🪷🙏🏻🪷🙏🏻🪷
*శ్రీ గురుభ్యోనమః*
హృదయంలో ఉన్న నిజం గురించి ఎలా చెప్పాలంటే ... సాఫ్ట్ గా చెప్పాలి, స్వీట్ గా చెప్పాలి. మన హృదయంలోని నిజతత్వం మీకు ఎవరికైనా అనుభవంలో ఉంటే, దాని గురించి తియ్యగా చెప్పాలి కానీ, చేదుగా చెప్పకూడదు. అది నిజమైనా చేదు చేదుగా చెప్పకూడదు.
గోడకి మేకు కొట్టినట్టు, హృదయంలో ఎవరి మనస్సయితే ఫిక్స్ అయిపోయి ఉందో, వాడు కొంతకాలానికి జీవన్ముక్తుడు అవుతాడు. జీవన్ముక్తుడు అంటే ఏమిటి ? నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే, ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే మోక్షసుఖం, ముక్తి సుఖం, ఆత్మసుఖం అనుభవంలోకి వస్తుంది. అది అమృతానుభవం. అప్పుడు ఇంక పునర్జన్మ ఉండదు.
ఇప్పుడు మనందరం చేసే పని ఏమిటి ? మనకు ఎవరైనా అరటి పండు ఇచ్చారనుకోండి ... అరటిపండు గుజ్జు తీసి బయట పడేస్తున్నాం, తొక్కలు మాత్రం చేతిలో పెట్టుకొని తింటున్నాం. అంటే లోపల గుజ్జు తిని తొక్కలు బయటపడేయాలి. మనం తొక్కతిని గుజ్జు బయటపడేస్తున్నాం. అది మనం చేసే పని.
సాధన చెయ్యటం మంచిదే ... ఎంతకాలం చెయ్యాలి అంటే ... భగవాన్ చెపుతున్నారు ... *అన్ని వాసనలు, అన్ని సందేహాలు నశించేవరకు సాధన అవసరమే !* మందు ఎంతకాలం వాడాలి ? శరీరంలో ఉన్న రోగం తగ్గేవరకు వాడాలి. *సాధన ఎంతకాలం అవసరం ? నీ వాసన వేరుతో సహా నశించేవరకు, నీ సందేహాలన్నీ వేరుతో సహా నిర్మూలం అయ్యేవరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండవలసిందే ! నీ మనస్సుని నువ్వు నమ్మడానికి వీలులేదు. మూల తలంపు దాని మూలంలో నశించాలంటే ... నీ సాధన ఒక్కటే సరిపోదు. సాధన అవసరం. కానీ సాధన ఒక్కటీ సరిపోదు. ఈశ్వరానుగ్రహం, గురువనుగ్రహం కూడా ఉండాలి.*
*చలం గారు అంటూ ఉండేవారు..* భగవాన్ ని నేను పట్టుకున్నప్పటి కంటే, భగవాన్ నన్ను పట్టుకున్నప్పుడే బాగుండేవాడిని. నా అంతట నేను ప్రయత్నం చేసి, ప్రయత్నం చేసి ఆయన్ని అంటిపెట్టుకున్నప్పటికంటే, ఆయన సహజంగా నా హృదయంలోకి వచ్చినప్పుడు చాలా బాగుండేది, నాకు ఆనందంగా ఉండేది, మనసు చల్లగా ఉండేది అన్నారు. మన కృషి మనం మానకుండా ఉంటే, మన బుద్ధిలో ఆ విశ్వాసం విడిచిపెట్టకుండా ఉంటే, *అనుగ్రహం ఏదో ఒకరోజున వస్తుంది. వస్తుందో, రాదో అని సందేహం అవసరం లేదు. ఈశ్వరుని స్వరూపమే అనుగ్రహం !*
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*పోడూరు :* 2000 / 08 / 10
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment