*నేను నేనైన నేను...నేను...నేను*
'సంభవామి యుగే యుగే' అన్నా, 'ఆత్మానం సృజామ్యహం' అన్నా అది పరమాత్మ భాషే. స్మృతులెన్ని ఉన్నా వర్తమానంలో జీవించటమే సత్యం.
రామకృష్ణాది అవతారాలన్నీ 'పురా' స్థితి నుంచి ‘పునా' స్థితిలోకి ప్రవేశించినవే. పురా అంటే పాత, పునా అంటే కొత్త! ఉన్నదదే, స్థితులు వేరు. జన్మలన్నీ ప్రవాహాలు, ఉన్నవన్నీ మలుపులు. సాగర సంగమం వరకూ జన్మంతా ఆగని చైతన్య ధార.
ఆత్మ సర్వ వ్యాపకమని, సర్వ శక్తివంతమని నిజానికి ఉన్నదంతా ఆత్మేనని పుర్ణాద్వైత భావన. శంకర భగవత్పాదులు ‘ఆత్’ అంటే ఏమీ, ‘మా’ అంటే లేదని అన్నారు.
ఆత్మ అంటే ప్రత్యేకంగా లేదని భగవత్పాదుల హృదయం. ఉన్నదంతా ఆత్మే అనుకుంటే మరణం తప్పని దేహం, మరణ మెరుగని ఆత్మ కలిసి ఉండటం ఒక విచిత్ర స్థితి. అయినా అది ఒక యదార్థ స్థితి.
సనాతన ధర్మ విచారణలో పునర్జన్మ ప్రధానాంశం. మళ్ళీమళ్ళీ జన్మ ఎత్తటం ఉన్నదన్న సంప్రదాయక, ఆధ్యాత్మిక భావన పునర్జన్మ.
మరణ సమయంలో స్థిర మైన ఆలోచన మరుజన్మకు పునాది అనీ, కర్మ ప్రారబ్దాలు పూర్తి కాకుండా మర ణిస్తే, వాటిని అనుభవించటానికి మళ్ళీ జన్మ వస్తుందనీ, ముక్తి లభించే వరకూ జన్మలు వస్తూనే ఉంటాయనీ రకరకాల వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం.
కాస్త లోతు గా విచారిస్తే తల్లి గర్భం నుంచి సమాధిగతమయ్యే వరకూ శరీరం మార్పు చెంది మరణ స్థితికి చేరుకుంటున్నది. కనుక మరణిస్తున్నది దేహమని అర్థమవుతోంది.
పంచభూతాత్మకం కనుక తిరిగి పంచభూతాల్లో కలుస్తున్నది. మరణం దేహానికే పరిమితమైన ఒక మహాద్భుత సృష్టి రహస్యం. ఒక అధివాస్తవిక పరిణామం. జీవులందరికీ అనివార్య యోగం.
నీట నానని, నిప్పున కాలని, గాలికి చెదరని, మంటి నుంచి మింటి వరకూ వ్యాపించిన ఆత్మకు పుట్టుకాలేదు, మరణమూ లేదని వేదాంత విచారణ. ఆత్మ సర్వ వ్యాపకమని, సర్వ శక్తివంతమని నిజానికి ఉన్నదంతా ఆత్మేనని పుర్ణాద్వైత భావన.
శంకర భగవత్పాదులు 'ఆత్' అంటే ఏమీ, 'మా' అంటే లేదని అన్నారు. ఆత్మ అంటే ప్రత్యేకంగా లేదని భగవత్పాదుల హృదయం. ఉన్నదంతా ఆత్మే అను కుంటే మరణం తప్పని దేహం, మరణ మెరుగని ఆత్మ కలిసి ఉండటం ఒక విచిత్ర స్థితి. అయినా అది ఒక యదార్థ స్థితి. ఇంతకీ పునర్జన్మ ఎవరికి? దేహానికా, ఆత్మకా?*
ఉద్దాలకుడు శ్వేతకేతువుకు పరిచయం చేసిన 'నేను' సనత్కుమారుడు నారద మహర్షికి బోధించిన 'నేను' అష్టావక్రుడు, జనకుడు విచారించిన 'నేను' 'నేను'ను తెలుసుకోగలిగితే అన్నిటినీ తెలుసుకున్నట్టు అంటూ నిరంతరం బోధించి, ఆ స్థితిలోనే నిలచిన రమణ మహర్షి.
స్పృశించిన 'నేను' 'నేను నేనైన నేను' అంటూ అవస్థాత్రయాతీత స్థితిని ఆవిష్కరించిన జిల్లెళ్ల మూడి అమ్మ ప్రతిపాదించిన 'నేను'... 'నేను' మేనును భరిస్తున్నదా? 'మేను' నేనును భరిస్తున్నదా? ఈ రెంటిలో పునర్జన్మ లేని స్థితి దేని పరం?*
ఇచ్ఛా, క్రియా జ్ఞాన సమ్మేళనమై, విజ్ఞాన పరిపూర్ణమై, మనోబుద్ధి, చిత్యహంకారాలకు అతీతమైన అహం స్పురణే 'నేను'! సర్వేంద్రియాలకు, మనసుకు అధిష్ఠానమైన, మూలమైన, ప్రేరకమైన 'నేను' ఆత్మకు పర్యాయ పదం.
ఒకటి నడిచేది, రెండోది నడిపించేది. నడిచేదానికి, ఆగటం తప్పదు, నడిపించే దానికి నడక లేదు కనుక దానికి ఆగటం అంటూ లేదు.
కర్మలు, వాటికి సంబంధించిన అను భవాలు ఎప్పటికప్పుడే! ఎక్కడికక్కడే! అనుభవించటానికే ఆత్మ అనుకుంటున్నాం కనుక, గతించినవన్నీ గుర్తులే కనుక, ఆనందం, భయం, బాధ వంటివాటినన్నిటినీ సమన్వయం చేసుకోవటం కనుక, గతం మిగిలి ఉన్నట్లే ఉంటుంది.
శరీరపరంగా కొన్ని లక్షల కణాలు పుడుతూ, గిడుతూ సాగే ప్రక్రియ కొనసాగు తూనే ఉంది శ్వాసకు శ్వాసకు మధ్య ఏ మాత్రం దీర్ఘ వ్యవధి ఏర్పడినా మరణం తథ్యం.
ఆలోచనకు ఆలోచనకు మధ్య ఉండే విరామం మరణమే. ఆ స్థితిలో దాని పేరు మరపు. జీవితంతో ఏర్పడే దశలు, ఆయా దశలలో ఏర్పడే పరిచయాలు, వ్యక్తులు, అన్నీ మరుగున పడేవే. స్మృతిగా మిగిలేవే.
ఇంతటి అవ్యవస్థ మధ్యా, సంస్థితమైన 'నేను' ఏ మార్పుకూ లోను కాకుండా స్థిమితంగా ఉంటున్నది. ఈ వితర్కానికి తెరదించుతూ నిరాకార పరబ్రహ్మ తత్త్వమే సాకార, సగుణ, స్వభావంగా, మూర్తిమత్వంగా వచ్చి, ఆత్మ ఒక దేహాన్ని ధరించినపుడు ఎట్లా జీవిస్తుందో బోధిస్తుంది. దాన్ని అవతారమని, భగవదంశ అని భావిస్తాం.
No comments:
Post a Comment