*దేవతలను తృప్తిపరచడానికి ఉత్తమమైన సాధన ఏది?*
జ : దేవతలను తృప్తిపరచడానికి సాధనము యజ్ఞమే. యజ్ఞము చేత దేవతలు తృప్తి చెందుతారు. అది ధర్మ చక్రం. దేవతలు మనకు కావలసిన సుఖ ఉపకరణములనన్నింటినీ అందిస్తారు. ప్రధానంగా వర్షం. వర్షం లేకపోతే ఏ ప్రాణీ బ్రతకదు.
మఖము జేయ వజ్రి మది సంతసించును
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురియఁ గసవు వసుమతిఁ బెరుగును
గసవు మేసి ధేనుగణము బ్రతుకు!
అంటారు భాగవతంలో. దేవతలు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది. వర్షం పడితే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే పశువులు తింటాయి. పశువులు తింటే పాలిస్తాయి. పాలిస్తే మనకు ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు ఆధారం దేవతలు. దేవతలు యజ్ఞము చేత తృప్తి చెందుతారు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన విషయం. యజ్ఞమునందు అగ్ని ముఖంగా హవిస్సులు ఇస్తారు. ‘స్వాహా’ అని శబ్దం వేస్తే దేవతలకు వెళ్తోంది అని గుర్తు. ‘స్వధా’ శబ్దం చేత పితృదేవతలకు ఇస్తారు. దేవతలు తినే పదార్థాన్ని పేరు చెప్పి స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తే హవ్యా వాహనుడై అగ్నిహోత్రుడు ఈ పదార్థాన్ని పట్టుకెళ్ళి దేవతల చేతిలో పెడతాడు. అది కాలిపోదు. కాలిపోయినట్లు కనపడుతుంది. మనం తినేశాం. ఊరికే తినేశాం అంటే తిన్నది బలం అయితే లోకానికి ఉపయోగ పడతాడు. అలాగే అగ్నిహోత్రమునందు మంత్రముద్వారా వేసినటువంటి పదార్థము దేవతలకు చెందితే దేవతలు తృప్తిపడతారు. తృప్తి పడిన దేవతలు ఐశ్వర్యమునకు కారణమైన సమస్తములనూ అనుగ్రహిస్తారు. దానివలన మనం కావలసిన సుఖ సంతోషాలను పొందుతాం. పొందితే పంట పండగానే ఒక యజ్ఞం చేసి దేవతలకు హవిస్సు ఇస్తారు. దేవతలు ప్రీతి పొందుతారు. అతి వృష్టి, అనావృష్టి లేకుండా సమవృష్టి వర్షం పడుతుంది. పంటలు పండుతాయి. పంటలు పండితే మనము, పశువులు సంతోషంగా ఉంటాయి. మళ్ళీ యజ్ఞం చేస్తాం. ఇదొక ధర్మచక్రం. ఈ ధర్మ చక్రంలో వేలు పెట్టినా, జోక్యం చేసుకున్నా, వైక్లబ్యం తీసుకువచ్చినా ఈశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. అందుకే
శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు
గోవులందు విప్రకోటియందు
ధర్మపదవియందుఁ దలిగి నాయందు వాఁ
డెన్నఁ గలుగు నాఁడె హింసఁ జెందు.
ధర్మచక్రం జోలికి వెళ్ళకూడదు. యజ్ఞాలేమిటి? యాగాలేమిటి? హవిస్సులేమిటి? అనకూడదు. తెలియకపోతే ఊరుకో. నీ మాటలు విని యజ్ఞయాగాదులు మానేస్తే దేవతలకు అందవు. ఎవరికైనా కడుపు నిండకపోతే కోపం వస్తుంది. నేనిస్తే పుచ్చుకుని నాకు పెట్టవలసినది పెట్టకపోతే నేనెందుకు వర్షం కురిపిస్తాను అని కురిపించడం మానేస్తే క్షామం వస్తుంది. క్షామం వస్తే ప్రజలు బాధపడతారు. ధర్మచక్రానికి వైక్లబ్యం వస్తుంది. ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారం సనాతన ధర్మంలో యజ్ఞమునందు ఉంటుంది. మామూలుగా ఇస్తే దేవతలు చూస్తారు కంటితో. యజ్ఞముఖంగా, అగ్ని ముఖంగా ఇచ్చినదే వాళ్ళు తింటారు. సనాతన ధర్మము నందు దేవతలు సంతోషించేది ప్రాణప్రదమైన అంగం యజ్ఞం. ఆ యజ్ఞాన్ని, యజ్ఞశాలని, యజ్ఞమునందు అగ్నిహోత్రాన్ని, యజ్ఞ నిర్వాహకుడిని యజ్ఞమునకు ప్రధాన సంబారమైన గోవుని అంత గౌరవించడానికి, కీర్తించడానికి కారణం లోక క్షేమం అంతా యజ్ఞముల మీద ఆధారపడి ఉంది. అందుకే దేవతలను ప్రీతి పొందించగలిగిన ప్రధాన సాధనం యజ్ఞమే.
🔵🔴🟢🟡🙏🟡🟢🔴🔵
No comments:
Post a Comment