Sunday, January 25, 2026

 కోడి కూర-చిట్టి గారె
     రచన- జాబిలమ్మ

అనగనగా హైద్రాబాద్ మహా నగరంలో , …………… అనే బస్తీలో ఒక పెద్ది రెడ్డి గారు ఉండేవారు. పెద్దిరెడ్డి గారి భార్య పేరిందేవి , పేద్ధ పేచీకోరుగా పేరుపొందిందా బస్తీలో. ( అసలావిడ నోటి ధాటికి తట్టుకోలేక ఆ పక్క ఇంట్లో ఎవరూ స్థిరంగా ఉండలేరని వినికిడి)
వారి ఏకైక కుమార రత్నం మాంసాహార భోజనం మహాఇష్టం! అందులో , కోడి కూరంటే మరీనూ!అసలది లేకపోతే 
రోజూ అతనికి ముద్ద గొంతు దిగదుట.
అసలు ఎవరింట్లో వాళ్ళు , వాళ్ళకి కావలసినదేదో వండుకుని, తిని కూర్చుంటే ఈ ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయిండీ?

అక్కడే వచ్చిందండీ అసలు చిక్కు!
పేరిందేవమ్మగారికి తమ కోళ్ళు గుడ్లు పెట్టగానే , వాటిని సున్నితంగాచిట్లించి, పెంకు తీసి లోపలి తెల్లని, పచ్చని సొనవండేసుకున్నాక, ఆ పెంకులు, ఇంకా మిగతా చెత్త , చెదారంతో పాటు గోడ బయట పారేయడం ఆనవాయితీ.
ఇంక కూర వండుకున్నాక, కోడికాళ్ళు వగైరా బొమికలు కూడా 
ఆ గోడవార చేరుకునేవి.
ఆవిధంగా పేరిందేవమ్మ గారి 
ఆనవాయితీ నిరాటంకంగా సాగిపోయే సమయంలో ~~~~~~

ఆ పక్కింట్లోకి సుబ్రహ్మణ్య శాస్రి గారు వారి సతీమణి సుశీలమ్మ, సుపుత్రి సూర్యకాంతం తోటి కాపురానికి దిగారు. 
వస్తూనే, ముందుగా ఇల్లూ, వాకిలీ శుభ్రం చేయించుకున్నారు.
చక్కగా గోడవారగా  రుబ్బురోలు పెట్టించారు.  ఆపక్కనే నిద్రగన్నేరు చెట్టు నిండుగా పూలతో కలకలలాడుతూ కనువిందు చేస్తోంది.
సుశీలమ్మ తృప్తిగా పెరడంతా పరికించి చూసుకుంది. ఏమయితేనేం, ఊరికి కొత్తయినా, ఉండడానికి చక్కటి ఇల్లు సమకూడింది. ఆమె సంతోషంతో చిరునవ్వు నవ్వుకుంది.
           ……………………….
మరునాడుదయం — - - -
సుశీలమ్మగారు తలారా స్నానం చేసి తులసి పూజ  చేసుకుని, పప్పు రుబ్బు కోవడానికి ఉపక్రమించారు. 
వాళ్ళమ్మాయి సూర్యకాంతానికి చిట్టి గారెలంటే మహా ఇష్టం కదా.( అవేనండీ— గారెలే— చిన చిట్టి పరిమాణంలో- వెండి రూపాయ కాసంతన్నమాట- మధ్యలో కన్నం మాత్రం చిటికెన వేలు గోరుతో చేయాల్సిందే! లేకపోతే సూర్యకాంతం చిఱ్ఱు బుఱ్ఱులు తను తట్టుకోగలదా?)
ఇంట్లోంచి భక్తిరంజని పాటలు వింటూ, పరవశత్వంతో , పని అలసట తెలీకుండా సుశీలమ్మగారు  తెగ రుబ్బేస్తూంటే ………………..
మలయమారుతం చల్ల చల్లగా వీస్తూ ఉంటే…  ఎచటినుండి వీచెనో, ఈ చల్లని గాలీ అనుకుంటూ ఉండగా ……..
గాలిలో తేలుతూ చిన్న చిన్న తెల్లని పెంకులు హఠాత్తుగా వచ్చి మీద పడ్డాయి. ఆమె  తలెత్తి చూసి రాబోతున్న మరో అవాంతరాన్ని తప్పించుకుని ఏవం(డీ  అని గావుకేకతో భర్తని పిలిచి, తరువాత నోట మాట లేక  గోడదిశగా వేలు చూపింది. 
అటుచూసిన శాస్త్రి గారు అగ్గిమీద గుగ్గిలం అయిపోయి మడవపైకి పంచ మడిచి కట్టి యుద్ధరంగానికి సన్నద్ధమయ్యారు……………
సూర్యకాంతం ఓమాటలా పెరట్లోకి తొంగి చూసి , ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి నాంది లా ఉందనుకుంటూ తన మానాన తను కాలేజీ కెళ్ళడానికి తయారవడం మొదలు పెట్టింది.
………………………………………………..
 ……. కాలేజీలో…
సూర్యకాంతం చేత్తో పుస్తకాలతో తడబడే అడుగులతో, కాస్త బెరుకు బెరుకుగా క్లాస్ రూమ్ లో  అడుగుపెట్టింది. అంతే!!  అక్కడ సూది కింద పడితే శబ్దం వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది! అందరి కళ్ళూ బాపూ బొమ్మలా అందంగా వయ్యారంగా అరుదెంచిన సూర్యకాంతంమీదే! 
గభాలున తలవంచుకుని  వెళ్ళి తన స్థానంలో కూర్చుంది. 
ఆరోజు విరామ సమయంలో సీనియర్ విద్యార్థులు ఏమ్మా , బామ్మా, అడ్రస్ ఇమ్మా ముద్దుగుమ్మా, అని ఇంకా రకరకాలుగా విసిగించడం మొదలు పెట్టారు. 
సూర్యకాంతం బెదురు చూపులతో ఎవరయినా తననీ సీనియర్స్ బారినుంచి రక్క్షిస్తారేమోనని కలయచూసింది. ఆమె కళ్ళు దూరంగా నిల్చుని ఆ తంతు తదేకంగా చూస్తున్న రమణారెడ్డి మీద పడింది. 
అంతేనండి! చూపులు కలసిన శుభవేళ అన్నట్టు రెడ్డి కాంతం కళ్ళలోని అభ్యర్థన గ్రహించేసి, తన తోటి విద్యార్థులందరినీ పిలిచి ఇక ఆ అమ్మాయిని ఏవిధంగానూ విసిగించరాదని ఆజ్ఞ జారీ చేశాడు.
( రెడ్డి అంటే కాలేజీ పిల్లలందరికీ గౌరవం, ఒక విధమైన భయం కూడా)
కాంతం కళ్ళు కృతజ్ఞతతో మెరిసాయి. రెడ్డి ఆజానుబాహు విగ్రహం, ఆకర్షణీయమయిన ముఖం కూడా ఆమెను ఆకట్టుకున్నాయి.
ఇంకేముంది? మొదలయిందండీ వారి ప్రేమాయణం. ఇద్దరూ తమతమ తలపుల్లో తేలిపోతూ, చదువూ, కాలేజీ యాదృచ్ఛికంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి పాపం వాళ్ళింట్లో, పక్కింట్లో జరిగే గొడవల సంగతి తెలుసుకోడానికి, పట్టించుకోడానికీ సమయం చిక్కలేదు. అసలు ప్రయత్నిస్తే కద.
………………………………………………….
అలా వాళ్ళ ఇంట రామాయణం, ఇళ్ళ మధ్య భాగోతం, ఇంట్లోని ఆడస్త్రీ మహిళలు, వారి తాలూకు పురుషపుంగవుల మధ్య మహా భారత సంగ్రామాలు కొంతకాలం కొనసాగాయి.
చినరెడ్డి( రమణారెడ్డి) కాంతం మధ్య స్నేహం కూడా దిన దిన ప్రవర్థమానమై పక్వమంది ప్రేమగా రూపొందింది.
         ………………,,,,……..,,,,,…….
ఆరోజు సాయంత్రం చినరెడ్డీ , చిట్టీ ( సూర్యకాంతం ముద్దు పేరు)
పార్కులో కలుసుకున్నారు .
వారిద్దరి కుటుంబ సభ్యుల మధ్య రోజూ జరిగే వాదోపవాదాలు, రామ రావణ యుధ్ధాలకి పరిష్కారం ఏమిటా అనేది వారి చర్చనీయాంశం.
చాలాసేపు తర్జన భర్జన తరువాత వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. 
                       సశేషం…..
            మూడవ భాగం

……అలా ఇద్దరూ మాట్లాడుకుంటూఇళ్ళు చేరేసరికి…

“ఇవి పప్పు రుబ్బిన చేతులే””
“ఆ! ఇవి కోడి కోసిన చేతులే”

“ ఇవి చెట్టు కొమ్మలు నరికి, పొయ్యిలో మంట పెట్టిన చేతులే”

“ఇవి రోట్లో ఎండు మిరప కాయలు కొట్టి , కంట్లో కారం కుక్కేయగలిగిన చేతులే”
అంటూ ఆ ఆడస్త్రీ మహిళా మణులు శిగపట్లు పట్టే వేళ
….మగధీరులిద్దరూ తమతమ కఱ్ఱసాము ప్రజ్ఞా ప్రదర్శనం చేసేవేళ,

 “ఔరా ఇది గుండమ్మ కథ—నాటక రూపం— గుండమ్మలు, గంటన్న, అంజిగాడి పాత్ర పోషణ “ కాదు కదా ?? 
అని హాశ్చర్య పోయిన వేళ,
         అలా చేయిచేయి పట్టుకుని జంటగా నిలబడిపోయిన ముచ్చటయిన జంటని చూసి,
పోరాటంలో మునిగిన నాలుగుశాల్తీలు అమాంతంగా అవాక్కయిపోయాయి!!
రమణా రెడ్డి వెంటనే తేరుకుని
“ ఇదిమొదలు నేను మాంసాహారం మానేస్తున్నానని శపథం చేస్తున్నాను” అంటూ తన కుడిచెయ్యి పైకెత్తాడు.
సూర్యకాంతం కూడా” తనకుడిచేయి పైకెత్తి “ నేను కూడా 
గారెలు బూరెలు తినడం మానేస్తున్నాను” అంది
ఇద్దరూ యుగళ గీతంలా” మీరంతా ఈ దినదిన సంగ్రామాలకు స్వస్తి పలకక పోతే 
మేమిద్దరం ఆకులు అలములు, కందములాదులు తింటూ హిమాలయాల్లో……
“అయ్యోఅయ్యయ్యో. అంత ఘోర శపథం వద్దు బాబోయ్ అంటూ వాళ్ళ నాన్నలు తమ ఆయుథాలు జారవిడిచారు!!
ఆడ  స్త్రీ మహిళలు  శిగపట్లు సడలించి ఆ యువ జంటని సంభ్రమాశ్చర్యాలతో పరికించారు.
తమతమ భర్తలు చేసిన వాగ్దానం పునరుధ్ఘాటించారు!!
……………………………………………….

ఒక నెల రోజుల తరువాత :
ఆ ముంగిట మంగళ వాద్యాలు మ్రోగాయి!
“ మా కోడికూర పెండ్లి కొడుకాయెనే, మా చిట్టి గారె పెండ్లికూతురాయెనే”

ఆఇళ్ళకి “ శాంతి నివాసం “ పేరు పెట్టారని విన్నాను.
ఆ(. ఇంకో విషయం చెప్పడం మరిచానండోయ్! ఆ బస్తీలో వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు వారానికి రెండుసార్లు చెత్తంతా బయటి కుండీల్లోంచి పోగేసి ఊరిబయట  సేంద్రీయ ఎరువుల మిశ్రమం (కంపోస్ట్) తయారు చేస్తున్నారట. 
అసలు అమలు జరగానికి శ్రమ పడ్డది
కూడా కోడికూర, చిట్టి గారెలేనట. ఆ(య్!!


Disclosure#
కోడికూర- చిట్టి గారె 
హైద్రాబాద్ లో హైటెక్ సిటీలో ఉన్న ఒక భోజనశాల పేరు

No comments:

Post a Comment