Wednesday, July 15, 2026

 *మూడు చేపల కథ*
*(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
*సంస్కృత భారతంలో ఈ కథ శాంతిపర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉపపర్వంలో 137వ అధ్యాయంలో 24 శోకాల్లో ఉంది. ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ఈ కథకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన కథలను ధర్మరాజు భీష్ముని ప్రశ్న అడగడం, దానికి సమాధానంగా భీష్ముడు కథను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కథను భీష్ముడు ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంతతానుగా చెబుతాడు.*.             ఈ కథ చెప్పడానికి ముందు భీష్ముడు

*“అనాగతవిధాత, ప్రత్యుత్పన్నమతి అనే ఇద్దరు సుఖాన్ని పొందుతారు. దీర్హసూత్రి నశించి పోతాడు”.* దీనికి ఉదాహరణగా ఒక చక్కని కథ చెబుతాను విను అని భీష్ముడు ఈ మూడు చేపల కథను ఇలా చెబుతాడు.

ఎక్కువ లోతు లేకుండా చాలా చేపలు ఉన్న ఒక చెరువులో మూడు చేపలు స్నేహంగా జీవిస్తాం. వాటిలో ఒకటి చాలా ముందు చూపు కలది. రెండవది సమయానికి తగిన పనిచేసే తెలివితేటలు కలది. మూడవది ప్రతి పనికీ అనవసరంగా ఆలస్యం చేస్తూ ఏ నిర్ణయానికి రాలేనిది. ఇలా ఉండగా ఒకరోజు మత్స్యకారులు చెరువులో ఉన్న నీటిని తోడుతూ ఉంటారు. 

చెరువులో నీరు తగ్గిపోతుండడం గమనించిన దీర్ఘదర్శి అయిన మొదటి చేప తన ఇద్దరు మిత్రులతో ఇలా అంటుంది.

"చెరువులో నివసించే అన్ని ప్రాణులకు ఆపద వచ్చింది. తప్పించుకునే దారి చెడిపోక ముందే మనం ఇక్కడి నుంచి మరొక చోటుకి వెళదాం. రాబోయే కీడును ముందుగానే పసిగట్టి ఉపాయంతో తొలగించుకునే వానికి ప్రాణ భయం ఉండదు కాబట్టి మనం మరొక చెరువుకు పోదాము” 

దాని మాటలను విని దీర్ఘసూత్రం "నీవు చెప్పించి బాగానే ఉంది. కానీ మనం అంత తొందరపడ వలసిన అవసరం లేదని నా దృఢ నిశ్చయం” అని అంటుంది.

ఆ తర్వాత దీర్ఘదర్శితో ప్రాప్తకాలజ్ఞం “సమయం వచ్చినప్పుడు నా బుద్ధికి తగిన యుక్తి తోస్తుంది ” అని పలుకుతుంది.

ఈ మాటలను విని దీర్ఘదర్శి ఒక సన్నని నీరు దారిలో ఒక పెద్ద మడుగులోకి చేరుతుంది. 

ఆ తర్వాత చెరువులో నీరు తగ్గిపోవడంతో జాలరులు అనేక విధాలుగా అందులోని చేపలను పట్టుకుంటారు. మిగిలిన వాటిలో చేపలతోపాటు దీర్ఘసూత్రం కూడా ఉంటుంది. 

ప్రాప్తకాలజ్ఞం వలతాడును నోటితో పట్టుకొని వలలో చిక్కినట్లుగా కనిపిస్తుంది. తర్వాత జాలరులు పక్కన ఉన్న పెద్ద చెరువులో చేపలు ఉన్న వలను ముంచి కడుగుతున్నప్పుడు ప్రాప్తకాలజ్ఞం తాడును వదలి నీటిలోకి జారుతుంది.

తెలివిలేని దీర్గసూత్రం జాలరులకు చిక్కి చచ్చిపోతుంది. 

ఈ విధంగా ప్రాణం మీదికి వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రం లాగా అప్పటికప్పుడే నశిస్తాడు. 

నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినపుడు ఆలోచించుకోవచ్చు అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్తకాలజ్ఞుని లాగా ప్రాణసంకటంలో చిక్కుకుంటాడు. 

రాబోయే ఆపదను ముందే ఊహించి జాగ్రత్తపడే వాడు దీర్ఘదర్శిలా సుఖంగా ఉంటాడు. అని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది.

*ఈ కథ ప్రాథమిక స్థాయి తరగతుల తెలుగు పాఠ్యాంశంలో గతంలో ఉండేది. అయితే ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలామందికి తెలియదు.* *ఈ కథ దీర్గదర్శి లాగా రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయట పడాలనే నీతిని తెలుపుతూ ఉంది. ఈ పద్ధతి ఉత్తమమైంది.* *ఎలాంటి భయం ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో బైట పడడం మధ్యమం.* *ఈ పద్ధతిలో అపాయం నుంచి బైటపడే వరకు ప్రాణాలు అరచేతిలో చిక్కబట్టు కోవాలి. అపాయం నుంచి తప్పించు కోవడానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు. అందువల్ల దాని కంటే మొదట పద్దతే ఉత్తమమైంది. ఒక వేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతి పాటించకపోతే ప్రాప్తకాలజ్ఞుని లాగా రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి.* *ఈ రెండు పద్ధతులు పాటింపని సోమరి దీర్షసూత్రుని లాగా చనిపోవలసి వస్తుందనే చక్కని నీతిని ఈకథ తెలుపుతూ ఉంది.*

No comments:

Post a Comment