*చైనీస్ రాశిచక్రం (చైనా జానపద కథలు)*
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
***********************
తెలుగు రాశి చక్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నట్లే చైనీస్ రాశి చక్రంలోనూ పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశులను పన్నెండు జంతువుల పేర్లతో పిలుస్తారు. మరి ఈ జంతువుల పేర్లలో దేని పేరు ముందు, దేని పేరు తర్వాత అని ఎలా నిర్ణయించారో చెప్పడానికి అక్కడ ఒక ప్రసిద్ధ జానపద కథ ఉంది. ఆ సరదా కథ ఇప్పుడు విందాం.
స్వర్గలోకానికి మనం ఇంద్రుడు అధిపతి అని నమ్మినట్లే చైనాలో జేడ్ చక్రవర్తి అధిపతి అని వాళ్ళు నమ్ముతారు. అతనికి ఒకసారి కాలాన్ని కొలవడానికి ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది అనిపించింది. దాంతో బాగా ఆలోచించి మొత్తం సంవత్సరాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాలి అనుకున్నాడు. కానీ దేని పేరు ముందు పెట్టాలి, దేని పేరు తర్వాత పెట్టాలి అనే విషయంలో పెద్ద చిక్కు ఎదురైంది. నా పేరు ముందంటే నా పేరు ముందంటూ జంతువులు, పక్షులు గొడవ పడసాగాయి. దాంతో బాగా ఆలోచించి తన పుట్టినరోజున జంతువులను అన్నింటిని ఒక నది ఒడ్డుకు పిలిపించాడు. ఆ నది చాలా పెద్దగా ఉండి మధ్యలో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. "ప్రియమైన మిత్రులారా... మీరందరూ నాకు కావలసిన వారే. కాబట్టి ఎవరికి నేను అన్యాయం చేయను. మీలో ఎవరైతే ముందుగా ఇవతలి ఒడ్డునుంచి అవతలి ఒడ్డుకు చేరుకుంటారో వాళ్ళ పేర్లు వరుసగా పన్నెండు రాశులకు పెట్టాలి అనుకుంటున్నాను. మీరు సిద్ధమేనా" అన్నాడు. అన్నీ 'సిద్ధమే' అన్నాయి. "సరే... నేను అవతలి ఒడ్డున మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. సరిగ్గా పది గంటలకు మీరు పందాన్ని ప్రారంభించండి" అని చెప్పి వెళ్లిపోయాడు.
ఎలుక, పిల్లి మంచి స్నేహితులు. కానీ వాటికి ఈత సరిగా రాదు. దాంతో 'ఏం చేయాలబ్బా' అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఎద్దు కనపడింది. అది చాలా బలంగా, ఉత్సాహంగా, మంచి వయసులో ఉంది. దాని దగ్గరికి పోయి "ఓ ఎద్దుమామా... మాకు ఈతరాదు. దయచేసి మా ఇద్దరినీ నీతో పాటు నది అవతలికి దాటించగలవా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము" అని వినయంగా వేడుకున్నాయి. ఎద్దు ఆ మాటలకు కరిగిపోయింది. "దానిదేముంది మిత్రులారా... మీది పెద్ద బరువేమీ కాదు. నామీద ఎక్కి కూర్చొని గట్టిగా పట్టుకోండి" అని చెప్పింది. రెండు సరేనని దాని వీపు పైకి ఎక్కి గట్టిగా పట్టుకుని కూర్చున్నాయి.
పందెం మొదలవగానే ఎద్దు నీళ్లలో సర్రున బాణం లెక్క దూసుకుపోసాగింది. మిగతా జంతువులను అన్నింటినీ అతి సులభంగా దాటేసింది. ఎలుక చూడ్డానికి చిన్నగా అమాయకంగా ఉంటుంది గానీ దాని బుర్ర నిండా దొంగ ఉపాయాలే. ఎలాగైనాసరే రాశి చక్రంలో అన్నింటికన్నా ముందు తన పేరే ఉండాలి అనుకుంది. 'ఏం చేయాలబ్బా' అని ఆలోచించసాగింది. చుట్టూ దరిదాపుల్లో ఏ జంతువు లేదు. ఉండేది తాము ముగ్గురమే. దాంతో నది మధ్యలో నీళ్లు బాగా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఛటుక్కున పిల్లిని నీళ్లలోకి తోసేసింది. దాంతో పాపం అది నీళ్లలో పడి కొట్టుకపోయింది. ఇక మిగిలింది ఎద్దు, ఎలుకలే.
ఎద్దు నదిని దాటి ఒడ్డుకు చేరుకునే సమయంలో ఎలుక దాని వీపు మీదనుంచి ఉరుక్కుంటూ తలమీదకు వచ్చి అక్కడినుంచి తన బలమంతా ఉపయోగించి ఎగిరి ఎద్దు కన్నా ముందు ఒడ్డుకు దుంకింది. కళ్ళు మూసి తెరిచేలోగా రాజును చేరుకుంది. అది చూసి ఎద్దుకు నోట మాట రాలేదు. అన్నిటికన్నా ముందు రాజును చేరింది ఎలకనే కాబట్టి రాజు మొదటి రాశికి ఎలుక పేరే పెట్టాడు. రెండవ రాశికి ఎద్దు పేరు పెట్టాడు.
ఆ తరువాత వంతు పెద్దపులిది. తన బరువైన శరీరంతో పెద్దపెద్ద అంగలు వేస్తూ నీళ్లలో ఈదడం మొదలుపెట్టింది. నది మధ్యలోకి వచ్చేసరికి ఆ ప్రవాహానికి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అలలు ఎగిరెగిరి పడతా వున్నాయి. అయినా అలాగే అది పట్టు వదలకుండా మునుగుతా తేలుతా ఆఖరికి అవతలి ఒడ్డుకు చేరుకుంది. దాంతో చక్రవర్తి మూడవ రాశికి పులి పేరు పెట్టాడు.
కుందేలుకు ఆ నదిని ఎలా దాటాలో అర్థం కాలేదు. దానికి నదిలో వేగంగా ఈదేంత బలం లేదు. దాంతో బాగా ఆలోచించి నీటి ప్రవాహం తక్కువగా ఉన్న చోటు వెతుక్కుంటా ఒడ్డు వెంబడే పోయింది. నీళ్లలో అక్కడక్కడ ఉన్న రాళ్ల మీద గెంతుకుంటూ మధ్య వరకు చేరుకుంది. అక్కడ ప్రవాహం వేగంగా ఉంది. ఎలా దాటాలబ్బా అని ఎదురుచూస్తూ ఉంటే కొంచెం సేపటికి ఒక పెద్ద చెట్టుమొద్దు నీటిపై తేలుతూ వచ్చింది. ఎగిరి దాని మీద కూర్చుంది. నెమ్మదిగా దాని సహాయంతో అవతలి ఒడ్డుకు చేరి వేగంగా రాజును చేరుకుంది. రాజు దాని తెలివిని మెచ్చుకొని నాలుగవ రాశికి కుందేలు పేరు పెట్టాడు.
అంతలో డ్రాగన్ ఆకాశంలోనుంచి అక్కడికి సర్రున దూసుకు వచ్చింది. దాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అసలు ఈ అడవిలోని జంతువులన్నింటిలోనూ అత్యంత బలమైనదానివి, నీటిలోనూ ఆకాశంలోనూ ఎగరగలదానివి, కళ్ళు మూసి తెరిచేంతలోగా నదిని దాటగలిగినదానివి నువ్వు మాత్రమే. అలాంటిది ఇంత ఆలస్యంగా రావడమేమిటి. అందరికన్నా ముందు నువ్వే వస్తావు అనుకున్నానే" అన్నాడు. దానికి డ్రాగన్ చిరునవ్వు నవ్వి "మనం ఎప్పుడూ మన గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎట్లా... పక్కనే ఉన్న ఒక పల్లెటూరిలో ప్రజలు వానలు లేక అల్లాడిపోతూ తమను కాపాడమని నన్ను వేడుకున్నారు. దాంతో వాన కురిపించడానికి మేఘాల్ని తీసుకుపోవాల్సి వచ్చింది. తిరిగి వస్తావుంటే ఈ కుందేలు చెట్టు మొద్దుపై కూర్చుని నదిని దాటడానికి కిందామీదా పడుతూ కనిపించింది. దాంతో గాలిని బలంగా ఊది ఆ కుందేలును నది దాటేటట్లు చేసి ఆ తర్వాత నేను వచ్చాను" అంది.
ఆ మాటలు విన్న రాజు "నిజమైన సేవ అంటే మీదే. తన గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించని ఈ లోకంలో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. కుందేలు తర్వాత మీ పేరు పెడుతున్నా" అంటూ వినయంగా డ్రాగన్ పేరు ఐదవ రాశికి పెట్టాడు.
అంతలో రాజుకు గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. "ఓహో గుర్రం వస్తున్నట్లుంది. ఇక ఆరవరాశికి దాని పేరు పెట్టవచ్చు" అనుకున్నాడు. గుర్రం రాజు దగ్గరికి వస్తున్నంతలో అనుకోకుండా అంతవరకు దాని ముందు కాలుకు చుట్టుకొని కదలకుండా మెదలకుండా గమ్మున వున్న ఒక పాము బస్సుమంటూ ఎగిరి ముందుకు దూకింది. ఊహించని విధంగా పాము కనపడడంతో గుర్రం భయపడి కంగారులో పక్కకు ఉరికింది. దాంతో పాము వేగంగా సర్రున పాకుతూ రాజును చేరింది. ఆ తరువాత గుర్రం వచ్చింది. దాంతో రాజు ఆరవ రాశికి పాము పేరు, ఏడవ రాశికి గుర్రం పేరు పెట్టాడు.
కాసేపటికి మేక, కోతి, కోడిపుంజు మూడు కలసి నవ్వుకుంటూ ఒక తెప్ప మీద అక్కడికి చేరుకున్నాయి. వాటిని చూసి రాజు "అరే మీరు ముగ్గురూ కలసి ఒకేసారి ఒకే సమయంలో వచ్చారే. మరి ఎవరి పేరు ముందు పెట్టాల" అన్నాడు. దానికి ఆ మూడు నవ్వేసి "మేము ముగ్గురం కలసి తెప్పను తయారు చేశాం. ముగ్గురం కలసి కష్టపడి నదిని దాటి వచ్చాం. ఎవరి పేరు ముందుపెట్టినా, ఎవరి పేరు వెనుక పెట్టినా పరవాలేదు. మేము ఏమీ అనుకోము" అన్నాయి.
దాంతో రాజు "శభాష్ అదీ మాటంటే. ఇదీ కలసి నడవడం అంటే. మీ మీ ఆకారాలను బట్టి పెద్దదాన్ని ముందు చిన్నదాన్ని తర్వాత పెడతాను" అంటూ వాటిని మెచ్చుకొని మేక పేరు ఎనిమిదవ రాశికి, కోతి పేరు తొమ్మిదవ రాశికి, కోడిపుంజు పేరు పదవ రాశికి పెట్టాడు.
అంతలో అక్కడికి నెమ్మదిగా ఈదుకుంటూ కుక్క వచ్చింది. దానిని చూసి రాజు ఆశ్చర్యంగా "అదేంది మిత్రమా ఈ అడవిలో సులభంగా నదిలో ఈత కొట్టగలవాటిలో నీవూ ఒకదానివి. ఎంత వేగంగా నది ప్రవహిస్తున్నా నవ్వుకుంటూ దాటేయగలవు. అలాంటిది ఇంత ఆలస్యంగా వచ్చావే" అన్నాడు. ఆ మాటలకు కుక్క నవ్వి "ఈ నదిలో నీళ్లు చూశారా ఎంత తేటగా ఉన్నాయో. అడుగున ఉన్న ఇసుక, రాళ్లు, గవ్వలు అన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాంతో సరదాగా స్నానం చేయాలని మధ్యలోనే ఆగిపోయి ఈతలో మైమరిచిపోయాను. అందుకే ఆలస్యం అయింది" అంది. రాజు 'సరే' అని పదకొండవ రాశికి కుక్క పేరు పెట్టాడు.
ఇక మిగిలింది ఒకే ఒక రాశి. ఎవరు వస్తారా అని ఎదురు చూడసాగాడు. ఎంతసేపున్నా ఎవరూ రాలేదు. "ఇంక ఎవరూ వచ్చేటట్టు లేరు. ఆ ఒక్క రాశి మిగిలి పోయేటట్లు ఉంది" అనుకున్నాడు రాజు. అంతలోనే అతనికి గుర్రుమని ఒక అరుపు వినిపించింది. 'ఏమొస్తుందబ్బా' అని అటువైపు చూశాడు. ఒక అడవిపంది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వచ్చింది. దానిని చూసి రాజు "అదేంది మిత్రమా ఇంత ఆలస్యమైంది. ఇంక ఎవరూ రారనుకున్నానే" అన్నాడు.
దానికి అడవిపంది సిగ్గుపడుతూ "మహారాజా మన్నించండి. దారిలో ఆకలైతే కడుపునిండా తిన్నాను. సగం దూరం వచ్చేసరికి అలసిపోయి నిద్ర ముంచుకు వచ్చింది. దాంతో కాసేపు పడుకుని వచ్చా" అంది. "సరే... సరే... మొత్తానికి వచ్చావు. మిగిలిన అందరికన్నా నీవే అదృష్టవంతురాలివి" అంటూ చివరి రాశికి అడవిపంది పేరు పెట్టాడు.
అలా చైనీస్ రాశిచక్రంలో పన్నెండు రాశులకు పన్నెండు పేర్లు పెట్టడం పూర్తయింది.
ఆ తర్వాత చాలాసేపటికి అక్కడికి కిందా మీద పడుతూ పిల్లి వచ్చింది. కానీ అప్పటికే అన్ని రాశులకు పేర్లు పెట్టేయడంతో పిల్లికి అవకాశం దక్కలేదు. దాంతో తనని నీళ్లలో తోసేసి రాశిచక్రంలో అవకాశం లేకుండా చేసిన ఎలుక మీద పిల్లికి కోపం ముంచుకు వచ్చింది. అందుకే అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలుక కనపడితే చాలు వెంటబడి తరమడం మొదలుపెట్టింది
**********************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
***********************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment