. *ఆత్మ సత్య తత్వములు*
***********************
ఓ మనిషీ ! నీవెందుకొ స్వార్థానికి బానిస !
అదను చూచి నిను హరించ
పొంచి ఉంది మృత్యు నిషా !
ఈ తనువూ చితికెనా !
వినూత్న తనువు కావలెనా !
వెంటనె నీ వెంట ఉన్న
మృత్యువును వరించుమా !
ధన్యుడిగ తరించుమా !
ప్రతి జన్మకు జననము, మరణములు
ఆది అంతములు.
కానీ నిజముగ ఆత్మకు
లేవు ఆది అంతములు.
చెడి తడబడు ఈ తనువును
విసర్జించుటే మరణము.
సరికొత్త వినూత్న తనువు
ధారణయే జననము.
జననమునకు మరణమునకు
నడుమ ఉండు జీవనము
ఆత్మకు తాత్కాళికమౌ
స్వప్న తుల్య భావనము.
ఎక్కడ ఎపుడెటులున్నను
ఇంతే గాద మనము !
ఇంతేగా దమనము !
ఏనాడూ ఎటులుండునొ
పరిస్థితుల తోరణము !
పరిస్థితులతో రణము !
దేవుడు కలడని కొందరు !
దేవుడు లేడని కొందరు !
దేవుడు కలడో లేడో
తెలిసిన వారెందరు ?!
అగ్ని అగ్నిలోన కలిసి
విడిపోతూ కలియు రీతి
పరమాత్మలొ ఆత్మ కలిసి
విడిపోవుటె అనుభూతి.
ఈ మున్నాళ్ళా ముచ్చటకే
ఎందుకు తలబిరుసు మనకు ?!
సుగుణ సత్ప్రవర్తనమున
కలుగు ముక్తి ప్రగతి మనకు !
ఇది గ్రహించి నడచుకొనిన
ఉండవు సుఖ దుఃఖములూ
సుఖ దుఃఖములకు అతీతము
ఆత్మ సత్య తత్వములు !
********************
రఛన :---- రుద్ర మాణిక్యం. (కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment