"మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే, మనం కూడా వాళ్ళతో అలానే ప్రవర్తించాలి , ఇదే ధర్మం " ఇది నిజంగా మహాభారతంలో చెప్పబడిందా ? చెప్పివుంటే ఏక్కడ? ఏ సందర్భంలో ?
రామాదివత్ ప్రవర్తితవ్యం..న రావణాదివత్ అని చెప్పడమే మన ప్రాచీన కావ్య పురాణాల లక్ష్యం.
ధర్మ అధర్మాల సంఘర్షణ ఎపుడూ ఉండేదే. రమణ మహర్షి ఉన్నపుడే —* నిన్ను షూట్ చేసి పేరు తెచ్చుకొంటాను * అన్నవాడూ ఆయనకు ఎదురయ్యాడు. ఆయన" సరే కానీ- ఈ శరీర బంధం తొలగి పోతుంది" అని అన్నాడు అచలుడై.
కొంపలో పెట్టి తగలబెట్టిన వాళ్లతోనే సాధ్యమైనంత వరకూ కలిసి ఉండాలనీ , వాళ్లను ఎవడో పట్టుకుపోయి చంపేయ బోయినపుడు " మన తమ్ముడు వాడు. వెంటనే వెళ్లి బయటికి తీసుకురండి! " అని చెప్పిన ధర్మం మనది.
శరణు చొచ్చినపుడు రావణునంతటి మహాదోషిని ఆతతాయిని..కనబడగానే చంపివేయవలసిన వాడిని — క్షమాపణ కోరితే వదలివేయడానికి సిద్ధమైన శ్రీ రాముడు మనకు ఆదర్శం.
అలాగే * లోక కంటకులైన (కేవలం తనకు కాదు ) దుష్టులను ధర్మం తప్పి నడిచే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళను ఎలాగైనా ఆ స్థానం నుంచి తప్పించి , శాశ్వత ధర్మాలు చెడకుండా కాపాడాలి.* .అనే ధర్మ సూక్ష్మమూ మనం పాటించేదే.
రాజపురుషులను తన అధికార స్థిరత్వం కోసం బలిచేయదలచిన జరాసంధుణ్ణి కపటోపాయంతో నైనా పదభ్రష్టుణ్ణి చేయడం చూస్తాం . ఆ పదవి తన స్వార్థం కోసం కాదు. ఆతడి కొడుకు సహదేవుడే ఆ స్థానంలో నిలపబడ్డాడు. అలాగే అంగదుడు వాలి కొడుకు వాలి స్థానం పొందాడు. [రాజపదవిలో ఉండి ఆదర్శంగా ఉండవలసిన వాలి కామపరుడు కావడం , రావణుడూ అదే విధంగా మోహవిభ్రాంతిలో పడి, ఎవరి ఉపదేశమూ వినక పోవడమూ వాళ్ల శిక్షార్హతను నిరూపిస్తాయి.]
కౌరవులు రహస్యం గా చంపే ప్రయత్నాలు చేసినా వాళ్లను కపటోపాయాలతో చంపివేయాలి— అని పాండవులు ఎపుడూ అనుకోలేదు. రావణుడు దొంగ గా రాముడు లేనపుడు సీతమ్మను అపహరించినా , రాజ ధర్మం పాటించి అతణ్ణి దోషిని యుద్ధం లో పరాజితుణ్ణి చేసి తనను తీసుకు పోవడమే ధర్మం— అని ఆ మహారాజ్ఞి చెబుతుంది. అంతే కాదు. రావణ వథ కాగానే హనుమ * వీళ్ళు నిన్ను నిరపరాధిని నానా బాధలు పెట్టారు. ఈ రాక్షస స్త్రీలను దండిస్తాను …అనుమతిస్తే*..అని ఆవేశపడినపుడు ఆమె ఎంత ఉదాత్తంగా మాట్లాడింది! —-రాజ సేవ వాళ్ల వృత్తి... రాజాజ్ఞ పాటించారు. వాళ్లలో ఏ తప్పూ లేదు..ఆవేశపడకు ! అంటుంది ఆ తల్లి.
భీముడు ( సభాపర్వంలో) —ద్రౌపది పట్ల అనుచితంగా దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ ప్రవర్తించినా తాను వాళ్లను *ఉగ్ర రణాంతరంబునన్ * శిక్షిస్తాను అన్నాడు గానీ వాళ్ల మాదిరిగానే వీథి రౌడీగా స్వైర విహారం చేస్తాననలేదు.
ఏ వ్యక్తి పాప పుణ్యాలు అతని వెంట వస్తాయి. ఎదుటి వాడు ఎట్లా నడుచుకొన్నా తాను స్వధర్మం వీడగూడదు; తప్పితే తనకు అపకీర్తీ, అసద్గతీ కలుగుతాయి అని నమ్మి నడచిన రోజులవి.
పై మాట భీముడు ఎక్కడైనా తమ అన్నదమ్ముల మధ్య చర్చలో అని ఉండవచ్చు గానీ, ఆ లాంటి చర్య లకెపుడూ దిగజారలేదు.
No comments:
Post a Comment