Thursday, June 11, 2026

 *యోగి వేమన -6*
రచన : మాలయశ్రీ 


*వదిన హితబోధ*

“లక్ష్మి మంచిపిల్ల!” నరసమాంబ అన్నది.
“అవును" ఒప్పుకున్నాడు వేమన.
"ఎందుకు ఆ అమ్మాయి మనసును నొప్పించావ్?"
“ఆనవసరంగా ఆ అమాయకురాలు నాపై ఆశలు పెంచుకోవద్దని”
“ఇదెక్కడి విపరీతం”
“ఇక్కడిదే”
“ఇంత మొండిపట్టుదలా?”
“జీవధనములయిన చెడుగాక పడుగాక మాట తప్పలేరు మానధనులు!”
“ఏ మాట?”
“నేనిచ్చిన మాట”
“ఎవరికిచ్చావ్?”
"నాకు సమాధానం చెప్పు. ఎవరా అదృష్టజాతకురాలు?”
“నా సహచరి!”
“దేవదాసా?”
“ఆమెనే”
“ఏమన్నావు?”
“భార్యాభర్తల మనుకున్నాం”
“దాన్ని పెళ్ళాడుతావా?”
“ఆడాను!”
“ఆ?!”
“అవునమ్మా”
"మాతో మాటమాత్రమైనా చెప్పకుండా"
"పోట్లాడుతూ చెప్పానుగదమ్మా”
"బాగుంది వరస నీకేం తక్కువయింది చెప్పు చక్కగా కులం పిల్లను పెళ్ళిచేసుకోక"
"కులం పిల్లను యెవరయినా చేసుకుంటారు కదమ్మా. కులం కాని పిల్లను చేసుకునే ఆమెకు గౌరవం"
"వాళ్ళతో వీళ్ళ గౌరవం పోతుందికదా"
"ఈ మగాళ్ళు తమ స్వార్థానికి వాళ్ళనలా దిగజార్చారు వదినా. మళ్ళీ కొందరు నాలాంటి మగవాళ్ళే వాళ్ళకు గౌరవస్థానాన్ని కల్పించాలి. నీలాంటి ఉదారవతులు అందుకు తోడ్పడాలి. స్త్రీజాతి ఉద్ధరణకు స్త్రీలే సహకరించకపోతే ఎలా చెప్పు?"
"ఏమిటో నీదంతా వితండవాదం"
“మా వదినకు తెల్పు-నేను నిజమే మాట్లాడుతున్నానని”
"సరి, పెళ్ళెప్పుడయింది"
"నీ చేతిలో వుంది
"ఏమిటి?"
"నీవు ఆశీర్వదించినప్పుడు"
"ఇక్కడికి తీసుకొస్తావా ఏమిటి?"
"మీరు రమ్మనందే రాము”
"అక్కడికి రావాలా మరి?"
"మైల సోకుతుంది కదా మీకు"
"మరి? "
"ముత్తయిదువ చిహ్నంగా మీ ముక్కెర ఇచ్చి దీవించండి"
"చివరికి మిగిలింది ఇదొక్కటే"
"అదే మా పెళ్ళి చిహ్నం"
"ఇదెక్కడి కలికాలం?"
“శుభకార్యం:”
“ముత్తయిదువ ముక్కెర తీసి యిస్తుందటయ్యా"
“వదినా ఈ ఒక్క కోర్కెను తీర్చవమ్మా. ఇంక జీవితంలో నేనేదీ కోరను."

ఆలోచన పాలైంది నరసమాంబ. చివరి ప్రయత్నంగా ఆమెకో ఉపాయం స్ఫురించింది.

"సరే ఇస్తాను కాని ఒక నిబంధన” నిశ్చలంగా అంది.
“చెప్పెయ్యి. నిప్పులో దూకమన్నా దూకేస్తా"
"అంత సాహసం ఏమీ అక్కర్లేదు"
“మరి ?”
“దీనిని ఆమెకు ఇచ్చేటప్పుడు నగ్నంగా వెనుకకు మొగ్గవాలి తీసుకొమ్మను”

సిగ్గుతో తల ప్రక్కకు తిప్పుకొని నవ్వుతూ కళ్ళు మూసుకొన్నాడు.

“సరే, నీవన్నట్లే…” అన్నాడు.
“మాట తప్పవద్దు సుమా”
"నీ మీద ఒట్టు-సరేనా?"

ఆతని ముఖంలో నవ్వు చెదరిపోలేదు. ఆమె ముఖం గంభీరంగానే వుంది, వదిన ఇచ్చిన ఆభరణం తీసుకొని బయటపడ్డాడు.
📖

*అభిరామయ్య కలిశాడు*

ఊపులో వెళ్తున్న వేమన దారిలో అభిరామయ్యను తాకినంత పని చేశాడు. అతడు భయంతో తప్పుకొని ప్రక్కకు నిలిచాడు. అభిరామాచారి ఆ వూళ్ళో పేరున్న స్వర్ణ కారుడు. వీరింటి నగలు అతడే చేస్తాడు. నియమ నిష్టలు నిజాయితీ కళాకుశలత్వం కల ఆ స్వర్ణ శిల్పికి ఊళ్ళో మంచి గౌరవం వుంది.

"తాకుతావా యేం? ఏమిటా దూకుడు-కాస్త దూరంగా వుండు-” అన్నాడాయన వేమన్నతో.
“ఏం, తాకితే మైల పడిపోతావా?”
"కాదా మరి? మడిలో వున్నానయ్యా. దేవాలయానికి పూజకు వెళ్తున్నాను. కనిపిస్తూ లేదూ?
“ఓహోహో పట్టుబట్టమడా?”
"ఆ-పట్టుబట్టో గోనెపట్టో, మడంటే మడే"
“సరేకాని అభికామయ్యగారూ! తడిబట్ట గోనెపట్టా మడులు తెల్సు కాని, ఇంటిమడి అంటే ఏమిటి?"
“నా పిండాకూడు, జరుగవయ్యా. కొంచెం పక్కకు తప్పుకో."
"అంత తొందరా?"
“కాదా మరి”
“ఓ-దైవ మందిరానికి వెళ్తున్నావు కదూ!"
“అవును మరి. సరేకాని, ఇంతకు నువ్వెక్కడికి?"
“దేవీ మందిరానికి!” అని నవ్వుతూ వెళ్ళాడు.

“శివ శివ!” అని అభిరామయ్య ఇలా-

"బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభితలింగం.” అని చదువుకుంటూ వెళ్ళాడు—

*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment