Thursday, June 11, 2026

 సరైన దారిలో నడిచిన చారిత్రక నవల పట్టుతోవ

✍️మహమూద్

మనుషులే చరిత్ర నిర్మాతలు. ఆ నేపధ్యంలో దారులు నిర్మించిన చరిత్ర కూడా వాళ్ళదే! వాటి మీద రాజ్యాల, సామ్రాజ్యాల ముద్ర ఉన్నా పాదముద్రలు మాత్రం మనుషులువీ, బానిసలవీ, మహిళవీ, వ్యాపారులవీ, పిల్లలవి కూడా!

ఈ దారుల నిండా, మానవుడి చెమట నెత్తురై పారింది. అనేక సందర్భాల్లో ఈ దారులు అలవోకగా మానవుల ప్రాణాలు తీసాయి. అనేక మందిని ఆగర్భశ్రీమంతులను చేసాయి. ఆ సంఖ్యకు తీసిపోకుండా బికారుల్ని కూడా చేసాయి. మానవులను కలిపాయి,విడదీసాయి. రాజ్యాలకు రాజ్యాలనే కూల్చాయి. ఆర్థిక పుష్టిగల బలమైన దేశాలనూ నిర్మించాయి.

ఈ దారుల్లో నడిచి, దేశ దేశాలను దాటి, చరిత్రను రికార్డు చేసి అనేక మంది మహానుభావులయ్యారు.ఇబన్ బటూత, పాహియాన్,మార్కోపోలో లాంటి సాహసికులు ప్రపంచజ్ఞానాన్ని పొందడం కోసం ఈ మార్గాలలో నడిచి దేశ దేశాల సంస్కృతుల్నీ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల్నీ, అర్థం చేసుకొని అంచనా గట్టి ప్రపంచం ముందు చరిత్రగా ఉంచారు.

ఈ దారుల వల్ల సంభవమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పులకు ప్రత్యక్ష సాక్షులుగా నిలబడ్డారు.

ఈ దారులు ఎడారులకూ, అరణ్యాలకూ మధ్య వారధు లయ్యాయి. ఈ దారుల నిర్మాణం కోసం చిందించబడ్డ మానవ రుధిరం దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంస్కృతికి అజ్యం పోసింది. శ్రమజీవుల త్యాగాలు ఈ దారులకు నునుపుదనాన్ని ఇచ్చాయి. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న యాత్రికుల కలలను సాకారం చేసాయి. స్వంత ప్రాంతంలో దొరకని పేరు ప్రఖ్యాతులు చాలా మందికి పర ప్రాంతాల్లో ఈ దారుల వల్ల లభించాయి. వ్యాపారులకు లాభాలూ, నష్టాలు రెండింటినీ సరిసమానంగా రుచి చూపాయి.

వస్తువుల రాకపోకలే కాదు.సంస్కృతులు,భాషలు, ఆహారపు అలవాట్లు,యుద్దాలు,మతాలు,మానవత్వం, నైపుణ్యాలు, అన్నింటికీ మించి “జ్ఞానం” ఈ దారుల గుండా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఆ మాటకొస్తే ఖండాంతరానికిబదిలీ అయి ప్రపంచ రూపు రేఖలు మారడానికి ఉపకరించాయి.

చెంఘీజ్ ఖాన్ తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తే అలెగ్జాండర్ పశ్చిమం నుండి తూర్పు వైపు ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించి చరిత్ర సృష్టించిందీ ఈ దారుల్లో పయనించే!

చరిత్ర నిండా మానవులు కొత్తదారులు వేయడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాటి కోసం జీవిస్తున్నారు, చాలా మంది ప్రాణత్యాగాలూ చేస్తున్నారు.

కాగా అలాంటి దారుల్లో ఒకానొక దారి “పట్టుతోవ" లేదా పాశ్చాత్య చరిత్రకారులు ముద్దుగా పిలుచుకునే "సిల్క్ రూట్”. ఇది చైనా నుండి ప్రారంభమై మధ్య ఆసియా, ఆఫ్రికా, యూరప్ దాకా విస్తరించింది. చైనా ప్రజల శ్రమ సొత్తు అయిన పట్టు, పింగాణీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఈ దారి వల్ల కాదూ!?

ఇది ఇప్పటి మాట కాదు. గతంలోకి తొంగి చూస్తే రెండు వేల సంవత్సరాల ముందు ప్రారంభమైన మహోజ్వలమైన చారిత్రక మానవ పరిణామ ఘట్టం! ఈ దారి గురించి పుంఖాను పుంఖాలుగా రచనలొచ్చాయి.

కాల్పానిక సాహిత్యంలో కూడా దీనికి చోటు దొరికింది. ఆ కోవలోకి వసుధేంద్ర రాసిన “పట్టుతోవ” ఒకటి వచ్చి చేరింది. ఇది చరిత్రకి కాల్పినికతను జోడించి రాసిన నవల! మాతృక కన్నడంలో వచ్చింది. తెలుగు అనువాదాన్ని ఛాయా ప్రచురణ సంస్థ రంగనాధ రామచంద్రరావు ద్వారా చేయించి మన పాఠకులకు అందించింది.

ఒళ్ళూ, కళ్ళూ, మెదడు హూనమయ్యేలా శ్రమిస్తే, పరిశోధిస్తే గానీ ఇలాంటి నవల రాయలేం. పాఠకులను రంజింపజేసే నవల చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. చారిత్రక నవల రాయడం ఇంకా కష్టతరమైనది కదా! చాలా వివరాలు సేకరించాలి. చాలా పుస్తకాలు చదవాలి, వాటినుంచి తన రచనకు అవసరమైన రీసోర్స్ను ఎన్నిక చేసుకోవాలి. డాక్యుమెంట్స్ పరిశీలించాలి. వీటన్నింటినీ తన కథకు జోడించాలి. అది వాస్తవ చరిత్రకు దగ్గరగా ఉండాలి.

ఇలాంటి రచనలు చరిత్ర వక్రీకరణకు కారణమయ్యే ఆస్కారముంది. అది రచయిత దృష్టిలో ఉంచుకోవాలి. ఇవన్నీ సమతూకంలో ఉంటే ఆ రచన పాఠకులను రజింపజేస్తుంది.

వసుధేంద్ర ఏ ఏ పుస్తకాలు చదివి ఈ నవల రాయడానికి పూనుకున్నారో చివర లిస్ట్ ఇచ్చారు. దాదాపు యాభై జాతీయ, అంతర్జాతీయ చారిత్రక గ్రంధాలని చదివిన తర్వాత గానీ ఈ రచన నవలా రూపాన్ని సంతరించు కోలేదు. ఈ నవలని పాఠకులు ఆస్వాదిస్తున్నప్పుడు ప్రతి వాక్యం వెనుక రచయిత పడ్డ కష్టం అవగతమౌతూ ఉంటుంది. రచయిత అవసరమనుకున్న చోట చాలా వివరాలు ఇచ్చారు. ఉదాహరణకు- తుషార సముదాయ జీవన విధానం మీద కానీ, లేదా జోరాష్ట్రియన్ మత విధానాల విషయంలో కానీ ఈ అంశాన్ని గమనించవచ్చు. కాబట్టే పట్టుతోవ గొప్ప రచన చదివిన అనుభూతినిస్తుంది.

వసుదేంధ్ర బుద్ధుడి అభిమాని అని అనిపించడమే కాదు అంతర్లీనంగా బౌద్ధ సంస్కృతి నదిలా నవల ఆసాంతం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే రచయిత ఈ నవలని తథాగతుడికి అంకితమిచ్చాడు.

నాలుగు వందల ముప్పై పేజీలున్నా ఈ నవల ఎక్కడా విసుగు తెప్పించదు. పైగా చరిత్రలో అతి సామాన్యులు, రాజులు, రాజ్యాలు బుద్ధుడి ప్రభావంలో, ఆ కాలంలో ఎలా తలవంచుకొని నిలబడ్డారో పాఠకులకు అర్థం అవుతుంది. నిజానికి ఈ నవలలో కథా వస్తువు బుద్ధుడి మరణానంతరం ఏడువందల సంవత్సరాల తర్వాతి కాలానికి చెందినది. బుద్ధుడి భావనల్లో ఏ మాత్రం బలహీనమైనవి ఉన్నా అప్పటికే బౌద్ధం ఈ ప్రపంచం నుంచి కనుమరుగైపోయేది! కానీ నవలలో ప్రస్తావించిన స్థలకాలానికి బౌద్ధం నిలిచి ఉండడమే కాక, ఖండాంతరాలు దాటి, మానవ స్వభావాన్ని మార్చుతూ, తాను మారుతూ, కొనసాగుతూ ఉన్నది. చైనాలో పుట్టిన కన్ఫ్యూజనిజం, టావోయిజం, పెర్షియాలో పుట్టిన జోరాస్ట్రియనిజం, ప్రభావ హీనమైనాయి కానీ బౌద్ధం ప్రపంచ ముఖ్యమైన జీవన విధానాల్లో ఒకటిగా ఇప్పటికీ మనగలుగుతోంది.

ఈ నవలలో ఈ మతాల మనుషుల మధ్య సంఘీభావాన్నీ, ఒక మతం ఇంకో మతంపై వేసుకున్న ప్రభావాన్నీ పాఠకులు తెలుసుకుంటారు.ఈ మతావలంబికులైన పలు పాత్రల మధ్య కలయిక, స్నేహం, ప్రేమ మరియు సాంస్కృతిక సమ్మేళనాన్ని కూడా ఈ నవల చక్కగా చిత్రించింది.

మానవుల మానసిక, శారీరక ప్రవర్తన మీద వాళ్ళ ఆలోచనల తీరు మీద, మనుజుల వ్యక్తిత్వం మీద బౌద్ధం బలమైనముద్రని ఎలా వదిలిందో ఈ నవలలోని పాత్రల ద్వారా నిరూపిస్తాడు రచయిత. బౌద్ధ భిక్షువులు కూడా మానవాతీతులు కాదనీ, వారిలో కూడా మానవ సహజ ఉద్వేగాలు, చపలత్వాలు ఉంటాయని "బౌద్ధ మిత్ర"అనే పాత్ర ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు రచయిత. కథలోని ఈ సందర్భం వల్ల, కాలానుగుణంగా మార్పుకు లోనైన బౌద్ధ మతంలోని ప్లెక్సిబిలిటీకి ఉదాహరణగా చూడవచ్చు.

ఈ నవలలో మొత్తం ఐదు పెద్ద అధ్యాయాలలో కథా విస్తరణ ఉంటుంది. నాంది అనే చిన్న భాగంలో భారత దేశం నుంచి బౌద్ధం చైనాలో ప్రవేశించిన విధానాన్ని చూచాయగా తెలుపుతుంది. తర్వాతి ఐదు అధ్యాయాలూ ప్రధాన పాత్రల జీవన సరళితో మొదలై చివరి భాగంలో ఈ పాత్రలకీ పట్టుతోవకీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ, వీళ్ళు ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకున్నారు, పట్టుతోవ అనే ఒక మొరటు దారి వీళ్ళ జీవితాల్లో నింపిన సంతోష విషాదాలేమిటీ? అంతిమంగా వీళ్ళంతా పట్టుతోవలో ఏ భాగంలో తేలారు? పట్టుతోవ వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? ఎవరి నుంచి ఎవరిని విడదీసింది, కలిపింది, ఈ నేపధ్యంలో వీళ్ళు చేసిన త్యాగాలు ఏమిటీ? పొందిన అనుభవాలేమిటీ? బౌద్ధానికి ఈ చారిత్రక పరిస్థితులతో ఉన్న సంబంధం ఏమిటీ? భిన్న మతాలకు, సంస్కృతులకు చెందిన వీళ్ళ జీవితాల్లో బౌద్ధం రాక తెచ్చిన మార్పులేమిటీ? ఇలాంటి మానవమాత్రులు చరిత్ర మార్పుల్లో భాగం ఎలా అయ్యారు? అనే అంశాలన్నీ కలిపి బలమైన డ్రామాతో ఈ నవల నడుస్తుంది.

తొలి అధ్యాయం: హవినేను

నవల తుషార తెగకు చెందిన హవినేమ అనే ఒక కళాకారుడి దగ్గర మొదలౌతుంది. ఈ తెగ ఆటవిక తెగ. పట్టుతోవకి తన సంస్కరణలతో పట్టంగట్టిన కుషాణ రాజు (ఇతని పూర్వికులు కూడా తుషార తెగకు చెందిన వారే అనే వాదన కూడా ఉంది) కనిష్కుడిని అనివార్యంగా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ తెగ సభ్యులు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారో ఈ అధ్యాయంలో నిక్షిప్తం చేశారు రచయిత!

మొత్తం తెగ మనుగడను ప్రమాదంలోకి నెట్టిన కనిష్కుని సామ్రాజ్యం చాలా విస్తారమైనది. రాజు బలవంతుడు. ఇతని రాజ్యం మీదుగా పట్టుతోవ ఇతర ప్రాంతాలకు వెళుతుంది. ఇదే రాజ్యంలోని అరణ్యాల మీద ఆధారపడి తుషార తెగ జీవిస్తుంది.

తన రాజ్యంలో భోగభాగ్యాలకు లోటు రానీయకుండా కనిష్కుడు ఈ దారిని ఉపయోగించుకున్నట్టూ, దేశదేశాల నుంచి వ్యాపారస్తులు ఆ రాజ్యానికి తమ వస్తువులతో వచ్చి వ్యాపారం చేసుకోడానికి అవకాశమిచ్చిన దాఖలా ఈ నవల ఇస్తుంది.

పట్టుతోవలో వ్యాపారాభివృద్ధికి కనిష్కుడు చేసిన గొప్ప కృషి వెనుక రాజ్య విస్తరణ ఒకటైతే, దానికి బౌద్ధాన్ని ఆసరా చేసుకున్న ఎత్తుగడ ఒకటి!

అప్పటి, ఇతర రాజ్యాలతో పోలిస్తే ఆ వ్యవస్థ ఆధునికంగా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో బౌద్ధమతాన్ని కనిష్కుడు ఉపయోగించుకున్న తీరు ఈ నవల చర్చిస్తుంది. ఈ దారిలో వ్యాపారస్తుల బాగోగుల కోసం కనిష్కుడు మంచి ఏర్పాట్లు చేశాడు. వారి రాకపోకలలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి ఒకవ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాళ్ళ కోసం విశ్రాంతి గృహాలు నిర్మించాడు. వాటి కోసం అరణ్యాలను ధ్వంసం చేశాడు. ఈ ప్రమాదాన్ని తుషార తెగ వాళ్ళూ ఎదుర్కోక తప్పలేదు.

వ్యాపార లావాదేవీల్లో, మారకంలో ఉపయోగించే నాణేలనూ సంస్కరించాడు. కానీ ఇతడి బలమైన సామ్రాజ్యవాదం వల్ల అనేక తెగలు స్థానంభ్రంశం చేయబడ్డాయి, లేదా నిర్మూలించబడ్డాయి. రచయిత ఆ హింస జోలికి పోకుండానే దాని తీవ్రతని శిల్పంలో భాగం చేశారు. అరణ్యాలలో నివసించే తెగలకు వ్యాపారుల, పట్టణ సంస్కృతుల దాడి ఎలా ఇబ్బందుల పాలు చేసిందో అరణ్యాలపై ఆధారపడిన తుషార సంచార తెగలు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాల విచ్ఛిన్నం ఎలా జరిగిందో ఈ నవలలోని ఈ భాగంలో చదవవచ్చు. ఇంత చిన్న తెగల సమాచారాన్ని నిక్షిప్తం చేసిన చరిత్రకారులను ఖచ్చితంగా అభినందించాలి! అలాగే వాటిని ఈ నవలలో రచయిత ఉపయోగించుకున్న పద్దతి కూడా కొనియాడదగింది.

ఈ దారి ఏర్పడినప్పుడు కోతకు గురైన అరణ్యాల కడుపుకోత పాఠకులకు బాగా అర్థమవుతుంది. అంతే కాకుండా, పాఠకులు ఇప్పుడు మనం దేశంలో ఆదివాసీల మీద జరుగుతున్న దమనకాండని కూడా పోల్చి చూసుకుంటారు. డ్యాముల నిర్మాణసమయంలో తెగ్గోయబడే అడవులు, ఖాళీ చేయబడే తండాలను మననం చేసుకుంటారు. 

హవినేమ ఈ అధ్యాయంలో ముఖ్యపాత్ర. అతడి తాత శిఖనేమ నుండి వారసత్వంగా లభించిన రంగులతో అందమైన ఆకారాలను చిత్రించే వృత్తి అతడికి జీవనాధారం. అతడు అటు తన కుటుంబానికి కాక ఇటు పురుషపురం (ఇప్పటి పాక్ పెషావర్) పట్టణ జీవితానికి కాక కుటుంబ పోషణ కోసం అటూ ఇటూ ఊగుతూనే బౌద్ధుల పరిచయంతో కొంత నిలదొక్కుకుంటాడు. 

తుషార తెగలోని కొందరు వాళ్ళ సంస్కృతిని కాపాడు కోవడానికి కనిష్కుడితో నేరుగా వైరం పెట్టుకుందామని వాదించినా, తాత శిఖనేమ ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు తుషార సమూహానికి ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయో వివరించి రాజీపడేలా చూస్తాడు. 

హవినేమ పురుషపుర నగర జీవితపు తళుబెళుకుల అకర్షణకులో పడి అక్కడే బౌద్ధం ప్రభావానికి లోనౌతాడు. అయితే తుషార తెగవారు పురుషపురానికి వస్తువుల మారకం కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ సంతలో అడవి సంబంధిత వస్తువులు అమ్మి వారికి అవసరమైన పచారీ సామాన్లు తెచ్చుకోవడం అవసరం.

కనిష్కుడు ప్రవేశ పెట్టిన నవీన నాణెల పద్ధతి వల్ల ఈ తెగ చాలా ఇబ్బందుల పాలౌతుంది. మార్కెట్తో నేరుగా సంబంధం ఉన్న ఈ కొత్త సంస్కరణలను అవగాహన చేసుకోలేక సతమతమైపోతుంది.నాణేల విలువల మధ్య తేడా గుర్తించడంలో విఫలమై నెత్తిమీదికి తెచ్చుకుంటుంది.

 రాజ్యంతో నేరుగా వైరం పెట్టుకొని బతకగలిగే ఆత్మస్థైర్యం లేకపోవడం వల్లా, పాత ఉత్పత్తి విధానాలతోనే కొనసాగాలి అనుకునే వెనకబాటుతనం వల్ల అనేక సమూహాలు కనుమరుగై పోయాయి.ఆ సముదాయాల్లోనే కొంత మంది కాలం పరీక్షకు నిలబడాలి అనుకుంటారు. మార్పుని అంగీకరిస్తారు. సొంత అస్తిత్వాన్ని నిలబెట్టు కోవడంలోనూ, కొత్త వాటిని అంగీకరించే పరిస్థితులతోనూ గొప్పగా ఘర్షణ పడతారు.

అందులో హవినేమ, అతని భార్య సగనేమి తాత శిఖనేమి ముఖ్యులు! పాత విధానాలు విడవలేక,మూఢాచారాలను గొప్పవి అని నమ్మే తుషార తెగతో తెగతెంపులు చేసుకోవాలని సగనేమి తన భర్తని అరణ్యం వొదిలి పట్టణం వైపూ,కొత్త పద్దతులను,హేతుబద్దతను సమాజంలో ప్రచారం చేస్తూ లిబరల్ కనబడుతున్న బౌద్ధం వైపూ ఆకర్షింపబడతారు. తుషార తెగ జీవనవిధానాన్ని సాధ్యమైనంత వివరణాత్మకంగా రచయిత రాశారు. చివర్లో హవినేమ చేసిన త్యాగం తన సమూహం కోసమా? లేదా, పట్టుతోవ కోసమా? అనేది చాలా ముఖ్యాంశం.

➡️రెండో అధ్యాయం: మధుమాయ!

ఈ అధ్యాయంలో ఈమెది ప్రధాన పాత్ర. తండ్రి సూదులు తయారు చేసే వృత్తి అవలంబిస్తూ బతుకుతో పోరాడుతూ ఉంటాడు. మధుమాయ రకరకాల పూల నుండి రంగులు తయారు చేసి పాత్రలపై అందమైన ఆకారాలను చిత్రిస్తుంది. వీళ్ళు అరపారశీకులు- రోమన్లు, పారశీకుల మధ్య సంకరం పొందారు.

వీళ్ళ ప్రాంతం మీదుగా పోయే పట్టుతోవ వల్ల మిత్రవందకుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అతడి ప్రేమలో పడుతుంది.

అరపారశీకుడైన తండ్రి సహజంగా లౌకికుడు! అందుకే వందశాతం జోరాస్ట్రియుడైన మిత్రవందకుడిని అంగీకరిస్తాడు. మిత్ర వందకుడు సమర్ఖండ్ వాసి, ముత్యాలను, రత్నాలను వెలికితీసే గని కార్మికుడు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే సోగ్గా తెగకు చెందిన వాడు. కాగా దాదాపు ఎడారిగా ఉండే తమ ప్రాంతంలో వ్యవసాయానికి భవిష్యత్తు లేదని ఆ తెగ యువకులు పట్టుతోవ వ్యాపారస్తుల ఆకర్షణ పాల పడతారు.వాళ్ళల్లో ఒకడీ మిత్రవందకుడు. 

మధుమాయ వ్యక్తిత్వం వల్ల ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఇతడు గనిలోంచి నీలి రంగు పొడి చౌర్యం చేసి దొరికిపోయి శిక్ష పొందుతాడు. పని నుండి బహిష్కరణకు గురౌతాడు.అనక వ్యాపారం చేయాలను కుంటాడు. దాని పెట్టుబడి మధుమాయ సమకూర్చు తుంది. వీళ్ళిద్దరికి సహకారం అందిస్తాడు ఓహ్యా అనే మిత్రుడు. పట్టుతోవ వ్యాపారులతో పోటీ పడలేని మధుమాయ తండ్రి నష్టాల పాలౌతాడు.కాబట్టి మధుమాయ తన ప్రాంతాన్ని ఒదలక తప్పదు. చైనా దేశంలో ఒక కుటుంబానికి దాసిగా మారుతుంది. మిత్రవందకుడు వ్యాపారం కోసం పట్టుతోవలో అడుగిడతాడు.

మధుమాయ చాలా గొప్ప పాత్ర. ఈ నవలకే తలమానికం. వందల సంవత్సరాలు బయటికి పొక్కనీయకుండా కాపాడుకున్న చైనీయుల పట్టు ఉత్పత్తి రహాస్యం మిగతా ప్రపంచానికి మధుమాయ ద్వారా ఎలా ఎగుమతి చేయబడిందో తర్వాత తెలుస్తుంది. ఆ నేపధ్యంలో ఎక్కడో నివసిస్తున్న మధుమాయ చైనాలో ఎలా అడుగు పెట్టిందీ, ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగిందీ ఒక వైపు తెలియజేస్తూనే ఇంకోవైపు వాటిని ఎంతో నైపుణ్యంతో ఆమె ఎదుర్కోవడాన్ని హృద్యంగా చిత్రించాడు రచయిత.

➡️మూడవ అధ్యాయం: జ్ఞానసేనులు

ఈ అధ్యాయం బౌద్ధ సన్యాసులకు సంబంధించినది. జ్ఞానసేనులు అనే ఒక వృద్ధ బౌద్ధ సన్యాసి తన శిష్య బృందంతో, కనిష్కుని ఆదరణతో పురుషపురంలో బౌద్ధారామంలో ఉంటాడు.

ఇతడు పాత తరానికి ప్రతినిధి అని అనుకుంటే, ఇతడి అనుంగు శిష్యుడు బుద్దమిత్ర కొత్త తరానికి ప్రతినిధి. ఇతడు పూర్వపు గురువుల నుండి పొందిన బౌద్ధ జ్ఞానాన్నీ ప్రచారం చేస్తూంటాడు. 

బుద్ధమిత్రకు, జ్ఞానసేనులకు మధ్య బుద్ధుడి భావాలను అర్థం చేసుకునే విషయంలో కొంత ఘర్షణ తలెత్తుతుంది. బౌద్ధాన్ని ఆచరిస్తున్నపుడు కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యలతో పాటు, మార్పును అంగీకరించడంతో బౌద్దం చూపిన సరళత ఈ అధ్యాయంలో చర్చకు వస్తుంది. 

బుద్ధుడు సంసార జీవితాన్ని త్యజించాడు. ప్రతి బౌద్ధ గురువు ఎలా ఉండాలో స్పష్టమైన సంకేతాలిచ్చాడు. వాటిని కొనసాగించాలా? వద్దా? బౌద్ధ భిక్షువులు సంసార సుఖాన్ని అనుభవిస్తే తప్పేమిటీ? అనే మీమాంసకు బుద్ధమిత్ర లోనౌతాడు. బౌద్ధం ఇతర మతాలతో పోలిస్తే లిబరల్ ఎందుకైందీ? ఇందుకే!

వారు నివసించే గుహలలో శిల్పాల రీతులపై వేరే మతాల ప్రభావం ఉందా? బౌద్ధ ప్రతిమలలో బుద్దుడి ప్రవచానాలు ప్రతిఫలిస్తున్నాయా? లేక విగ్రహ పూజ లాంటి అవాంఛనీయ పద్దతులు దూరాయా? లాంటి అంశాలు చర్చకు వస్తాయి. తుషార తెగలో చాలా మందిలో మార్పు రావడానికి జ్ఞానసేనులు కారణం. ఈ అధ్యాయంలో బౌద్ధం మీద పాఠకులకు మంచి అవగాహన ఏర్పడుతుంది. బౌద్ధం కాలమాన పరిస్థితులతో సర్దుకుని ఎలా విస్తరించింది పాఠకులు తెలుసుకుంటారు.

➡️నాలుగవ అధ్యాయం: సగనేమి!

ఈ అధ్యాయంలో సగనేమి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈమె హవినేమ భార్య! వీరివురికీ కలిగిన సంతానం రుతునేమ!

ఈమె పురషపురం శివారులో ఉన్న బౌద్ధాలయం దగ్గర ఒక పాకలో భర్త, కుమారుడితో జీవిస్తోంది. బౌద్ధులు ప్రచారంలో భాగంగా చైనా దేశానికి పయనమైనప్పుడు తన సంతానాన్ని తుషార తెగ ఆటవీకత నుంచి దూరం చేసి బుద్ధ జ్ఞానిలా తీర్చిదిద్దాలని అనుకుంది. కొడుకు కోసం తనకిష్టమైన అరణ్యజీవితాన్ని త్యాగం చేసింది. ఆవిడ బలమైన నిర్ణయం ముందు భర్త కూడా వోడిపోక తప్పలేదు.

ఇక్కడ బుద్ధమిత్రకు ఈ కుటుంబంతో ఏర్పడిన బంధం బుద్ధమిత్రునిలో ఎటువంటి మానసిక మార్పులకు కారణమైంది!? అవి ఓ బౌద్ధుడికి ఆచరణీయమా? కాదా? అతడీ పరిస్థితిని అధిగమించడా? రాజీపడ్డాడా?

హవినేమ కుమారుడు రుతునేమ (అంటే తుషార సముదాయ మలితరం బౌద్ధాన్ని స్వీకరించే ప్రతినిధిగా చెప్పవచ్చు) బుద్దమిత్రతో బలపడిన గురు శిష్య బంధం వల్ల చురుకైన రుతునేమ చాలా వేగంగా బౌద్ధ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు.

బౌద్ధుల ఆచరణకు నవీన ప్రతినిధిగా కనిపిస్తాడు బుద్ధమిత్ర! ఇదే సందర్భంలో హవినేమ భార్య సగనేమి బుద్ధమిత్ర వ్యక్తిత్వంపై వేసిన ప్రభావం ఏమిటీ? ఆమె విషయంలో బుద్ధమిత్ర సరిగానే ప్రవర్తించాడా? అనేవి పాఠకులను ఆలోచింపజేస్తాయి!

➡️ఐదో అధ్యాయం: చాన్ లిహ్వా

మధుమాయ దాసిగా వెళ్ళిన చైనా కుటుంబ యజమాని కూతురు చాన్ లిహ్వా! మధుమాయ స్నేహితురాలు. మధుమాయను వాళ్ళు బానిసల వేలంలో తీసుకొని వచ్చారు. ఆమె పేరు ఉచ్ఛరించడం రాక ఆమెకు "కాంగ్ హీ” అనే నామకరణం చేశారు. కానీ ఆ కుటుంబం ఆమెని బానిసగా కాక పని మనిషి గానే చూస్తూ ఉంటుంది.

చాన్ లిహ్వా కుటుంబం ఉప్పు తయారీలో నిష్ణాతులు. ఆ కాలంలో చైనాలో ఉప్పుకు గొప్ప గిరాకీ ఉండేది. చైనాకు ఉన్న సముద్ర తీరం అంతా దక్షిణంలో ఉండేది. ఉత్తరంలో ఉన్న వాళ్ళకు ఉప్పు కరువు. కాబట్టి ఒకప్పుడు ఆదాయం పెద్దగా లేని వ్యవసాయ కుటుంబం ఉప్పు వృత్తిలో దిగాక ఒకటవ శ్రేణి నుండి నాలుగవ శ్రేణికి ఎగబాకింది.పైగా కాంగ్ భార్య శీ ఇంట్లో మిగతా అందరి సహాయంతో పట్టును తయారు చేస్తుంది. ఇది వారికి అదనపు ఆదాయం. ఇందులో మధుమాయ బాగా సహాయ పడుతుంది. ఆ క్రమంలో పట్టు తయారి గుట్టును తెలుసుకుంటుంది.

చైనా సామాజిక వ్యవస్థ నిచ్చనమెట్లలో ఎగువ మధ్యతరగతి కుటుంబం వీళ్ళది. అయితే లిహ్వా తండ్రి కాంగ్ ఇంకా పై స్థాయికి ఎదగాలనుకుంటాడు. కాబట్టి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం పొందితే సహజంగా శ్రేణి పెరుగుతుందని దాని కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు.దానికవసరమయ్యే మెటిరియల్ సంపాదించి చదువుకుంటూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే చైనా పై హూణుల దాడులు అతిపెద్ద సమస్య. అప్పటికే వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చైనా మహా గోడ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అయినా హూణుల దాడులు అగలేదు. దానికి చైనా రాజు ఒక దుష్ట మార్గాన్ని కనుగొన్నాడు. చాన్ లిహ్వా లాంటి అందమైన ఆడపడుచులను, తమ ఉద్యోగస్తులూ, ట్రాన్స్ జెండర్ల సహాయంతో జల్లెడపట్టించి, వారిని దొరబొచ్చుకొని, రాణులుగా చేసుకొని, అంతఃపురానికి పశువుల్లా తోలుతారు. వారిని ఎరగా వేసి హుణులను శాంతపర్చడం చేస్తారు. అందులో లిహ్వా కూడా ఒక బలిపశువు అవుతుంది.

ఆ సందర్భంలో మధుమాయకు బానిసత్వం నుంచి విముక్తి లభించే అవకాశం వస్తుంది. లిహ్వా బాగోగులు చూసుకునే పరిచారికగా ఆమె కూడా అంతఃపురంలో చేరుతుంది. అక్కడ ఆమెకు లిహ్వాను రాణిగా ఎంపిక చేసిన ట్రాన్సెజెండర్ ఈలి పరిచయం కొంత ప్రశాంతత నిస్తుంది. ఈలి గాథ అనాటి చైనాలో సామాన్యులూ, దిగువ తరగతి వాళ్ళూ ఎంత దయనీయంగా జీవించారో అర్థం అవుతుంది. బతుకు భారమైన ఈలి అంతఃపురంలో చేరితే జీవితం బాగువడుతుంది అని ట్రాన్స్ జెండర్ మారతాడు. కానీ రాజు కోసం దుష్ట కార్యాల్లో భాగం కాక తప్పదు.

లిహ్వా అంతఃపురంలో ఎలాంటి జీవితాన్ని అనుభవించింది. చివరికి చైనా రాజ్యంపై  ఎలా కక్ష తీర్చుకున్నది చివరలో తెలుస్తుంది.

ఐదో అధ్యాయం: సగనేమి

తుషార సముదాయానికి చెందిన సగనేమి హవినేమ భార్య! భర్తను తన ఆధీనంలో ఉంచుకోగలిగిన స్వంత అస్తిత్వం ఉన్న మహిళ! బౌద్ధ మత ప్రభావంలో పడి అరణ్యంలో జీవించడానికి ఏమి లేదని, బతుకు బాగుపడాలంటే తుషార తెగ మూఢత్వం, ప్రాచీన జీవన పద్ధతుల నుండి బయటపడాలని అనుకుంటుంది.

అరణ్యం ఒదిలి బౌద్ధ గురవుల సహచర్యంలో బతకనారంభిస్తుంది. అది అక్కడితో ఆగలేదు. బౌద్ధ భిక్షువులు చైనా వైపు మతం ప్రచారినికి బయలుదేరారు. వాళ్ళతో పాటు పట్టుతోవలో ప్రయాణించడానికి సిద్ధపడిపోయింది. ఆమె ఒక సారి దేనినైనా నిర్ణయించుకుందంటే తిరుగులేదు. 

పట్టుతోవ ఎంత మొరటుదారో ఆమెకు అప్పుడు తెలియదు. పైగా ఐదేళ్ళ కొడుకు రుతునేమ ఉన్నాడు. భర్త హవినేమ మాత్రం తిరిగి అడవి దారి పట్టాలని నిర్ణయించుకున్నాడు. అడవి విడిచిన ఈ ఐదేళ్ళలో నగర జీవితం గొప్పగా అనిపించలేదు. అ జీవితంతో సర్దుబాటు చేసుకోవడం అసాధ్యం అని అడవిలో బతుకే సహజమైనదని అతడికి అనిపిస్తుంది. 

సగనేమి మీద బుద్ధమిత్ర వ్యక్తిత్వం,జీవితం గొప్ప ప్రభావాన్ని వేసాయి. సగనేమి కుటుంబాన్ని బౌద్ధ సన్యాసులు కష్టం సమయంలో ఆదుకున్నారు. ఆ కృతజ్ఞతా భావం ఆమెలో ఉంది! బుద్దమిత్ర, రుతునేమ గురుశిష్య బంధాన్ని విస్మరించగలదా? తన కుమారుడిలో లోకజ్ఞానం పెరగడానికి బౌద్ధం కారణమని ఆమెకు తెలుసు. దాన్ని విస్మరించగదా? ఐదేళ్ళ వయస్సు రుతునేమ సంస్కృతం మాట్లాడగలుగుతున్నాడు. రాయగలుగుతున్నాడు. చాలా చురుకుగా ఉన్నాడు. అలాంటి బాలుణ్ణి అడవుల పాలు చేయగలదా? ఈ ఉదాహరణలు చూపి భర్త హవినేమను ఒప్పించింది. అది ఆమెకు వెన్నెతో పెట్టిన విద్యయే! 

బౌద్ధ గురువులు, వ్యాపారకూటమితో కలిసి పట్టుతోవలోకి అడుగిడిందా చిన్న కుటుంబం. పేరు "తక్లామకాన్"! ఇక్కడే వీళ్ళకి మిత్రవందకుడు పరిచయం అయ్యాడు.అతడు అప్పటికే ముత్యాలు మణులు అమ్మే వ్యాపారిగా మారాడు. ఇప్పుడు కూడా చీనాలో గిరాకీ ఉందని అమ్మడం కోసం ఆ బృందంలో కలిసాడు. వీళ్ళందరూ కలిసి పట్టుతోవలో ముందుకు సాగారు.

ఆ మరణసముద్రం లాంటి తక్లామకాన్ ఈ బృందానికి భయంకరమైన అనుభవాన్నిచ్చింది. వీళ్ళంతా చైనా చేరారా? లేదా? లిహ్వాకు ఏమైంది? మధుమాయ చైనా నుండి బయటపడి మిత్రవిందకుడిని కలిసిందా? లిహ్వా తమ్ముడేమయ్యాడు? అతడి ప్రభుత్వ ఉద్యోగం దొరికిందా? బుద్దమిత్రను కనిష్కుడు గౌరవించినట్టు, చైనా రాజు కూడా గౌరవించాడా?
--------------------
అప్పటి చైనా సమాజంమ్మీద కన్ఫ్యూషియస్ మతం ప్రభావం బలంగా ఉంది. ఆ మత ఆచార వ్యవహారాలనూ, అది విధించే కఠినమైన విధినిషేధాల వివరం బాగా ఉంది ఈ అధ్యాయంలో. బహుశా లిబరల్ బౌద్ధం అందుకే చైనాలో పాగా వేయగలిగిందా!? అనేది ఒక అంశం అయితే బౌద్ధం కాంగ్ ఫ్యూజి (చైనా వాళ్ళు కన్ఫ్యూజనిజాన్ని అట్లా పిలిచే వారు) నుంచి కొన్ని అంశాలు స్వీకరించినట్టు తెలుస్తుంది. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి పై పాత్రలన్నీ తక్షమాకాన్ అనే చైనా ఎడారిలో కలుసుకొని అనుభవించిన కష్టాలేమిటీ? వాళ్ళు అతి భయంకరమైన ఎడారి వాతావరణాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అక్కడ హూణుల దాడులను ఏమన్నా ఎదుర్కొన్నారా? వీళ్ళతో పాటు తొవలో పయనించిన వర్తకుల వల్ల వీళ్ళేమైనా లాభం పొందారా? అనే అంశాలు తెలుస్తాయి.
--------------------
దారులు కేవలం ప్రయాణం కోసం నిర్మించబడినవి కావు, అభివృద్ధి పేరు వాటికి అద్దినా ఆ అభివృద్ధి వెనుక ఉన్న విధ్వంసానికి నకళ్ళు “తోవలు”!

శతాబ్దాలుగా మానవ సాహాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పట్టుతోవకు ఇంకా ప్రాసంగికత ఉందా?! లేదా కొత్త ముఖాటాతో అప్పటి విస్తరణ కాంక్షను చైనా ఇప్పుడు కొనసాగిస్తుంది. చరిత్ర పునరావృత్తం అవుతూ ఉందా? ఇంకా పట్టుతోవ పొడవూ వెడల్పూ పెరుగుతూ ఉందా? అప్పుడు పట్టూ పింగాణీ ఇప్పుడు ఏఏ సరుకులీ దారిలో పయనిస్తాయి. అప్పుడు బౌద్ధం సహకరించినట్టు ఇప్పుడు ఎవరి సహకారం ఉంటుంది. సోషలిజం ముసుగు ధరించిన నవీన పెట్టుబడిదారులా? అపుడు తుషార తెగ మాయమైనట్టు ఇప్పుడే తెగలు మాయమౌతాయి?

 అప్పుడది తోవ! ఇప్పుడు హై వే! దీని శక్తి ఇంకా తీవ్రమైంది! ఇంకా వేగవంతమైంది!! ఇంకా నిర్దాక్షిణ్యమైంది! లాభానికి రక్తదాహం ఎక్కువ! అది మరి శ్రమజీవుల నెత్తురు రుచిమరిగినది.

తేజో తుంగభద్ర అనే గొప్ప నవలని అందించిన వసుధేంద్ర కలం సృష్టించిన మరో ఆణిముత్యం పట్టుతోవ! తప్పకుండా చదవండి.

@అరుణతార మే నెల పత్రిక నుండి సేకరణ

No comments:

Post a Comment