*ఫారిన్ విస్కీ* (హాస్య కథ )
*రచయిత* -
*చాగంటి ప్రసాద్* (చా. ప్ర )
(*మా తెలుగు లండన్ తెలుగు వార్షిక పత్రిక లో ఎంపికైన కథ)*
“ఒక అరగంటలో కుక్కుటేశం వస్తాడట్రా!”… అన్నాడు గవర్రాజు, ఏదో వాతావరణశాఖ వారి తుఫాను ముందు హెచ్చరికలా.
“రానీయరా! వాణ్ణి చూసి చాలా రోజులైంది”. అన్నాడు చక్రి.
“ఒరేయ్ అమాయక చక్రవర్తి ! వీడు పాత కుక్కుటేశం కాదురా, `పాట కుక్కుటేశం`. పాటలు పాడడం,బొమ్మలు గీయడం, కథలు రాయడం లాంటి ఏదో ఒక హాబీ మనిషికి ఉంటే ముసలితనం త్వరగా దరిచేరదని , మనసు ఎంతో రిలాక్సిoగా ఉంటుందని సైకియాట్రిస్టులు చెప్పారుట. మన ఖర్మకొద్ది మనవాడు ఈ వయస్సులో పాటలు పాడే హాబీని ఎన్నుకుని , సాధన పేరుతో మమ్మల్ని సాధిస్తున్నాడు. వాడితో మాటలుండవు. కేవలం పాటలే.”...వ్యంగ్యంగా అన్నాడు గవర్రాజు.
“అర్ధం అవ్వలేదు.. అయినా అది మంచి హాబీనేగా!”..అన్నాడు చక్రి.
“హాబీ ఏంటీ నీ బొంద?.. నువ్వు అదృష్టం కొద్దీ అమెరికా లో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. మా కిక్కడ లైవ్ లో నిత్య నరకమే. వాడి గానం కాదు గాని, మా ప్రాణం తీస్తున్నాడు. గాయకుడ్ని అనిచెప్పి అనుక్షణం మమ్మల్ని వాడి పాటలతో గాయపరుస్తూనే ఉన్నాడు.” అన్నాడు చమత్కారంగా.
“నువ్వు మరీ చెప్తావురా ! వాడు చిన్నప్పడు కాలవ గట్టున , నూతి పళ్ళెం లో స్నానం చేసేటప్పుడు, సబ్బుతో రుద్దుకుంటూ `ఆ ...ఆ ` అని కూనిరాగాలు తీసేవాడు. అప్పుడనిపించేది వీడో మంచి గాయకుడు అవుతాడని. కానీ దారి తప్పి ఆ ప్రైవేట్ కంపెనీ లో జాయిన్ అయ్యాడు ప్చ్” .. అన్నాడు చక్రి.
“కూని రాగాలు కాదు. ఖూనీ రాగాలు. వీడు ఆ కంపెనీ లో ఆమోఘంగా పనిచేసి ఉద్దరించటం లేదు. వాళ్ళ కల్చరల్ హెడ్ని మేనేజ్ చేసి మైకందుకున్నాడు. భుజంపై ఉన్న శవాన్ని దింపని విక్రమార్కుడిలా, వీడు మైకు పట్టుకుని వదలడు,స్టేజి దిగడు. ఇంకా విచిత్రం ఏంటంటే వీడి తోటి పాటగాళ్లు కూడా అలా `పాడెవాళ్ళే `. ఏ మాత్రం పాట విందామని సంబర పడ్డా పాడె ఎక్కేయడం ఖాయం. వీళ్లందరూ గంప గుత్తగా ఒకే చోట చేరి సంతమార్కెట్లో కూరగాయిలు వేలంపాటలు పాడినట్టు రోజూ పాడుతూనే ఉంటారు. ఈ దందా రోజూ నడూస్తూఉంటుంది. ఏవైనా గాలివానొచ్చినప్పుడో ఊర్లోకి వరదలొచ్చినప్పుడో సంతమార్కెట్టు వేలం ఆగొచ్చు కానీ, పంచభూతాలు కలిసొచ్చి దాడిచేసినా వీళ్ళు ఆపరు గాక ఆపరు. అదేం దురదో?”...అని చెమటకు చిరచిరలాడుతున్న బుర్రను గోక్కుంటూ, గుక్కతిప్పుకోకుండా చెప్పి,… ఆయాసమొచ్చిందని ఆపాడు.
“ఎందుకంత ఆయాసపడుతూ చెప్తున్నావు?.మామూలుగా ఏడు”.. అన్నాడు విసుగ్గా.
“నీ ప్రాణానికొచ్చే ముప్పుని రాకుండా ఆపుదామనీను. కాస్త హెచ్చరిద్దామనీను?” అన్నాడు గవర్రాజు.
“వీళ్ళంతా ఎక్కడ పాడతారు ? “
“నగరం మధ్యలో ఒక పుణ్యాత్ముడు కట్టించిన తుంబుర గానసభ ప్రాంగణంలో. శ్రోతలు లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ పాడుగానం జీడిపాకంలా సాగుతూనే ఉంటుంది. పోనీ ఆ పాటలకు చక్కని సంగీత వాద్య పరికరాలు ఏమన్నా ఉంటాయా అంటే. ఏదో కొక్కోరోకో అనే సిస్టమ్ లో మ్యూజిక్ ”..వెటకారంగా అన్నాడు.
“ కొక్కోరోకో కాదు కరొకె “.. సర్ది చెప్పాడు చక్రి.
“అదే అదే !.. దాని దారి దాందే ! పాట దారి పాటదే! అస్సలు సింక్ అవ్వదు”. అంటూ మొహం వికారంగా పెట్టాడు గవర్రాజు.
“నీకెల్లా తెలుసు ? నువ్వు వెడతావా వాడితో ?”
“ఒక సారి వెళ్ళాను. మళ్ళీ ధైర్యం చేయలేదు. కానీ రెగ్యులర్ గా కొంతమంది ఆస్థాన శ్రోతలు మటుకు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకు”.. అంటూ నవ్వాడు వెటకారంగా.
“ఎవరు ? గవర్రాజు మాటల్లో వ్యంగ్యం అర్థం అవ్వక అడిగాడు చక్రి. “ చుట్టు పక్కల ఇళ్లల్లో నిద్ర పట్టనివాళ్ళు, పెళ్ళాల తిట్లు తప్పించుకొని తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు, బయట ఎండ బాధ,వాన వస్తే షెల్టర్ కావలసిన వాళ్ళు, ,సమోసాలు,టీలు అమ్మునుకునే వాళ్ళు పదిమంది తప్ప, వేరే బుర్ర ఉన్నవాళ్లెవరూ ఆ ఛాయలకు వెళ్ళే ధైర్యం అస్సలు చేయరుట. ఆ పక్కనే వుండే మా మావయ్య చెప్పాడు”.. అంటూ నవ్వాడు గవర్రాజు .
“నీకు జెలసీ! వాడు స్టేజ్ షోస్ ఇస్తున్నాడని. వాడి సంగతి నాకు తెలుసు. వాడికి పాటలు పాడడం అంటే ఎంతో ప్రేమ. అమెరికా నుంచి ఇక్కడకు వచ్చే ముందే నా టూర్ ప్లానర్ లో వాడి పాట లైవ్ లో వినడం అని రాసుకున్నాను. మనసువాడి పాట వినాలని ఉవ్విళ్లూరుతోందిరా!” …అన్నాడుచక్రి.
“సరే! ఆ ఆనందం ఏదో మొత్తం నువ్వే అనుభవించు. అంత ప్లాన్ చేసుకుని ప్రమాదం కొని తెచ్చుకుంటానని నువ్వు ఉవ్విళ్లూరుతుంటే, నిన్ను ఎవడు ఆపగలడు ? కొత్తగా పెళ్లయిన వాడ్ని. నేనా రిస్కు తీసుకోలేను.”భయంగా అన్నాడు గవర్రాజు.
“అదేంట్రా ?మనవాణ్ణి మనమే ఎంకరేజ్ చెయ్యకపోతే ఎలా?నీకు సంగీతం గాని, పాడడం గాని వచ్చా? నన్నేమో , ఫైన్ఆర్ట్స్ అంటేనే తెలియకుండా పెంచాడు మా నాన్న. మనలో ఒకడు పాటలు పాడుతుంటే ఏదో మాహాపరాధం చేసినట్టు, అసూయ వెళ్ళగక్కుతావేంటి ?” కాస్త కోపoగా అన్నాడు చక్రి.
“నువ్వు విదేశాల్లో ఉండి వీడి విన్యాసాలు చూడలేదు..” చెప్పబోతుంటే ఏదో పాడుకుంటూ దూరంగా వస్తున్న కుక్కుటేశం కనబడ్డాడు గవర్రాజుకి.
“వాడొస్తున్నాడు.తర్వాత చెప్తాను,”..అంటూ ఏదో పులిని చూసి జింక పారిపోయినట్టు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి స్పీడుగా లాగించేసాడు గవర్రాజు.
“చక్రి! ఎన్నాళ్ళైందిరానిన్ను చూసి!” అంటూ చక్రిని కౌగిలించుకున్నాడు కుక్కుటేశం .
" సారీరా! తుంబుర గానసభలో `గాన సంవత్సరీకం`వలన నిన్ను కలవడం లేటయ్యిందిరా.” అన్నాడు కుక్కుటేశం.
“గాన సంవత్సరీకమా?”నోరు వెళ్ళబెట్టాడు చక్రి. "అదేరా!నాన్ స్టాప్ గా ఇరవై నాలుగ్గంటలూ, మూడువందల అరవై ఐదు రోజులు పాడుతూనే ఉంటాం. నా వంతుగా కొన్ని పాటలు పాడి అక్కడ్నుంచే వస్తున్నాను. నీకో సంగతి చెప్పనా ! నేను పాడకపోతే ఆ కార్యక్రమానికి కళే ఉండదురా!” గర్వంగా చెప్పాడు.
“ఓహ్ !నువ్వు పెద్ద గాయకుడిగా పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా కుక్కుటం!. ఇప్పటి వరకు నీ గురించే, నీ పాట గురించి గవర్రాజు గొప్పగా చెప్తూనే ఉన్నాడు.” ఆప్యాయంగా అన్నాడు చక్రి.
“వాడీమధ్య నా కొత్త పాటలు మిస్సయ్యాడు.మా ఇంటి ఛాయలకే రావడం లేదు ” ..దిగులుగా అన్నాడు.
“సర్లేరా !వాడిక్కడే ఉంటాడుగా . ఎప్పుడైనా వింటాడు. నేను మాత్రం నీ పాట వినాలని తహతహలాడుతున్నాను. ఈ రాత్రి నీ గానామృతం నా చెవిలో పొయ్యాల్సిందే!” అన్నాడు చక్రి.
ఆ మాటతో తన పాట వినడానికి ఓ శ్రోత దొరికినందుకు ఉబ్బిపోయి,“అదెంత పని! నీ లాంటి రసికుల కోసమే కదా ఈ కుక్కుటం పాడేది. నువ్వు నా అతిధివి. ఇవ్వాళ మా ఇంట్లోనే డిన్నర్.మీ చెల్లి వంట అదిరిపోతుంది. గవర్రాజుగాడ్ని కూడా తీసుకురా !” చక్రిని ఊరిoచాడు.
“సరేరా ! ఈ రాత్రి గవర్రాజు ను తీసుకుని మీ ఇంటికి వస్తాం. ” హామీ ఇచ్చాడు చక్రి.
'ఆహా! ఇన్నాళ్ళకి ప్రవాసాoధ్ర మిత్రుడికి నా పాట వినిపించే భాగ్యం కలిగింది కదా! నా గానంతో వాడిని అలరిస్తాను,సప్తస్వరాలతో సప్తసముద్రాలు దాటేస్తాను. వీడి సహకారంతో అమెరికా వెళ్లి అక్కడ తెలుగువాళ్ళని నా పాటలతో రంజింప చేసి అంతర్జాతీయ గాయకుడిగా పేరు సంపాదిస్తాను “.. గాలిలో తేలిపోతూ ఇంటి దారి పట్టాడు కుక్కుటేశం .
@@@
“ఒరే గవర్రాజు!మనిద్దరిని కుక్కుటం గాడు డిన్నర్ కి పిలిచాడు.. ఫోన్లో చెప్పాడు చక్రి.
"నేను రాన్రా, నాకు వేరే పనుంది” .. అన్నాడు గవర్రాజు.
“అమెరికా నుంచి ఖరీదైన విస్కీ తెచ్చాను మరి నీ ఇష్టం”... ఊరించాడు చక్రి.
“ఫారిన్ విస్కీ ...అబ్బా!" అంటూ పెదాలు చప్పరించాడు....! కుక్కుటంగాడి పాట తలుచుకోగానే ...! నోరు చేదుగా అయిపొయింది. వాడి పాటకు చెవులు తూట్లుతప్పవు. వెళ్లకపోతే మంచి ఫారిన్ సరుకు మిస్ అవుతా. కాసేపు ఊగిసలాడి, సర్లే వస్తాలే!మీ ఇంటిదగ్గర రెడీగా ఉండు”అన్నాడు గవర్రాజు చివరకు.
**
“ఒరేయ్ ! చక్రి ! ముందు కడుపుకు, తర్వాత వీనులకు విందు. ఆ తర్వాతే మందు” .. అన్నాడు కుక్కేటేశం.
“అనుకున్నాను.వీడేదో ఫిట్టింగ్ పెడతాడని” పళ్ళు నూరుకున్నాడు గవర్రాజు .
“ఒకే అలాగే కానీయ్.”అన్నాడు చక్రి తన భుజాని కి ఉన్న సంచి తడుతూ. గవర్రాజు, కుక్కుటేశం దృష్టి అంతా చక్రి భుజానికి ఉన్న సంచి మీదే ఉంది. ఎప్పుడు బయటకు తీస్తాడా ఎప్పుడు ఫారిన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తాడా అని చూస్తూ పెదాలు చప్పరిస్తున్నారు.
“ఏమండీ! అన్నయ్య గారికి మీ పతకాలు అవీ చూపించండి" అన్న భార్య కపోతేశ్వరి అరుపుకి ఉలిక్కిపడి.. వాళ్ళని తన గదిలోకి తీసుకెళ్ళాడు.
తనకొచ్చిన షీల్డులు,సన్మాన ఫోటోలు, బిరుదు పత్రాలు, బహూకరించిన శాలువలు చూపించాడు ఇద్దరికీ.
“అబ్బా !గాయకుడిగా నీ ఎదుగుదల చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా కుక్కుటం.” అంటూ భుజం తట్టాడు చక్రి. వీళ్ళ సంభాషణ వింటున్న కపోతేశ్వరి మాట్లాడుతూ, "అవును అన్నయ్యగారు! ఈయనకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదంటే నమ్మండి.. ఎప్పుడూ పాటలు పాడడం,సన్మానాలు అందుకోవడం ఇదే పని ". అంటూ మురిసిపోతూ చెప్పింది.
“ఆహా ! నా మిత్రుడు కుక్కుటం ఒక మహాగాయకుడని అమెరికా లో అందరికీ చెప్పుకుంటానురా!” ఆనందంగా అన్నాడు చక్రి.
“ఓ...నిరభ్యంతరంగా చెప్పుకో “అంటూ పర్మిషన్ ఇచ్చాడు కుక్కుటేశం.
‘ఈ చక్రి గాడో అమాయకుడు’! వీడికొచ్చిన కప్పులు, సన్మాన శాలువాలన్నీ కొన్ని సాంస్కృతి కార్యక్రమాల వాళ్ళకు వీడు పని చేసే కంపెనీ వాళ్ళ చేత చందాలు ఇప్పించి, దానికి బదులుగా తెప్పించుకున్న బాపతని తెలియదుగా పాపం!... చాటుగా నెత్తి బాదుకున్నాడు గవర్రాజు. డిన్నర్ అయ్యాకా ముగ్గురు డాబా మీదకు చేరారు.
“ ఈ చల్లని పున్నమి రాత్రి ఎంత హాయిగా ఉందో కదరా!” పరవశంగా అన్నాడు చక్రి.
“ఈ వెన్నెల మరింత హాయిగా ఉండేలా పాడతాను మిత్రులారా!”.. కుక్కుటేశం గొంతు సవరించుకున్నాడు. చక్రి ఆతృతగా వాడు ఎదురుచూస్తున్నాడు. గవర్రాజు కనబడని నక్షత్రాలను లెక్కెడుతున్నాడు.
“ఆకాశా వీధిలో అందాల జాబిలి!..”ఘంటసాలను అనుకరిస్తూ పాట మొదలెట్టాడు. అది వినగానే భయంతో బిక్కచచ్చిన చందమామ చటుక్కున మబ్బుల చాటుకి పారిపోయాడు. లాప్ టాప్లోంచి కరొకెమ్యూజిక్ మొదలైంది. దాన్ని ఫాలో అవ్వకుండా తనకిష్టం వచ్చినట్టు పాడుతున్నాడు. శృతి లేదు, లయ లేదు, సరికదా అనుకరణలో గొంతు కూడా లేవడం లేదు. అమర గాయకుడిని అనుకరిద్దామని తాపత్రయం తప్ప, పాటలో ఓ అందం గాని, తియ్యదనం గాని లేదు. పూనకం వచ్చినట్టు పాడుతున్నాడు,కీచురాళ్ళ అరుస్తున్నట్టుగానూ, గురకరాళ్ళని డబ్బాలో వేసి ఆడించినట్టుగా కర్ణ కఠోరంగా పాడుతున్నాడు. కళ్ళు మూసుకుని గానామృతాన్ని ఆస్వాదిద్దామని ఎదురుచూస్తున్న చక్రికి దిమ్మ తిరిగిపోయి భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఓ గంటపాటు పాటలని, గాలిని కలుషితం చేశాడు.చల్లని వెన్నెల కూడా వేడెక్కి పోయింది. గాలి స్తంభించింది. రోడ్డు మీద అలిసి పడుకున్న కుక్కలు భయంతో `భౌ భౌ` మంటూ అరవడం మొదలుపెట్టాయి.
గవర్రాజు అక్కడున్న తలగడ దూది పీకి చెవుల్లో పెట్టుకుని తన్మయత్వాన్ని దొంగాభినయం చేస్తున్నాడు. ఉన్నట్టుండి కింద నుంచి..
“కుక్కుటేశం గారు ! మీ పాటలు ఆపుతారా లేక న్యూసెన్సు కేసు పెట్టమంటారా ? రోజూ మీ గోలతో మాకు నిద్ర పట్టడం లేదు. వెంటనే మీ కచేరి ఆపు చేయండి. లేకపోతె పోలీసులను పిలుస్తాం.” అంటూ చుట్టు పక్కలవాళ్ళుఅరుస్తున్నారు.అరుపులు విని చక్రి ఆందోళనగా కుక్కుటాన్ని చూసాడు.
“వాళ్ళు అంతేరా!వాళ్ళ అరుపులు పట్టించుకోకు. వాళ్ళకే మాత్రం సంగీత జ్ఞానం లేదు. నేను గాయకుడిగా పైకొస్తున్నానని అసూయ. వీళ్లంతా ఆమధ్య చుట్టుప్రక్కల వాళ్ళు ఖాళీ చేసిన ఇళ్లను ఆక్రమించుకున్న వాళ్ళే." అన్నాడు కోపంగా.
"నువ్వు పైకి రావడం సంగతి దేవుడెరుగు. వాళ్ళు పైకొచ్చి దేహశుద్ధి చేస్తారేమో చూడు."భయంగా అన్నాడు చక్రి.
“అంత సీను లేదురా ?మా సింగర్స్ గ్రూప్ లో ఒక డి.ఎస్.పి ఉన్నాడు. ఆయనకి చెప్తే చాలు, వీళ్ళ సంగతి చూస్తాడు.” అన్నాడు ధీమాగా..
"ఒరేయ్ కుక్కుటం !ఇప్పుడు టైము ఒంటిగంట. కాసేపు పోతే మీ వీధిలో ఉన్న `కుక్కుటాలన్నీ` నీతో పోటీగా కూస్తాయేమో ..ఇక నీ కచేరి ఆపుచేయ్యి." బ్రతిమాలాడు చక్రి.
“నువ్వు పాన్ ఇండియా పాటల్ని మిస్ అవుతావురా చక్రి!. ఇదికూడా పాడని “. అంటూ `ఓ దునియా కే రఖ్ వాలే` .. అంటూ హిందీ పాట అందుకున్నాడు.. ..,గవర్రాజు నరాల బలహీనతున్నవాడిలా తల ఊపడం మానలేదు.
ఇంక లాభం లేదని.. "ఒరేయి.! నా ఫారిన్ విస్కీ రుచి చూడండి రా" అంటూ చక్రి తన సంచిలో చెయ్యి పెట్టాడు..
కుక్కుటేశం పాట మొదలెట్టాకా , హరి బ్రహ్మలు దిగి వచ్చి చెప్పినా ఆపడు.. అది మహా పాపం అని అతని నమ్మకం. కానీ, ఫారిన్ విస్కీ అనగానే ఆపేశాడు.
చక్రి సంచి లో చేయి పెట్టడం చూసిన గవర్రాజు, ఎక్కడ మందు మిస్ అవుతానోనని గబుక్కున వచ్చి అతని పక్కకు వచ్చి కూర్చున్నాడు.చక్రి ఎంత పెద్ద బాటిల్ తెచ్చాడా అని ఎదురు చూస్తు దృష్టి వాళ్ళిద్దరి మీద పెట్టాడు కుక్కుటేశం.
సంచిలోంచి చక్రి పెద్ద కాగితాల కట్ట తీశాడు . ఆ కట్ట లోంచి వెదికి ఓ పెద్ద పేపర్ తీసాడు. చక్రి గొంతు సవరించుకుని సర్దుకు కూర్చున్నాడు...
"ఇక ప్రారంభిద్దాం" అన్నాడు చక్రి మిత్రులకేసి చూస్తూ.
"పేపర్లు ప్రక్కన పెట్టు... ఫారిన్ విస్కీ తియ్యారా బాబూ!" అన్నాడు గవర్రాజు.
“ఫారిన్ విస్కీ ఎంత మధురం...ఎంత మధురం! చంద్రుని వెన్నెలకన్నా మధురం ... వెన్నెలకన్నా మధురం అమర గానం కన్నా మధురం...మధురం...మధురం” అంటూ గొంతెత్తి అరవడం మొదలు పెట్టాడు.
"సడెన్ గా ఏమయ్యింది రా నీకు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా!...ఆ అరుపులు ఆపి ఫారిన్ విస్కీ బయటకు తియ్యి" అన్నాడు కుక్కుటేశం. గవర్రాజు దూరంగా జరిగి బిక్క చచ్చిపోయిన మొహంతో చూస్తున్నాడు.
" నేను కవిత చదువుతూంటే అరుపు లా? నువ్వు గార్ధభ స్వరంతో పాడేవి పాటలా?" అన్నాడు చక్రి.
కుక్కుటేశం తెల్లబోయిన మొహంతో ఇద్దరి పక్కన కూలబడిపోయాడు. చక్రి తన కవితల ప్రవాహం ఆపడం లేదు.. తెలుగు శీర్షిక పెట్టిన కవితల్లో ఇంగ్లీష్ పదాలు, ఫ్రెంచ్ పదాలు , అరబ్బీ వాక్యాలతో ఎవ్వడికి అర్ధం కాని `పాన్ ప్రపంచ` కవితలని వినిపిస్తున్నాడు.. కుక్కుటేశానికి కడుపులో దేవుతోంది. అదో మాదిరిగా అయ్యిపోయి వికారం మొదలైంది.. "ఇంక ఆపరో "అని కుక్కుటేశం చక్రి కాళ్ళు పట్టుకున్నాడు..
గవర్రాజు చెవులలోంచి తీసేసిన దూది కోసం డాబా అంతా వెతకడం మొదలు పెట్టాడు. దురదృష్ట వశాత్తూ అది దొరక లేదు.
" ఒకసారి ఫారిన్ విస్కీ చూపించరా" అన్నాడు గవర్రాజు ఇంకా ఆశ చావక.
చక్రి చేతిలో ఉన్న పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ చూసి కళ్ళు తేలేసారు గవర్రాజు, కుక్కుటెశం.
"మోసం! ఫారిన్ విస్కీ...నువ్వు చదివిన కవిత శీర్షిక పేరా?" అన్నారు ఇద్దరూ కోరస్ గా.
కాలనీ లో కుక్కుటం కూసింది కొక్కోరోకో అంటూ.. అప్పుడు ఆపాడు చక్రి..
"హమ్మయ్యా ! మీ ఇద్దరి దగ్గరా నా కవితా శతకం చదవడం పూర్తైయ్యింది. ఎలా ఉంది నా ఫారిన్ విస్కీ కవిత? "అన్నాడు నవ్వుతూ.
"గూబ గుయ్యుమందిరా! జీవితం లో ఫారిన్ విస్కీ పేరెత్తం" అన్నాడు గవర్రాజు.
"ఇంత కాలం మిమ్మల్ని నా గానంతో ఎంత నరకం చూపించానో ఇప్పుడు బాగా అర్థమయ్యింది రా! జీవితం లో పాటల జోలికెల్లితే నీ ఫారిన్ విస్కీ మీద ఒట్టు. యువగళాన్ని ప్రోత్సాహిస్తా ! " అన్నాడు కుక్కుటేశం జ్ఞానోదయమై.
“మంచి నిర్ణయంరా కుక్కుటం.. యువగళాన్ని ప్రోత్సాహిద్దాం! ఇంత వయసొచ్చాకా ,అపస్వరాలతో, పూడిపోయిన గొంతుతో పాటలు పాడి జనాల్ని ఏడిపించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు” అన్నాడు గవర్రాజు”
“ఫారిన్ విస్కీ వద్దురా మీకు ?”.. అంటూ చక్రి సంచిలో చెయ్యిపెట్టాడు.
“బాబోయి ! ఇప్పుడు ఇంక త్రాగలేంరా ! అని ఇద్దరూ జారుకోబోయారు.
“సర్లే ! ఇంటికి పట్టుకుపోతాను”.. అంటూ డాబా మూల దాచిన బాటిల్ బయటకి తీశాడు చక్రి.
“ఇద్దరూ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి, ఇదైతే ఒకే రా ! ఎక్కడ కవిత మళ్ళీ చదివి వినిపిస్తావోనని భయపడి చచ్చాం !.. అంటూ దాన్ని లాక్కున్నారు ఇద్దరు.
(అయిపోయింది)
*చాగంటి ప్రసాద్*
No comments:
Post a Comment