అనంతరాముడు కథ 8
నిజాయితీ:
(రచన : మంగు కృష్ణ కుమారి గారు)
కూనలపల్లి గ్రామం పేరుకు తగ్గది. ఇంటింటా పిల్లలు కనిపిస్తారు. అన్ని వయసుల పిల్లలు చదువుల్లో, ఆటల్లో చాలా చురుకుగా ఉంటారు.
ఊరి జనాలు పొరపొచ్చాలు లేకుండా, ఐకమత్యంతో ఉంటారు.
ఆ ఊర్లో సూరన్న అనే కష్టజీవి ఉన్నాడు. అతనికి ఎలాటి ఆస్తిపాస్తులూ లేవు. పంటపొలాలూ లేవు. కనీసం సొంతంగా ఓ గుడిసె కూడా లేదు. ఓ పూరి గుడిసె అద్దెకి తీసుకొని ఉంటున్నాడు.
ఈ సూరన్నకి చదువంటే చాలా ఇష్టం. ఒక్క కొడుకు రంగబాబు బాగా చదువుకోవాలని అతని కోరిక.
అందుకే భార్యని కొడుకుతో పట్నంలో ఉంచేడు. తన రెక్కల కష్టంతో సంపాదిస్తూ, భార్యా కొడుకులకే అంతా పంపిస్తూ తను ఇంత గంజో, జావో కాచుకొని తాగి గడుపుకుంటున్నాడు.
అతనికి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలని బడికి దింపడం, బడినించీ తేవడం లాటి సాయాలు చేసేవాడు. ఊళ్ళో అందరికీ సూరన్న అంటే చాలా గౌరవం. అంతకన్నా నమ్మకం ఎక్కువ.
ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. పిట్టలు గూడు వదిలి రాడం లేదు. ఎండ తాపానికి, తప్పనిసరి పని ఉన్న వాళ్ళు మాత్రమే బయట తిరుగుతున్నారు.
కొందరు పిల్లలు మాత్రం ఎలాటి ఎండ భయం లేకుండా హాయిగా గెంతుతూ, పరిగెడుతూ ఆడుకుంటున్నారు. వాళ్ళకి అప్పుడు వేసవి సెలవలు.
సూరన్న పొలంలో ఎండుగడ్డి కోసి కట్టకట్టి ఒక గోనె అంకంలో వేసి తెస్తున్నాడు. పిల్లల ఆట పాటలు చూస్తూ తనలో తను ‘వీళ్ళకి ఈ ఎండ ఒక లెక్క కాదు’ అనుకున్నాడు.
శ్రీనివాసు, బంగార్రాజు, సంగయ్య, జగ్గూ కలిసి ఆడుతున్నారు. బాటకి ఒకవైపు కొంత మట్టి జాగా ఉంది. అక్కడ ఎండలో ఒక కుక్క గాఢ నిద్రలో ఉంది.
నలుగురూ చిలిపితనం ఎక్కువ అయి ‘ఈ కుక్క మీద రాళ్ళు వేద్దాం పదండి’ అంటూ రాళ్ళు పట్టుకొని అటు వెళ్ళేరు.
అప్పుడే అక్కడకి చేరిన సూరన పిల్లలతో “వద్దర్రా “ అని వారించే లోపలే జగ్గూ, సంగయ్యా కుక్కమీదకి నాలుగు రాళ్ళు విసిరేరు. రాళ్ళు గట్టిగా తగిలి కుక్క ‘భౌ భౌ’ అంటూ లేచి పరుగు అందుకుంది.
అప్పుడు చూసేరు అందరూ. అంతసేపూ కుక్క పడుకున్న దగ్గర
మూడు పేటల చంద్రహారాల గొలుసు పడి ఉంది. బంగార్రాజు “ఒరే గొలుసురా” అంటూ తీసేడు. ఒక లోటాడు నీళ్ళు తెచ్చి కడిగి చూస్తే మిలమిలా మెరిసింది.
“బంగారం గొలుసు” అంటూ పిల్లలు నలుగురూ కేకలు పెట్టేరు. సూరన్న ముందుకు వచ్చి “పిల్లలూ, ఈ గొలుసు ఎవరిదో తెలుసుకొని వాళ్ళకి ఇచ్చేద్దాం” అంటూ గొలుసు తను తీసుకున్నాడు. జగ్గూకి ఆ మాట నచ్చలేదు. ‘అంత గొలుసు ఎలా పడిపోయిందా?’ అని సూరన్న చూసేడు. బిళ్ళ దగ్గర మూడు పేటలకీ కలిపి ఉన్న లింకు తెగి ఉంది.
ఈలోపల సంగయ్య పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మలని పిలిచేడు. నలుగురి తల్లులూ వచ్చేరు. అందరూ ఆ గొలుసు తమ కొడుక్కి దొరికింది కాబట్టి తమదే అని వాదించేరు.
శ్రీనివాసు వాళ్ళమ్మ “అందరూ సమానంగా పంచుకుందాం” అంది.
ఈ మాటకి అందరూ సరే అన్నారు.
అప్పటిదాకా వాళ్ళ అసలు నైజాలు ఆశ్చర్యంగా చూస్తున్న సూరన్న తేరుకొని “అమ్మా ఎవరూ ఇంకోలా అనుకోకండి.ఈ నగ ఎవరిదో వాకబు చేయించి వారికి ఇచ్చేద్దాం” అన్నాడు.
ఈ మాట ఎవరికీ నచ్చలేదు. అది కనిపెట్టి సూరన్న “సరే! అనంతరాముడు గారికి చెప్దాం. ఆయన ఏం చెప్తే అదే!” అన్నాడు.
అనంతరాముడు పేరు వినగానే అందరూ తగ్గేరు. సూరన్న పిల్లలని తనతో తీసుకెళ్ళి అనంతరాముడికి నగ అప్పచెప్పి జరిగింది అంతా చెప్పేడు కానీ పిల్లల అమ్మలు నగ తమకే చెందాలని అన్న విషయం చెప్పలేదు.
అనంతరాముడు సూరన్నా, పిల్లల ధర్మబుద్ధిని పొగిడి తను పిలిచినపుడు పంచాయితీకి రమ్మన్మాడు.
తరవాత అనంతరాముడు ఒక ప్రకటన చేసేడు. “గత రెండుమూడు రోజుల్లో ఎవరయినా తమ బంగారు నగని పోగొట్టుకొని ఉంటే… నగ ఆనవాలు చెప్పి తన దగ్గరకి రావచ్చు.”
ఇది విని చాలామంది తమ ఉంగరం పోయిందనీ, జూకాలూ పోయేయని వచ్చేరు.
ఒక పేద స్త్రీ కళ్ళనీళ్ళతో తన పేరు జోగమ్మ అనీ, తన చంద్రహారాలు మూడు వరసలవి పోయేయని ఏడుస్తూ చెప్పింది.
అనంతరాముడు కబురు పెట్టి సూరన్ననీ, పిల్లలనీ, వాళ్ళ తల్లితండ్రులనీ, పంచాయతీకి రమ్మని పిలిపించేడు.
అనంతరాముడు ఆమెని మొత్తం వివరాలు అడిగేడు.
ఆమెది గవ్వల వలస గ్రామం. వితంతువే కాదు కడు పేదరాలు. ఇద్దరు పిల్లలని కష్టపడి పెంచుతున్నాది. ఆమె అమ్మమ్మ, తన పేరింటిదని తన మరణం తరవాత తన చంద్రహారాలు జోగమ్మకే ఇవ్వమంది. అలా ఆమెకి ఈ నగ వచ్చింది.
జోగమ్మ ఎన్ని కష్టాలు ఉన్నా, తన కూతురు పెళ్ళికి ఈ నగ ఇవ్వవచ్చని అమ్మకుండా దాచింది.
దగ్గర బంధువుకి బాగాలేదని తెలిసి చూసిందికని రావి కమతంకి వెళ్ళింది. ఇంటి దగ్గర నగ దాచిందికి భద్రత లేదని మెళ్ళో పెట్టుకొని వెళ్ళింది. తిరిగి వస్తూ బాడుగ బండీకోసం ముందుకి నడుస్తూ, తోవ తప్పి కూనలవలస గ్రామం చేరింది. ఆమెకి ఆ గ్రామం పేరు కూడా తెలీదట.
ఎండకి కళ్ళు తిరుగుతూ ఉంటే మట్టి జాగా దగ్గర కూలబడింది. ఇంకా ఆ మగత తగ్గకుండానే ఒక బండీ వస్తూ ఉంటే ఎక్కి తన ఇంటికి చేరింది. ఎండకి కళ్ళు తిరిగి పడి, మర్నాటి దాకా నగ సంగతి చూసుకోలేదు.
తరవాత ఎక్కడ పోయిందో బోధపడక తనలో తను ఏడ్చుకుంటున్నాది.
అంతా విన్న అనంతరాముడు ఆమెని ‘నగకి ఆనవాలు ఏదన్నా ఉందా?’ అనడిగేడు. ఆమె బిళ్ళమీద ఓ మూలకి, అమ్మమ్మ పేరు ఉందని చెప్పింది. అనంతరాముడు అప్పటికే బిళ్ళ మీద జోగమ్మ అన్న పేరు చూసేడు. ఆమెకి గొలుసు చూపించగానే ఆమె ఆనందంతో అది తనదే అని చెప్పింది.
అనంతరాముడు ఆమెకి సూరన్న, పిల్లల గురించి చెప్పి ఆ గొలుసు ఆమెకి అప్పచెప్పేడు. జోగమ్మ సూరన్న కాళ్ళ మీద పడింది. పిల్లలందరినీ ముద్దు చేసి, వాళ్ళ తల్లితండ్రులని మెచ్చుకుంది.
పిల్లల అమ్మలు తమ స్వార్థ బుద్ధిని తలచుకొని సిగ్గుపడ్డారు.
అనంతరాముడు జరిగిందంతా మహారాజుకి చెప్పేడు. ఆరునెలల తరవాత రాజధానిలో జరిగిన వేడుకలలో ఆ ఏడు ఇచ్చే ‘నిజాయితీ బహుమానం’ సూరన్నకి వచ్చింది.
సూరన్నకి సహకరించిన పిల్లలకీ, వాళ్ళ తల్లితండ్రులకీ కూడా ‘సహకార బహుమానాలు’ లభించేయి.
పిల్లల తల్లితండ్రులు సూరన్నకి తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
ఈ కథ సమాప్తం.
ఇంకో కథతో వచ్చేవారం కలుద్దాము.
🙏🙏🙏🙏🙏🙏🙏
యెనుముల
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment