*అరిషడ్వర్గాలు...*
*వాటి పర్యవసానాలు...*
మనిషి మనుగడకు, మనిషి ఎదుగుదలకు, మనిషి అభివృద్ధికి అడ్డు పడే శత్రువులు,
మనిషి దుఃఖాలకు మూల కారణాలు 'అరిషడ్వర్గాలు'. మనిషి మనసును, చెట్టుకు పట్టిన చెదలా పీల్చి పిప్పి చేసేవి 'అరిషడ్వర్గాలు'. ఈ అరిషడ్వర్గాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. అసలు ఏమిటి ఈ 'అరిషడ్వర్గాలు'
"కామ, క్రోధ, లోభ, మోహ, మధ మరియు మాత్సర్యం" అనే ఆరు వర్గాలే (శత్రువులు) ఈ అరిషడ్వర్గాలు'.
మనిషి అభివృద్ధికి అడ్డు పడే, మనిషి దుఃఖాలకు మూల కారణమయ్యే ఈ 'అరిషడ్వర్గాలు' ఏమిటో వివరంగా చూద్దాం :
*కామం* :
కామం అంటే వివిధ రకాల శారీరక, మానసిక కోరికలు కలిగి ఉండటం. కామం మనిషికి ఒక శత్రువు లాంటిది. మనిషి వివిధ రకాల కోరికలు కలిగి ఉండటం వలన, విచక్షణ కోల్పోయి చేసే పనుల వలన మనిషి మనుగడకు, మనిషి ఎదుగుదలకు, మనిషి అభివృద్ధికి అడ్డుపడి, మనిషి దుఃఖాలకు మూలకారణమవుతుంది. ఉదా : కామంతో కీచకుడు తనకు తానే వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. కీచకుడు ఎవరో కాదు, విరాట మహారాజు బావమరిది. విరాట మహారాజు బావమరిది ననే అహంకారంతో, తనను కూడా లెక్క చేయకుండా, అనేకమైన కీచక పనులు, ఆకృత్యాలు చేసేవాడు. అజ్ఞ్యాత వాస సమయంలో, విరాట మహారాజు ఇంట, సతీసమేతంగా పంచ పాండవులు కొలువుదీరుతారు. అప్పుడు ఈ కీచకుడు ద్రౌపతిని చెరపట్టేందుకు ప్రయత్నిస్తాడు. తెలివిగా ద్రౌపతి నర్తనశాలకు రమ్మంటుంది. అక్కడ నల్లటి ముసుగులో వున్న భీముడు, భయంకరమైన పిడిగుద్దులతో కామంతో ఊగిపోయే కీచకుణ్ణి హతమారుస్తాడు.
*క్రోధం* :
క్రోధం అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని కల్గి ఉండటం. అనుకున్న పనులు కాలేదని, తన మాట చెల్లలేదని, పని వత్తిడి పెరిగిందని, దానికి కారణం ఎదుటి వారేనని వారిపై కోపాన్ని ప్రదర్శించడం, కక్ష పెంచు కోవడం మొదలగునవి. కోపం లో, ఆవేశం లో తీసుకునే ఏ నిర్ణయం కూడా నష్ట పరుస్తుందే కాని విజయాన్ని చేకూర్చదు. క్రోధం మనిషికి ఒక శత్రువు లాంటిది. క్రోధం కలిగి ఉండటం వలన, విచక్షణ కోల్పోయి చేసే పనుల వలన మనిషి మనుగడకు, మనిషి ఎదుగుదలకు, మనిషి అభివృద్ధికి అడ్డుపడి, మనిషి దుఃఖాలకు మూల కారణమవుతుంది. ఉదా : శ్రీ మహావిష్ట్నువు మీద క్రోధం వలన హిరణ్యకశ్యపుడు, తన కొడుకు ప్రహల్లాదుడు నిరంతరం హరినామ స్మరణం చేయడం తట్టుకోలేక, కన్న కొడుకని కూడా చూడకుండా, అత్యంత కఠినమైన శిక్షలు పెడుతాడు. ఐనను ప్రహల్లాదుడు హరి నామ స్మరణ మానడు. "ఎక్కడరా నీ హరి, ఈ స్థంభం లో చూపమనగా ", "ఇందు గల డందు లేడన వలదు, ఎందెందు వెతికినా నందు గలడు హరి" అంటాడు ప్రహల్లాదుడు. వెంటనే అదే స్తంభాన్ని చీల్చుకుని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వచ్చి, హిరణ్యకస్యపున్ని హతమారుస్తాడు.
*లోభం* :
లోభమంటే పిసినారి తనం. తాను సంపాదించింది తనకు తప్పా ఇతరులకు చెందకూడదు అని అనుకోవడం. ఈ లోభత్వం గల కొందరు తాము తినరు, ఇతరులను తిననివ్వరు. చివరికి అది, దొంగల పాలో లేక భూమి పాలో కాక తప్పదు. లోభం మనిషి ఎదుగుదలకు, దేశ అభివృద్దికి ఒక శత్రువు లాంటిది. ఉదా : ద్రుతరాసష్ట్రుడికి లోభం ఎక్కువ. దేశ సంపద అంతా తన కొడుకులైన దుర్యోధనాది నూరుగురు కౌరవులకే దక్కాలి గాని, పాండవులకు సూది మొన భూమి కూడా చెందకూడదని ఎత్తులు వేసి, ఓడించి, వారిని అరణ్య వాసం పంపిస్తాడు. కాని చివరికి పాండవుల చేతిలో లోభులైన, క్రూరులైన, హీనులైన కౌరవులు, అత్యంత ఘోరంగా మరణిస్తారు.
*మోహం* :
మోహమంటే అత్యధిక కోరికలు కలిగి ఉండటం. అత్యధికంగా వ్యామోహం కలిగి ఉండటం. అభిమానం పెంచుకోవడం. తాను కోరుకున్నది తనకే చెందాలి తప్పా ఇతరులకు చెందకూడదు అనే గట్టి భావన కలిగి ఉండటం. దానినే ఇతరులు పొందితే తట్టుకోలేక పోవడం. అనుకున్న కోరిక తీరక పోతే మానసికంగా క్రుంగిపోతారు. మోహం మనిషికి ఒక శత్రువు లాంటిది. ఉదా : కన్న కొడకు పై వ్యామోహంతో, కైకేయి, రాముడిని కాకుండా, భరతునికే పట్టాభిషేకం చేయాలని కోరగా, మాట తప్పని దశరథ మహారాజు రాజు, రాముడిని 14 సంవత్సరాలు అరణ్య వాసానికి పంపడం, ఆ తరువాత సీతా మాత, శ్రీ రాముడు ఎదుర్కొన్న శారీరక మానసిక బాధలు వర్ణనాతీతం. చివరికి సీత అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. భరతుడు రాజ్యాధికారం ఒప్పుకోలేదు. అలానే ద్రుతరాష్ట్రుడు కూడా తన కొడుకులైన కౌరువలపై వాళ్ళ మాలిన వ్యామోహం వలన, వారిని సక్రమ మార్గం లో పెంచక సర్వాన్ని కోల్పోతాడు.
*మదం* :
మదమనగా గర్వం. గాంభీర్యాన్ని ప్రదర్శించడం. గొప్పలకు పోవడం. అంతా నా వల్లనే జరిగింది, ఇది నా వల్లనే సాధ్యం. నేను లేకపోతే ఇది జరిగేది కాదు అని తమకు తామే జబ్బలు చరుచు కోవడం.
ఎదుటి వారిని లెక్కచేయక పోవడం, కించ పరుచడం, దూషించడం, చిన్న చూపు చూడటం. మధం మనిషికి ఒక శత్రువు లాంటిది. ఉదా : మధం తోటి, లంకాధి పతి రావణా సురుడు, తన మాయలతో బంగారు జింకను సృష్టించి, శ్రీ రాముడిని, లక్ష్మణుడిని అటు వైపు మళ్ళించి, మారు వేషంలో బిక్షాటనకు వచ్చి, శ్రీ రాముడు గీసిన గీతను కూడా దాటి వచ్చి బిక్షం వేయాలని ఒప్పించి, సీతను అపహరించి, లంకలో బంధిస్తాడు.
హనుమంతుడు లంకకు నిప్పు పెట్టినా లెక్కచేయడు, వద్దని వారించిన తమ్ముడు విభీషణుడిని తరిమి కొడుతాడు. శ్రీరాముడుతో తలపడి సర్వాన్ని కోల్పోతాడు. చివరికి శ్రీ రాముడి చేతిలో తానూ హతుడయ్యాడు.
*మాత్సర్యం* :
మాత్సర్యం అనగా అసూయ, ఈర్ష్య, ద్వేషం. సిరి సంపదలన్నీ తనకే దక్కాలి గాని, ఇతరులకు దక్కకూడదు అనే భావన, ఆలోచన కలిగి ఉండటం. ఇతరులు ఇండ్లు కట్టుకుంటే చూసి ఈర్ష్య పడటం, ఇతరులు బట్టలు కొనుక్కుంటే చూసి అసూయ పడటం, ఇతరుల ఇంట్ల పెండిండ్లు అవుతుంటే ఏడవడం మొదలగునవి గా చెప్పుకోవచ్చు. ఉదా : పాండవుల ఎదుగుదలను జీర్నిచుకోలేని దుర్యోధుని మామ ' శకుని 'ఈర్ష్యతో, వారిని ఎలాగో ఓడించాలని మోసపూరిత పాచికలు వేసి, ఓడించి పాండవులను 12 సంవత్సరాలు అరణ్య వాసం 1 సంవత్సరం అజ్ఞ్యాతవాసం పాలు చేస్తారు.
ఈ అరిషడ్వర్గాలు మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా సాంఘీక పరంగా, సామాజిక పరంగా అదః పాతాళ లోకానికి త్రొక్కేస్తాయి. అందుకని వీటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి గాని, వాటి అదుపులోకి మనం పోకూడదు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment