విద్యాధనం
మన పూర్వీకులు పేర్కొన్న అప్లైశ్వర్యాలలో విద్య ఒక్కటే శాశ్వతమైనది. మిగతా ఏడు- పదవి, ధనం, జీవిత భాగస్వామి, సంతానం, వినయం, ధైర్యం, స్థైర్యం... ఏవీ స్థిరమైనవీ శాశ్వతమైనవీ కావు. అందుకే వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మశా స్త్రాలు, కావ్యాలు సందర్భోచితంగా విద్యా ప్రాశస్త్యాన్ని వెల్లడించాయి. 'విద్యయా అమృ తమశ్నుతే'- అమృతత్వం పొందడానికి విద్య ఒకటే మార్గమని ఈశావాస్యోపనిషత్ ప్రవచించింది. మానవాళికి జీవితాన్ని ప్రసాదించే విద్య పూజనీయమైనది, దైవ సమా నమైనదని విష్ణుపురాణం ఉద్బోధించింది. ప్రణోదేవీ సరస్వతీ... అని విద్యాధిదేవతను కీర్తించింది రుగ్వేదం. ఆ వాగ్దేవి ఆవిర్భవించిన రోజు మాఘ శుక్ల పంచమి. ఈ రోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం సంప్రదాయం.
అయిదో శతాబ్దికి చెందిన భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో విద్యా ప్రాధాన్యాన్ని చక్కగా వివరించాడు. విద్య దొంగిలించడానికి వీలుకాని ధనం. ముఖానికి ఒక వర్చ స్సునిస్తుంది. కీర్తిని, సుఖాలను ప్రసాదిస్తుంది. గురువుగా, బంధువుగా నిరంతరం వెన్నంటి ఉంటుంది. ఎంతగా దానం చేస్తే అంతగా పెరిగే సంపద విద్య ఒక్కటేనని భర్తృహరి ఉపదేశిం చాడు. 'స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అని ఆర్యోక్తి. అందుకే అవతార పురు షులు శ్రీరామ శ్రీకృష్ణులు సైతం ఆశ్రమాలకు వెళ్లి గురువుల దగ్గర విద్యనభ్యసించారు. వేయి న్నర సంవత్సరాల క్రితం భారతావనిలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా భాసించాయి. కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానంలో కవిసార్వభౌముడు శ్రీనాథుడు విద్యాధికారిగా వ్యవహరించాడు. అంటే అప్పటికే విద్యకు సంబం ధించిన విభాగమొకటి పరిపాలనలో స్థిరపడిందన్న మాట. 'చదవిన సదసద్వివేక చతురత కల్గున్' అన్నాడు పోతన. 'చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు' అన్నాడు వేమన. సమాజ పరిణామక్రమంలో అన్ని కాలాలలో విజ్ఞులు విద్యనొక జీవితావసరంగా గుర్తిం చారు. గౌరవించారు. అదే పరమ సంపదగా భావించారు. విద్యతో వినయం, విద్యా వినయాలతో అర్హత, అర్హతతో ధనం, ధనంతో ధర్మం, ధర్మంతో సుఖం లభిస్తుంది. విద్య సకలార్థ ప్రదాయిని.
దైనందిన జీవితంలో పౌరసమాజం సంపద కన్నా విద్యకు ప్రాధాన్యమివ్వడం చూడ వచ్చు. మీరేం చదువుకున్నారు? పిల్లలేం చదువుతున్నారు? అని అడుగుతారే తప్ప ధన సాధన సంపత్తి గురించి ప్రశ్నించరు. అలాగే పేరుకు ముందో వెనకో విద్యార్హతలుంటాయి తప్ప కూడబెట్టిన సంపదల వివరాలు ఉండవు. డబ్బు, నగలు, భవనాలు, వాహనాలు.. మరణించాక అన్యాక్రాంతమవుతాయి. వాటిని సమకూర్చిన వారి పేరు కాలక్రమంలో కనిపించకుండాపోతుంది. విద్యాకీర్తి ఒక్కటే ఎన్నటికీ చెరిగిపోదు. కనుక విద్యాదీపం నిరం తరం కాంతులు వెదజల్లాలి. తల్లిదండ్రులు పిల్లలకిచ్చే అత్యంత విలువైన సంపద విద్య ఒక్కటే. విద్యార్థులు చదువే సర్వస్వంగా శ్రమించాలి. విద్యావ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వాలు యథాశక్తి సహకరించాలి. విద్యాధనం మహాధనం. విద్యాదానం మహాదానం అన్న ఆర్యోక్తి జనజీవన సంస్కృతిలో భాగం కావాలి.
డాక్టర్ అయాచితం శ్రీధర్
No comments:
Post a Comment