Friday, July 17, 2026

 *అతి చిన్న కధ : నమ్మకం* 

“నాన్నా! నువ్వు నాకివాళ ఎలాగైనా సైకిల్ తొక్కడం నేర్పాలి.”

“సరే. ఆ సైకిల్  యిలా పట్టుకురా. సీటు మీద కూర్చో. నేను వెనకనించి పట్టుకుంటా. నువ్వు ముందుకి చూస్తూ తొక్కు. వెనక్కి మాత్రం చూడకు. ఓకే ?”

“అలాగే. మరి నువ్వు వెనకాల పట్టుకోవాలి. మధ్యలో వదిలెయ్యకూడదు. ప్రామిస్?”

“సరే. నువ్వు సీటు మీద కూర్చో. వెనక్కి చూడకు. ముందుకే చూడు. ఓకే . ఇంక పోనీ ”

“అయ్యో! పడిపోయాను. నాన్నా ఎక్కడున్నావ్ ? అంత దూరంలో వున్నావేం? అలా మధ్యలో వదిలేస్తావేం?”

“ నువ్వు మధ్యలో వెనక్కి చూశావ్. నా మాట మీద నమ్మకం పెట్టలేదు. అందుకే పడ్డావు. సరే. మళ్లీ సీటు మీద కూర్చో. నువ్వు వెనక్కి తిరిగి చూడనంతవరకు నేను పట్టుకుంటాను. వెనక్కి తిరిగితే వదిలేస్తాను. ఓకే ?”

“ ఈ సారి బాగా తొక్కుతున్నాను నాన్నా. నువ్వు పట్టుకున్నావు కదా .”

“.. .. ..”

అదేంటి?  జవాబులేదు!  గ్రౌండ్ లో ఎదురుగా ఎవరో వస్తున్నారు ? నాన్నలా వున్నాడే ? నాన్నే!!

“నాన్నా! నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది. నువ్వు పట్టుకోక పోయినా తొక్కేస్తున్నా!!”

“సరే. జాగ్రత్తగా దిగు.”

“అవునూ, నువ్వు పట్టుకోక పోయినా ఎలా తొక్కగలిగేను?”

“ నేను వెనకనించి పట్టుకుని వున్నాను అన్ననమ్మకమే నువ్వు స్వంతంగా తొక్కగలిగేలా చేసింది. అసలు నీకు సైకిలు తొక్కడం ఎప్పుడో వచ్చు. కానీ నీ మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల తొక్క లేక పోయావు. నేను చేసిందల్లా  నీ వెనక నేనున్నాననే నమ్మకం నీకు కలిగించాను. అంతే.  గురువైనా , దైవమైనా చేసే పని ఇదే. అంతా ఆ నమ్మకం మీదే ఆధారపడి వుంటుంది.”

“బావుంది నాన్నా, సైకిల్ నేర్చుకోడంలో కూడా ఇంత జ్ఞానం వుందా!”   


*(నండూరి బాల సుబ్రహ్మణ్యం)*

No comments:

Post a Comment