Sunday, January 25, 2026

 ‘మాకూ ఒక కుటుంబం కావాలి!’ (కథ)
రచన: నండూరి సుందరీ నాగమణి.

అపరాహ్ణమౌతుంటే  భర్త కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోకీ, లోపలికీ తిరుగుతోంది రుక్మిణి. బాగా ఏడ్చినట్టుగా ఆమె ముఖం బాగా వాచి ఉంది. రాత్రి ఉన్నట్టుండి తొమ్మిదవ గదిలో ఉండే సుబ్బారావు నిద్రలోనే వెళ్ళిపోయాడు. అతన్ని తట్టి లేపబోయిన ఆయన రూమ్మేట్ వల్లభయ్యకు కాస్త ఆలస్యంగా తెలిసింది, సుబ్బారావుది శాశ్వతనిద్రని. వెంటనే విషయాన్ని మేనేజర్ మోహనరావుకి తెలియజేసారు. మోహనరావు వెంటనే ఇంటి నుంచి బయలుదేరి వచ్చేసరికే, ఆశ్రమంలోని అందరూ సుబ్బారావు గది దగ్గరే గుమిగూడి ఉన్నారు.

రుక్మిణి భర్త విష్ణుమూర్తి దుఃఖానికి అంతులేదు.  ఇటీవలే పరిచయమైనా ఆయనకు సుబ్బారావు ఎంతో దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి కాలక్షేపానికి చదరంగం ఆడుకునేవారు. మనసుకంతగా దగ్గరైన అతన్ని, ఇంత తొందరగా మృత్యువు తీసుకుని వెళ్ళిపోతుందని విష్ణుమూర్తి ఊహించలేదు.

మేనేజర్ మోహనరావు వచ్చిన వెంటనే, సుబ్బారావు కొడుకులకు ఫోన్ చేయాలని ప్రయత్నించాడు. ఓ పావుగంట గడిస్తే కానీ కాల్స్ కలవలేదు. ముందుగా చిన్నబ్బాయికే కలిసింది. విషయం విన్న అతను రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి, అన్నతో మాట్లాడి ఏ  విషయం చెబుతానని అన్నాడు. ఈలోగా పెద్దకొడుకే వీరి మిస్డ్ కాల్స్ చూసి, మోహనరావుకి  ఫోన్ చేసాడు. క్లుప్తంగా విషయం చెబితే,  తాము రావటానికి వీలుకాదని, ఇండియాకి వెంటనే టికెట్ దొరకటం కష్టమని, చేయవలసిన కార్యక్రమాలు అన్నీ జరిపించమనీ, అవసరమైన డబ్బు మోహనరావు ఖాతాకి పంపిస్తామని చెప్పి కాల్ కట్ చేసేసాడు పెద్దబ్బాయి.

ఊహించినదే జరగటంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు మోహనరావు. వెంటనే చకచకా సుబ్బారావు అంతిమయాత్రకు ఏర్పాట్లు చేసాడు. తలకొరివి కూడా తానే పెట్టటానికి సిద్ధపడ్డాడు. విష్ణుమూర్తితో సహా, ఓ పదిమంది వరకూ ఆయన పార్థివదేహంతో పాటుగా, రుద్రభూమికి వెళ్ళారు. ఇప్పుడు భర్త కోసమే ఎదురుచూస్తోంది రుక్మిణి. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. నిజానికి భర్తకే తప్ప తనకు సుబ్బారావుతో పెద్ద పరిచయం లేదు, ‘అన్నయ్యగారూ...’ అని పలకరించటం తప్ప. అంత దుఃఖం ఎందుకంటే, ప్రతీరోజూ చూసే మనిషి ఇక కనిపించనంత దూరం వెళ్ళిపోయిన బాధతో పాటు, బతుకు భయం కూడా... దానితో పాటే మరణ భయం... 

ఈ వృద్ధాశ్రమంలో తామిద్దరూ చేరి అప్పుడే సంవత్సరం దాటింది. చేరిన తరువాత ఇది ఐదవ సంఘటన. అన్నీ ఒకలాగే... సంతానం సప్తసముద్రాల అవతల. ‘రావటానికి వీలు లేదు... డబ్బు పంపిస్తాము, అన్నీ మీరే చేసేయండి!’ పేర్లు వేరు... కొడుకులందరిదీ ఒక్కటే బడి, ఒక్కటే పాఠం... మరి రేపు తమ పరిస్థితి ఏమిటో ఆలోచిస్తేనే రుక్మిణి గుండె పగిలిపోతోంది.

ఇంతలో బయట కొద్దిగా కలకలం వినిపించి, వరండాలోకి వచ్చింది. రుద్రభూమినుండి అప్పుడే తిరిగివచ్చినవారంతా లోపలికి రాకుండా అక్కడే ఉన్న కొళాయిల వద్ద స్నానాలు చేస్తున్నారు. విష్ణుమూర్తి సైగ ప్రకారం ఆయనవి ఒక జత బట్టలు ఉతికినవి పట్టుకొని, సిద్ధంగా  నిలుచున్నది రుక్మిణి.  టవల్ చుట్టుకొని స్నానం చేసి, లోపలికి వచ్చాడు విష్ణుమూర్తి. మరొక టవల్‌తో తల తుడుచుకొని, పొడి బట్టలు ధరించి, నిస్త్రాణగా కుర్చీలో కూర్చున్నాడు ఓపిక లేనట్టు.

వంటశాలలో అప్పుడు హడావుడి మొదలైంది. ఈలోగా, గదిలో ఉన్న  పొయ్యి వెలిగించి, గబగబా ఇంత ఉప్మా కలిపింది రుక్మిణి. మధుమేహ వ్యాధిగ్రస్తుడైన భర్త అంతసేపు ఏమీతినకుండా ఉండగలగటం అంటే మాటలు కాదు. మౌనంగా భార్య అందించిన పళ్ళెం అందుకొని, ఆవురావురుమని టిఫిన్ తినేసి, ఆమె అందించిన పాలు తాగాడు. వేసుకోవలసిన మందులు వేసుకున్నాడు.

“రుక్కూ, ఎందుకో తెలియదు... ఇక్కడ ఉండాలంటే నాకు చాలా భయంగా, అయిష్టంగా ఉంది...” అన్నాడు గొంతు పెగుల్చుకుంటూ.

“నిజమేనండీ... కానీ...”  

“మన వయసువారు ఉంటారని ఇక్కడ చేరాము. కానీ ఇలా కళ్ళముందే వారి మరణాలు చూస్తూ ఉంటే, ఇద్దరం తిరిగి ఊరికి వెళ్ళిపోవటమే మంచిదని అనిపిస్తోంది రుక్కూ... మరణం తప్పదని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను...”

“నిజమేనండీ... కానీ, మన ఊరిలో మాత్రం మనకి ఎవరున్నారండీ? ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. ఇక్కడైతే మనకి రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్, సమయానికి ఉపాహార, అల్పాహారాలు అందుతాయి. చేసుకోలేని స్థితిలో ఉన్నాము కనుక...” అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో... “రుక్కూ... అక్కడ కూడా మనిషిని పెట్టుకుందాము. ఇంటిపనికి, వంటపనికీ... ఎలాగో కాలక్షేపం చేద్దాము. సుబ్బారావు ఇలా ఉన్నట్టుండి వెళ్లిపోవటాన్ని నా మనసు ఒప్పుకోవటం లేదు...” అన్నాడు విష్ణుమూర్తి.

“సరే, ఆలోచిద్దాం లెండి... ఇప్పుడు ఇక అవన్నీ ఆలోచించకుండా, భోజనసమయం వరకూ, ఇలా పడుకోండి. మాత్రలు వేసుకున్నారు కదా... కాసేపు విశ్రాంతి తీసుకోండి...” నచ్చజెబుతున్నట్టు అన్నది రుక్మిణి.

***

ప్రస్తుతం రుక్మిణి, విష్ణుమూర్తి ఉంటున్న వృద్ధాశ్రమం ఒక పెద్దతోట మధ్యలో ఉంది. ఆడువారు, మగవారు కలిపి సుమారుగా ఒక నలభై మంది ఉంటారు. దంపతులైతే ఒకేగదిలో ఉండగలిగే  సదుపాయం కూడా ఉంది. అందరికీ కలిపి ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ టిఫిన్ వండుతారు. ఎమర్జెన్సీగా ఏదైనా వండుకోవాలన్నా గదిలోనే స్టవ్ పెట్టుకుని వండుకోవచ్చు. మరీ లేవలేని వారు తప్ప అందరూ డైనింగ్ హాల్లోనే తింటారు. ఇక్కడ ఫీజులు ఎక్కువే అయినా, ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉండటం వలన, ఇక్కడైతే  కేర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దంపతులిద్దరూ ఈ ఆశ్రమంలో చేరారు.

***

రెండురోజుల తరువాత, ఉదయం కాఫీలు, టిఫిన్లు అయ్యేసరికి  ఎనిమిది దాటింది. విష్ణుమూర్తి  వార్తాపత్రిక  చదువుతూ కూర్చున్నాడు. రుక్మిణమ్మ భాగవతం చదువుకోసాగింది.

ఇంతలో... మాణిక్యం హడావుడిగా వచ్చి, “బాబుగారూ, ఇదిగో ఈ అయ్యగారూ, అమ్మగారూ మీ కోసమే వచ్చారు...” అని చెప్పి వెళ్ళిపోయింది.

కళ్ళజోడు సవరించుకుంటూ గుమ్మంవైపు చూసేసరికి, “నమస్కారమండీ...” అంటూ చిరునవ్వుతో రెండుచేతులూ జోడించి కనిపించాడు కమల్.

“నమస్తే బాబూ...” ప్రతి నమస్కారం చేసాడు విష్ణుమూర్తి.

“నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ...” నమస్కరించింది ఉష.

“నమస్తే అమ్మా...” ఈసారి విష్ణుమూర్తిలో చిన్న అయోమయం చోటుచేసుకుంది. రుక్మిణి పరిస్థితి అందుకు తక్కువగా ఏమీ లేదు.

“నమస్తే గ్రాండ్‌పా, నమస్తే గ్రాండ్‌మా...” నాలుగు చిట్టి చేతులు నమస్కరించాయి.

ముద్దులు మూటగట్టే చిన్నారి పిల్లలు నాలుగేళ్ళ అనన్య, మూడేళ్ళ అంకిత్ వాళ్ళ చిట్టి చేతులతో పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసారి సీరియస్‌నెస్ చోటుచేసుకుంది విష్ణుమూర్తి ముఖంలో.

“పిల్లలూ, మీరటు వెళ్ళి ఆడుకోండి... నేను, అమ్మ – తాతగారితో, బామ్మగారితో మాట్లాడి వస్తాము... ఏం?” పిల్లలను దూరంగా పంపేసాడు కమల్.

“అంకుల్... కూర్చోవచ్చా?”

“అయ్యో, కూర్చోండి బాబూ...” గదిలోంచి రెండు కుర్చీలు తీసుకువచ్చి, వాళ్ళు నిలబడ్డ బాల్కనీలో  వేసింది రుక్మిణి.

“నా పేరు కమల్. ఇక్కడికి నెలరోజులకోసారి వస్తుంటాను...” 

“అవును బాబూ, ఇదివరలో కలిసాము. నెలకోసారి ఇక్కడికి వచ్చి వంటచేసి పెట్టటమో, వండిన అయిటమ్స్ తీసుకువచ్చి వడ్డించటమో చేస్తావు... మాకు తెలుసు కదా...” ప్రశాంత వదనంతో అన్నాడు విష్ణు మూర్తి.

“ఈమె నా భార్య, ఉష. నాకిద్దరు పిల్లలు... వాళ్ళే... నేను ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నానండీ.”

“మంచిది బాబూ... నాతో ఏమైనా పనుందా?”

“అదీ... ఎలా చెప్పాలో తెలియటం లేదు. అమ్మా, మీరు కూడా కూర్చోండి, నిలబడిపోయారు” అంటూ కమల్ లేచి వెళ్ళి, ఓ కుర్చీ తీసుకువచ్చి, రుక్మిణిని కూర్చోబెట్టాడు.

“ఆంటీ... మీ పిల్లలు ఎక్కడ ఉంటారు?” అడిగింది ఉష.

“ఇద్దరు అబ్బాయిలూ అమెరికాలో స్థిరపడ్డారమ్మా...” బరువుగా చెప్పింది రుక్మిణి.

“మరి మీరిద్దరూ ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది...”

ఉషకు సమాధానం చెప్పబోతున్న రుక్మిణిని వారిస్తూ, “అసలు మీకేం కావాలమ్మా? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు?” కొద్దిగా కరకుదనం ధ్వనించే కంఠంతో అడిగాడు విష్ణుమూర్తి.

“అపార్థం చేసుకోకండి... నాకు అమ్మానాన్నలు కావాలండీ! నా పిల్లలకు తాతయ్యా, బామ్మా కావాలి...” రెండు చేతులూ వినమ్రంగా జోడించి చెప్పాడు కమల్.

“ఏం? మీ స్వంత అమ్మానాన్నలేమయ్యారు? వదిలిపెట్టేసావా? చదువుసంధ్యలు  లేనివాళ్ళనీ, అనాగరికులనీ పల్లెటూళ్ళో వదిలేసావా?” తీక్షణమైన కంఠస్వరంతో అన్నాడు విష్ణుమూర్తి.

“అయ్యయ్యో! నాకసలు అమ్మానాన్నే లేరండీ... చిన్నతనంనుంచీ అనాథాశ్రమంలో పెరిగాను. నా భార్య కూడా అంతే. ఇప్పుడు మాకు అమ్మానాన్నలు కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. మిమ్మల్ని మనింటికి తీసుకువెళతాను. నాకు అమ్మా, నాన్నలవగలరా? ప్లీజ్?”

“నీకేమైనా పిచ్చా? లేక మాకు వేరే గతిలేదనుకుంటున్నావా? నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైరయ్యాను. యాభైవేలు పెన్షన్ వస్తుంది నాకు. నా కొడుకులిద్దరూ అమెరికాలో పెద్ద స్థాయిలో ఉన్నారు. ఉన్న ఊరు, కన్నతల్లి అన్నారు కాబట్టి భారత్ వదిలివెళ్ళటం ఇష్టంలేక ఇక్కడున్నాము కానీ, లేకుంటే ఎప్పుడో అక్కడికి వెళ్లిపోయేవాళ్ళం...” బింకంగా చెప్పాడు విష్ణుమూర్తి.

బదులుగా ఆయన చేతికి ఇంగ్లీషులో ఉన్న ఒక మెయిల్ కాపీ ప్రింటవుట్ ఇచ్చాడు కమల్.

“డియర్ మిస్టర్ కమల్,

మా ముసలాళ్ళకూ మాకూ ఎలాంటి సంబంధమూ లేదు. కొన్ని పరిస్థితులవలన మేమిక్కడికి వాళ్ళను పిలవలేము. వాళ్ళు కూడా మాకు ఇష్టం లేకుండా మా గ్రామం విడిచిపెట్టి వచ్చి వృద్ధాశ్రమంలో చేరారు. మా పరువంతా పోయింది. వాళ్ళను అమ్మానాన్నలుగా చెప్పుకోవటానికి కూడా మాకు ఇష్టం లేదు. వాళ్ళను మీరు దత్తత తీసుకుంటామని అన్నారు. అది మీ ఇష్టం. మాకెలాంటి అభ్యంతరం లేదు.

ఇట్లు,

చంద్ర, వినోద్ ”

అని సంతకాలతో సహా ఉంది.

విష్ణుమూర్తి ముఖం పాలిపోయింది. విషయం అర్థం చేసుకున్న రుక్మిణి, కళ్ళతోనే భర్తకు నచ్చజెప్పి, వాళ్ళతో చెప్పటం ప్రారంభించింది.

***

“క్రిందటేడు సంక్రాంతి పండుగకు, తమ కుటుంబాలతో సహా  మా ఊరు వచ్చారు బాబూ మా అబ్బాయిలిద్దరూ...
 
మాకున్న మూడెకరాల పొలాన్ని, పెంకుటింటినీ అమ్మేసి, డబ్బులివ్వమని అన్నారు. పదిహేను ఎకరాల బంగారం పండే భూమి కాస్తా ఇద్దరి చదువులకోసం అమ్మేయగా, మూడెకరాలు మాత్రం మిగిలింది.

ఇల్లు కూడా పాడుపడిపోయింది. ఆ కాస్త ఆస్తినీ  అమ్మి డబ్బిస్తే అది తీసేసుకుని, మమ్మల్ని ఇక్కడ చేర్చి, వాళ్ళు అమెరికా వెళ్లాలని అనుకున్నారని తెలిసింది. అందుకీయన ససేమిరా కాదన్నారని మేము నిద్రపోయాక, ఒక ఉత్తరం రాసి పెట్టి రాత్రికిరాత్రి ఇల్లు, దేశం  విడచి వెళ్ళిపోయారు. అందులో తాము ఇంకెప్పుడూ ఇండియాకి తిరిగిరామని చెబుతూనే,   ఈయనను డబ్బుకోసం చూసుకున్న స్వార్థపరుడని నిందించారు. 

బాణం దెబ్బ తిన్న పక్షిలాగా విలవిలలాడిపోయారు ఈయన. గుండె రాయి చేసుకుని, ఇక ఆ పల్లెలో ఉండలేక, ఆస్తులన్నీ అమ్మేసుకుని, ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని, మావాళ్ళు వదిలేసిన ఈ ఆశ్రమం విజిటింగ్ కార్డ్ పట్టుకుని, ఇక్కడికి వచ్చి చేరాము. ఇక్కడ రోజులు బాగానే గడుస్తున్నాయి, కానీ...” వెక్కివెక్కి ఏడవసాగింది  రుక్మిణి.

“అయ్యో ఏడవకండమ్మా... ఇక దుఃఖించే రోజులకు స్వస్తి అనుకోండి. మన ఇంటికి రండమ్మా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీనుంచి ఏదీ ఆశించను. నా పిల్లలతో ఉంటే చాలు.

క్రిందటి నెలలో మా పిల్లల స్కూల్లో తాతయ్యల గురించి, బామ్మ, అమ్మమ్మల గురించి చెప్పారట. అమ్మా నాన్నలు ఆఫీసులకి వెళ్ళిపోయినా, వీళ్ళు బడినుంచి  ఇంటికి వచ్చేసరికి వీళ్ళను చేరదీసి, చక్కగా బట్టలు మార్చి, అన్నంపెట్టి, కథలు చెబుతారని, హోమ్‌వర్కులు చేయిస్తారని, ఆటలు ఆడిస్తారని చెప్పారట.

అప్పటినుంచీ పిల్లలు ఒక్కటే గొడవ! మాకూ ఓ బామ్మా, తాతయ్యా కావాలి అని, అర్జెంట్‌గా తీసుకురమ్మనీను. వాళ్ళే ఉండి  ఉంటే మాకు చిన్నప్పుడు హోమ్‌లలో పెరిగే అగత్యం ఉండేది కాదు కదా... అదే బాధపడ్డాము నేను, ఉష.  అప్పుడే తోచింది మాకు ‘అడాప్ట్ గ్రాండ్ పేరెంట్స్’ అనే ఆలోచన. ఇది అధికారికంగా దత్తతతో సమానం కాకపోవచ్చు. కానీ మానసికంగా దత్తతే... పిల్లల్ని దత్తత తీసుకుని, స్వంత పిల్లల్లా ప్రేమించగలిగినప్పుడు తల్లిదండ్రులను మాత్రం ఎందుకు దత్తత తీసుకోకూడదు? స్వంత తల్లిదండ్రులుగా ఎందుకు ప్రేమించకూడదు? నా పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ గా ఎందుకు ఇవ్వకూడదు?

ఈ ఆశ్రమంలో మిమ్మల్ని చూస్తుంటే శివపార్వతులను చూసినట్టు ఉండేది. మీరంటే ఏదో తెలియని భక్తిభావం కలిగేది. నా చిన్న కుటుంబం ఒక పెద్ద కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా మారటానికి... ఊహూ, మార్చటానికి మీరు నా ఇంటికి వస్తే, మేము కృతార్థులమౌతాము! మమ్మల్ని నమ్మండి, ప్లీజ్ నాన్నగారూ...” చేతులను విష్ణుమూర్తి పాదాలపై ఉంచాడు కమల్. అదేపని చేసింది రుక్మిణికి, ఉష.

విష్ణుమూర్తి, రుక్మిణి కంగారు పడిపోయారు. వెంటనే ఏమనాలో కూడా తోచలేదు. “బాబూ... వెంటనే ఏ విషయం చెప్పలేము... మేము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని చెప్పి వారిని పంపించేసారు.

***

ఆ దంపతులు గుమ్మం దాటారో లేదో, అయోమయంగా భార్యవైపు చూసాడు విష్ణుమూర్తి.

“ఇదేమిటి రుక్మిణీ? ఇప్పుడేమి చేయటం?” అన్నాడు.

“అవునండీ... వాళ్ళ వేడికోలు చూస్తుంటే మనసు నీరైపోతుంది... కానీ మన పిల్లలేమంటారోనని మనసు వెనక్కు లాగుతోంది కూడా...” దిగులుగా అన్నది రుక్మిణి. 

“ఎందుకంటారు రుక్కూ? వాళ్ళు కమల్‌కిచ్చిన మెయిల్లో మనం మన పిల్లలకేమీ కామని రాసిచ్చారు! నా రక్తాన్ని డబ్బుగా మార్చిస్తే అది పనికొచ్చింది కానీ, ఈ ముసలివయసులో మనం పనికిరాలేదు వాళ్లకి...” ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.

వాళ్ళిద్దరూ ఆరోజు రాత్రి భోజనం చేస్తున్నా, రేడియోలో వార్తలు వింటున్నా కూడా మనసులో అలజడే... దేనిమీదా మనసు లగ్నం చేయలేకపోయారు.

***

మర్నాడు సాయంకాలం -

“రుక్మిణీ... ఒక నిర్ణయానికి వచ్చేసాను” గంభీరంగా చెప్పాడు విష్ణుమూర్తి.

“ఏమిటండీ, అది?”

“కమల్‌ని చూస్తుంటే, మనకి మూడో కొడుకు పుడితే ఇలాగే ఉంటాడని అనిపించింది. వాళ్ళకే కాదు, మనకూ  ఒక కుటుంబం కావాలి. కమల్‌లాంటి కొడుకు, ఉషవంటి కోడలు, ఆ మనవరాలు, మనవడు... మనకి కావాలి... స్వంత మనవలతో ఎప్పటికీ గడపలేము. కలిసివచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవటం అవివేకమే... మనం కమల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము...”

“కానీ... వాళ్ళు ఎలాంటివాళ్ళో... ఏమిటో...” రుక్మిణిలో దాగి ఉన్న భయం ఆయనను ప్రశ్నించేలా చేసింది. 

“నా తదనంతరం నా యావదాస్తి అంటే బ్యాంకులో ఉన్న డిపాజిట్లు అన్నీ నీకు చెందేటట్టు, నీ తరువాత ఈ ఆశ్రమానికే చెందేట్టు విల్ వ్రాసాను. దాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టాను. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఈ ఆశ్రమ నిర్వాహకులు గోవిందరావుగారు ఊర్నించి రాగానే ఆయన  దగ్గర ఆ కమల్ వాళ్ళతో  ఒక ఒప్పంద పత్రం వ్రాసుకుందాము. మనమేమీ వాళ్ళకు డబ్బు ఇవ్వకరలేదన్నట్టు, అక్కడ మనకు నచ్చకపోతే వెంటనే వచ్చేసేటట్టు... మన సొమ్ము ఆశించి వాళ్ళు ఈ పథకం వేసారో, వెంటనే తెలిసిపోతుంది. సరేనా?”

“సరేనండీ...” తలూపింది రుక్మిణి.

“కానీ ఆ అబ్బాయిని చూస్తుంటే అట్లా అనిపించటం లేదు... ఇన్నాళ్లకు మనకూ ఒక కుటుంబం... మనదైన కుటుంబం... రుక్కూ, తలచుకుంటేనే మనసు పరవశించిపోవటంలేదూ?”

“అవునండీ... నాకూ ఎప్పుడెప్పుడు వెళదామా అనిపిస్తోంది...”

“ఇంకేం? త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకుందాము”

***

“నాన్నగారూ, ఇది మీ ఇద్దరి గది... సౌకర్యంగా ఉందా అమ్మా?” ఆపేక్షగా రుక్మిణి ముఖంలోకి చూస్తూ అడిగాడు కమల్.

కళ్ళనిండా నీళ్ళతో తల ఊపింది రుక్మిణి.

“బామ్మా... ఇవాళ నేనూ, అక్కా మీ దగ్గరే పడుకోవచ్చా?” అమాయకంగా అడిగాడు బుజ్జిబాబు, అంకిత్. “ఇవాళొక్కరోజేమిటి కన్నా? ఈ రోజునుంచీ...” అంది రుక్మిణి పిల్లలను దగ్గరకు తీసుకుంటూ.

వాళ్ళ తలలు నిమిరి, నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు విష్ణుమూర్తి.

తమ పాదాలపై వాలిన కమల్, ఉషలను తమ అశ్రువులే అక్షతలు కాగా మనసారా దీవించారా దంపతులు... 

***

(సమాప్తం)

No comments:

Post a Comment