Friday, July 17, 2026

 *తెలియదు నీ మనసు దేవోత్తమా..*

విశ్లేషణ :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు 

     పెదతిరుమలయ్య వినిపిస్తున్న భక్తి జాలువారే కీర్తన ఇది. స్వామీ! నేను మానవమాత్రుడను. నీవు దేవోత్తముడవు. సులభసాధ్యుడవని విని నా మసస్సు నీయందు లగ్నమైనది. నా అతి చొఱవకు, సాహసానికి నీవేమనుకొంటావో నీ మనస్సు తెలియదు. నిన్ను నా నోరారా పిలుస్తాను. నీవెక్కడున్నా నన్ను విడువక రక్షించు.

     ఓ దేవోత్తమా! నీ మనస్సెట్లుండునో నేనెఱుగను. కానీ నీవు సులభడవు (సులభముగా) అనుగ్రహించగలవాడవని విని గ్రహించి నా మనస్సు నీ యందు చొరబడినది.

1. నీ మూర్తిని అందంగా కన్నులయెదుట నేను చూడగానే ఆత్మలో దానిని (నీ రూపాన్ని) తలపోయటం అలవాటు చేసికొన్నాను. నిజానికి నీతి బద్ధంగా ఆలోచిస్తే నీవెంత ఘనుడవు. నేనెంత అల్పుడను. ఇలాంటి నా అగ్గలికెకు (విజృంభణకు) నీవేమనుకొంటున్నావో!!

2. నీవు నావాడవని నెట్టుకొని (పూనుకొని) పూజిస్తాను. పైగా భద్రంగా పెట్టెలో పెట్టుకొని చక్కగా దాచుకొంటాను. నా సాహసం యెంతటిదో చూశావా ప్రభూ! ఏ విధంగా నిన్ను మెప్పించగలను? మధ్యలో వచ్చిన వాడను. నాపై కూడా నీవు ప్రసన్నుడవై యెట్లా నవ్వుతూ వున్నాడవో!!!

3. నేను నిన్ను వినయంగా నా నోరునిండా నీపేరు పెట్టి పిలిచినాను. కాని నీవెక్కడెక్కడున్నావో? విడువక యెందున్నాడవో నేనెట్లెఱుగుదును? ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు అలమేలుమంగపతివి. శీఘ్రముగా నన్నేలితివి. నీవు యెట్టి సుకృతముతో లభించినావో కదా! 🙏🏻

No comments:

Post a Comment