*భీమాది పంచబలులు ఒకే లగ్నంలో ఓకేరోజున జన్మించారంటారు. నిజమేనా? ఈ విషయం మీద భారతంలో ఏం చెప్పారు? భీమాది వీరులు ఒకేరోజున జన్మించిన వాళ్ళ జాతకాలుఒకేలా నడుస్తాయా? ఒకే రోజున ఒకే లగ్నంలో జన్మించడం వాస్తవమేనా? ఒకేరోజున జన్మించిన వాళ్ళ జాతకాలు ఒకేలా నడుస్తాయా?*
పంచభీములు లేదా పంచబలులు అనబడే భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు - ఒకే సమయంలో జన్మించలేదు. వారు సమ వయస్కులనేది కూడా ఎంతమాత్రమూ నిజం కాదు. ఈ విషయానికి సంబంధించి ఈక్రింది అంశాలను పరిశీలించండి.
జరాసంధుడు - కంసుని మామగారు.
శ్రీకృష్ణుడు - కంసుని మేనల్లుడు
కనుక - జరాసంధునికీ, కృష్ణునికీ - మూడు తరాల వయోభేదం ఉన్నది. ఈ లెక్క ప్రకారం భీమ, జరాసంధుల మధ్య కూడా అంతే వయోభేదం ఉన్నది. భీమ దుర్యోధనులు సమవయస్కులు. వారు కృష్ణుని కంటే కొద్దిగా చిన్నవాళ్ళు.
భీమాది పంచబలులు జన్మించిన జన్మ నక్షత్రాలు, జన్మ సమయాలు, లగ్నరాశ్యాదులు, వేరు వేరు కావడం వల్ల వారి జాతకాలు కూడా వేరుగానే ఉన్నాయి. కనుక వారి జీవిత గమనాలు కూడా వేరుగానే ఉన్నాయి. కనుక వారి జీవిత గమనములు కూడా నేరుగానే ఉంటాయి. వ్యాసకృతమైన భారతంలో ఎక్కడా ఈ అయిదుగురూ ఒకే సమయంలో ఒకే నక్షత్రంలో జన్మించారని చెప్పబడలేదు.
*“యస్మిన్నహని భీమస్తు జజ్ఞేభరతసత్తమ!*
*దుర్యోధనోపి తత్రైవ ప్రజజ్ఞే వసుధాధిప!!"*
అనే వ్యాసభారత శ్లోకాన్ని అనుసరించి భీమ - దుర్యోధనులిద్దరూ మాత్రమే ఒకే రోజున జన్మించారు. అదీ - ఒకేరోజున జన్మించారనే చెప్పబడింది కాని ఒకే సమయంలో కాదు ఆ సందర్భంగా జరిగిన కథ ఈ క్రిందిది.
ధర్మరాజు జన్మించిన వార్త వినగానే అప్పటికి గర్భవతిగా వున్న గాంధారి తనకంటే ముందుగా కుంతీదేవి సంతానవతి అయిందనీ, ఆ పిల్లవాడు భవిష్యత్తులో రాజ్యార్హుడు కాబోతాడనే ఆక్రోశంతో గర్భాన్ని మోదుకున్నది. అప్పుడు ఆమెకు గర్భపతనం జరిగింది. ఆ సమయంలో వ్యాసమహర్షిని ప్రార్థించగా ఆ మహర్షి వేంచేసి, ఆ మాంసఖండాన్ని నూటొక్క ముక్కలుగా విభజించి - ఒక్కొక్క దానినీ ఒక్కొక్క నేతికుండలో ఉంచాడు. తనకు నూరుగురు కుమారులూ, ఒక్క కుమార్తె కావాలన్న గాంధారి మనోభీష్టాన్ని అనుసరించి ఆయన ఆ విధంగా చేశారు.
అలా ఉంచబడిన కుండల నుంచి దుర్యోధనాదులు జననం జరిగిందనీ, భీముడుశతశృంగ పర్వతారణ్యంలో జన్మించిన రోజుననే ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధునుడు జన్మించాడనీ వ్యాస భారతం స్పష్టం చేస్తున్నది.
జరాసంధుడు భీమునికంటే బాగా వయోధికుడు. అతడూ, భీమ దుర్యోధనులూ, ఒకేసారి జన్మించడం యదార్థం కాదు.
ఈ పంచబలులని పేర్కొనబడేవారు ఓకేరోజున జన్మించిన వారని భారతంలో ఎక్కడా చెప్పబడిన ఉండలేదు. ఇక ఒకే రోజున జన్మించిన వారి జాతక ఫలితాలు గురించి-
ఎవరైనా ఒకే రోజున జన్మించినా, వారి జనన సమయాలలో తేడా ఉంటే, జాతక ఫలితాలు తప్పక మారుతాయి.
జనన సమయంలో ఉన్న తేడానుబట్టి జన్మ లగ్నం మారుతుంది. జన్మలగ్నం మారినప్పుడు, ద్వాదశ భావఫలాలున్నూ తప్పక మారడం జరుగుతుంది. ఆయాభావాలలో ఉన్న గ్రహాలు మారుతాయి. వాటిని బట్టి ఫలితాలు మారుతాయి.
ప్రతి దినమూ, సూర్యోదయానికి మరుసటి దినం సూర్యోదయం వరకూ ద్వాదశ లగ్నాలు నడుస్తాయి. ఏ లగ్న సమయంలో జన్మించిన వారికి ఆ లగ్నం జన్మలగ్నమవుతుంది.
ఒకే రోజున జన్మించినప్పటికీ జన్మ సమయం మారేసరికి, లగ్నమూ, గ్రహాల యొక్క స్థితి కూడా మారుతాయి. ఉదాహరణకు మేష రాశిలో కుజుడు ఉండగా మకర లగ్నంలో జన్మించిన వారికి కుజుడు చతుర్థమందు ఉండగా ఆ కుజుడు అదే మేష రాశిలో ఉండగా కుంభ లగ్నంలో జన్మించిన వారికి తృతీయమందు కుజుడు ఉండడం జరుగుతుంది. మొదటి వారికి చతుర్లకుజ ఫలితాలు, రెండవవారికి తృతీయ కుజ ఫలితాలు కలుగుతాయి. రెండింటిలోనూ ఎంతో భేదం ఉంటుంది.
ఈ విధంగా జన్మించిన దినం ఒకటే అయినా, సమయం మారినట్లయితే, ఫలితాలు ఎంతగానో మారడం జరుగుతుంది. జాతక చక్రం పూర్తిగా మారుతుంది. జన్మదినం ఒకటే అయినా, ఈ జననానికీ, ఆ జననానికీ మధ్య గ్రహాలేవీ కూడా ఇతర రాశి ప్రవేశం చేయకుండా ఉన్నప్పటికీ కూడా జన్మసమయం మారితే జాతక కుండలి పూర్తిగా మారుతుంది . దానినిబట్టి ఫలితాలూ మారుతాయి. దశాంతర్దశలు విభేదిస్తాయి.
ఒకే దినమందు జన్మసమయం మారేసరికి అనేక మార్పులుంటాయి. లగ్నం మారుతుంది. తిధి మారవచ్చును. నక్షత్రం మారవచ్చును. గ్రహాలు తాము ఉన్న రాశిగాని, నక్షత్రంగాని, నక్షత్ర పాదం కాని మార్పు చెందవచ్చును. ఇంకా అనేక స్థూల, సూక్ష్మ అంశాలలో మార్పులు సంభవించవచ్చును. ఈ మార్పు వల్ల రాశి కుండలిలో, నవాంశకుండలిలో ఎన్నో భేదాలు ఏర్పడతాయి. అతి శీఘ్రగ్రహమైన చంద్రుని గమనం వల్ల కూడా జన్మసమయ భేదాన్ని అనుసరించి ఫలితాలలో ఎన్నో మార్పులువస్తాయి.
పై కారణాల రీత్యా ఒకే రోజున జన్మించినా, వివిధ సమయాలలో జన్మించిన వారి జాతకాలు ఒకే విధంగా ఉండవు. ఈ విషయంలో సందేహం లేదు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
No comments:
Post a Comment