Sunday, January 25, 2026

 పడవ ప్రయాణం

ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ఊరు చేరాలంటే నది దాటవలసి ఉంటుంది. అందుకని పడవ ఎక్కాడు. పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా ‘జీవితం అంటే ఏమిటి?’ అని పండితుణ్ని అడిగాడు. ‘నదీ ప్రయాణం లాంటిదే జీవితం. బయలుదేరిన పడవలో ఎంతోమంది ఎక్కుతారు. కలుసుకుంటారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. వారు దిగాల్సిన ఒడ్డు వచ్చాక దిగి తలో దిక్కుకు వెళ్లిపోతారు.

మరో ఒడ్డులో మరికొందరు ఎక్కుతారు. వాళ్లూ పడవలో ప్రయాణం చేస్తారు. వారి గమ్యం వచ్చాక వారు కూడా దిగి వెళ్లిపోతారు. మనం కూడా మన గమ్యం వచ్చేంతవరకు మాత్రమే ప్రయాణం సాగిస్తాం. ఈ పడవ ప్రయాణంలాగే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఈ భూమి మీదికి వచ్చాక మన జీవితంలోకి ఎంతోమంది తొంగి చూస్తారు. మనతోపాటు ప్రయాణం చేస్తారు. వారి గమ్యం వచ్చాక మనల్ని వీడిపోతారు. అలా వెళ్లేటప్పుడు వెళ్లిపోతామని కూడా చెప్పరు, చెప్పడానికి కూడా వారికి కుదరదు. మనం కూడా అంతే. చెప్పాపెట్టకుండా ప్రయాణం ముగిస్తాం. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఈ పడవ ప్రయాణం తాత్కాలికమని గ్రహించాలి.

ఈ భూమి మీదికి అతిథుల్లా వచ్చాం, అతిథుల్లా ఉంటాం, అలాగే వెళ్లిపోతాం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే వారు, వారితో అనుబంధాలు… శాశ్వతమని భావిస్తేనే సమస్య. అంతేకాకుండా ఈ సృష్టిలో అందరూ సమానమే అని గుర్తించాలి . ప్రశాంతంగా ప్రవహించే ఈ నదిలో హఠాత్తుగా సుడిగుండాలు వస్తే అందరం మునిగిపోతాం. చిన్నాపెద్దా, పేదా ధనిక, కులం, మతం తేడా ఉండదు. ఎందుకంటే సృష్టిలో విభజన లేదు. మనిషే విభజనను తయారుచేశాడు. అందరూ మనవారే అనుకుంటే జీవితం మధురం, విభజన చేసి చూస్తే భయంకరమైన విషం. అందుకే అన్ని జీవరాశులపట్ల ప్రేమను ప్రదర్శించాలి. అది గొంతు నుంచి కాదు, హృదయం నుంచి రావాలి’ అని వివరించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821

No comments:

Post a Comment