లక్షల రూపాయలు ధారపోసిన టంగుటూరి ప్రకాశం. 

సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞమునందు హోమమ్మొనర్చిన సోమయాజి’గా, ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి నాయకులతోనే ప్రజా రాజ్యాలు ఏర్పడతాయి. 

ఆ నిజాయతీ, నిరాడంబరతలే ప్రకాశాన్ని- ప్రముఖ దేశ నాయకుల ఎదుట ధీమాగా తలెత్తుకు నిలబడేలా చేశాయి.

No comments:

Post a Comment