*🙏🛕🕉️శ్రీ జగన్నాథ వైభవం!!!*
'పురుషోత్తమ క్షేత్రమని పురాణాలు వర్ణించిన దివ్య క్షేత్రం 'పురి',
శ్రీమన్నారాయణుడు జగన్నాథ నామంతో ఈ క్షేత్రాన భాసిస్తున్నాడు. మత్స్య, విష్ణు, పద్మ, స్కాంద, అగ్ని- పురాణాలలో, కపిలసంహిత, రుద్రయామళ, నీలాద్రి మహోదయ మొదలైన తంత్ర గ్రంథాలలో మహా భారతంలో ఈ క్షేత్ర మహిమను బహువిధాలుగా ప్రస్తావించారు. సృష్ట్యాది నుంచి ఉన్న అత్యంత ప్రాచీన క్షేత్రమిది- అని శాస్త్రగ్రంథాలు వర్ణిస్తు న్నాయి. ఆదిగా బ్రహ్మ దేవునకు ఈ క్షేత్రంలో నీలాచలంపై నీల మాధవుడు దర్శన మిచ్చాడు. ఇక్కడి వటవృక్షం ప్రళయకాలల్లో కూడా నశించనిది. ఒక కల్పాంతంలో జగమంతా ఏకార్ణవమైనపుడు, ఇక్కడి వటవృక్ష పత్రంపై బాలకృష్ణుడు మార్కండేయ మునికి గోచరించినట్లుగా పురాణకథ.
*పురుషోత్తమాఖ్యం సుమహత్ క్షేత్రం పరమ పావనం |*
*యత్రాస్తే దారవతనుః శ్రీశోమానుషలీలయా ।*
*దర్శనాన్ముక్తిదః సాక్షాత్ సర్వతీర్థ ఫలప్రదః ॥* (స్కాందపురాణం)
“పురుషోత్తమ నామంతో పరమపావనమైన గొప్ప మహిమకల క్షేత్రమిది. లక్ష్మీపతి విష్ణువు మానవులను అనుగ్రహించే లీలతో కఱ్ఱలతో చేసిన రూపాన్ని పొందాడు. దర్శనమాత్రం చేత సాక్షాత్తు ముక్తినీ, సర్వ తీర్థఫలాన్ని ఇచ్చే క్షేత్రమిది”.
అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు మొద లైన మహాత్ములు, మహర్షులు ఈ క్షేత్రంలో నారాయణుని సేవించుకున్నారు. అవంతీ సామ్రాజ్యాధిపతి అయిన ఇంద్ర ద్యుమ్నుడికి ధ్యానంలో దర్శనమిచ్చిన మాధవుడు, ఈ క్షేత్రంలో అతడికి ప్రత్యక్ష మయ్యాడు. నారదుని ప్రేరణతో ఇక్కడికి వచ్చిన ఇంద్రద్యుమ్నుడికి దర్శనమిచ్చిన నారాయణుడు, తన సంకల్పంతో విచ్చేసే నాలుగు దారువులను (కర్రలు) నాలుగు మూర్తులుగా విశ్వకర్మ (దేవశిల్పి) స్వయంగా మలుస్తాడని తెలియ జేశాడు. ఆ మాట ప్రకారమే సముద్ర జలాలద్వారా వచ్చిన కర్రదుంగలను విశ్వకర్మ నాలుగు దివ్య మూర్తులుగా హరి యానతి మేరకు అద్భుతంగా శిల్పించాడు.
విష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా ఆవిర్భవించారు.
పురాణాలను సమీక్షించి పరిశీలిస్తే, నీలమాధవుడు కృతయుగంలో ప్రథమ జ్యేష్ఠ మాసంలో ఆవిర్భవించాడు. శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు ద్వాపర యుగావతారులు. కలియుగారంభంలో ఇంద్రద్యుమ్నుడి ద్వారా ఈ విగ్రహాలుగా నెలకొన్నారు.
ఈ విగ్రహాల శిల్పరీతి అపురూపం. వదనప్రధాన దేవతలు వీరు. భావ ప్రకటనకు స్థానమైన వదనాలే ప్రధానంగా ఉన్న మూర్తులు. కేవలం జ్ఞానేంద్రియాలతో కూడిన వదనంతో, విశ్వంలో కర్మలన్నింటినీ నిర్వహించగలిగే శక్తిని చాటుతున్న మూర్తులివి.
మొదటగా వీటియందు ప్రతిష్ఠను నిర్వహించినది సాక్షాత్తు బ్రహ్మదేవుడే. తరువాత ఆయన విధించిన నియమాల ప్రకారం విష్ణు మహిమతో ప్రతి అధిక ఆషాఢంలో, దివ్యచిహ్నాలు కలిగిన వృక్షాల దారువులను సంగ్రహించి ఈ విగ్రహాలను మలచి, పాత విగ్రహాలలోని కళలను నూతన మూర్తులలో ప్రతిష్ఠించడం ఆనవాయితీ. ఇటు వంటి విధానం మరి ఏ క్షేత్రంలోనూ గోచరించదు.
కృతయుగ జ్యేష్ఠమాసంలో మొదటిగా విష్ణువు ఆవిర్భవించినందువల్ల ప్రతి జ్యేష్ఠ పూర్ణిమనాడు స్వామిని స్నానం చేయించి, ఏకాంతంలో ఉంచి, తిరిగి అన్ని అలంకారా లతో ఆషాఢ శుద్ధ విదియనాడు రథయాత్రను జరుపుతారు. పరమాత్ముడు స్వయంగా ప్రజలమధ్య సంచరించే ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధి చెందింది.
ఆదిలో అక్షయ వటవృక్షం వద్దనే నారదుడు నరసింహ దేవుని ప్రతిష్ఠించాడని చెబుతారు. జగన్నాథ విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడూ బ్రహ్మ దేవుడు నృసింహ మంత్రాలతోనే ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కనుక అది నృసింహ క్షేత్రం కూడా. అనంత తత్త్వానికి సంకేతమైన నల్లని వర్ణమే జగన్నాథుని వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లని చాయ. ఐశ్వర్యశక్తికి సంకేతం- సుభద్రాదేవి పసుపురంగు.
"బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు. జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేద స్వరూపం, సుదర్శనుడు అథర్వణ వేదరూపుడు"- అని బ్రహ్మదేవుడు స్వయంగా పేర్కొన్నాడు. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్త్వమే ఈ నాలుగు రూపాలు- అని దీని సారాంశం. ఎప్పటికప్పుడు తయారుచేసే మూడు దారు రథాలపై ఊరేగే వేదవేద్యుని దర్శనం ఒక దివ్యానుభూతి.
'నందిఘోష' అనే రథంపై జగన్నాథుడు, 'తాళధ్వజ' రథంపై బలభద్రుడు, 'దర్పదళన' రథంపై సుభద్రాదేవి ఊరేగే రథయాత్ర, ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలాలు.
No comments:
Post a Comment