Thursday, June 11, 2026

 *యోగి వేమన -5*
రచన : మాలయశ్రీ 


*పెళ్ళి ప్రయత్నాలు*

దేవదాసి చెల్లెలు వీధివెంట పోతుండగా వేమన్న వరస మరదలు లక్ష్మి దారిలో కల్సింది. ఆ అమ్మాయిని వేమన్న కివ్వాలని పెద్దల ఉద్దేశ్యం కాని ఇంకా నిర్ణయం కాలేదు. ఆశచావలేదు.

“ఓ బోగమోరి పడుచా! జోరుగా పోతున్నావ్-కొంచెమాగు.”

"ఏం కాపోరి పడుచా! ఏమిటి విశేషం?"

“ఏమిటే పడుచా అంటున్నావ్?"

“నన్ననలేదా నువ్వు?"

“నిన్నంటే నన్నంటావా?"

“ఏం అనకపోతే భయమా.”

“మీకెందుకు భయం-సిగ్గా-ఎగ్గా-?"

"ఏయ్ మాటలు తిన్నగా రానియ్య."

“ఏం ఎందుకు?" అంటూ బాట ప్రక్కకు నడిచింది.
"వంకర మాటలంటే ఊర్కునేది లేదు." దగ్గరికి వెళ్తూ అంది.

“వంకర చేతలైతే బాగుంటవా" వెక్కిరించింది లక్ష్మి.
"ఎవరివి వంకర చేతలు?"
"మీవి."
“ఎందుకో."
“ఛీ! మంది మగాళ్ళతో.”
“ఊఁ... ఇంకా”
"రోత"
“ఆలాగనా?"
"కాకపోతేనేం?"
"మీరు బుద్ధికలవాళ్ళయితే మీ మగాళ్ళు మా యిళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారమ్మా!?"
“ఏమంటున్నావ్?"
"వున్నమాటే అంటున్న."
"ఏమిటీ ?"
“సరేకాని, నీ పెళ్ళెప్పుడు? పప్పన్నం అరిసెలు ఎప్పుడు తినిపిస్తావ్:"
“నా రాత కదొకటా."
"ఏమైందమ్మా! కల్యాణఘడియ రాలేదా యింకా?"
“మా బావ ఇంటిపట్టున వుందేకదా."
“ఏమైందట.”
"ఏం మాయదారి చచ్చిన రోగమో. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట. ఇంటికి రావడమే మానేశాడట."
"ఎటు పోతున్నాడో”
“నాకేం తెల్సు”
“ఏమీ తెలువలేదా?"
"ఎలా చెప్పాలమ్మా ఈ నోటితో”
“మహారాణిలా”
"భోగం కొంపల వెంట తిరుగుతున్నాడట కదా"
"కావచ్చును-నాకేం తెల్సు ?"
"నీ దయనే. కొంచెం జాడచెప్పి పుణ్యం కట్టుకో"
“ఏం చేస్తావేమిటి?"
“మా వాళ్ళకు చెప్పి ఆ ముండను ఊరి నుంచి బయటకు పంపిస్త"
"అదంత సులువుకాదు. నీ బావా నీకు దక్కడు. బలవంతాన ఏ పనీ జరగదు"
“మరేం చేయనే?"
“నువ్వే ఆలోచించు"
“నేనే వెళ్ళి బావ పాదాలపై పడి బ్రతిమిలాడుకుంటా"
"ఇది మంచి మార్గమే. కాని మా ఇండ్లకు వస్తే మీ కులకాంతల పరుపు ఉంటదటమ్మా?"
"ఏం చేయను. కాని కాలం వచ్చినప్పుడు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకోలేదూ?"
“విశ్వామిత్రుడు కుక్క మాంసం తినలేదూ?"
“వెక్కిరించకు”
"చక్కని ఆలోచనేకాని, నేనో మాట చెప్తాను విను. మీ బావ మా అక్క దగ్గరే వుంటున్నాడు. ఆమె ఎంత చెపితే అంత”
“ఆమెను బ్రతిమిలాడనా?"
“బావను పెళ్ళాడుతాననా?”
“ఆనే కదా నేననేది?"
"అతడు వినడుకదా అని నేననేది"
“మరేం చేయాలె-"
“ఇలా పాతకాలపు ముసలమ్మవేషాలు పనికిరావు. కాస్త నాజూగ్గా, కంటికింపుగా వుండే దుస్తులేసుకో”
“మీ వేషాలు మాకు రావే"
“రాకపోతే నీ బావ ఆశ వదలుకోవే"
“మనసొప్పదే"
“అందుకే నేను చెప్పింది ఒప్పుకో. అందంగా అలంకరించుకొని వీ బావ కనిపించినప్పుడు వెంటపడు”
"దారికాచేదా?"
"ఇంక నీ పుణ్యం: నావెంట నడుస్తాననలేదు"
“వద్దామనే వుంది"
“వద్దు తల్లీ నీకో దండం!”
"మరి?"
“మీ బావగారింట్లో తిష్టవెయ్యి, పాతొక రోత కొత్తక వింత, అని నీ రొట్టె విరిగి నేతిన పడవచ్చు! ప్రయత్నించి చూడు. ఎవరి భాగ్యం ఎట్లున్నదో ఎవరు కలగన్నారు"
“వస్తానే. నీ మేలు మరచిపోను”
"సరే. ఈ మల్లెపూలు తీసుకో”
"సరే ఇవ్వు, పూలిస్తానంటే వద్దనకూడదు”
"మా అక్క ముడిచేపూలు మీ బావ వాసన చూసే పూలు. ఎక్కడైతే నేమిలే పూజించే దొకరినేకదా!"
“ఛీ పోవే!" పూలు తీసుకుంది.
“పోతున్నాలే జాగ్రత్తసుమా"
"సరే కానీ, నీకు మీ అక్కంటే కోపమా? నాకింతగా సహకరిస్తున్నావ్"
"కాదు. మా అక్క చాలా మంచిది. దేవత. కాని నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. పైగా వేమన్నకు పెళ్ళయితేనే మా అక్కకు భద్రత. లేకుంటే పెద్ద వాళ్ళతో ఎప్పుడేం గొడవ వస్తుందోనని భయంగా వుంది"
"అలాగా” అని లక్ష్మి కదిలింది, పూలసజ్జతో, ఈ పిల్ల సైతం ఇంటికి వెళ్ళింది.
📖

లక్ష్మి వెళ్ళి నరసమాంబతో ముచ్చట్లలో దిగి అక్కడే కూర్చుండిపోయింది. ఆ పిల్ల మనసు తెలుసుకొని ఆమెకూ శుభసూచకంగా తోచింది, కాని వేమన ఇంటికి వచ్చినా ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. మరదలు కావాలని పలకరించినా దూరం వెళ్ళాడు.

"మరదలు నీకోసం ప్రొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నదయ్యా, పాపం వెళ్ళి పలకరించు" వదిన నవ్వుతూ అంది.

"ఇదుగో వదినా! ఇలా నన్ను బాధించకండి. నేను ఇంటికిరావటం ఇష్టంలేకపోతే చెప్పండి. అన్నయ్య వలెనే మీరనుకుంటా"

ఆమె మారుపలుక లేదింక.

"హు, ఇంతపాటి అందగాడు లోకంలోలేనట్లు. ఈయనగారు పెళ్ళాడకపోతే ఇక నేను ఇలాగే వుంటానో" అని లక్ష్మి ఉక్రోశంతో చరచర వెళ్ళి పోయింది.

*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment