*సండే స్టోరీ*
*ముక్తపథం*
🛕
రచన : ఎమ్. రాధాగోవిందలక్ష్మి
“పాత దేవుళ్లకు కొత్తగుళ్లెందుకు”
“శుద్ధ దండుగ. అస్సలక్కర్లేదు... అన్నట్టు ఏమిటిది... కొత్త బట్టల్లాగున్నాయే...”
“అవునండి... పండక్కి మా అక్కయ్య పెట్టింది”
"పాత దేహానికి కొత్త బట్టలెందుకు... పాతవే చాలుగా..”
"బాగుందండోయ్! మనిషికీ దేవుడికీ పోలికేమిటి... ఇది వందేళ్లలో నశించే శరీరం. ఆయనగారు యుగాల తరబడి అలాగే ఉంటాడుగా..."
"ఎక్కడ ఉండనిస్తాడీ మనిషి.... తనకి నచ్చకపోతే మార్చేస్తాడోయ్... కోపం వస్తే కూల్చేస్తాడు. పక్కవాడు పెట్టుకున్న దేవుడు తనవాడు కాడని నమ్మకం కలిగితే ముక్కలు ముక్కలు చేసి పారేస్తాడు"..
"అలాంటప్పుడు దేవుడు తన మహిమలు చూపించి, మనిషిని శిక్షించొచ్చుగా..."
"వచ్చు... కానీ అదోరకం పూజ అని సరిపెట్టుకుంటాడు కాబోలు"..
"ఏమిటి..... పూజించే విగ్రహాన్ని బద్దలు కొడితే పుణ్యమా.... మనం మొక్కేదైవాన్ని వాడు కాలికింద తొక్కితే మోక్షము... "
"అదే వైరభక్తి... వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు రాక్షసులై పుట్టి, విష్ణువుపైనే కత్తిగట్టిన కథలు నీకు తెలియవా... "
“బాగుంది.... వాళ్లకీ వీళ్లకీ సాపత్యమా.."
"పోనీ... బలిపీఠం మీది ప్రసాదం కోసం వేగంగా వస్తే రెక్కలతో కసపూడ్చిందని కాకికీ, ఒళ్లు విదిలిస్తే కళ్లాపి జల్లిందని హంసకీ, ముత్యాల దారం తెంపిపోస్తే ముత్యాల ముగ్గేసిందని చిలుకకే, ఎలకని చంపబోయి పడగవిప్పితే మణి దీపాలు అలంకరించిందని పాముకీ, స్వామినీ అర్చించిన నీటితో తడిసిన పువ్వులో వున్న మకరందం తాగితే తేనెటీగకే పాండురంగ విభుడు మోక్షం అనుగ్రహించలేదా... తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన ఫలితం అనుగ్రహించే తీరతాడు... విగ్రహాలు బద్దలుకొట్టి మళ్లీ తనకో కొత్తరూపం రావడానికి కారణమైన వాళ్ళు కూడా ఆయనకి ప్రియభక్తులే లేవయ్యా"
"అయ్యా! తెనాలి రామకృష్ణగారు... నేనడిగింది మీ పాండురంగ మహాత్మ్యంలో ఎప్పుడో జరిగిపోయిన కథలు కావు... ఇప్పుడు జరుగు తున్న వాటిని గురించి.... నగరులో ఇన్ని దేవళాలుండగా మళ్లీ ఈ శ్రీకృష్ణమందిరం రాయలవారు ఎందుకు కట్టించినట్టూ అని..."
"శర్మా... కళింగ దండయాత్రలో విజయం సాధించినందుకు గుర్తుగా కట్టించామని ముందే చాటింపు వేశారు కదుటయ్యా... "
"తూర్పు యుద్ధమూ ముగిసింది... బీజాపూర్ సుల్తాన్ తిక్క కుదర్చడమూ అయ్యింది... అది కాదు నేనడుగుతూంట... విజయనగరం ఒకప్పుడు కిష్కింధలో ఉంది... శ్రీరాముడు వాలినిక్కడే సంహరించాడంటారు కాబట్టి సహస్ర రామాలయం కట్టించారు... విజయనగరం పుట్టక ముందు నుంచే విరూపాక్ష దేవాలయం ఉంది... సరే... రాయల వారికిష్టం కదాని ఉగ్రనరసింహ మూర్తి దేవాలయం కట్టించారు. సప్తస్వరాలు పలికే స్తంభాలున్న విఠలేశ్వరుని దేవాలయం ఉన్నది. ఇవన్నీ ఒక మోస్తరు... ఎక్కడో ద్వారకలో పుట్టి, బృందావనంలో పెరిగి ఆనక కురుక్షేత్ర యుద్ధం దగ్గరుండి జరిపించిన శ్రీకృష్ణుడికి ఇక్కడ ఆలయం ఎందుకండీ దండగ.... తిరుపతి దేవుడు తిరుపతిలో ఉంటేనే అందం... బృందావనం శ్రీకృష్ణుడు అక్కడ ఉంటేనే అందం... మనూళ్లో ఎందుకు?”
“ష్... ధూర్జటి కవీశ్వరులొస్తున్నారు. కాసేపు నోర్మూసుకో”.
"కొండవీడు మనదేరా... కొండపల్లి మనదేరా.. కాదని వాదుకు వస్తే కటకం దాకా మనదేరా' అంటూ పాడుకుంటున్న చాకలి పాటనే శుభ శకునంగా భావించి కళింగం దాకా విజయయాత్ర సాగించాడు శ్రీకృష్ణదేవరాయలు. దక్షిణదేశాన్ని గెలుచుకొచ్చి మధుర, తంజావూరులలో తెలుగుల పరిపాలనకు శ్రీకారం చుట్టాడు. ఏడు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత విజయనగరంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాలలో భాగంగానే గజపతులను ఓడించాక కటకం నుంచి తెచ్చి బాలకృష్ణుని విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయులు హంపిలో ప్రతిష్ఠింప చేశాడు. రెండు ప్రాకారాలతో ముచ్చటగొలిపే బాలకృష్ణ మందిరం కృష్ణరాయలు విజయనగరంలో స్వయంగా నిర్మించిన దేవాలయాల్లో రెండోది.
📖
ఈ కథా కాలానికి ఆ దేవాలయంలో రెండో ప్రాకారం నిర్మాణం పూర్తయ్యింది.... అంతకుముందే బీజాపూర్ సుల్తాన్ పై కృష్ణరాయలు విజయం సాధించి తిరిగి వచ్చాడు. ఆ శుభ సందర్భంలో విజయనగరంలో మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవాన్ని
చూడడానికి వచ్చిన తెనాలి రామకృష్ణుడు, నిగమశర్మల మాటలు జరుగుతూండగా ధూర్జటి కవి ప్రవేశించాడు... మరికాస్సేపటికి రాయలు దేవాలయంలో ప్రవేశించాడు... వస్తూ ధూర్జటిని గమనించి, ఒక్క క్షణం ఆగాడు.
“ఏమండీ.. మా శిఖిపింఛమౌళి ఎలాగున్నాడు... మీ చంద్రమౌళితో సరితూగుతాడా..."
"ఆకుపచ్చ నెలవంక స్పష్టంగా కనిపిస్తోంది. ఈయన శశిధరుడే కదా... సకల విద్యాధినాధుడు, పరమగురుడు ఇక్కడ సామవేదం వినిపిస్తుంటే... నమశ్శివాయ అని నేనన్నా... కృష్ణం వందే జగద్గురుం అని మీరనుకున్నట్టే ఒక్కటే కదూ ప్రభూ!”
"ధూర్జటి కవీశ్వరా... మీ శివభక్తి అనన్య సామాన్యం. నేనూ దర్శనం చేసుకుని వస్తాను సభలో కలుసుకుందాం".
రాయలు గుళ్లోకి వెళ్లాడు. రంగ మండపంలో సభాసదులంతా రాయల రాకకోసం వేచి చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
"స్వామీ! శివుడు గొప్పోడా..... విష్ణుమూర్తి గొప్పోడా..."
"ఏం శర్మా! ఇప్పటిదాకా నా బుర్ర పాడుచేశావు... ఇప్పుడు ధూర్జటి గారిని పట్టించావా..”
“ఫరవాలేదులే రామకృష్ణయ్యా... ఏమిట్రా. నీ సందేహం"
“అదే ఎవరు గొప్పా అని..."
"నీ పేరెట్టుకున్న నిగమశర్మ భ్రష్టుడైనా చివరికి విష్ణువు మోక్షం ఎలా ఇచ్చాడో రాశాడు కదా ఈ రామకృష్ణయ్య.... ఆయన్నే అడిగి చూడక పోయివా”
“సందేహమేముంది... వేదమంత్రాలు, శాస్త్ర విజ్ఞా నాలు, నిఖిల విద్యలు మోక్షాన్నిప్పించలేవని మీరే చెప్పారుగా. భక్తి అంటే షోడశోపచారాలు, నిత్య నైవేద్యాలు కావని చెప్పి... చెప్పుతో తుడిచి, పుక్కిలి ఊసి అభిషేకం చేసి, మాంసం తినిపించిన, కన్నప్పకు సాయుజ్యమిచ్చిన శివుడే గొప్పవాడు. భక్తి పారమ్యాన్ని చాటిన కన్నప్పను నిత్యం స్మరామి... అంతటి మహోన్నత భక్తులున్న సర్వేశ్వరునికి శిరసా నమామి”.
“తాత ముత్తాతలనాడు లింగం మెళ్లో వేసుకున్నారు.... ఈయనగారేమో కాళిదాసులాగా కాళికాదేవి మెచ్చకుంటే కవయ్యాడు... జంగాల కథలు విడిచిపెట్టి వరసగా విష్ణు కథలు వ్రాస్తున్నాడు..... ఆయన లాగే చెపుతాడు... మీరు చెప్పండి...."
“ఏం చెప్పమన్నావు...”
"బృందావనంలో శ్రీకృష్ణుడికి 'విద్యానగరంలో గుడెందుకు అని అడిగితే మా గురువుగారు నోర్మూసుకోమన్నారు... మీరు చెప్పండి... ఈ ఊళ్లో శివాలయం కట్టి ఈయనే వాయులింగేశ్వరుడు.... ఇదే శ్రీకాళహస్తి అనుకోమంటే మీరు అనుకుంటారా..."
"దానికేముంది... ఎక్కడైనా ఉండే ఈశ్వరుడు ఒక్కడే కదా.. నువ్వెలా చూస్తే అలా కనబడతాడు. శ్రీకాళహస్తిలో మోక్షం పొందిన సాలెపురుగు, ఏనుగు, పాము వాళ్లకి వేరే పూర్వజన్మలున్నాయి... అయినప్పటికీ నీ సరదాకోసం ఈశ్వరుడి వరం పొందిన మా గర్వాన్ని కాళింది మడుగులో శ్రీకృష్ణుడు అణి చాడనుకో... శివారాధనలో దేహత్యాగం చేసిన ఏనుగును మొసలి బారి నుంచి శ్రీమహావిష్ణువు కాపాడాడనుకో... తప్పేం లేదు.
"యధాశివమయో విష్ణు రేవం విష్ణు మయశ్శివః యధాంతరం నపశ్యామి తధామే స్వస్తిరాయషిః" అని వేదావ్యాసుడు చెప్పిన మాట గుర్తులేదా... ఏం సంధ్యావందనం మానేశావా..."
"అదికాదండీ ఏ వూళ్లో దేవుడు ఆ వూళ్లోనే ఉంటే మనమంతా అక్కడికే వెళ్లి చూసొస్తాంగా... మళ్లీ ఇక్కడెందుకు అని..."
“కాశీ వస్తానంటే చాలట. వచ్చిన ఫలితం ఇస్తా డట విశ్వేశ్వరుడు... కానీ మన తిరపతయ్య అలా ఊరుకోడు కదా... ఎవరి దగ్గరికైనా మనం వెళ్లలేనప్పుడు... ఆయన్నే మన దగ్గరికి పిలిపించుకోవాలి... దేవుడైనా అంతే.."
"అది కాదండీ... "
“ష్... కాసేపు ఊరుకో సభ ప్రారంభమవుతోంది... అదిగో రాయలవారి మాటలు ఆలకించు..."
“శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు త్రిలింగాల నడుమ నున్న ప్రాంతాన్ని ఏకీకృతం చేసి ఆంధ్ర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో పాలకులు ఆంధ్ర రాజ్యాన్ని ముక్కలు చేసి పంచుకున్నారు. తిరిగి ఆంధ్ర రాజ్యం ఏకం చేసి ఒక్క గొడుకు కిందికి తెచ్చినవాడు కాకతీయ ప్రతాపరుద్రుడు. మళ్లీ ఆ ఐకమత్యం ఆయన తోనే నశించింది. ఏ జాతికైనా ఐకమత్యమే మహా బలం. కలిసి ఉంటే ఉన్న బలం, ధైర్యం ఎదుగుదల విడిపోతే రావు. ఆంధ్ర రాజ్యానికి పూర్వపు ప్రతిష్ఠను తిరిగి సాధించడానికే విజయనగర ప్రభువులు తొలి నుంచీ కృషి చేస్తున్నారు... మా ప్రయత్నమూ అదే. రాజ్యకాంక్షతోనే మతమౌఢ్యంతోనో దురాక్రమణలకు దిగడం రాయలు రక్తపిపాసులు అనిపించుకోవడం మా అభిమతం కాదు..
అనాదిగా భరతఖండం శాంతిసా సామరస్యాలకు పరమత సహనానికి మారుపేరుగా నిలిచింది. అడపాదడపా జైన, బౌద్ధ మతాలు ఇక్కడ సంచలనాలు సృష్టించినా... అవన్నీ ఇక్కడి మతాలుగానే చలామణీ అయ్యాయి.... అన్ని మతాలవారూ ఇక్కడ సహజీవనం చేశారు. నేటికి అయిదు శతాబ్దాలయ్యింది.... భరత ఖండంపై తురకల దాడులు మొదలై రెండు వందల ఏళ్లయ్యింది... దక్షిణా పథంలో వాళ్లు చెలరేగడం మొదలుపెట్టి... ఇక్కడ రాజ్యాలు సంపాదించారు... ఆస్తులు కూడబెట్టారు. రాజ్యం వీరభోజ్యం కనుక వాళ్ల రాజ్యాలు విస్తరించాయి. కానీ హింస, అత్యాచారాలు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని దారుణాలు పెచ్చుమీరి పోతున్నాయి. హైందవజాతి, సంస్కృతి, విద్య, విజ్ఞానం, ఆస్తులు, దేవాలయాలు అన్నింటిపైనా వాళ్లు సాగించిన కర్కశదాడులతో, మారణ హోమంతో ఆర్యావర్తం అతలాకుతలమవుతోంది. దక్షిణాపథంలో బహమనీల ప్రాబల్యాన్ని నిరోధించడానికి విజయనగర ప్రభువులు శతధా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు విజయనగరం దుర్గాలలో ఒకటైన రాయచూరు దుర్గాన్ని తిరిగి మనం కైవసం చేసుకున్నాం. ఇది మన గెలుపు”.
రాయలు సభనుద్దేశించి ప్రసంగిస్తున్నాడు...
📖
సభలో పోర్చుగీసు నుంచి వచ్చిన న్యూనిజ్ ఉన్నాడు...
"మహారాజా! బీజాపూర్ రాజ్యం మొత్తం మీ పాదాక్రాంతం అయినప్పుడు మీరు రాయచూరు దుర్గంతో సరిపెట్టుకున్నారు.... ఇదేం రాజనీతి?”
“రాయచూరు మాది కనుక మేం తిరిగి తీసు కున్నాం. మిగిలిన రాజ్యమంతా కైవసం చేసుకుంటే అప్పటిదాకా ఊరుకున్న బహమనీలు అప్పుడు ఊరుకోకపోవచ్చు. మళ్లీ వాళ్లతోనూ యుద్ధం చేయాలి. ఇప్పటికే వేలాది ప్రాణాలు బలిపెట్టాం. రక్తపాతాలకు సాక్ష్యాలుగా నిలబడ్డాం. మాతృభూమి సంరక్షణ కోసం ఒక విదేశీయుడితో పోరాడడానికి మరో విదేశీయులైన మీ బుడతకీచుల సాయం తీసుకున్నాం. వాడ్ని తరిమేస్తాం సరే.... మిమ్మల్ని పక్కలో బల్లేల్లా తయారుచేసుకోమంటావా... ఏ నాడూ మీ సాయం అవసరం లేకుండా మేం గెలవగలమో అప్పటివరకూ వారి ఆధిపత్యమే కొనసాగనీ..”
"రాయచూరులో కూడా తురకలందర్నీ అలాగే వదిలేశారు... మీరు తలుచుకుంటే వారందర్నీ తరిమికొట్టి ఉండొచ్చుగా...”
“వాళ్లంతా సామాన్యపౌరులు. వారి ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించకపోతే అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసినా వృధాయే కదా! వారూ మాలాగే ఈ భారత భూమిపై పుట్టినవారేగా..”
"నేను ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని యుద్ధాలు చూశాను మహారాజా! యుద్ధ భూమిలో ఒకరకం హింస. యుద్ధం తర్వాత ఒకరకం హింస. ఓడిన రాజ్యంలో సామాన్య పౌరులపైనా వాళ్లు చేసే దాడులకు అంతూ పొంతూ లేదు. ఆస్తిపాస్తులకు రక్షణ లేదు. ఆడపడుచులపై అత్యాచారాలకు లెక్కలేదు.”.
“మేమూ విన్నాం”.
“మతం మార్చుకోకుంటే చంపుతారని భయం. రహస్యంగా స్వీయ మతాన్ని కాపాడుకునే వాళ్లు కొందరు. అత్యాచారాలకు గురైన ఆడపడుచుల్ని, వాళ్ల కన్నవాళ్లని సమాజంలో ఏ హోదాలో ఉంచాలో తెలియక సతమతమయ్యేవాళ్లు కొందరు. వాళ్లని రక్షించుకోవడం కోసం ఆ మతంలోకి మారిన వాళ్లు మరికొందరు. మొత్తం మీద అక్కడ దేశాన్ని నడిపిస్తున్నది మతం ఒక్కటే. మతోన్మాదమే జరుగుతున్న యుద్ధాలన్నింటికీ ముఖ్య కారణం. మరి మీరు చేసిన యుద్ధాన్నీ దగ్గరుండి చూశాను... యుద్ధ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వదిలేయడం... గెలుచుకున్న రాజ్యంలో మీ మతాన్ని
బలవంతంగా అమలుచేసే అవకాశం ఉన్నా అలా చేయకపోవడం విచిత్రం కాదా..”
"ఏమీ కాదు.. హిందూ రాజులకు పరమత సహనం, శాంతికాముకత్వం లేకుంటే మీరంతా ఈ గడ్డ మీద అడుగుపెట్టగలిగేవాళ్లే కాదు. అది మాకు అనాదిగా ఉన్నదే...”
కృష్ణదేవరాయలు చెబుతున్నాడు... న్యూనిజ్ తో సహా సభ అంతా ఆలకిస్తోంది... అంతలో ఏదో ఆవేశం పూనినవాడిలా నిగమశర్మ లేచి నిలబడ్డాడు... తెనాలి రామకృష్ణుడు వారిస్తున్నా వినిపించుకోకుండా అన్నాడు... ఇలా
“ఆ మితిమీరిన సహనం కారణంగానే ప్రభూ... రెండో దేవరాయల హయాంలో హరిహరాలయం దర్గాగా మారినా ఊరుకున్నారు. దానికి మాన్యాలిచ్చి పోషించారు... అందుకు ఫలితంగా ఆనాటి తురక సైనికులు సింహాసం కంటే ఎత్తుగా వాళ్ల గ్రంథం పెట్టించి, మహారాజుకు గౌరవ వందనం అయినా చేయకుండా అవమాన పరిచారు”.
“అప్పటి పరిస్థితులు వేరు... అయినా ఆ సంగమ వంశం అంతరించింది. సాళువ వంశం సమసి పోయింది. ఇప్పడీ తుళువ చక్రవర్తుల సారధ్యంలో విజయనగరం మరింతగా బలోపేతం అయ్యింది. ఇక మనపై కన్నెత్తి చూసే దమ్ము ఆ ముష్కరులకు ఉండదు".
మహామంత్రి తిమ్మరుసు సమాధానం చెప్పాడు వాడికి.
“సుప్రసిద్ధ శైవక్షేత్రం సిద్ధవటం తురకల మయం అయిపోయింది. అంతకుముందే తొలి తెలుగు కావ్యం పుట్టిన రాజమహేంద్రిలో వేణుగోపాల స్వామి ఆలయం ధ్వంసం అయిపోయింది..”
"అలాంటి ఉదాహరణలు భారతదేశం నిండా లక్షోపలక్షలున్నాయి... అదంతా కాలమహిమ. గతాన్ని తవ్వుకుంటూ కార్పణ్యాలు పెంచుకోవడం తగని పని. సామరస్యం దెబ్బతింటే దేశంలో శాంతి సౌఖ్యాలు కరువై పోతాయి”.
"అందుకని దైవద్రోహులని వదిలేయాల్సిందేనా.."
“ఊహూ... శిక్షించాల్సిందే..”
“మరి ఆ సయ్యద్ మర్కార్ ని ఇంతవరకూ ఎందుకు శిక్షించలేదు”.
“అతనికి నలభై వేల పర్దావుల డబ్బిచ్చి గుర్రాలని కొనుగోలు చేసిపెట్టమని పంపించాం. ఆ డబ్బుతో సహా అతను ఉడాయించాడు. అతని కారణంగానే బీజాపూర్ వారితో యుద్ధం జరిగింది. మన రాయచూర్ మనకి దక్కింది. ఈ దొంగతనానికి ముందు అతను ప్రభుత్వానికి విశ్వాసపాత్రుడు. దైవద్రోహి కాడే.. ఈ రెచ్చగొట్టే మాటలు కట్టిపెట్టకపోతే ముందు నీకు శిక్ష పడుతుంది”.
తిమ్మరసు గట్టిగా మందలించాడు. నిగమశర్మ దెబ్బతిన్న వాడిలా ఊరుకుండిపోయాడు. రాయల సూచన మేరకు సయ్యద్ మర్కార్ ని తీర్పు కోసం ప్రవేశపెట్టించాడు తిమ్మరుసు. రాయులు వాణ్ణి చూసి హూంకరించి ఇలా అన్నాడు...
“గుర్రాలు కొనమని డబ్బిస్తే కాజేశావు. నువ్వు నమ్ముకున్న ఆదిల్ షా నిన్ను నట్టేట్లో ముంచి పోయాడు. డబ్బు అతనే కట్టుకున్నాడు. కానీ నువ్వు చేసిన నేరం మాత్రం క్షమించరానిది. నీ వల్ల రక్తం ఏరులైపారింది. కొన్ని వేలమంది సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు... దీనికి ఏమిటి నీ సమాధానం”.
"రాళ్లని మొక్కే కాఫిర్లని ఖతం చేయమని దైవాజ్ఞ. ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడు అతి తొందర్లోనే మీ దేశంలో మా దేవుని రాజ్యం స్థాపిస్తాం..."
"నోర్ముయ్... వదరుబోతా ఇప్పుడే నీ తల తెగ నరుకుతాను... అంటూ నిగమశర్మ ముందుకు వెళ్లబోయాడు. తెనాలి రామకృష్ణుడు ఈసారి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. సభలో కొద్దిసేపు కలకలం జరిగింది. కాసేపటికి రాయలు అన్నాడు.
“రాళ్లని మొక్కడం నీచం అయితే... సమాధులకు మొక్కడం కూడా నీచం కాదా... పిండాలు పెట్టే మాకు, సమాధులు కట్టే మీకు పూర్వులంతా పితృదేవతలకు పూజనీయులైనప్పుడు ఎక్కడుంది తేడా. మక్కాలో రాయిని మీరు వాటేసుకోవటం ఎలాంటిదో... మేం గుళ్లో దేవుడికి అభిషేకాలు, అర్చనలు చేయడం అలాంటిది కాదా. దీనికోసం మళ్లీ పవిత్ర యుద్ధాలని పేరొ కటా. ధర్మం, సత్యం ప్రాణాలైన హైందవానికి, హింసతో రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని చూసే మీకు ఎంత తేడా".
"ఈశావాస్యమిదం జగత్. వాళ్ల కాబా రాయిని చూస్తే శివలింగం లేని పానవట్టం గుర్తొస్తుంది.... ఈ న్యూనిజ్ మహాశయుడి మెళ్లో శిలువను చూస్తే, రెండు సోమ సూత్రాలుండి, పానవట్టం లేని శివలింగం కనిపిస్తుంది. అంతటా ఉన్నది శివుడొక్కడే... చూసేచూపు లోనే తేడా..”
"భళీ! ధూర్జటి కవీశ్వరా... అతులిత మాధురీ మహిమ గల కవిత్వం చెప్తారని రాయలవారు మిమ్మల్ని గురించి సెలవిచ్చింది ఇందుకే కదండీ”.
"కవిత్వమే కాదు... ధూర్జటి గారి మాటలోను రాతలోనూ కూడా పలుకు పలుకునా అమృతం కురుస్తుంది... చెప్పండి ఇతగాడికి ఏం శిక్ష విధిద్దామంటారు?"
"మరణదండన విధిస్తే ఆ క్షణంతో పోతుంది.
అవయవాలు తీసేస్తే అవిలేవన్న లోపం ఒక్కటే మిగులుతుంది. అలా కాకుండా ఏ పనినైతే ఇతను ఇంతవరకూ అసహ్యించుకుంటున్నాడో అలాంటి పనిని ఇతనిచేత చేయిస్తే బాగుంటుంది".
"ఏం చేద్దామంటారు?"
"నా కంటే మన రామకృష్ణయ్య అయితే బాగా చెబుతాడేమో..”
"ఏముంది... సున్తీ చేయగానే హిందువులు తుర కలైపోయినట్లు, వీడికి గెడ్డం పీకించేసి శంఖచక్రాలు, తిరునామం పెట్టేద్దాం సరిపోతుంది”.
"భయం పెట్టి, ప్రలోభ పెట్టి మతం మార్చడం కంటే హేయమైన చర్య మరొకటి లేదు”.
“అయితే ఒక పని చేద్దాం... ఇకపై రాయలవారు కట్టించే దేవళాల్లో రాళ్లెత్తే కూలీగా యావజ్జీవిత శిక్ష విధిద్దాం”.
“అందువల్ల ప్రయోజనం?”
"మత దురహంకారం నశిస్తుంది... నీలో నాలో ఉన్న పరాత్పరుడొక్కడే... వాణ్ణి కళ్లముందు చూసుకోవడానికి ఒక్కొక్కడు ఒక్కోరూపం కల్పిస్తాడని ఎరుక వస్తుంది. రాయిలోనూ, నిప్పులోనూ, ఆకాశంలోనూ, నీటిలోనూ, గాలిలోనూ ఉన్న పరమాత్మని ఎలా కొలిచినా ఒక్కటేనన్న జ్ఞానం కలుగుతుంది".
"బాగుంది”
"అయితే ప్రభూ! శృంగేరి పీఠంలో మరమ్మత్తులు జరిపే ఆలోచన ఏమైనా మీకుందా... ఉంటే ముందు ఇతగాడికి శిక్ష అక్కడ అమలు జరపండి”.
"ఏం?"
"అక్కడ సూర్యకిరణాలు నెలకొక్కరాశి స్తంభం మీద పడే మండపం ఉంది కదా. అక్కడ వీడిచేత సూర్యారాధన చేయిద్దామని”.
"ఉంటే"
"చందమామ వాళ్ల పక్షం వహించాడని ఓ పద్యంలో వాపోయారుగా మహాప్రభూ! మీ మనసుకు కాస్త ఉల్లాసం కలుగుతుందని”.
ఉరిమినట్టు చూశాడు రాయలు. ఒక్కక్షణం సభ స్తంభించింది. కాసేపటికి.
“అమ్మ రామకృష్ణయ్యా... అసాధ్యుడివయ్యా” అంటూ హాయిగా నవ్వేశాడు రాయలు. సభలో నవ్వులు పూశాయి. శిక్ష ఖరారు చేసి ఖైదీని పంపేశారు. మరికొంతసేపటికి సభ చాలించి కృష్ణరాయలు వెళ్లిపోయాడు..... మిగిలిన వాళ్లంతా బయల్దేరబోతూండగా నిగమశర్మ మళ్లీ మొదలెట్టాడు...
"అదికాదండీ అడుగడుక్కీ గుళ్లయిపోతే అసలైన గుడి ఏదో ఎలా తెలుస్తుంది?!... ఆనక మా గుడి గొప్పదంటే మా గుడి గొప్పదని కొట్టుకుచావరా..”
“శ్రీకృష్ణ శరణం మమ... మహాదేవ రక్షమాం”.
అంటూ దణ్ణం పెట్టి మారు పలకకుండా గబగబా సభ నుండి బయటికి నడిచాడు రామకృష్ణుడు.
🙏
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment