Friday, July 17, 2026

 అతి చిన్న కధ : ఆత్మా వై పుత్ర నామాసి:

“ నాన్నా! ఎలా వున్నాను?” అడిగాడు మా అబ్బాయి. 
 
“ ఓయ్! అదేంటి? నా కొత్త చొక్కా నువ్వేసుకున్నావు? నిన్నటినించీ వెదుకుతున్నాను దీనికోసం.”

“ నాకు సరిపోతోంది. ఇక నించీ నీ చొక్కాలన్నీ నావే ” అంటూ బయటకి పరిగెత్తాడు. 

నా చిన్నప్పుడు ఇలాగే నేనూ నాన్న షర్ట్ వేసుకోవడం గుర్తొచ్చింది.

“అంగాదంగాత్ సంభవసి” అనుకున్నాను ఆనందంగా.

-0-0-

“నాన్నా! రిటైర్ అయ్యాక నువ్వు బాగా లావైపోయావు. బరువు కూడా బాగా పెరిగింది. నువ్వు అర్జెంట్ గా సన్నబడాలి. నేచర్ క్యూర్ ఆశ్రమం లో ఒక నెల వుండి రావచ్చుకదా. బరువూ తగ్గుతుంది. ఆరోగ్యమూ బాగుపడుతుంది ” అన్నాడు అబ్బాయి. 

“నేనూ అదే అనుకుంటున్నా. అందుకే ఈ ఆదివారం వెడుతున్నా. ఒక నెల పాటు నేను కనబడను.” అన్నాను నేను. 

-0-0-

“ ఏరా ! ఎలా వున్నాను?” అడిగాను నేను 

“ నాన్నా! నువ్వేనా?!  అదేంటి? బాగా సన్నగా అయిపోయావు. పొట్ట కూడా తగ్గిపోయింది.” ఆశ్చర్య పోయాడు అబ్బాయి. 

“అదేరా మరి ప్రకృతి వైద్య మహత్యం” అన్నాను నేను.
 
“ఓయ్! అదేంటి? నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి  నిన్న తెప్పించుకున్న T-షర్ట్ నువ్వు వేసుకున్నావు?”

“ జస్ట్ ట్రైల్ వేశాను. నాకు సరిగ్గా సరిపోయింది. ఇక నించీ నీ షర్ట్ లు అన్నీనాకే” అన్నాను నవ్వుతూ.  

“ బావుంది. చిన్నప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నావన్న మాట .   ఈ లెక్కన ఇంకో అయిదేళ్లలో నీ మనవడు, నువ్వూ కూడా నా షర్ట్ లు వాడేసుకుంటుంటే నేనేం చెయ్యాలి” అన్నాడు వాడూ నవ్వుతూ.

“ఆత్మా వై పుత్ర నామాసి:” అన్నాను  నేను ఆనందంగా.


(నండూరి బాల సుబ్రహ్మణ్యం)

No comments:

Post a Comment