గంగ వెఱ్ఱులెత్తడం అనే మాట యొక్క అర్థం ఏమిటి? ఈ మాట ఎలా పుట్టింది?
గంగ అంటే గంగానదే కానక్కరలేదు. గంగానదితో పాటు నీటివనరు దేన్నైనా గంగ గానే భావిస్తారు. మంచినీళ్ళు కూడా తీసుకోలేదు అనటానికి పచ్చిగంగ కూడా ముట్టలేదు అంటారు. బెస్తలు సముద్రాన్ని గంగమ్మతల్లి అంటారు.
ప్రాజెక్టులు కట్టని రోజుల్లో వర్షాకాలంలో ప్రతి నది, ప్రతి ఏరు, ప్రతి వాగూ వంకా ఉధృతమైన వేగంతో ఊళ్లకి ఊళ్లను ముంచుకుంటూ ప్రవహించేవి. మరీ కొండవాగులైతే ఎక్కడో కొండల్లో పడిన వానకి, చుక్క వర్షం పడని ప్రాంతంలో వరదని పారించేవి. అదే గంగవెర్రులు. సమాచార ప్రసారం లేని ఆ రోజుల్లో, ఇక్కడ వర్షం లేకపోయినా విపరీతంగా వరద వస్తున్న నీటివనరును చూసి పుట్టించుకున్న మాట గంగవెర్రులు. వెర్రెత్తిన గంగ.
ఇప్పుడు కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ లో వానలు లేకపోయినా, మహారాష్ట్రలో పడిన వానలకు ఆంధ్రప్రదేశ్ లో గోదావరికి వరద వస్తుంది. కర్ణాటకలో పడిన వానలకు మన రాష్ట్రంలో కృష్ణకు, తమిళనాడులో కావేరికి వరదలు వస్తూ ఉంటాయి.
అకస్మాత్తుగా మనలో కలిగే అడ్డుకట్ట వేసుకోలేని ఉద్వేగాల ప్రదర్శనకి తెలుగులో జాతీయం గంగవెర్రులు.
No comments:
Post a Comment