Friday, July 17, 2026

 భారతీయతకు పునాది కుటుంబం. దానికి నాంది వివాహం. గౌరవప్రద హోదాను, ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టే విశిష్ట బంధం అది. దాన్ని మించిన పవిత్రత, ఆత్మీయత, స్నేహం, సంతోషం ప్రపంచంలో మరెక్కడా లభించవు.
మహాభారతంలో యక్షుడు ‘పురుషుడికి నిజమైన నేస్తం ఎవరు’ అని ధర్మజుణ్ని ప్రశ్నిస్తాడు. ‘భార్యే అసలైన స్నేహితురాలు’ అని బదులిస్తాడాయన.
ప్రేమలోని అమరత్వాన్ని, స్త్రీత్వంలోని మాతృత్వాన్ని, అంతర్యామిలోని దైవత్వాన్ని కలగలిపి కుటుంబానికి పంచిపెడుతుంది ఇల్లాలు. భర్తతో పాటు కుటుంబసభ్యులందరి అవసరాల్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నారు. ఈ జగతికి జీవనజ్యోతి ఆమె.
భర్త అంటే అర్థం ‘భరించేవాడు’ అని మాత్రమే కాదు. బాధ్యత గలవాడే భర్త. అతడు ప్రేమను కుటుంబమంతటికీ పంచుతాడు. ఆదరణ కనబరుస్తూ, అందరి పోషణ బాధ్యతా వహిస్తాడు.
వివాహం అనేది, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికే పరిమితమైనది కాదు. జీవితాన్ని ఎంచుకోవడమే వివాహం. మహాత్మాగాంధీ బోధించినట్లు- ‘అన్నింటి కంటే జీవితం ఓ చక్కని కళ. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తే గొప్ప కళావేత్త’. ప్రతి ఒక్కరి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలా ఉండాలనుకున్నప్పుడు- సంతోషం పొందడానికి కాదు, దాన్ని ఇవ్వడానికే పెళ్లి చేసుకోవాలి. సంతోషాన్ని పంచే వ్యక్తే దాన్ని తప్పక పొందగలడు.
పెళ్లిలోని ఏడడుగుల్లో- మొదటి అడుగు శారీరక శక్తికి, రెండో అడుగు మానసిక బలానికి. మూడో అడుగు- దంపతులు కలిసి బతకడానికైతే, నాలుగో అడుగు ఆయురారోగ్యాల కోసం. అయిదో అడుగు పశుసంపద కోసం, ఆరో అడుగు రుతు పవనాల సానుకూలత కోసం. ఏడో అడుగును సఖ్యత కోసం వేస్తారు. ఏడడుగులూ కలిసి నడుస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధనకే పెళ్లి. రెండు ఆత్మలూ మూడు ముడులతో ముడివడతాయి. పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి ఉండాలని; వాక్కు, అర్థంలా ఒక్కటిగా మెలగాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
అనుకూలంగా, అనుగుణంగా ఉండేదే వివాహం. అలా కుదరడం అందరి విషయంలోనూ సాధ్యం కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు దూరమవుతాయి. ఇంకా కొన్ని మిగిలి ఉంటే, వాటికి సంబంధించి వీలైనంతవరకు సర్దుకుపోవడం ఓ సుగుణం. ఆ గుణం అహంకారాన్ని దూరంగా తరుముతుంది. పరిష్కారాన్ని చేరువకు తెస్తుంది. బంధాల్ని పదిలపరుస్తుంది. ప్రేమను పంచుతుంది.
వివేకవంతులకు జీవితం ఒక పండుగ. హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలని అనుకోవడం సహజమే. అలా అనుకున్నప్పుడు ‘జీవిత భాగస్వామి తత్వమే మారాలి, తన తత్వాన్ని నేనే కచ్చితంగా మార్చితీరాలి’ అని పంతానికి పోవడంవల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. భాగస్వామి సరళిని ఏదోవిధంగా మార్చడమే పనిగా పెట్టుకోకుండా, తానే సవ్యమైన దృక్పథంతో మారగలిగితే మేలు.
వివాహ సౌధాన్ని ప్రేమ, నమ్మకం, సహనం, త్యాగం అనే పునాదులపైనే నిర్మించుకోవాలి. అప్పుడు గృహమే స్వర్గసీమగా మారుతుంది.
దైవదత్తమైనది జీవితం. దానికి వరం ప్రేమ. ఆ ప్రేమకు సంతానమే ముద్దు. అందువల్ల దాంపత్య జీవితం ముద్దుముచ్చట్లతో సాగాలి. దంపతులు నిత్య నూతనంగా, సదా సంతోషంగా జీవనయాత్ర సాగించాలి. నవ వేదంలోని ముఖ్య సూత్రం అదే!
ఓ వృద్ధజంటను వివాహ దినోత్సవ సందర్భంగా వూళ్లొవారు సన్మానించారు. వేదికమీద ఇద్దరినీ ఓ ప్రశ్న అడిగారు- ‘ఇన్నేళ్లూ మీ కాపురం ఇంత ఆనందంగా సాగడానికి కారణం ఏమిటి’ అని.
‘ఆమె నా భార్య కాదని అనుకోవడమే’ అన్నాడాయన! ‘ఆయన నా భర్త అని కలలోనైనా అనుకోలేదు’ అని బదులిచ్చిందామె! అందరూ నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం ఆగి, ‘మేమిద్దరం ప్రాణ స్నేహితులం అనుకున్నాం’ అని ఆ దంపతులు ఒకేసారి సమాధానమిచ్చారు. భారతీయ వివాహ వ్యవస్థలోని పరమార్థం అదే!

No comments:

Post a Comment