Wednesday, July 15, 2026

 అసత్యభయం .
సత్యాత్ న ప్రమదితవ్యమ్ అనే వేదవాక్యం పలికిపలికి ఋషులకూ వినివిని మనకూ ఒంటబట్టింది .

ఒక్క సత్యవాక్యంతో నూరు యజ్ణాలూ నూరుమంది సత్పుత్రులూ సాటిరారంటుంది మహాభారతం.

అసత్యం పలికితే పుణ్యలోకాలలో సుఖంగా ఉన్న పితరులూ అథోగతి చెందుతారు అంటుంది శకుంతల. .

క్షత్రవరుడైన విశ్వా

మిత్రునకుఁ బవిత్రయైన మేనకకున్ స

త్పుత్రినయి బొంకువలుకగ

ధాత్రీతలనాథ! యింత ధర్మీతరనే — అంటుందామె.

ఇపుడు మన చదువుల్లో విమర్శ దృష్టి ఎక్కువ.

గణపతిని అక్షరం అక్షరం అర్థం చేసుకొంటూ వ్రాయాలి అని ఆదేశించాడట వేదవ్యాసమహర్షి. అంటే ఎక్కడా ఒక్క తప్పు గూడా రాగూడదు. సత్యమే లిఖింపబడాలి అని ఆయన అభిమతం.

మన దృష్టికి తప్పు అనిపించింది అడిగేయాలి— అని ఇప్పటి మన ప్రబోధ.

ఒక రోజు ఒక పండితుడు ధర్మ రాజు మీద మాట్లాడుతూ కోపంగా —

"ఎవరినీ అడగడు. అన్నీ సొంత నిర్ణయాలు చేస్తాడు. తమ్ముళ్ళు నోరు తెరవలేక ఒప్పుకుంటారు".. అని.

తనకంటే తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు అడగాలి. అన్ని సందర్భాలలో పెద్దవాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం చేస్తే చిన్నవాళ్లు అనుసరించాలి.

సభాపర్వంలో భీష్ముణ్ణి ఎవరు అగ్రతాంబూలానికి అర్హుడో చెప్పండి —అని అడిగాడు గదా!

ఇంకొక ప్రొఫెసర్ "అర్జునుడు మేలు చాలా దిగులుపడ్డాడు బంధువులు ఈ యుద్ధం వల్ల మరణిస్తారు గదా " అని. ఆ ధర్మరాజుకు ఎంతసేపూ సింహాసనం ఎక్కవలె అనే ఆశే. ఎందరు చచ్చినా దిగుల్లేదు… అంటాడు .

మరొక ప్రొఫెసర్ నేను విదురుడి మీద ఎం ఫిల్ చేస్తున్నపుడు తటస్థపడి ఉచిత సలహా ఇచ్చాడు.

విదురుడు పంచమాంగదళం వంటివాడు. తిన్న ఇంటికి వాసాలు లెక్కపెట్టే రకం. కౌరవుల వైపు ఉండి వాళ్ల ఉప్పుతిని వాళ్లకే ఎసరుపెట్టాడు అని వ్రాయమన్నాడు.

జాషువా భారతవీరులు అనే ఖండికలో వ్యాసమహర్షిని ప్రశ్నించాడు. తాతా! నీకు ఆ పాండవుల్లో తప్పులు కనబడలేదా! కౌరవులేనా అన్ని తప్పులూ చేసిన వాళ్ళు? అని. .

దీపాల పిచ్చయ్య శాస్త్రి ద్రోణప్రశస్తి వ్రాస్తూ

తాత స్వయంగా వాళ్ళ జీవితాలు దగ్గర ఉండి చూచినవాడు నా మనవళ్ళలో వీళ్ళు మంచి వాళ్ళు.. వీళ్ళు కాదు. వంశం అంతా నాశనం చేశారు అని చెబుతూ ఉంటే ఇతరులు "కాదు కాదు" అనడం

ఇంటి యజమాని ఈ గేదె వట్టి పోయింది అంటే కాదు కాదు పెద్ద పొదుగుతో చక్కగా ఉంది. దండిగా పాలిస్తుంది అని దారిన పోయేవాడు అన్నట్టుంది అని చమత్కరించాడు.

ఇరావతీ కార్వే జగద్విఖ్యాతురాలు. ఆమె వ్రాసింది:— విదురుడికి కుంతికీ యోగసంబంధం వల్ల ధర్మరాజు పుట్టి ఉండవచ్చు (* యుగాంత * అనే ఆమె పుస్తకంలో)

వ్యాసుడు చెప్పింది తప్పన్నమాట.

***

రచయిత హృదయం యథాతథంగా తెలుసుకొని ఆవిష్కరించడమే గొప్పవిమర్శ లక్షణం అని చెప్పారు విజ్ఞులు .

ఒకసారి మా మిత్రుడు పాండురంగ, నేనూ బ్రహ్మంగారి మఠానికి పోయాము. అతడు డాక్టరేట్ చేస్తున్న సమయం. ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి .(1988లో)

అక్కడికి కొండవీటి వెంకటకవి వచ్చాడు. ఆయనతో తన సిద్ధాంత వ్యాసం గురించి చర్చించాడు మా మిత్రుడు.

" ఆ తత్వాలు నేటి భాషకు అందవు. నీవు రోజూ కొంచెం సేపు ఏకాగ్రతతో బ్రహ్మం గారిని ధ్యానం చెయ్. నీకే స్ఫురిస్తాయి ఆయన చెప్పిన విషయాల లోతులు"— అని చెప్పారు ఆయన.

ఏదైనా గ్రంథం చదివేటప్పుడు ఆ కవినీ , మంత్రం ఉచ్చరించడం లో అది ఇచ్చిన ఋషినీ మునుముందు స్మరించుకోవడం సంప్రదాయం. అపుడా మహాత్ముల దయ మనపై ప్రసరించి మన బుద్ధి ప్రచోదనం చెంది తత్వం బోధపడుతుంది.

పోతన గూడా భాగవతతత్వం తనకు ఎరుకపడడానికి *భావాంబరవీథి విశ్రుత విహారిణి నన్ దయజూడు భారతీ!* అని వేడుకొని రచన ఆరంభిస్తాడు..

ఇపుడు మనదంతా రివర్స్..

దీన్ని గురించి మాట్లాడుకోవడం కేవలం కాలహరణమే.

No comments:

Post a Comment