*_1.హిరణ్యకశపుడు మంచి తండ్రి!_*
=================
_ఔనా..! నిజమా..! అదెలాగో తెలియాలంటే చదవాల్సిందే...._
_(ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకం... వేణుభగవాన్ గారి *అమ్మ.. నాన్న.. ఓ జీనియస్!* ఈరోజు ఇందులోని కొన్ని విషయాలు మీకోసం...)_
=================
_['“గమనం' అనే నా మిత్రుడు, మోటివేటర్.. తన *మంచి తల్లిదండ్రులు మీరే* అనే పుస్తకంలో -హిరణ్యకశపుడు మంచి తండ్రి- అని రాశారు." –వేణుభగవాన్]_
_ఎందుకంటే హిరణ్యకశపుడు తన కొడుకైన ప్రహ్లాదుని చదువు గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. మంచి గురువుల వద్ద చేర్పించాడు._
..............................................
*[అలా చేర్పించడానికి ముందు చదువు విలువ గురించి ఎంత చక్కగా చెప్పాడో చూడండి... ఇది ఈ పుస్తకంలో లేదు. నేను ఈ పద్యాలను, వాటి భావాలను చేర్చాను..--వెలిశెట్టి నారాయణరావు🙏]*
_కందపద్యం_
*_చదువనివాడజ్ఞుండగు_*
*_చదివిన సదసద్వివేక చతురత కలుగున్_*
*_చదువగ వలయును జనులకు_*
*_చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!_*
_రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో చదువు యొక్క విశిష్ఠత గురించి చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. ఇది పోతన భాగవతంలోని ప్రహ్లాదచరిత్రలోనిది._
*భావం: నాయనా ప్రహ్లాదా! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్, అసత్ అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలి. అది కూడా గురువుల దగ్గరకు వెళ్లి మాత్రమే చదువుకోవాలి. కాబట్టి మన కులగురువులైన చండామార్కుల వారి దగ్గర నిన్ను చదివిస్తాను.*
_ఈ పద్యంలో చదువుకోవడం ఎంత అవసరమో చెబుతూ, అది గురువుల దగ్గర మాత్రమే చదువుకోవాలన్న విషయాన్ని తెలియచేశాడు పోతన. రాక్షసరాజయినప్పటికీ హిరణ్యకశిపునికి గురువుల పట్ల గౌరవం ఎక్కువ. ఈ పద్యంలో ‘చదువు’ అనే పదాన్ని వాడుతూ, పిల్లలంతాఎందుకు చదువుకోవాలో చక్కగా వివరించాడు._
_అలా హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విద్యాభ్యాసం కోసం గురువులైన చండామార్కుల వారి దగ్గర చేర్చుతాడు. కొంతకాలం గడిచాక, కుమారుడు ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చి, కొడుకును ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రహ్లాదుడు చెప్పినదే ఈ పద్యం..._
_కందపద్యం_
*_చదివించిరి నను గురువులు_*
*_చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే_*
*_చదివినవి కలవు పెక్కులు_*
*_చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!_*
*భావం: తండ్రీ! గురువులైన చండామార్కులవారు నన్ను బాగా చదివించారు. ధర్మానికి, అర్థానికి సంబంధించిన ముఖ్యశాస్త్రాలన్నీ చదివాను. అంతేకాదు ఇంకా చాలా విషయాలు కూడా చదివాను. చదువులలో దాగి ఉన్న నిగూఢ విషయాలన్నిటినీ తెలుసుకున్నాను.*
_ఈ పద్యంలో ప్రహ్లాదుడు చెప్పిన *‘చదువులలో మర్మమెల్ల’* అన్న మాటను గమనిస్తే... అన్ని విద్యలలోనూ దాగి ఉన్నది భగవంతుడైన విష్ణుమూర్తి మాత్రమే అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పలుకుతాడు. ఇందులో ‘చదువు’ అనే పదం నాలుగు పాదాలలోనూ ఉంది. అందువల్ల నేర్చుకోవడానికి ఇబ్బంది లేకపోవడమేగాక, వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది._
________________________
_(ఇప్పుడు అసలు విషయానికి వద్దాం...)_
*హిరణ్యకశిపుడు తండ్రిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాడు.*
*నేడు ఫీజు కట్టడం వరకే తమ బాధ్యత అనుకుని, తమ పిల్లలకు మార్కులు తగ్గితే.. ఉపాధ్యాయులను నిలదీసే తల్లిదండ్రులు ఎన్నిసార్లు పేరెంట్-టీచర్ మీటింగులకు వెళ్తారు? పిల్లల ప్రవర్తన గురించి వాకబు చేస్తారు? తమ పిల్లల స్నేహితులెవరో.. వారెలాంటి వారో, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా?*
*ఎందుకంటే... టీచర్ చాలామంది పిల్లలను చూడాలి, క్లాసు సబ్జెక్టును బోధించడానికి ప్రిపేర్ అవ్వాలి. పరీక్ష పేపర్లు దిద్దాలి. ఇంకా ఇంటి వద్ద బాధ్యతలు నిర్వర్తించాలి. కనుక ప్రతి పిల్లవాడిపై అన్ని కోణాల్లో ధ్యాస పెట్టే అవకాశముండదు. నిజానికి ఒక టీచర్ పాఠం చెప్తుంటే 85% పిల్లలు సరిగ్గా వినరు. అంటే దానర్థం పాఠం సరిగా చెప్పలేదని కాదు. మీకు రేడియోలో వచ్చిన ప్రతి పాటా ఇష్టం ఉంటుందా? అదే మీకు నచ్చిన పాట వస్తే... వెంటనే కనెక్ట్ అయిపోతారుకదా! అదే విధంగా పిల్లలు ఆ రోజు పాఠానికి సంబంధించి టీచర్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నా, లేదా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నా, వారు డిస్కనెక్ట్ అయిపోతారు. టీచర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న కొద్దిమంది పిల్లలు మాత్రమే ఆసక్తిగా వింటారు. మిగతావారు విన్నట్టుగా నటిస్తారు. (ఆ విషయం వారి బాడీ లాంగ్వేజ్ చెప్తుంది). కనుక పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే అని గుర్తుంచుకోవాలని మనవి.*
_హిరణ్యకశిపుడిలో ఉన్న మంచి లక్షణాలని తల్లిదండ్రులు ఒంటబట్టించుకోవాలి. అయితే అవి మాత్రం వదిలేసి, ఆయనలో ఉన్న ఒకే ఒక చెడు గుణాన్ని మాత్రం అందరూ ఔపోసన పట్టేస్తున్నారు._
_అదేమిటంటే తండ్రి శివభక్తుడు. కొడుకు విష్ణు భక్తుడు. *విష్ణు భక్తి కోర్సు* చేయాలని ప్రహ్లాదుని హృదయ కాంక్ష. *శివ భక్తి కోర్సు* చేయాలని హిరణ్యకశపుని హృదయ వాంఛ._
*అందువల్ల పిల్లల హృదయాన్ని అర్థం చేసుకోనివారందరూ రాక్షస రాజులే మరి.*
________________________
*♦️తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు ఎందుకు పంపిస్తారు? మంచి చదువుకు, మార్కులకు, భవిష్యత్తుకు.. మరి పిల్లలు బడికి ఎందుకు వెళ్తారు? ఆడుకోవడానికి, స్నేహితులను కలవడానికి వెళ్తారు. టీచర్ చెప్పే విధానంతో ఆకర్షితులై పిల్లలు నేర్చుకుంటారు. అందువల్ల బోధనలో ఆసక్తి రేకెత్తించడమే అత్యంత కీలకమైన పని!*
=================
*_2. :.. వారిని వారిలానే ఉంచండి_*
=================
_(-ఖలీల్ జిబ్రాన్ రాసిన ఒక చిన్న కథ....)_
*"నేను ఒక సారి, ఒక పిచ్చివాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడి గార్డెన్లో పచార్లు చేస్తుండగా, అక్కడ ఒక ఫిలాసఫీ పుస్తకం చదువుతున్న యువకుడిని చూశాను. దగ్గరగా వెళ్ళి గమనించాను. అతని ప్రవర్తన, ఆరోగ్యవంతమైన అతని తీరు మిగతావారికంటే విభిన్నంగా ఉంది. నేను అతని ప్రక్కన కూర్చొని "ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాను. అతడు నావంక ఆశ్చర్యంతో తేరిపార చూసి, నేను ఆశ్రమంలోని వైద్యుడిని కాదని నిర్ధారించుకున్నాక - "ఏం చెయ్యను సార్! మా నాన్న గొప్ప లాయర్, నన్నూ తనలాగే లాయరును కావాలంటాడు. మా మామయ్య పెద్ద 'బిజినెస్ మెన్,' నన్ను బిజినెస్ మెన్ చెయ్యాలనుకుంటాడు. ఇక మా అమ్మ, వాళ్ళ నాన్నలా నేనూ రాజకీయ నాయకుడవ్వాలనీ, మా చెల్లి తన భర్తలా నేనూ సాఫ్ట్వేర్ ఇంజినీరు అవ్వాలని, మా అన్నయ్య తనలా నేనూ ఒక అథ్లెట్(క్రీడాకారుడ్ని) అవడం మంచిదని చెప్తాడు. ఇక స్కూల్లో నైతే మా పియానో టీచర్, ఇంగ్లీష్ టీచర్ వాళ్లనే ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఫాలో అవ్వాలని నిర్ధారించేస్తారు! ఎవరూ నన్ను నన్నులా, ఒక మనిషిలా చూడటంలేదు. అందరూ తమ అద్దంలో నన్ను చూస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. కనీసం ఇక్కడైనా నేను నాలా ఉందామని... అన్నాడు".*
-----------------------
_ఒక గొప్ప పారిశ్రామికవేత్త కుమారుడు. తండ్రి తదనంతరం ఆ కంపెనీకి చైర్మన్ గా నియమితుడై, కొత్త పాలసీలతో, ధృక్పథంతో, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టి కంపెనీని విప్లవాత్మకమైన రీతిలో పలు కొత్త రంగాలకు దిశా నిర్దేశం చేయసాగాడు. ఈయన దూకుడు చూసిన ఆ కంపెనీ డైరెక్టర్స్ అతనితో... 'సర్, మీరు మీ తండ్రిలా కాదు, మీరు పూర్తిగా భిన్నంగా ఉన్నారు' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దానికా యువకుడు 'కాదు కాదు. నేనూ మా నాన్న లాంటి వాడినే, ఆయనకూ నాకూ తేడా ఏం లేదు' అన్నాడు. 'కాదు సార్, మీ పాలసీలు, ఐడియాలు, ఆలోచనలు, విజన్, మేనేజ్మెంట్, లీడర్షిఫ్ అన్నీ మీ తండ్రిగారి కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి' అన్నారు అందరూ. దానికి ఆ యువకుడు "చూడండి! మా నాన్నగారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఏ విషయాలలోనూ ఎవరినీ అనుకరించేవారు కాదు, నేను కూడా అంతే, ఎప్పుడూ ఎవరినీ అనుకరించను, మా నాన్నగారితో సహా! ఆ విధంగా నేను కూడా మా నాన్నగారిలాంటి వాడినే" అన్నాడు._
*మీ పిల్లలను, వారిని వారిలా ఉండనివ్వగలిగినంత విజయవంతమైన పేరెంటింగ్ మరొకటిలేదు.*
*తల్లి, తండ్రుల నుండి వ్యాపారాలు, వృత్తులు అంది పుచ్చుకున్న వారు తమ వ్యాపారం/వృత్తిలో రాణించాలంటే తమదైన శైలిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, ఒక స్పష్టమైన విజన్ తో పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులే కాకుండా లోకం మెచ్చే నాయకులౌతారు.*
=================
*_3. వారినే శోధించి, సాధించనివ్వండి_*
-----------------------
_ఒక పిల్లవాడు రోజూ సముద్రం నుండి రకరకాల రాళ్లు ఏరుకుని జేబు నిండా నింపుకుని ఇంటికి తెచ్చేవాడు. అది రోజూ చూస్తున్న తండ్రి ఒకరోజు మనుషులను పెట్టి బస్తాలనిండా రాళ్లు తెప్పించాడు. కానీ ఆ కుర్రాడికి ఏమాత్రం ఆనందం రాలేదు. ఎందుకంటే.... *ఆ రాళ్ళలో ఆనందం లేదు. ఆ రాళ్ళను వెదకడంలో నిజమైన ఆనందం ఉంది.*_
*ఒక గొంగళిపురుగు గూడు బద్దలు కొట్టుకుని సీతాకోకచిలుకగా బయటకు రావడాన్ని ఒక సైన్సు టీచరు పరిశీలించమని విద్యార్థులకు చెప్పాడు. అది గూడు బద్ధలు కొట్టడంలో ఎంతో శ్రమపడటం చూసిన ఒక విద్యార్థి జాలితో ఆ గూడుని కత్తిరించాడు. దానికి సహాయం చేశానని ఆనందపడ్డాడు. కానీ ఆ సీతాకోక చిలుక రెక్కలు పూర్తిగా వికసించలేదు. ఆ గూడు బద్ధలు కొట్టడంలోనే దాని రెక్కలు గట్టిపడతాయట, అందమైన రంగులొస్తాయట.*
*తమ పిల్లలకే కాక రాబోవు ఏడు తరాలకు కూడా సంపాదించి పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారసత్వ ఆస్తులను ఇచ్చేముందు ఆ పిల్లలను సమర్థులుగా తయారుచెయ్యాలి. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటూనే తల్లిదండ్రుల మీద ఆధారపడని వ్యక్తిత్వం అలవడాలి. తన మూల ప్రతిభను గుర్తించి దేనికైనా ఆ ప్రతిభను అన్వయించగలగాలి. సమర్ధునిగా, పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగిననాడు అతనికి/ఆమెకి వారసత్వంగా వచ్చిన ఆస్థి, వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా అభివృద్ధి చేసి తనదైన మార్కు సృష్టించగలుగుతారు.*
=================
*_{ఇలాంటి ఎన్నో మంచిమంచి విషయాలతో ఉన్న ఈ పుస్తకం చదవగలగడం.. మీతో పంచుకోగలగడం నిజంగా నా అదృష్టం: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment