*సత్పురుషుల సాంగత్యం*
”సత్పురుషుడు ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశం ఇతర విషయాల్లో ఎలాంటిదైనా స్వర్గం కంటే అధికమైనదవుతుంది".
అది జ్ఞానవంతులకు నివాసయోగ్యం.
*"సత్పురుషుడు, వృక్షము లేని చోటు.. సర్వవస్తు సమృద్ధమైనా అది మరుభూమి (శ్మశానం)తో సమానం!” అని జ్ఞానవాసిష్ఠ బోధ.*
జీవితంపై సందేహ, సంకటాలు కలిగినవారు మహాత్ములైన సజ్జనుల చెంత చేరాలి.
దుఃఖితులైన వారికి సత్పురుషులు.. ధైర్యాన్ని, దైవాలంబనోపాయాన్ని బోధిస్తారు.
ధర్మ, తత్వ రహస్యాలను తెలియపరచి శాంతహృదయులు చేస్తారు.
*ఇంతకీ సజ్జనులంటే, సత్పురుషులంటే ఎవరు?*
అంతర్యామియైన భగవంతుని కనుగొనడానికి ప్రయత్నించే సాధనా- పరులే సజ్జనులు, సత్పురుషులు.
సజ్జనులైన మానవులు మానవ ధర్మ సారాన్ని ఎరిగి ఉంటారు, వారికి చిత్త చలనం ఉండదు, తాపత్రయాలను పొందరు, ఎన్ని కష్టాలు వచ్చినా.. పర్వతం వలె చలించక స్థిరచిత్తులై ఉంటారు.
మనస్సునందున్న మాలిన్యాన్ని దైవనియమ సాధనలచే పోగొట్టుకొని స్థిరమతితో యత్నించిన మానవులు పరమేశ్వరుని కనుగొనగలుగుతారు.
ఆత్మవేత్తలైనవారు దేని మీదా ఇచ్ఛ లేనివారై ఉంటారు. ఆత్మదర్శనం చేతనే తృప్తి చెంది ఉంటారు.
*అటువంటి వారి దర్శనం లభించినవారే ధన్యులు.*
*పద్మాకరం దినకరో వికచం కరోతి. చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్ నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగాః*
తామరలు ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను వికసింపజేస్తున్నాడు.
కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని వికసింపజేస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్షోదకధారలు కురిపించి జీవనదానం చేస్తున్నాడు.
ఇలా సత్పురుషులు తమంత తామే పరహితాసక్తులై ఉంటారని..
ఎవరూ అడగకుండానే సాయం చేస్తారని భర్తృహరి చెప్పాడు.
ఆత్మోద్ధరణకు ధనం, స్నేహితులు, శాస్త్రాలు, బంధువులు చేయగలిగిన ఉపకారమేదీ లేదు.
ఆ విషయంలో సహాయం చేయగలిగినది సత్పురుషులే !
సత్పురుష సమాగమమనే చక్కని నావలో సంసారం నుంచి ముక్తిని పొందడమే ఉత్తమ మార్గం.
సత్పురుషుల తోడి సాంగత్యం పూర్వపుణ్య వశానే లభిస్తుంది.
అది గంగలా పాపాలను పోగొడుతుంది.
వెన్నెలలా అందరి మనస్సులకూ ఆనందం కలిగిస్తుంది.
సూర్యుని ప్రభలవలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది.
చల్లని చెట్టు నీడవలె తాపమును పోగొడుతుంది.
బహుదుర్లభమైన సజ్జన సాంగత్యం వల్లనే పాప, తాప, దైన్యాలు నశిస్తాయి...
No comments:
Post a Comment