కృష్ణుడు మరియు ఉద్ధవుల మధ్య ఉన్న సంబంధం, దైవిక స్నేహం మరియు మార్గదర్శకత్వం గురించి ఏ విధంగా అవగాహనను కల్పిస్తుంది?
కృష్ణుడు - ఉద్దవుడు
వందే నందవ్రజస్త్రీణాం
పాదరేణుమభీక్ష్ణశః .
యాసాం హరికథోద్గీతం
పునాతి భువనత్రయం "
- భాగవతం 10:47:63
" కాదమ్మా, నందవ్రజస్త్రీల పాదరేణువులకే నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎవరు కృష్ణలీలలు గానం చేస్తే ముల్లోకాలు పవిత్రమయిపోయాయో ఆ స్త్రీలే గోపికలు " అన్నారు ఉద్ధవుడు. అభీక్ష్ణశః అంటే మళ్ళీ మళ్ళీ ( నమస్కరిస్తున్నాను ) అని.
ఉద్ధవుడు బృందావనంలోని మట్టిని కళ్ళకద్దుకుంటున్నాడుట. గోపికలు కృష్ణుడు నడయాడిన నేల కదా, అందుకని అలా చేస్తున్నాడు ఉద్ధవుడు అనుకున్నారుట. " కాదమ్మా తల్లులారా, విడిచి పెట్టలేని సంసారబంధాలన్నింటినీ గడ్డిపోచలా విడిచి పెట్టి వేదములు వెతికినా కూడా కానరాని కృష్ణుని అనన్యభక్తులయిన మీరు నడిచిన నేలను నేను కళ్ళకు అద్దుకుంటున్నాను. మీ పాదరేణువులకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను " అన్నాడుట ఉద్దవుడు.
అక్కడ ఉన్న తీగలను, పొదలను తాకుతూ " ఎందుకొచ్చిన ఈ మానవజన్మ, ఇక్కడ బృందావనంలో తీగలాగనో పొదలాగనో పుట్టివుంటే ఈ నందవ్రజస్త్రీల పాదరేణువులు నాపై పడుతూ ఉండేవి, తరించేవాడిని " అని బాధపడ్డాడుట ఉద్ధవుడు.
ఇంతకీ విషయమేమిటంటే విద్యాభ్యాసం పూర్తిచేసుకుని మథురకు తిరిగివచ్చిన కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి బృందావనం వెళ్ళమన్నారు. దేనికో, ఏమి చేయాలో చెప్పనేలేదు. ఉద్దవుడు కూడా అడుగలేదు. కృష్ణుడు వెళ్ళమన్నారు, అంతే.
వెళ్ళి గోపికలను కలిసిన తరువాత తెలిసింది ఉద్ధవుడికి అనన్యభక్తి అంటే ఏమిటో, ముక్తిని ఒసగే భక్తి ఎలా ఉండాలో తెలుసుకోవడానికే కృష్ణుడు తనని బృందావనానికి పంపారని.
గోపికలు ఏ కర్మ/పని నీ మానేయలేదు, ఆపలేదు. కాని ఏ పని చేస్తూన్నా కృష్ణుడి ధ్యాసే. కృష్ణుడి కోసం చేస్తూన్న భావనే.
కృష్ణపరమాత్మ అవతారాన్ని ముగించే ముందు ఉద్దవుడికి ఎన్నో ధర్మసూక్ష్మాలు చెబుతారు. అది ఉద్ధవగీతగా ప్రసిద్ధి చెందింది.
ఉద్దవుడు ఏడుస్తూ " నీ పాదం భూమిమీద ఉండడంవల్ల కలి ప్రవేశించడానికి భయపడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలా, ఏమిటి జీవుల పరిస్థితి " అని అంటారు.
కృష్ణుడు ఏడుస్తూన్న ఉద్దవుడుతో " నేను వ్యక్తరూపాన్ని ఉపసంహరిస్తున్నాను కాని నా సమగ్ర ( అవ్యక్త) రూపాన్ని భాగవతామృత సముద్రంలో ప్రవేశింప చేస్తున్నాను. అది పారాయణ చేసి, విని తరించవచ్చు సులభంగా " అన్నారు.
ఉద్దవుడు కృష్ణుని అనన్య భక్తుడు. వారి భంధం ఆధ్యాత్మికం.
శుభమస్తు
No comments:
Post a Comment