Sunday, January 25, 2026

 *_వేమన్న చెప్పింది_* 
*_వేదం రా..!!_*
+++++++++++++++++
వేమన జయంతి సందర్బంగా..
################

*_ఉప్పు కప్పురంబు_* 
*_ఒక్క పోలికనుండు.._*
*_చూడ చూడ_* 
*_రుచుల జాడ వేరు_*
కవులందు వేమన వేరయా
వినర తెలుగోడా..!

కవిత్రయమన్న 
తిక్కన,వేమన,గురజాడ
ఇది శ్రీశ్రీ మాట..!

వానలో తడవని..
వేమన శతకం వినని
మనిషి ఉండడనేది
నిస్సందేహం..
*అంతటి శక్తిమంతం*
*ఆయన కవితా ప్రవాహం..!*

మాసిన గడ్డం..
ఒంటిపై గోచీ..
వంచిన శిరస్సు...
అందులో ఎంత తేజస్సు..
తరిగిపోని యశస్సు..
ఇదీ నాలుగు మాటల్లో
వేమన..వివరంగా చెప్పాలంటే 
అంతే ఉండని
*మహాగ్రంధమని* 
*నా భావన..!*

*_భోగి కాని వాడు_* 
*_యోగి కాలేడన్న ఆర్యోక్తి.._*
వేమనకే  ఉపయుక్తి..
జీవితమంతా విలాసం..
వ్యసనాలతో ఉల్లాసం..
చెడు సావాసం..
ఒకనాటికి ముంచుకొచ్చిన
వైరాగ్యం..
పొర్లుకొచ్చిన కయితలు..
*సిసలైన జీవిత కతలు..!*

వేశ్యల చుట్టూ 
తిరిగిన వేమయ్య..
బంధాల దాస్య విముక్తి
పొందిన సిద్ధయ్య..
మూడు వాక్యాల్లో తత్వబోధన..
నాలుగో వాక్యంలో 
కృతజ్ఞతా భావన..!
*_విశ్వదాభిరామ_* 
*_వినుర వేమ.._*
నీ చుట్టూ ఉండే సీమ
మొత్తం భ్రమ!

నచ్చింది..మెచ్చింది
*_ఆటవెలది.._*
అందులోనే రాసేశాడు
తత్వాలు వందలకొలది..
ఔపోసన పట్టి పరసువేది
విరక్తి పుట్టి అయ్యాడు
సిసలైన తత్వవాది..
జమీందారో..రారాజో
ఆయన రచనలు
ఆశనిరాశల తరాజు..
వేదవేదాంగాల బేరీజు..!

వేమన వాదంలో 
ప్రధానంగా నిర్వేదం..
తిరుగుబాటు.. జరుగుబాటు...
జీవిత అర్థం..పరమార్థం..
*ప్రతీదీ యదార్థం..*
చక్కని ప్రతిపదార్థం..
ఒక్కోసారి అర్థం కాని
*_బ్రహ్మపదార్థం..!_*

ఏదేమైనా..భాష సరళం..
భావం నిండా 
ఆయన త్రాగిన గరళం..
చవిచూసిన గందరగోళం..
గుణపాఠం చెప్పిన సానిమేళం..
*_తన అనుభవాలే తత్వాలు_*
తలవంచిన సంకుచత్వాలు
మొత్తంగా వేమన తానయ్యాడు 
*తాత్వికుడు..బోధకుడు..*
అంతిమంగా దార్శనికుడు
*_అందుకే వేమన పలుకులు_*
*_ఎప్పటికీ ములుకులు..!_*

************************
   
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
         9948546286
         7995666286

No comments:

Post a Comment