Thursday, June 11, 2026

 *యోగి వేమన -8*

రచన : మాలయశ్రీ 


*అభిరాముని కోరిక*

అభిరామాచారి ప్రతిరోజూ ఉదయంపూట పాల పాత్రతో కొండ మార్గం వెంట వెళ్ళి ఒక గుహలోని సాధుకు ఇచ్చి వస్తుండేవాడు. అది ఏదయినా  మహిమల ఆశ వల్లనే కానీండి, కాదా-భక్తి వల్లనే కానీండి, కాని కొన్నాళ్ళనుండి అతడు క్రమం తప్పక పాటిస్తున్న సత్కార్యం ఆది.

వేమన అది గమనించాడు. ఒకనాడు రహస్యంగా వెంట వెళ్ళి అతని పని గమనించి వచ్చాడు కూడా. ఇతడేమీ అడగలేదు. అతడు చెప్పలేదు.

ఓ దినం అభిరాముడు జ్వరం వచ్చి ఆయాసంతో వున్నాడు. అందుకతడు విచారపడలేదుకాని, సాధుకు పాలు తీసుకువెళ్ళడానికి వీలుకానందుకు బాధపడ్డాడు.

వేమన సహాయాన్ని కోరాడు. అతడు కాదనక అంగీకరించాడు. పాల చెంబుతోపాటు కొండమార్గం పట్టాడు.
📖

*గురూపదేశం*

ఆ సాధు పేరు లంబికా శివయోగి. వేమన ఆ శివయోగి ముందు పాల పాత్ర వుంచాడు. వెళ్ళినది క్రొత్త సాధు సన్యాసుల పరిచయం అంతగా లేనివాడు. అక్కడే ఒక ప్రక్కన నిలిచాడు. ఆయన చంచలమయిన మనస్సుకు అక్కడ ప్రశాంతిగా వుంది.

కొంతసేపటికి కనులు తెరచి "ఎవరు అభిరామయ్యా!" అని పిలిచాడు యోగి. 

"స్వామీ!" వేమన బదులిచ్చాడు.

“చాల రోజులనుండి శ్రమపడుతూ ఇంతదూరం నడచి వచ్చి నాకు క్షీరదానం చేస్తున్నావు నాయనా! నీకు ఈ దినం అమృతదానం చేస్తాను"

వేమన కాదనలేదు. తాను అభిరాముడను కాననీ అనలేదు. మౌనంగా చేతులు బంధించుకొని కూర్చున్నాడు. చీకటి గుహలో అస్పష్టంగా కన్పించినా గురుముఖం వింత తేజస్సుతో మెరిసిపోతున్నది.

ఆయన తన ముందున్న వ్యక్తిని చూడలేడు. ఎక్కడో దూరాన దృష్టి నుంచి ఆత్మ స్వరూపాన్ని నిర్వచించి మోక్ష వివరాలను తెలియజేసాడు. మనిషిగా జన్మించినందుకు పరోపకారంలోనే జన్మ సార్ధక్యం వుందన్నాడు.

"సంసారాన్ని త్యజించి సన్యాసంతో జీవించడం ఘనత కాదా స్వామీ?" అన్నాడు భక్తుడు.

"కాదు నాయనా! దానివల్ల ఆ సాధకునికి ఒక్కనికే ప్రశాంతి-విముక్తి లభ్యం అయితే కావచ్చు కాని, ఈ విశాల లోకంలో కోట్లాది నరులు అజ్ఞానంతో, అల్ప వాంఛలతో, రోగాలతో, దారిద్ర్యంతో, నిరంతరం దుఃఖాల పాలవుతున్నారు. అట్టివారికి సహకరించడమే జ్ఞాని చేయవల్సిన పని. జీవుడే దేవుడు. మానవసేవయే మాధవ సేవ" అని సెలవిచ్చాడు యోగి.

“ధన్యుడను స్వామీ”
“స్వస్తి” (శుభమగుకాక)
"అయ్యా! మీరు నన్ను క్షమించాలి"
“ఎందుకు?”
"నేను అభిరాముడనుకాను"
“మరి ఎవరివి?”
"కాపు బిడ్డను-రెడ్డి వేమన అని అంటారు నన్ను”
"రెడ్డి వేమన అంటే?”
"కొండవీటి రాచవేమన సోదరుడను"
“ఇంకా పరమాత్మ తత్వం నీకర్థంకాలేదా నాయనా? నేను అనేది ఆత్మే కాని ఈ శరీరం కాదని మరచిపోయావా? ఆత్మకు ఈ బంధుత్వాలన్నీ ఎక్కడివి?"

“క్షమించండి స్వామీ అజ్ఞానంతో పలికాను"
"ఆజ్ఞాన అంధకారాన్ని తొలగించువాడే గురువు. ఆ ముసుగు నుంచి బయటపడినవాడే జ్ఞాని, నేనెవరు? నీవెవరు? అతనెవరు, సర్వం శివమయం. ఆభిరామునికి నా ఆశీస్సులు అందించు. ఇక్కడికి రేపు రావలసిన పనిలేదను. నేనీ దినమే ప్రయాణమవుతున్నాను.”
“ఎక్కడికి?”
“మరో చోటికి. అజ్ఞాని తిరిగితే కష్టం. జ్ఞాని తిరగకపోతే నష్టం. జ్ఞాని ఒకేచోట వుండకూడదు నాయనా. విజ్ఞానకాంతిని ప్రసరింపజేస్తూ, అంధకారాన్ని తొలగించుతూ సంచరిస్తూనే వుండాలి. నేనిక్కడికి వచ్చిన కార్యం నెరవేరింది. మరో చోటికి వెళ్ళాలిక"

యోగికి నమస్కరించాడు వేమన.

"సర్వం శివార్పితం" గురువన్నాడు.
📖

*వేమన మారాడు*

ఆయన అంతరంగంలోని అలజడి అంతమయింది. వదిన హితబోధ కారణంగా దేవదాసిపై ప్రేమ నశించింది. అయినా మనసు సంచలనంగా వుండేది. ఈనాడు మనస్సు నెమ్మదిపడింది. జీవిత పరమార్థం ఏమిటో తెలిసినట్లయింది.

అదే గిరి గుహముందు నిర్జనారణ్యంలో ఒక చెట్టు క్రింద రాతి పైన యోగధ్యానంలో కూర్చున్నాడు. ఆకలి లేదు దప్పిక లేదు. అలా ఎన్ని గంటలు కూర్చున్నాడో ప్రొద్దు పడమటికి వాలింది. మిత్రుని కోసం వెదకుతూ అభిరామయ్య వచ్చేవరకూ అలాగే కూర్చున్నాడు.

రేండు మూడుసార్లు పిలిస్తే కాని కన్ను తెరవలేదు.
"ఏమిటిది వేమన్నా?"
"ఏమిటేమిటి?"
"ఇక్కడ కూర్చున్నావు?"

నవ్వాడు. ఆ నవ్వు నవ్వులాలేదు. నవ్యంగా వుంది. వేదాంతిలా వుంది వెర్రిగా వుంది.

“వింతగా వుంది నాకు! ఏమిటిది వేమన్నా? ఇక్కడ కూర్చున్నావేమిటి ఇంటికి రాక"
“ఇల్లు ఇల్లెవరిది? తానెవరు!"
“ఇదేమిటి? కొత్తగా మాట్లాడుతున్నావే”
“ఆజ్ఞానంలో వున్నంతవరకు అంతా వింతే. వెలుగు చేరితే చీకటి అంతరిస్తుంది"
“జీవితం గల్లంతవుతుంది”
“అంతేకదా”
“ఏమిటి వేమనా?"
"జీవిత పరమార్ధం ఏమిటో గ్రహించావా యెప్పుడయినా?”
"లేదు"
"అందుకే నువ్వు అభిరామునివి!"
“ఏమిటి వేమనా?”
“ఏమీలేదు”
"సరే-గురువుగారెక్కడ?"
“వారు లేరు వెళ్ళిపోయారు”
"అయ్యో! ఉపదేశం లభిస్తుందని ఆశించానే”
“నాకు లభించింది”
“నాకు ఆశాభంగమయింది.”
“నేనెవరు? నీవెవరు?”
“వేమన్నా!”
“నీకు ఆశాభంగమయితే అందుకు నన్ను క్షమించు”
“అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం”
“జ్ఞానివి”
“సరేకాని, పద వెళదాం”
"నాకెక్కడికీ రావాలనిలేదు”
“ఇక్కడే వుంటావా ఏమిటి?”
“ఎక్కడయినా వుంటాను"
“మీవాళ్ళు నీపై బెంగతో వున్నారు.”
"నేను-నావాళ్ళు-ఆశలు.అంతా భ్రాంతి.”
“ఇదేం వైరాగ్యం?”
“వైరాగ్యమే"
“యోగివౌతావా?”
“సందేహమా”
“ఇదేమిటి మొన్నటివరకేమో ప్రేమ ప్రేమ అంటూ సానికొంప వెంట తిరిగావు. ఇప్పుడేమో ఇట్లా వేదాంతం మాట్లాడుతున్నావు. అంతా నీది వికట కవిత్వం"
"కామి కాని వాడు కవికాడు రవికాడు. కామి కాక మోక్షగామి కాదు"

"అలాగే అంటూ పో" 

“ఇదేమిటి వేమన్నా మాటలేదో లయలో వస్తున్నాయే". 

"కామి కానివాడు కవికాడు రవికాడు కామికాక మోక్షగామి కాడు, కామి యైనవాడు కవియౌను రవియౌను"

"అహో పద్యపాదాలు-ఆటవెలది చరణాలు! ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబును హంస పంచకంబు ఆటవెలది. చక్కగా యతులు, గణాలు కుదిరినై. నాలుగవ పాదం పూర్తిచెయ్యి వేమన్న. చక్కని పద్యం. అనుభవ సారం"

"నాలుగవ పాదంలో నిన్ను బంధిస్తాను అభిరామయ్యా— విశ్వదాభిరామ వినుర వేమ!"

"అహా! యెంతో బాగుంది. అయినా నా పేరెందుకిందులో"

"నా మిత్రుడవు. పవిత్ర వర్తనుడవు. గురు కరుణను నాపై ప్రసరింపజేసిన పుణ్యవంతుడవు. నాలో ఊపిరి ఆడుతున్నంతవరకు నీవు నావెంట వుండవల్సిందే"

“వేమన్నా”

“అభిరాముని వేమనను!”

"అయితే పై పాదం-విశ్వదుడవయిన అభిరాముని వేమా విను-అనా అర్ధం?"

నవ్వుతాడు.

“నీకు చేతులెత్తి నమస్కరించాలి"

"కాదు. నువ్వాపని చేయవద్దు. నీవే నాకు జ్ఞానమార్గం చూపిన గురుడవు"

"కాదు కాదు-నేనే నీ శిష్యుడను"

“పెద్దవాడివి బేలవుకాకు”

"వయసు కాదయ్యా. మనిషి పెద్దరికాన్ని నిలబెట్టేది మేధస్సు"

"జ్ఞానివి"

"సరేకాని ఇక ఇంటికి వెళదాం పద”
🤟
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment