కథ పేరు...."శాలువా".
**************
సహరి అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో సాధారణ బహుమతి పొందిన కథ. 15/01/2026 న సహరి లో ప్రచురితమైంది.
****************
కె.వి.లక్ష్మణ రావు
9014659041
🔹🔹🔹
ఆఫీసు వర్క్ లో బిజీ గా ఉన్నాను.అప్పుడే ఫోన్ రింగైంది.
"చంద్ర" కాలింగ్ అని వస్తోంది.
బిజీ వర్క్ లో ఉన్నప్పుడే ఫోన్స్ రింగవుతాయి.'లిఫ్ట్ చేస్తే వర్క్ ఆగిపోతుంద' ను కుంటూ...పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నాను.
కొంతసేపటికి మళ్ళీ ఫోన్ రింగైంది.
చంద్రమే చేస్తున్నాడు.
లిఫ్ట్ చేయకపోతే సాయంత్రం వరకూ ఫోన్ చేసేలా ఉన్నాడను కుంటూ,
"హలో, చంద్రం. చెప్పరా" అన్నాను.
"వారం క్రితమే నీ ఆఫీస్ కొచ్చి మరీ చెప్పాను.మరిచావా?
"వాడు అడిగేసరికి వెంటనే గుర్తు కొచ్చింది.
", ఈ రోజు నీకు సన్మానం, కదూ" అన్నాను.
"ఎక్కడ?" అడిగాడు.
"కాకినాడ, సూర్య కళామందిరంలో " జవాబిచ్చాను.
"ఎందుకు?"
"సాహితీ సంస్థ వారు నిర్వహించిన కథల పోటీలో నీకు బహుమతి వచ్చిందిగా"
"అంతే కాదురా, కథా రత్న అనే బిరుదు ప్రదానం కూడా ఉంది.
నా కలం బలమే, బహుమతిని తెచ్చి పెట్టింది.కానీ మీరంతా అక్కడకు వస్తేనే నా బలగం కూడా సంస్థ వారికి తెలుస్తుంది"
చంద్రం నాన్ స్టాప్ గా మాట్లాడేస్తున్నాడు.
"వారంలో వార్షిక తనిఖీ ఉందిరా.రోజూ సాయంత్రం ఓ గంట పాటు బాస్ ఓటి చేయమన్నాడు...రాలేనేమో?సారీ" అన్నాను.
"నో సారీ, నో ఎస్క్యూజ్"
నువ్వు రావాలంతే.
ఫోన్ ఆఫ్ అయింది.
డిగ్రీ లో కలిసి చదువుకున్నాం.ఈ మధ్యనే కలం పట్టాడు. బహుమతులు కూడా వస్తున్నాయి.
ఒక బిచ్చగాడి ఆకలి ఆవేదనను, ఆకలి యాత్ర అన్న కథ ద్వారా అద్భుతంగా అక్షరబద్దం చేసాడు.ఆ కథకే ఇప్పుడు బహుమతి, సత్కారం.
లంచ్ టైం అయింది.క్యాంటీన్ లోకెళ్లి కూర్చున్నాను.
వారం క్రితం సంగతి గుర్తొచ్చింది. చంద్రం వచ్చాడు.నా పక్కనే కూర్చున్నాడు.ఇద్దరమూ లంచ్ చేసి బయటకు నడిచాం.
అప్పుడే ఒక బిచ్చగాడు, "దర్మం చేయమం"టూ దీనంగా చేతులు చాచాడు.
"పనీ, పాటా లేదా? వెళ్లవయ్యా,వెళ్ళు" అంటూ విసుక్కున్నాడు.
అంతలోనే ఓ పది రూపాయలు బిచ్చగాడి చేతిలో వేసాను.బిచ్చగాడు వెళ్ళిపోయాడు.
చంద్రం వైఖరి చూసి నాకు ఆశ్చర్యం వేసింది.
"బిచ్చగాడి నే కథా వస్తువుగా తీసుకుని బహుమతి ని, సత్కారాన్ని పొందబోతున్నావ్ కదా! అదే బిచ్చగాడంటే ఎందుకు చీదరించు కుంటున్నావ్?"అర్ధం కాక అడిగాను.
"చంద్రం చిన్నగా నవ్వుతూ, "కులాంతర వివాహం మంచిదంటూ ఓ డైరెక్టర్ సినిమా తీస్తాడు. హిట్ కొడతాడు.అలాగని ఆ డైరెక్టర్ ,అతని పిల్లలకు కులాంతర వివాహం చేస్తాడా?
నేనూ అంతే.బీదవాళ్ళు, బిచ్చగాళ్ళు, కథల్లో రాసుకోవడానికి ఉపయోగపడతారంతే." చాలా సింపుల్ గా అన్నాడు.
"చంద్రం, సమాజంలో మార్పు తేవడానికి కలం పట్టానని గొప్పలు చెప్పకు.ముందుగా మారాల్సింది నువ్వే" అన్నాను కొంచెం కోపంగా.
వాడప్పుడు, వెటకారంగా ఓ నవ్వు నవ్వి, వెళ్ళిపోయాడు.
లంచ్ చేసి, బాస్ పర్మిషన్ కోసం ప్రయత్నించాను.
"స్నేహితుని సన్మాన మం టున్నావ్ కదా.ఓటి వద్దులే.డ్యూటీ టైం అయ్యాకా వెళ్ళు"
బాస్ పర్మిషన్ దొరికింది.చంద్రమంటే సదభిప్రాయం లేకపోయినా, రచయితలందరూ చంద్రంలా ఉండరు. వారి నైనా చూడవచ్చనుకున్నాను.
అదే ఆలోచనతో, సాయంత్రం బైక్ మీద బయలు దేరాను.
దారిలో క్లాత్ షోరూమ్ లో పచ్చని పట్టు శాలువా తీసుకున్నాను.
' సత్కారానికి, సన్మానానికి ప్రతీక శాలువా.
గౌరవాన్ని పెంచుతుంది.సన్మానం పొగడ్తలు శరీరానికి సోకకుండా చేస్తుంది.నీ గొప్పతనం చాలా ఉంద' నుకుంటూ శాలువా ను జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టాను.
ఎం.ఎస్.ఎన్ చారటీస్ పక్కగా ఉన్న హైవే మీదున్నాను.మరో ఆరు కిలోమీటర్లు దూరం ఉంది.ట్రాఫిక్ పెద్దలేదు.వేగం పెంచాను.తక్కువ సమయంలో నే కాకినాడ జగన్నాయక్ పూర్ వంతెన వద్దకు వచ్చాను.అక్కడే ఒక్కసారిగా ఆగాను.కారణం వంతెన మీద రంగు, రంగుల మట్టి డిబ్బీలను చూడటమే.ఒక ముసలి వాడు, ఆ డిబ్బీలను తన ముందు పెట్టుకుని అమ్ముతున్నాడు.
ఎర్రని ఏపిల్ పండు, పచ్చని సీతాఫలం ఆకారంలో చాలా బావున్నాయి.
మా ఆరేళ్ళ పాప సిరి , మట్టి డిబ్బీలు కావాలని చాలా రోజులుగా నన్నడుగుతోంది.ఫుట్ పాత్ ల మీద తప్ప, ఏ సూపర్ మార్కెట్ లోనూ ఇవి దొరకవు. బైక్ ను పక్కగా పెట్టి స్టాండ్ వేసాను.
సీతాఫలం ఆకారంతో చిలకాకుపచ్చ రంగులో నున్న డిబ్బీని చూపిస్తూ "ఎంత?" ని ,ఆ ముసలివాడి నడి గాను.
"డిబ్బీ బరువుగా అందంగా ఉంది.బావుంద" న్నాను.
"డబ్భై రూపాయలు బాబూ"...
గాజు కళ్ళు, ముడతలు పడిన శరీరం, మాసిన గెడ్డం, ముగ్గుబుట్టను తల పించే తల,వొంటి మీద చొక్కా కూడా లేదు. అక్కడక్కడా, అతుకులతో అరిగిపోయిన పంచీ మాత్రం కట్టాడు.
కష్టానికి, కరువుకు కలిపి పుట్టిన వాడిలా ఉన్నాడని పించింది.
'పేదవారితో బేరం, పెద్దవారితో బేధం మంచిది కాదం'టారు.
జేబులోనుండి ఒక వంద కాగితం తీసి ముసలాడికి ఇచ్చాను.
ఆ నోటును తన కళ్ళకు అద్దు కున్నాడు.మురిసి పోతూ చూసాడు.బోసి నవ్వు నవ్వాడు.తన ముందున్న గోనె పట్టా నుండి, మూడు మడతలు పెట్టిన పది రూపాయల కాగితాలను, వణుకుతున్న చేతులతో లెక్కపెట్టి నాకిస్తూ, "దరమ పెబువులు, సల్లంగుండాల" తన రెండు చేతులనూ ముందుకు చాచి, నన్ను దీవిస్తున్నట్లుగా అన్నాడు.
ఒక నవ్వు నవ్వాను.
హేమంత ఋతువు ప్రభావంతో చలి ఎక్కువుగా ఉంది.బైక్ లో ఉన్న స్వర్టర్ తీసి వేసుకున్నాను.
డిబ్బీని బైక్ బ్యాగ్ లో జాగ్రత్తగా పెట్టాను.బైక్ స్టార్ట్ చేయ బోతుండగా, ముసలాడు "బాబూ" అంటూ పిలిచాడు.
ఒక వైపు ,మా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపు లో ,చంద్రం సన్మానం ఫొటోస్ ,వరుస పెట్టి, వచ్చేస్తున్నాయి.అంటే ఇక సన్మానం చివరి దశలో ఉందన్న మాట.
ఇప్పుడైనా వెళ్ళక పోతే ఏం బావుంటుంది?.
ముసలాడి మాట వినిపించు కోనట్లుగా నటిస్తూ, బైక్ ను స్టార్ట్ చేసాను.
అయితే ముసలాడు మళ్లీ అరుస్తూ పిలిచాడు.
"ఎందుకన్నట్లుగా విసుక్కుంటూ, వెళ్ళాను.
అరవడంతో ఓపిక పోయినట్లుంది.నా చెవి లో ఏదో చెప్పాడు.
నేను అతని కేసి అసహనంగా చూశాను. "సమయం లేదు తాతా. నేను వెళ్ళాలి" అంటూ వచ్చి, బైక్ స్టార్ట్ చేశాను.
వణుకుతున్న ఆ చేతులను జోడిస్తూ, నా వైపు దీనంగా చూడటం, నా దృష్టి దాటిపోలేదు.
బైక్ వేగం పెంచాను.జడ్.పి ఆఫీసు రోడ్ వద్దకు వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది.
"ప్చ్"
మరింత సమయం వృథా అయింది.
గ్రీన్ సిగ్నల్ పడగానే, బైక్ వేగం పెంచాను.సన్మానం జరుగుతున్న సూర్య కళా మందిరానికి చేరాను.
అయితే మందిరం ముందున్న పార్కింగ్ స్థలంలో ఏ వాహనాలు లేవు.ఖాళీ గా ఉంది.
మందిరం నుండి ఏ మాటా వినబడటం లేదు.
అప్పుడే చంద్రం, సన్మానం లో కప్పిన శాలువాలను చూసుకుంటూ, వాటిని సవరించుకుంటూ కారెక్కు తిన్నాడు.నన్ను చూసి నవ్వలేదు.కనీసం ఆగలేదు. నా పక్కనుండే కారు వెళ్లి పోయింది.చప్పట్లు కొట్టడానికి, శాలువా కప్పడానికీ నేను రాలేదని కోపంగా వెళ్లి పోయాడనిపించింది.
పనిమనిషి అనుకుంటాను.అక్కడే కింద చెల్లా చెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను చెత్తబుట్టలోకి తీసి పడేస్తున్నాడు.నన్ను చూసి,
"సన మానం, అయిపోనాది బాబూ. అంతా ఎల్లిపోనారు. అంటున్నాడు.
నా చేతిలో నున్న పచ్చని పట్టు శాలువా, నన్ను ఏ చోటుకూ చేర్చలేదన్నట్లుగా చూస్తోంది.
'ముసలోడు కాల యాపన చేసాడు.లేకుంటే కనీసం శాలువా అయినా, చంద్రానికి కప్పేవాడినేమో?' మనసులో తిట్టుకున్నాను.
"కడుపు నిండి నోడికే పళ్లు పెడతారు.మెళ్ళో పూలు ఏత్తారు. ఆకలేసి అరిసినోళ్ళని పట్టించు కోరు.
"శాలువా కప్పినోళ్ళకే మళ్ళీ మళ్ళీ కప్పుతారు.సలితో ఏగలేక సతికిల పడినోళ్ళకు కనీసం మాసిపోయిన దుప్పటీ కూడా ఇయ్యరు. కలికాలం బాబూ" ఏ పుస్తక జ్ఞానం లేకపోయినా, లోకజ్ఞానం తో మాట్లాడిన ఆ పనివాడి మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.
అప్పుడే, డిబ్బీ ముసలాడు నా చెవిలో చెప్పిన మాటలు గుర్తు కొచ్చాయి.కర్తవ్యాన్ని ప్రబోధించాయి.
పట్టు శాలువా ను అలాగే జాగ్రత్తగా బైక్ బ్యాగ్ లో పెట్టాను.బైక్ స్టార్ట్ చేశాను. ఈ సారి దారిలో ఎక్కడా, రెడ్ సిగ్నల్ పడలేదు.
జగన్నాయక్ పూర్ వంతెన వద్దకు వచ్చాను.డిబ్బీలు లేవు.కానీ ముసలాడు అక్కడే ఉన్నాడు.నాకు కావాల్సిందీ అతనే.
నన్ను గుర్తు పట్టినట్లున్నాడు.
"డిబ్బీ బాగోనేదా?బాబు గోరూ?" వణుకుతున్న నోటితో నన్నడిగాడు.
"తాతను అలాగే ఉండ మంటూ, అతని వెనక్కు వెళ్లి, పచ్చని పట్టు శాలువాను అతని చుట్టూ కప్పాను.
ముడతలు పడిన శరీరం శాలువా లో ఒదిగి పోయిందనిపించింది.కీర్తి కండూతి అయిన చంద్రం కంటే, శ్రమను నమ్ముకున్న తాతే శాలువా లో బావున్నాడనిపించింది.
తాత గాజు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.వీధి లైటు వెలుగులో ,తాత కళ్ళలో వెలుగును గమనించాను.
"తాత ఏం సాధించాడని శాలువా ను కప్పారు?" అటు వెడుతున్న ఒక పెద్దమనిషి, నన్నడిగాడు.
"ఏమిటా?స్వశక్తిని నమ్ముకుని, డిబ్బీలమ్మిన డబ్బులతో ఆకలిని జయించాడు.అందుకే తాత చలిని కూడా జయించాలని శాలువా ను కప్పానని గర్వంగా చెప్పాను.
పెద్దమనిషి చప్పట్లు కొట్టాడు.
"తాతా, చిరిగి పోయిన దుప్పటీ అయినా ఇప్పించమని నా చెవిలో చెప్పావు.
"శ్రమజీవికి, శాలువా కప్పడమే నిజమైన సత్కారం" అన్నాను.
పచ్చని పట్టు శాలువా, చేరాల్సిన చోటుకు చేరిందేమో.చలిగాలి, తాత శరీరానికి తాకకుండా చేస్తోంది.
అమ్మ కొంగును చుట్టుకుని, చలిని జయించిన పసిబిడ్డలా, శాలువాలో గువ్వలా ఒదిగి పోయిన తాత బోసి నవ్వును చూస్తూ, సంతృప్తిగా అక్కడి నుండి కదిలాను.
**********
శుభం.
********
సహరి అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో సాధారణ బహుమతి పొందిన కథ..15/01/2026 న సహరి లో ప్రచురితమైంది.
****************
కె.వి.లక్ష్మణ రావు
No comments:
Post a Comment