Friday, July 17, 2026

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచిత*
*శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము -తాత్పర్య సహిత వివరణ*
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
యోగావాశిష్ఠంలో చెప్పబడింది. ఈ నాలుగు ద్వారాల ద్వారా మనం ఈ మోక్ష సౌధానికి చేరాలి. ఈ నలుగురు ద్వారపాలకులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాలి. సగౌరవంగా ఆహ్వానించాలి. అలా నువ్వు మార్పు చెందాలి.


        కాబట్టి నమః ఇదం. ఈ నమః అన్న శబ్దంలో అంత విశేషం ఉంది. 'నమ ఇదం' అంటే అర్థం. ఈ సర్వ సృష్టి లేనిది అని తెలియబడేంత వరకు. ఎఱుక లేనిది అని తెలియబడేంత వరకు, సంకల్ప శూన్య కాలములు లేనివని తెలియబడేటంత వరకు, మండల త్రయములు లేనివని తెలియ బడేంతవరకు, బయలే సత్యమని బోధపడేటంత వరకు, నిర్ణయ మయ్యేటంత వరకు నీకు వశవర్తినై ఉంటాను. ఎవరికి? సద్గురువుకి.


        నీ శరీర ప్రాణ సంఘాతాన్ని వాడాలి అంటే, ఆ గురుమూర్తి   చెప్పినటువంటి మేరకు లోబడినటువంటిదైతేనే నేను అనుమతిస్తాను. లేకపోతే అనుమతించను. ఎందుకని? నాకు స్వేచ్ఛ లేదయ్యా బాబూ. నేనొకాయనకి దాసానుదాసుడనని ఒప్పుకున్నా. ఎవరికి? ఆ స్వామి గారికి ఒప్పుకున్నా. ఒక స్వామిని ఆశ్రయించా నేను. ఒక దేశికేంద్రుణ్ణి ఆశ్రయించాను. ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆశ్రయించాను.


        వారు ఇచ్చినటువంటి జ్ఞానపరిధి ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి వశవర్తినై వున్నా. ఎందుకని?


        'శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః' వారికి నాకు అభేదం. కాబట్టి దక్షిణామూర్తితో అభేదస్థితిని నువ్వు పొందాలి. మీ జీవిత లక్ష్యం అది. మానవ జీవిత లక్ష్యాన్ని ఎంత స్పష్టంగా బోధించాడో చూడండి. ఆ దక్షిణామూర్తితో ఎవడైతే అభేద స్థితిని పొందాడో, ఆ పరబ్రహ్మ స్థితిని పొందాడో


      'యః పరస్య మహేశ్వరః తస్య ప్రకృతిలీనస్య' ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి లీనమైపోయిన్పటికీ ఏ మహేశ్వరుడైతే మిగిలిపోయి ఉంటాడో వాడు వీడేనయ్యా. శరీరంలో ఉన్నట్లు తోస్తున్నాడు. కానీ వాడు అశరీరి. వాడు పరబ్రహ్మం. వాడు దక్షిణామూర్తి. వాడు దేశకాలములకు అతీతమైన వాడు. త్రిపుటి ద్విపుటిలకు అతీతమైనటువంటివాడు. తురీయాతీతమైనటు వంటివాడు. తానే లేనటువంటివాడు.


        'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'. అటువంటి అవతార స్థితికి నాకు అభేదం. అటువంటి సద్గురు మూర్తికి నాకు అభేదం, అటువంటి శ్రీ గురుమూర్తికి నాకు అభేదం.

       కాబట్టి శ్రీ గురువైనా, సద్గురువైనా, అవతారుడైనా నీకనుగ్రహించే టటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే 'మేల్కొలుపు'. 'స్వప్నే జాగృతి వా య ఏష పురుషః'

        మేల్కొన్నాడు. 'మాయా పరిభ్రామితః' అంతా మాయా స్వరూపం కదయ్యా. నేనెవరిని? నేను సర్వకాల సర్వావస్థలయందు కూడా ఒక్క తీరుగా ఉన్నటువంటివాడిని. శాశ్వతుడను. ఏ త్రిపుటి ద్విపుటులు లేవు నాకు.


        ఏం మిగిలిందిక? మౌనవ్యాఖ్య. ఇంకా చెప్పడానికి ఏముంది? దక్షిణా మూర్తితో కలిసిపోయావు. అభేదత. రెండు లేవు. ఒకటి కూడా లేదు. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. అటువంటి నిశ్శబ్ద బ్రహ్మమయ స్థితిలో ఇంకా బోధించడానికి ఏమన్నా మిగులుందా?
*ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment