ఒక్క వర్షఋతువులో తప్పా మరి ఇతర ఋతువులన్నింటి రాత్రుల్లోనైనా మా ఊర్లో ఆరు బయట నిద్రలే సాగేవి.
నులక మంచాలు, నవారు మంచాలు, వైరు మంచాలు, నేలమీదవాల్చిన జనపనార సంచులు, వాటి పైన బొంతలు పరుచుకుని నక్షత్రాల వంక కళ్ళు, జనరంజని వైపు చెవులు వాల్చి ఉండేవి.
మరేం ఇతర ఆలోచన లేకుండా నిదుర ఊరికూరికే వచ్చి మనుషులందర్నీ కమ్మేసేది.
తెల్లవారు ఝాముకంతా కప్పుకున్న దుప్పట్లు కూడా హేమంత చలి మంచుతో తడిసి వాటిలో మనమో, మనలో అవో తెలీనంతగా కలగలిసి, ముణగదీసుకుని గడ్డం వెల్లి మోకాళ్ళని తాకే ఆసనమొకటి గా ఉండేది ఆ కాలం.
అయినా ఆ నిద్ర మత్తులోనే ఏవో కాసిన్ని మాటల శబ్దం, కొంత పొగ వాసన సోకగానే లేచి కూచుని ఆ పళాన ఆ దుప్పటితో సహా మత్తుగా ఊగుతూ వెళ్ళి ఆ చలిమంట కాచుకుంటున్న మనుషుల వెచ్చదనం మధ్య, ఆ పెద్దవాళ్ళ మాటల మధ్య కూలబడేవాళ్ళము.
చలికాగుతూ అనే చలిమంటలని ఈ చలి రోజుల్లో గుర్తుకు తెచ్చుకుంటుంటే మళ్ళీ ఆ కాలపు తెల్లవారుఝాము నిదుర ఒకటి ఇప్పటికిపుడు వచ్చి నా కళ్ళ మీద మూత ఒకటి పెడుతున్నట్లు మత్తుగా ఉంది.
ఇదంతా చలి కథ కాదు, నిదుర రాత్రి కథ కాదు. చలిమంటల కథ అసలే కాదు.
తెల్లారాకా ఇళ్లముందు వేసుకున్న ఒక ముగ్గు కథ .
మేము ముసల్మానులం కదా. మా ఇంటి ముందు ముగ్గు ఉండేది కాదు. చక్కగా పేడ నీళ్ళ కళ్ళాపి అదీ చల్లి ఉండేది కాని ముగ్గులు మాత్రం కావు.
ఎందుకు అని అడగవద్దు, ముగ్గు కొన్ని ఇళ్ళముందు ఎందుకు ఉండేదో, కొన్ని ఇళ్ల ముందు ఎందుకు లేదో తెలుసుకోడం అనే దిక్కుమాలిన భోగట్టా ఎప్పుడూ నా తలనొప్పి కాదు , నాకు అనవసరం కూడా .
మామూలు రోజులల్లో వేసే ముగ్గులు సరే! ఒకే! కానీ రంగు రంగుల సంక్రాంతి ముగ్గులు చాలా స్పెషల్ అని మీకు నేను నాకు మీరు మీకు కొత్తగా చెప్పుకోనక్కరలేదు
కానీ నాకు మాత్రం అది చాలా వ్వెరీ వ్వెరీ స్పెషల్. ఎందుకంటే మీరు ముగ్గులను, రంగులను, గీతలను లెక్కచేయని మామూలు మనుష్యులు . నేను అర్టిస్ట్ వాడిని.
ముగ్గు రంగులు అంటే ఏమిటీ?
నేలపై విరిసిన హరివిల్లు కాదూ?
అల్లంత దూరాన ఆకాశంలో ఒక్క హరివిల్లు వంపుకే మనసు థ్రిల్లయ్ పోతుందే!
మరీ ప్రతి ఇంటి ముందు చేయి చాపితే అందేంత అగ్గువలో నేల నిండా ఇంద్రచాపాలే వెలిస్తే !
శరీరంలో ఒక్క ఎరుపు రంగేనా?
సిరలు ధమనుల నిండా రంగు రంగుల రంగులు నింపుకొవాలని ఆశపడే నావంటి బొమ్మల పిచ్చి, రంగుల పిచ్చి పిల్లాడి కళ్ళు ఆశతో ఏమైపోను?
మా నాయనమ్మ ఒళ్ళో ఆ చలి మంట కాచుకుంటూ కాచుకుంటూ అలానే ఒరిగి రెండవ విడత నిద్ర ముగించుకుని ఇరుగమ్మా పొరుగుమ్మల సంక్రాంతి ముగ్గుల ముచ్చట్లు చెవిన పడగానే, లేచి దుప్పటి మంచం మీద పడేసి అమాంతం దారి వెంట నడుస్తూ అమ్మలక్కలు చిత్రకళ చూసుకుంటూ సాగుతుంటే నా కాళ్లకు చెప్పులకు బదులుగా రధం ముగ్గు చక్రాలు తొడుక్కుని నడుస్తున్నట్టుగా ఉండేది.
ఆ రంగు ముగ్గులు రాలే ఋతువులో నడక ముందుకే కానీ వెనక్కి మళ్ళేది లేదు.
వినగలిగిన చెవి కనుక వుంటే సొగసుగా రేఖా తాళమునకు జత గూర్చిన రంగొక్క తీరు రాగాలు కదా అవి.
అపుడెవరూ నన్ను పట్టుకుని "హృదయామెక్కడున్నాది? హృదయామెక్కడున్నాది? అని ఒక పాట అడిగిన గుర్తులేదు.
లంగా ఓణిలు, సన్నని వేళ్ళు, తెల్లని ముగ్గు పిండి, రంగు రంగుల రంగవల్లులు, పదహారేళ్ళ వయసు పిల్లలు.
వీరిలో ఎవరివంక నీ చూపు అని ప్రశ్న అడిగితే అప్పటికీ, ఇప్పటికీ హృదయం ముగ్గుల మధ్యే అని నా జవాబు తెలుపుతుంది.
రంగులు లేకపోయినా కూడా ముగ్గు పొడి తో గీసే గీతే గీత.
విదేశీ కాగితం మీద విదేశీ ఇంకు, విదేశీ క్రొక్విల్ ఉపయోగించి కూడా అంత బ్యూటిఫుల్లు గీతను లాగలేమే!
అటువంటిది రెండు స్వదేశీ వ్రేళ్ళు కాసింత తెల్ల ముగ్గుని పుచ్చుకుని నేల మీద సర్రున అంత షార్ప్ లైన్ ఎట్లా కట్ చేస్తారో ఎప్పటికీ నిబిడాశ్చర్యమే నాకు?
బాపు బొమ్మలూ బాపు బొమ్మలూ అని డంగై పొతామే, ఆ బాపు గారు బొమ్మలో వేసిన ముగ్గులు చూస్తే - ఆర్టిస్ట్ అవ్వాలి అంటే కుక్కా, తేలు, పెంకుటిళ్ళు, కుర్చిలో కూచున మనిషి, కూరలు అమ్మే అమ్మి అనే బొమ్మలొకటే కాదు ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేయాలి అని తెలిసినపుడు గుండెకు ఢామ్మని వచ్చి తగిలిన "ఝాటర్ ఢమాల్" అనే మాటకు అర్థం ఏమిటో తెలిసిందప్పుడు నాకు.
అప్పట్లో స్కూలు రోజుల్లో ఆడపిల్లలందరి నోట్ బుక్ వెనుక పేజిల్లో నిలువు చుక్కలు ,అడ్డ గీతలు మరియూ అల్లిబిల్లి ముగ్గులు ఉండేవి.
ఆ రోజుల్లో ఈ రోజుల్లోలా అంతగా రంగు రంగుల స్కెచ్ పెన్నులు దొరికేవి కావు. అప్పట్లో అవి ఉండి ఉంటే ఆయమ్మాయిల నోట్ పుస్తకాల పేజీల మీదినుంచి పూల కుచ్చెళ్ళ పావడాలు గిరగిర తిప్పుకుంటూ పండగే దిగి వచ్చేది.
ముగ్గు ఒక మాయాజాలమబ్బా
బాగా ముగ్గులు వేయగలిగిన ఒక అమ్మాయి , భావాలని అందంగా భాషలోకి వంపగలిగిన ఒక జవ్వని, తను మనసు పడ్డవాడికి ఒక ప్రేమలేఖ వ్రాసి ఆ లేఖ మధ్యమధ్యన అల్లిబిల్లిగా ముగ్గులు అల్లి ఇచ్చి ఉంటే ఆ ముగ్గు కాలికి ఇరుక్కుని అందులోంచి బయటపడే విద్య ఎప్పటికయినా వాడికి తెలిసి వచ్చేనా?
ముగ్గులు వేసే అమ్మాయిలు పొందిక కవి కళ్ల ముందుకు వచ్చి ఉంటే "నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే వాక్యం తిలక్ ఎట్లా వ్రాసారబ్బా? అనిపిస్తుంది. ముగ్గుపిండి కన్నా తెల్లనిదా? అందమైనదా వెన్నెల?
నాకు నేను తెలిసినప్పటి నుండి నేను ఎన్నడూ ముగ్గు మీద కాలు పెట్టలేదు, ఎప్పుడూ పెట్టను కూడా.
ఎప్పుడయినా కాలికి అక్షరమున్న కాగితం తగిలితేనే లెంపలెసుకుంటూ "అమ్మ సరస్వతికి అపచారమని" ఇదయిపోతామే!
మరి ముగ్గు మీద కాలు పెడతానా? ముగ్గు అంటేనే బొమ్మ. మరి బొమ్మంటే సరస్వతి దేవి వాళ్ళ అమ్మమ్మ కాదూ?
సేకరణ
🌹🍃
No comments:
Post a Comment