కోపం, ఆందోళన, వ్యామోహం అదుపులో ఉంచుకోవడానికి మనం ఏం చెయ్యాలి?
కోపం వస్తే ఒకటి నుంచి పదిదాకా లెక్క పెట్టమంటారు.
క్రోధిగా (న్) తపస్వికి జన్నే—అంటుంది భారతధర్మం .
జరగవలసిందెట్లాగూ జరుగుతుంది. దానికి చేయవలసింది చేస్తూనే ఉంటాం.ఐనా ఫలితం చేతిదాకా వస్తుందో చెయ్యి జారిపోతుందో అని ఆరాటపడుతూ ఉంటాం.
కోపం , తాపం, మోహం, ఆందోళన ఈ లక్షణాలు మనిషికి సహజాతాలు. ఇవి లోక యాత్ర సాగడానికి అవసరమే .పుట్టుకతోనే కొన్ని కోరికలూ వెంట పెట్టుకొని వస్తాం గదా!
అవి సాధించడం గూడా మన కర్మ బంధం విముక్తికి అవసరమే
. కాలాగ్ని సదృ శః క్రోథే " అని శ్రీ రాముని షోడశ గుణాలలో కోపం గూడా ఒకటిగా మహర్షి పేర్కొన్నాడు. అధర్మం పై కోపం లేకుంటే చులకన అయిపోతాం.
, ఏదైనా పదవో, చదువో సాధించాలనే మొండి పట్టుదల లేకపోతే ఏం సాధించగలం? అది ఎందుకు? నిరుపయోగం గదా! అని అందరూ చెబుతున్నా మనకుగా ప్రారబ్ధ వశాన ఏర్పడ్డ ఆ అభిమానంతో అందులో గుణాన్నే చూచి సాధించే వరకూ వెనకడుగు వేయం.
ఇదే మోహం లక్షణం.
అన్నీ నిరుపయోగమనే జ్ఞానం (?) నహి నహి రక్షతి డుక్ రుఞ్ కరణే అనేది ఒంటబట్టినపుడు కలుగుతుందేమో!
ఎవడూ వెంట ఏమీ తీసుకుపోడు అనేది అంతో ఇంతో ఒకవైపు అందరికీ స్పృహలోకి వస్తున్నా తాను చేసేది (తన ద్వారా జరగదు వలసినది) చేస్తూనే ఉన్నాడు కర్మఫలం మీది మోహంతో.
ఆశయా వర్ధతే లోకః .. లోకం జరగాలి గదా!
భగవంతుడు "స్వ కర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః " అన్నాడు. తన మానం కోసం ప్రతాపం చూపడం మానుష కర్తవ్యమే అవుతున్నది.
భగవదనుగ్రహం కలగక మోహం తొలగదు. అది తొలగనిదే జ్ఞానం వికసించదు. జ్ఞానం ఎవరికి వారికి స్వానుభవం వల్ల కలుగుతుంది. కష్టానుభవం వల్ల, ఏది అవసరమో ,ఏది కాదో బాగా తెలిసి వస్తుంది.
దోషంలో గుణ ఆరోపణ చేయడం వ్యామోహం. ధృతరాష్ట్రుడు ఇందుకు సరిపోయే ఉదాహరణ.
పుత్ర మోహాంధుడు— తాను దేవుడని నమ్మిన వాడే స్వయంగా వచ్చి చెప్పినా వినక — ఏమైనాడు?
బతికి ఉండగా జనాలు " పురుగులు బడి చావ…" అని తిడ్తున్నారని విశ్వసనీయ వర్గాలద్వారా విన్నాడు. పుత్రులుపోయి భీముడు (అన్న ఎంత వారిస్తూన్నా) గుడ్డి వాడికి దాణా వేయాలా! అంటున్నా ఏమీ అనలేని నీచపు బతుకు పదేళ్లు బతకవలసి వచ్చింది.
" ఇహైవ ఫలమశ్నుతే " అంటే ఇదేగదా!
మదములన్నీ (యౌవన,ధన, ఆభిజాత్య విద్యా మదాలు) ఉడిగినపుడే నిజం తెలిసి వస్తుంది. అపుడు భర్తృహరి చెప్పిన—
"తెలివియొకింత లేనియెడ తృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు
జ్జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్ .". గుర్తొస్తుంది.
పెరుగుట విరుగుట కొరకే.
ఎంత మిడిసిపడ్డా ఒకనాటికి కన్ను తెరవవలసిందే.
.వీటిని జయించడానికి మార్గం ఒకటే. నా కర్తవ్యం చక్కగా చేశాను. భగవదనుగ్రహం తో మంచి ఫలితమే కలుగుతుంది అనే నమ్మకం పెంచుకోవడమే..
No comments:
Post a Comment