Thursday, June 11, 2026

 ఏది సుఖం?

చాలినంత డబ్బు, భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని, సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం. నిరుపేదల బతుకులు దుఃఖభరితాలని అనుకోవడమూ సహజమే. కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవం?

ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి 'నేను చాలా కష్టాల్లో ఉన్నాను. సుఖజీవనాన్నిచ్చే మంత్రోపదేశం చేయండి' అని అడిగాడు. తత్వవేత్త నవ్వి అలాంటి మంత్రమేదీ తన దగ్గర లేదన్నాడు. అప్పుడా వ్యక్తి- 'నన్ను నిరాశపరచకండి. చాలా దూరంనుంచి వచ్చాను' అని ప్రాధేయపడ్డాడు. ఇతడికి మాటల్లో చెబితే అర్థమయ్యేలా లేదనుకున్న తత్వవేత్త 'మంత్రం చెబుతాను గానీ, సుఖంగా జీవిస్తున్నవారు ధరించిన పట్టువస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా' అని చెప్పాడు.

'అంతేనా! అదెంత సేపు... ఇప్పుడే 'తెస్తాను' అంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్లి 'నాకు మీ పట్టుపంచె ఒకటి ఇవ్వండి' అన్నాడు- ఆ వ్యాపారి ఆశ్చర్యంగా 'ఇస్తాను కానీ, ఎందుకు' అని అడిగాడు. ‘ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు సుఖజీవన మంత్రం చెబుతానన్నారు తత్వవేత్త. అన్నాడా వ్యక్తి. అప్పుడా వ్యాపారి 'పొరపడుతున్నావు. నువ్వు ఊహిస్తున్నట్లు నేనంత సుఖంగా ఏమీ లేను' అన్నాడు. 'మంచి వ్యాపారమూ సంపదా ఇంటినిండా సేవకులూ ఉన్న మీరు సుఖంగా లేనంటే నేనెలా నమ్మను' అన్న వ్యక్తితో వ్యాపారి నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర ఉండి  నువ్వే చూడు' అని చెప్పాడు. దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి- ఆ దంపతులు తరచు గొడవపడటం, వ్యాపారి కంటతడి పెట్టడం.. గమనించాడు. తన భార్య మంచితనాన్ని గుర్తుతెచ్చుకుని, ఆ వ్యాపారి కన్నా తానే నయమనుకుని అక్కడి నుంచి బయల్దేరతాడు. ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్తాడు. వృద్ధాప్యంతోనూ, వ్యసనపీడితుడైన కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడా లాభం లేదని మళ్లీ తన అన్వేషణ కొనసాగించాడు. ఒక చెట్టు కింద కూర్చున్న ఫకీరును చూసి 'మహాత్మా! మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు' అన్నాడు. ఫకీరు నవ్వుతూ 'నిజమే, దొరికిందేదో తిని, పరమాత్ముని భజన చేస్తూ బతకడాన్ని మించిన సుఖమేముంది' అన్నాడు. 'అయితే మీ పట్టుపంచె ఒకటి ఇవ్వండి' అడిగాడా వ్యక్తి. ‘నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేంలేదు. సంతోషంగా జీవించడానికి సంపదలేమీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే తత్వవేత్త నిన్ను పట్టువస్త్రం తెమ్మన్నాడు' చెప్పాడు ఫకీరు.
కోరికలకూ, ఆశలకూ లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం. ఏదైనా కోరిక అంటూ పుడితే, దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు. లేనిదానికి అర్రులు చాస్తూ ఉన్న వాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు. సుఖంగా, సంతోషంగా జీవించడానికి కావాల్సింది సంపద కాదు, తృప్తి.. అని గ్రహించడమే వివేకం.
గోవిందం ఉమామహేశ్వరరావు

No comments:

Post a Comment