*యోగి వేమన -9*
రచన : మాలయశ్రీ
"సరేకాని ఇంటికి వెళదాం పద”
“ఇదేనా నీ హితోపదేశం?"
"నా అజ్ఞానాన్ని మన్నించు. ఇంట్లో వుంటూనే యోగాన్ని అభ్యసించవచ్చు. వనాలలోనే వుండాలనేదేం లేదు"
"రాజయోగ మవలంభించమంటావా?"
"మనసు దైవచింతలో వున్నప్పుడు మనిషి ధర్మచింతనలో వున్నప్పుడు రాజభోగాలు అనుభవించినా తప్పులేదు."
నవ్వి ఇలా చదివాడు వేమన.
“ఆశచేత నరుడు ఆయువు కలవాళ్ళు తిరుగుచుండు భ్రమను తిప్పలేక
కుక్కవంటి ఆశ కూర్చుండ నీయదు విశ్వదాభిరామ వినురవేమ!”
“నన్ను క్షమించు వేమన్నా -నాది తప్పే"
“తప్పు లెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు ||విశ్వ॥
"ఇక ఇంతేనా?"
“పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు పట్టు
విడుచుకన్న పడిచచ్చు టేమేలు
విశ్వదాభిరామ వినురవేమ!”
“ఇంత విరాగమా?"
“ఇనుము విరిగె నేని ఇనుమారు
ముమ్మారు కాచి యతుకవచ్చు గాని
యెందు మనసు విరిగె నేని మరి యతుకగరాదు
విశ్వదాభిరామ వినురవేమ!”
"ఇంత యువ వయస్సులో ఈ కఠోర దీక్షను ఎలా నిర్వహిస్తావయ్య!"
"అనగ అనగ రాగమతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!”
“ఏమి కవితాధార? ఏమి భావ తీవ్రత - అయితే నేనూ నీతోనే వుంటా.. "
“వద్దు వెళ్ళిపో"
“ఏమో నాకూ సంసారం సంకటంగానే వుంది"
“చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ"
"అవును నిజమే. ఇదేమిటి? ఇంత ధారాళంగా పద్యాలు వస్తున్నాయే. ఇన్నాళ్ళు ఎప్పుడయినా కవితా సాధన చేశావా?"
నవ్వాడు వేమన.
“పూర్వపుణ్య పరిపాకం వల్ల లభించేవికదా-
కవితా వనితా" విరగబడి నవ్వాడు వేమన.
"ఇక్కడే వుంటావుకదా?"
"ఎక్కడున్నా నీకు నేను ప్రక్కనేగా. తప్పక కనిపిస్తాను"
“నన్ను మరచిపోకు సుమా”
"నన్ను మరచిపోతేకదా”
"వస్తా"
"సంతోషం"
మాటికి తిరిగి చూస్తూ అభిరామయ్య వెళ్ళిపోయాడు.
📖
ఇక వేమన ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడెక్కడ తిరిగాడో. ఎవరయినా దయతలచి ఏదయినా ఇస్తే తింటాడు-లేదా పస్తుంటాడు. అటు పారమార్థికుడు కాడు, ఇటు లౌకికుడూ కాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వుంటాడు. తనలో తానే ఏదో గొణుక్కుంటాడు. చెడు కనిపిస్తే భావావేశానికి లోనవుతాడు. మంచి కనిపించితే ఆనందిస్తాడు. ఆయా సందర్భాల్లో చెప్పినవే ఆయన పద్యాలన్నీను.
"భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు ధనము నాది యన్న ధనము నవ్వు
కధన భీతు జూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ"
అదీ ధోరణి. నిరంతరం సత్యాన్వేషణ. నీతి తత్త్వ బోధన, ఆహార పానీయాలమీద ధ్యాస లేదు. చివరికి వస్త్రాలమీద శ్రద్ధలేదు. చినికి పాతవయినా కారిపోయినా లెక్కలేదు. అది చూసి ఇదేమిటన్నవానికి జవాబు-
తల్లి గర్భము నుండి తాబుట్టినప్పుడు
మొదలు బట్టలేదు తుదను లేదు
నడుమ బట్ట గట్ట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ"
కట్టు బొట్టు అన్నీ వదిలేసి కౌపీనధారి ఆయ్యాడు-ఏమిటిది? అన్నట్టి ఆచారవంతులతో ఇలా అనేవాడు.
వేష భాష లెరిగి కాషాయ వస్త్రాలు
కట్టగానే ముక్తి కలుగబోదు
తలలు బోడులయిన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ"
దైవపూజను నిందించకు మన్నవారిని--
గట్టు రాళ్ళు తెచ్చి కాళ్ళచేతుల తొక్కి
కాసె ఉలులచేత చేసె రూపు
మొరపురాళ్ళ కెరగు మొప్పెలకే మందు
విశ్వదాభిరామ వినురవేమ"
మంత్ర మహిమను కాదంటావా? అంటే-
విపృలెల్ల చేరి వెర్రికూతలు కూసి
సతిపతులను గూర్చి సంబరముగ
మును ముహూర్త ముంచ ముండెట్లు మోసెరా-
విశ్వదాభిరామ వినురవేమ"
యోగ విద్యను మెచ్చుకునేవారికి —
ఆసనమ్ము పన్ని అంగమ్ము బిగియించి
యొడలు విరుచుకొనెడి యోగమెల్ల
జెట్టి సాముకన్న చింతాకు తక్కువ-
విశ్వదాభిరామ వినురవేమ
"ఎవరినైనా మునుల ఆశ్రయించాలంటే—
గుహలలోన జొచ్చి గురువుల వెదకంగ
క్రూర మృగమొకండు తారసిలిన ముక్తిమార్గమదియె చూపించు ముందుగా విశ్వదాభిరామ వినురవేమ
తీర్థాటనం చేయుమన్నవారిని–
తనువులోన నున్న తత్త్వంబు దెలియక
వేరె యాత్ర బోవు వెర్రివాడు
గంత మోసి మోసి గాడిద తిరుగదా-
విశ్వదాభిరామ వినురవేమ
మరి ఏం చేయాలీ అంటే—
తనువు నడవి జేసి తనలోనే కూర్చుండి
తపము జేయలేని తపసులెల్ల
అడవి యందుజేరి అలజడి పొందేరు విశ్వదాభిరామ వినుర వేమ ॥
అని అనేవాడు.
🤟
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment