🌺☘️🌺☘️🌺☘️🌺
*శ్రీ రమణ మహర్షి బోధనలు*
*ఆత్మ విచారము:*
వీటనన్నిటినీ వేరు వేరుగా పరిగణింపక వారు అవి అన్నీ “నేను అనే భావానికి భిన్నరూపాలుగా చూచేవారు. పృథక్ భావమూ మనస్సూ ఒకటే, మనస్తూ అహంవృత్తి ఒకటే అని వారనేవారు. అందువల్ల, ఆత్మసాక్షాత్కారమంటే - మనస్సూ, అహంవృత్తి మాయమవటమనమాటే. ఆత్మసాక్షాత్కారమైన తరువాత ఆలోచనలు చేసే యోచకుడుగాని, పనులు చేసే కర్తగాని, వ్యక్తి యొక్క ఉనికి గురించిన ఎరుకగాని ఉండవని వారు తరచూ అనేవారు.
ఆత్మ ఒక్కటే అసలైన సత్యమనీ, "నేను" అనే భావం ఒక తప్పు భావమనీ, దానికి ఉనికి లేనేలేదనీ అనేవారు - ఏదో ఒక వస్తువుతో తాదాత్మ్యం చెందినపుడే అది ఉదయించగలదనే వారు. ఆలోచనలు ఉదయించేప్పుడు, “నేను ఆలోచిస్తాను” “నేను నమ్ముతాను” “నేను కోరుతాను" "నేను పని చేస్తున్నాను" అని అన్నప్పుడు 'నేను' అనే భావం వాటిని స్వంతం చేసుకుంటుంది. ఏదో ఒక విషయంతో ఏకత చెందనప్పుడు "నేను" అనే భావం వేరుగా ఉండదు. ఈ విధమైన తాదాత్మ్యం నిరంతరంగా సాగుతూండటం వల్ల ఆ భావం కూడ అవిచ్ఛిన్నంగా ఉన్నట్టూ, వాస్తవమైనట్టూ అనిపిస్తుంది. ఇంచుమించు ఈ తాదాత్మ్యాలన్నిటికీ మూలం 'నేను' అన్నది దేహానికి పరిమితమని అనుకోవటమే- అటే "నేను" అనేది దేహధారిగానో, దేహానికి స్వంతదారుగానో అనుకోవటమే. "నేను ఈ దేహాన్ని" అన్న భావమే ఆ తరువాత కలిగే తప్పు తాదాత్మ్యాలకు మూలకారణం. ఆత్మవిచారం యొక్క ప్రధాన లక్ష్యం దీనిని అంతమొందించటం.
ఇట్లా పరిమితం చేసుకునే తాదాత్మ్యాలని నిరోధించటం, 'నేను' అనేదాన్ని అది తాదాత్మ్యం చెందేవాటి నుండి వేరుచేయటం వల్ల సాధ్యమనేవారు శ్రీరమణ. “నేను” అనే భావం తనంతట తానుండలేదు. అందువల్ల "నేను" లేక "నేనున్నాను" పైన తీక్షణమైన దృష్టి నిలిపితే, “నేను ఇది" "నేను అది" అనే భావాలుదయించవు. అప్పుడు “నేను” అనేది ఇతర విషయాలతో పొత్తు ఏర్పర్చుకోలేదు. ఈ విధంగా నేను (ఆత్మ) పై ఏకాగ్రత నిలిపితే అహంవృత్తి పోతుంది - ఆ స్థానంలో ఆత్మానుభూతి ప్రత్యక్షంగా ' కలుగుతుంది. “నేను” “నేనున్నాను" అనే ఈ లోపలి ఎరుకనే ఆత్మవిచారమనే వారు శ్రీరమణ. “నేను అనే భావం" కేవలం కల్పితమనీ అసత్యమనీ గ్రహించటానికి ఇదే ఎంతో శ్రేష్ఠమైన, సూటియైన మార్గమని వారు బోధిస్తూండేవారు.
No comments:
Post a Comment