సత్యమేవ జయతే సాధ్యమా ?
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం,
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన: "
- మనుస్మృతి - 4.138
" ఎల్లప్పుడూ సత్యమే (నిజమే) పలకాలి. మాట్లాడే మాటలు ఎదుటివారికి ఇంపుగా (ప్రియంగా) ఉండాలి. సత్యమైనప్పటికీ, ఎదుటివారిని బాధపెట్టే లేదా కీడు చేసే మాటలు (అప్రియమైన సత్యం) మాట్లాడకూడదు. అలాగే, ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం అబద్ధాలు (ప్రియమైన అసత్యం) కూడా చెప్పకూడదు " అని మనుస్మృతి తెలియచేసింది.
శ్రీరాముడిని ఎలాగయినా అయోధ్యకు తిరిగి తీసుకునివెళ్ళాలని భరతుడితో సహా అందరూ ప్రయత్నిస్తారు. వారిలో దశరధుడి సలహాదారుడు జాబాలి మహర్షి కూడా ఉన్నారు. ఆయన అంటారు " రామా ఎవరు తండ్రి, ఎవరు తల్లి. ఎవరి కర్మలు వారివే. తండ్రి బీజం తల్లి గర్భంలో పడి ప్రాణం పోసుకుంటుంది. పుట్టుకకు అది ఒక కారణం అంతే. తండ్రికిచ్చిన మాట అంటూ నువ్వు ఇక్కడ కూర్చోనక్కరలేదు. రాజ్యాన్ని పాలిస్తూ నీ ధర్మం నిర్వర్తించు " అని. అప్పుడు రాముడు అంటారు:
సత్యమేవేశ్వరో లోకే
సత్యం పద్మాశ్రితా సదా,
సత్యమూలాని సర్వాణి
సత్యాన్నాస్తి పరం పదా "
" సత్యమే లోకాన్ని నడుపుతూన్న పరమేశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది. సర్వ ధర్మములు సత్యమూలములు " అని.
" నేను సత్యానికి కట్టుబడ్డాను. మా తండ్రి సత్యాన్ని కాపాడడమే నా ధర్మం.
మాతండ్రి సత్యాన్ని నేను కాపాడకపోతే ఆయనకు అసత్యదోషం కలిగి ఆయనకు ఉన్నతలోకాలు ప్రాప్తించవు. నేనే అలా చేస్తే ప్రజలుకూడా అలాగే చేస్తారు, నేను అధోగతిపాలవుతాను. అధర్మాన్ని ధర్మంలా కనిపించేలా శాస్త్రవిరుద్ధంగా మాట్లాడారు మీరు. మీ మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మీవంటివారు నాతండ్రికి సలహాదారుగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను " అంటారు శ్రీరాముడు.
భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వవద్దంటాడు. బలి అలా చేయడం తప్పు అంటాడు. అప్పుడు శుక్రుడు అంటారు:
వారిజాక్షులందు, వాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప "
కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడవచ్చు అంటారు శుక్రుడు. కాని బలి వినడు.
కాని భారతంలో " అశ్వత్థామ హతః ( కుంజరః ) " అని అనమంటే ధర్మరాజు మొదట ఒప్పుకోలేదు. కాని అందరూ అలా అనడం తప్పు కాదు అంటే సరే అని అనేస్తారు.
అమ్మ కూడా పిల్లల క్షేమం దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసి వస్తుంది. తప్పు కాదు. మాట్లాడేటప్పుడు కుటుంబ గౌరవం, క్షేమం, సమాజహితం దృష్టిలో పెట్టుకోవాలి.
సత్యం తెల్లగా, నిర్మలంగా ఉంటుంది. అసత్యం రంగులు మారుస్తూ ఉంటుంది.
శుభమస్తు
No comments:
Post a Comment