*_ఇదేనా మన భారతం..!?_**
*పైశాచికానికి పరాకాష్ట*
*మంటగలసిన మానవత్వం*
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
జర్నలిస్ట్
9948546286
7995666286
_____________________
ఏం జరుగుతోంది
మన సమాజంలో..
రోజుకో కోణంలో
కనిపిస్తుందేమిటి
మనుషుల నైజం
ఏదో రూపంలో
ఆడకూతురుపై దౌర్జన్యమేనా..
మనం నేర్చిన చదువు..
గురువులు చెప్పిన బుద్దులు..
పెద్దలు బోధించిన సుద్దులు..
చిన్నతనంలో అమ్మానాన్న
నేర్పిన పాఠాలు..
తాతలు బామ్మలు
చూపిన బాటలు..
జీవితంలో అనుభవాలు నేర్పిన గుణపాఠాలు...
సంస్కృతి నేర్పిన సంస్కారం..
రామాయణం
చూపిన మార్గం..
ఏమైపోయాయి ఇవన్నీ..!?
అసలు ఏమిటీ విపరీతం..
రాజస్థాన్లోని గంగానగర్లో
పసి బిడ్డపై జరిగిన ఘాతుకం..పురాణాల్లో విన్న కరకు రక్కసులు సైతం ఒడిగట్టని ఘాతుకం..
చరిత్రలో ఎందరో ముష్కరులు చేసిన ఘోరాల గురించి విని ఉన్నాం..
వాటిని మించిన దురాగతం..
ఏమైపోయింది
ఆ మనుషుల్లోని ఇంగితం..
అమ్మ,అక్క,చెల్లి,వదిన,
భార్య..కూతురు..
ఎవరూ గుర్తు రారా..
చిన్న పిల్ల..లోకం తెలియని
ఆడకూతురు.
ఆడపిల్లగా పుట్టడమే నేరమై..
బయటకు రావడమే పాపమై..
మనిషిని నమ్మడమే తప్పిదమై..
ఘోర అనుభవానికి
గురై ఈరోజున అలమటిస్తోంది.
మీ ఇంటి మనిషి కాదనా..
అసలు అడిగేవాడే లేడనా..
మీలో మానవతే లేదనా..
ఎప్పుడో రాక్షసులు
ఇలా చేశారని..
రాతి యుగంలో
సంస్కారం ఎరగని
మనుషులు అలా ప్రవర్తించేవారని విన్నాం..
ఛీ అనుకున్నాం..
ఇప్పుడు అంతకు మించి చూస్తున్నాం..
ఛీదరించుకుంటున్నాం..
ఛీత్కరించుకుంటున్నాం..!
కొందరు మనుషులు
పశువులుగా మారి..
ఒక చిన్నారిని
ఇంత కర్కశంగా..
మంచి మరచి..
విజ్ఞత విడిచి..
విచక్షణ విస్మరించి..
మానవతను మంటగలిపి..
దానవతను కలగలిపి..
దౌర్జన్యం చేయడం..
ఎంత ఘోరం..!
అన్నా అని వేడుకుంది..
నాన్నా అంటూ
కాళ్ళావేళ్ళా పడి బ్రతిమిలాడుకుంది..
కరగలేదు కర్కశ హృదయాలు.
అంత మందిలో ఒక్కడైనా..
మనిషిని అని గుర్తెరిగి..
కరిగి ఉంటే ఈ ఘాతుకం
ఎక్కడో ఒక దగ్గర
ఆగి ఉండేది..
కాని రక్తం మరిగిన
పులుల్లా..ఆక్రందనలు చెవికి
ఇంపుగా వినిపించే శాడిస్టులు
వేడుకుంటున్న కొద్దీ చెలరేగిపోయారు.
వింటుంటే..చదువుతుంటే
జుగుప్స కలిగిస్తున్న
ఘోరకృత్యం.. పాల్పడిన
తుచ్చులకు ఎంతటి రాక్షసానందం ..ఆ రాక్షసులు
సైతం ఆశ్చర్యపడే..
అసహ్యపడే అమానుషం.
మనం ఉన్న ఈ కాలంలో..
మనం కూడా మనిషి
అనే పేరిట బ్రతుకుతున్న
ఈ తరుణంలో..ఈ ఘోరం
గురించి తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో..మనిషిగా
పుట్టినందుకు సిగ్గుపడుతూ..
గుండె నిండా ఆవేశం పొంగుతున్నా..ఇలా నిర్లిప్తంగా..జీవచ్ఛవాల్లా..!
ఇలాంటి దురాగతాలు
ఇప్పుడే మొదలు కాదు..
కాని తుది కావాలి..
ఇలాంటి పైశాచికాలకు
ఇక చరమగీతం పలకాలి..
ప్రభుత్వాలు కదలాలి
న్యాయస్థానాలు స్పందించాలి..
ముష్కరులను
సత్వరమే శిక్షించాలి..
రేపు మరో రాక్షసుడు లేవకుండా..
ప్రత్యేక కోర్టులు..
అవసరమైతే చట్టాలు సవరించి శిక్షలు విధించాలి.
అసలు ఇలాంటి రాక్షసులను
శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు
రూపొందించాలి..నిజానికి
న్యాయవాదులు సైతం
ఇటువంటి నీచుల తరపున
వకాల్తా పుచ్చుకోకుండా తీర్మానాలు చేసుకోవాలి..
లేదంటే బెయిలు..ఆనక విచారణ..కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగదీత..
మానానికి..అభిమానానికి
కాసులతో వెలకట్టే కుళ్ళు కేసులు..అన్నీ తిరకాసులు..
న్యాయవ్యవస్థను కించపరచడం కాదు గాని
ఈ దేశంలో పాపం చేసే, నేరానికి ఒడిగట్టే ప్రతి ఒక్కరికి
ఒక్కటే ధీమా.. బెయిల్ వస్తుంది..తర్వాత బయట తిరగవచ్చు..ఆపై కోర్టులో సంవత్సరాలు తరబడి కేసులను సాగదీసుకోవచ్చు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏదో ఒక దశలో ఏదో ఒకలా కేసును కొట్టేయించుకోవచ్చు.
న్యాయం చెయ్యడంలో
ఇప్పుడు కూడా ఆలస్యం జరిగితే..నిందితులకు
కొన్ని శక్తులు కాపు కాస్తే..
అది ఇంకొందరు కంటకులకు చులకన..తీర్పు సత్వరమే వెలువడాలి..
ఆ నరరూపరాక్షసులకు శిక్షపడాలి..అది ఉరిశిక్షే కావాలని దేశం యావత్తు కోరుకుంటోంది. అమలు కూడా బహిరంగంగా జరగాలి.
క్షమాభిక్షకు తావుండకూడదు.
ఇది జాతి కోరిక..
ఈ దేశంలో ప్రతి మనిషి
ఆకాంక్ష..పచ్చిగా చెప్పాలంటే
మానవజాతి కక్ష..
ఈ ఘోరకలిపై
న్యాయస్థానం ఇచ్చే తీర్పు
రేపు ఎందరో ఆడపడుచులకు
కావాలి రక్ష..!
😞😞😞😞😞😞😞😞
No comments:
Post a Comment