Sunday, January 25, 2026

 పూర్వకాలంలో ప్రతి ఇంట్లో *అరుగులు* ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ *మాతరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు*

తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల *ద్వారపాలకులు* లా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చుతో చేసిన వసారా ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతోమంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగింది.

తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకి ఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం. పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పిన తాతగారు శ్రీ మధునాపంతుల కామ రాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు  పంచాయతీ బోర్డు ఆఫీస్ కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడు రెండు అరుగుల మీద    తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారికి సంఘ సేవ మీద ఎక్కువ మక్కువ ఉండడం మూలంగా ప్రజల సమస్యల్ని అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో పల్లిపాలెం గ్రామాభివృద్ధి ఎంతగానో జరిగింది. ఆయన హయాంలో  ప్రజలు సమస్యలు తీరి ఎంతో సంతృప్తిగా ఉండేవారు. ఆయన గ్రామాభివృద్ధికి తీసుకునే ప్రతి నిర్ణయం మా అరుగుల మీద కూర్చుని తీసుకునేవారు. ఆయనకి మంచి మంచి ఆలోచనలు పుట్టించిన మా అరుగు నిజంగా రాములవారి 
సింహాసన మే. 

నిత్యం ఎంతో మంది పంచాయతీ అధికారులు వచ్చి పోతూ ఉండేవారు. వారికి అతిథి మర్యాదలు  అన్నీ మా అరుగు మీదే. ఆ రోజుల్లో మా వాళ్లకి కొంచెం ఛాందస భావాలు ఉండేవి. బంధువులు తప్పితే మిగిలిన వారిని లోపలకు రానిచ్చేవారు కాదు. అలా ఎంతో మంది అధికారులకు ఆతిధ్యం ఇచ్చి మా అరుగు అన్నపూర్ణ అయ్యింది.

ఇకపోతే మా నాన్నగారికి రాజకీయాలంటే చాలా అమితమైన ఆసక్తి. పదవులు తీసుకునేవారు కాదు గాని పదవులు కట్టబెట్టే వారు. ఎన్నికల సమయంలో ఎన్నో  గ్రూపు రాజకీయాలు, రాజకీయ సమాలోచనలు, రాజకీయ ప్రణాళికలు అన్ని ఈ అరుగునుండే. గెలుపు ఓటములు విశ్లేషణ, విజయోత్సవ సంబరాలు కూడా మా  అరుగు మీదే జరిగేవి. అలా మా అరుగు సంఘసేవకురాలు అయ్యింది.

మధ్యాహ్నం వేళలో మరి అరుగు మీద  పురాణ పఠనం  జరిగేది. మా నాన్నగారు రామాయణ భారత భాగవతాది గ్రంథాలలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. దీనికి  ఓలేటి సీతన్న తాతయ్యగారు పద్యాలకి అర్థం చెప్పే వారు. పక్క ఊరు నామవానిపాలెం గ్రామంనుండి వచ్చిన  శ్రీ భూపతి రాజు చిన్న వెంకటపతి రాజుగారు  మరియు  మధునాపంతుల గౌరమ్మగారు మరియు  అనేక మంది రెడ్డి ప్రముఖులు నిత్య శ్రోతలుగా ఉండేవారు. ఎన్నోమార్లు  శ్రీరామ పాదుకా పట్టాభిషేకం జరిగి ప్రసాదాలు పంచిపెట్టేవారు. ఇలా మా అరుగు ఎంతమందికి ఆధ్యాత్మిక ఆనందం ఇచ్చి పునీతులను చేసింది.

మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు కావడం వల్ల నిత్యం ఎంతోమంది పేషెంట్లు  వచ్చిపోతూ వారి కోసం ఈ అరుగుమీద వేచి ఉండేవారు. వారిచ్చే మందులు సేవించి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళేవారు. మా అరుగు నిజంగా ధన్వంతిరి నిలయమే.

మా ఇంట్లో మొత్తం 12 మంది పిల్లలు ఉండే వాళ్ళం అందరూ అరుగుమీద పుస్తకాలు ముందర వేసుకుని కూర్చుని నిత్యం చదువుకునే వాళ్ళం. మా పెద్దన్నయ్య దగ్గర నుండి నా వరకు అందరూ ఎర్రటి గచ్చు మీద తెల్లటి సుద్ధ ముక్కలతో లెక్కలు చేసుకునే వాళ్ళం. మరియు ఎంతో మంది విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాళ్లం. ఈ అరుగుమీద విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థికి లోటు లేదు. ఇలా మా అరుగు సరస్వతీ నిలయం అయ్యింది.

ఇక వేసవి సెలవుల్లో మా మేనత్తగారి పిల్లలు మద్రాస్ నుండి వచ్చే వాళ్ళు మేము అరుగు చివర తలగడ వేసుకుని పడుకోవడానికి పిల్లలందరం పోటీ పడేవాళ్ళం. ఎందుకంటే అక్కడ వీచే చల్లగాలి కోసం. ఇంతమంది పిల్లల మానసికంగా ఆనందానికి ఆలవాలమైన మా అరుగుని ఏమని పిలవ గలను. డిక్షనరీలో పదాలు దొరకడం లేదు. నీకు ప్రాణం లేకపోయినా మా ప్రాణాలను ఎల్లప్పుడూ కాపాడేవు. తెలిసీ తెలియని వయసులో మా బాబాయ్ గారి పిల్లలతో కలిసి మా అరుగు మీద కూర్చుని రాపాక వెంకట్రావు గారిని ఏడిపించిన పద్ధతి ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది ఉంటుంది.

మరి పండుగ దినాల్లో ఈ అరుగులమీద చతుర్ముఖ పారాయణం జోరుగా సాగుతూ ఉండేది. పేకాట వ్యసనమే కానీ సంసారిక బాధలనుండి ఉపశమనం పొందడానికి ఒక సాధనంగా భావించేవాళ్ళు.

ఇక రాత్రిపూట మా అగ్రహారీకులు  భోజనాలు చేసి    తువ్వాలు ఉండలా చుట్టుకుని మా ఎర్ర గచ్చు మీద పెట్టి దాని మీద తల పెట్టుకుని అరుగు మీద నడుము వాల్చి విశ్రాంతి తీసుకునే వారు. ఇలా ఆవకాయ నుండి అమెరికా వరకు అన్ని విషయాలు మాట్లాడుకుని సేద తీరే వారు. అలా మనుషుల మధ్య అనుబంధం పెంచింది.

ఉద్యోగరీత్యా దూరాలు వెళ్ళవలసి వచ్చి సొంత ఊర్లో ఉపాధి లేక మా అరుగు మీద కూర్చుని ఉండే అదృష్టం లేక పోయింది. ఎంతైనా ఇంటికి అరుగు ఉంటే ఎంతో హాయి.

రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.

No comments:

Post a Comment