Wednesday, July 15, 2026

 *_శౌర్యము - శాంతి_*
=================
*మనం చూసే మనుషుల్లో కొంతమంది ఏదీ పట్టనట్లుంటారు. అట్లాంటి వాళ్ళను చూసి 'వాడు సన్యాసిరా!' అంటారు. అంటే ఎట్లాంటి చలనమూ లేని మనిషిని సన్యాసి అంటూ ఉంటారు. అది పొరపాటు. నిజమైన సన్యాసిలో అపూర్వమయిన ఆనందం ఉంటుంది. అంతులేని శాంతి ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. ప్రపంచానికి అందని ప్రతిభ ఉంటుంది.* 

*మనుషుల్లో ఇంకొంతమంది  అత్యాశతో అల్లాడిపోతూ ఉంటారు. కోపంతో ఊగిపోతూ ఉంటారు. పోట్లాటకు సిద్ధపడి ఉంటారు. ప్రతిదాని పట్లా పట్టలేని మమకారంతో ఊగిపోతూ ఉంటారు.*

*ఒక ఊళ్లో ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవాళ్లు. ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ. ఒకర్ని వదిలి ఇంకొకరు ఉండేవాళ్లు కాదు.* 

*అట్లాంటి వాళ్లు ఒకసారి కొంతకాలం ఎడబాటుకు గురికావల్సి వచ్చింది. ఇద్దర్లో మొదటివాడు కొంత ఆవేశపరుడు. రెండో మిత్రుడు ప్రశాంతచిత్తుడు. మొదటివాడి ఆవేశాన్ని రెండోవాడు అదుపుచేస్తూ ఉండేవాడు. మొదటి మిత్రుడు ఏదో వ్యాపార నిమిత్తం ఆరు నెలలపాటు జపాన్ వెళ్లిరావాల్సి వచ్చింది. స్నేహితుణ్ణి వదిలి వెళ్ళడానికి మనస్కరించలేదు. కానీ తప్పనిసరయి వెళ్ళాల్సి వచ్చింది. బాధగా వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయాడు.* 

*వాళ్లిద్దరూ దాదాపు రోజూ ఉత్తరాలు రాసుకునేవాళ్లు. అట్లా కొన్ని నెలలు గడిచాయి. జపాన్ వెళ్లిన మిత్రుడు ఒకరోజు తాను ఇంకొన్ని రోజుల్లో తిరిగివస్తున్నానని ఉత్తరం రాశాడు. తన ప్రాణమిత్రుడు తిరిగి వస్తున్నందుకు రెండో మిత్రుడికి ఎంతో సంతోషం కలిగింది.* 

*మొదటి మిత్రుడు తను జపాన్లో ఉన్నన్ని నాళ్ళూ... ఎప్పటికీ తన మిత్రుడికి గుర్తుండిపోయేలా ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటూ ఉండేవాడు. ప్రతి రోజూ షాపులన్నీ తిరిగేవాడు. ఎన్నాళ్లో తిరిగి చివరకు ఎంతో అద్భుతమైన ఒక శిల్పాన్ని కొన్నాడు. అది అసాధారణమయింది. ఆకర్షణీయమైంది. దాన్ని చూస్తే ఎవరూ జీవితంలో మరచిపోలేరు. అట్లాంటి శిల్పాన్ని మిత్రునికి ఇవ్వగలుగుతున్నందుకు ఎంతో ఆనందించాడు.*

 *జపాన్ నించి వచ్చిన స్నేహితుణ్ణి మిత్రుడు సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరూ ఒక దగ్గర  ఏకాంతంగా కూర్చుని అనేక విషయాలు ముచ్చటించుకుంటూ ఉన్న సందర్భంలో మొదటి మిత్రుడు తను జపాన్ నుంచి తెచ్చిన శిల్పాన్ని రెండో మిత్రునికి బహూకరించాడు.* 

*ఆ శిల్పాన్ని చూసి రెండో మిత్రుడు క్షణకాలం నివ్వెరపోయాడు. కాసేపు ఆ శిల్పాన్ని చూసి మెల్లగా సాధారణస్థితికి వచ్చాడు. మొదటి మిత్రుడు రెండో మిత్రుని ముఖ కవళికల్ని పరిశీలించి _"ఈ శిల్పాన్ని చూడగానే నువ్వు ఎలా షాక్ కి గురయ్యావో... నేనూ మొదటిసారి చూడగానే అట్లాగే నివ్వెరపోయాను. ఇప్పటికీ ఈ శిల్పాన్ని గురించి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను"_ అన్నాడు.*

*ఆ శిల్పం ఒకే మూర్తిది. ఒకవైపునుంచి చూస్తే, ఒక వీరుడు కనిపిస్తాడు. అతని చేతిలో ఒక ఖడ్గముంది. ఇంకో చేతిలో వెలుగుతున్న దీపం ఉంది. ఆ దీప కాంతి అతని ముఖం మీద పడుతోంది. అతని వదనంలో అనంత ధైర్యసాహసాలు కనిపిస్తున్నాయి. ఆ శిల్పానికి మరోవైపు శాంతమూర్తి ఐన గౌతమబుద్ధుని ప్రసన్న వదనం ఉంది. ఒకే శిల్పంలో.. ఒకే వ్యక్తిలో రెండు కోణాలైన ధైర్యం, శాంతి ఉండేలా ఆ శిల్పి చిత్రించాడు.*

*రెండో మిత్రుడు నిర్మలంగా ఆ శిల్పాన్ని చూసి స్నేహితుడితో... _“ఒకే వ్యక్తిలో ఏకకాలంలో ధైర్యసాహసాలు, శాంతి అహింసలు ఉండాలి. ప్రపంచం అట్లాంటి సంపూర్ణ మానవుడి కోసమే ఎదురుచూస్తోంది. మనిషి వీరుడిలా సైనికుడిలా దృఢ చిత్తంతో ఉండాలి. అట్లా ఉండడమన్నది ఇతరులపై దాడిచేయడానికి అధికారం చెలాయించడానికి కాదు. తన అంతరంగంలోని కరుణను, దయను, ప్రేమను కాపాడుకోడానికి. ఆ రెండు లక్షణాలు వచ్చేలా ఎవరో మహాశిల్పి ఈ శిల్పాన్ని అద్భుతంగా రూపొందించాడు”_ అన్నాడు.*

*మొదటి మిత్రునికి శిల్పం గురించి ఇలా అవగాహన కలిగింది. అన్నిటికన్నా శాంతగుణం గొప్పది. శాంతంగా ఉండడమంటే.. దౌర్జన్యాన్ని సహించడం కాదు. శాంతంగా ఉన్న మనిషిలో సాహసం ఉంటుంది. శక్తి ఉంటుంది. బలం ఉంటుంది. ఆ శాంతం మీద ఎవరూ దాడి చెయ్యలేరు. దౌర్జన్యం చెయ్యలేరు. కారణం ఆ శాంతంలో అజ్ఞాతంగా అనంత శౌర్యం దాగి ఉంటుంది. శాంతగుణంలో దాగి ఉన్న శౌర్యం ఇతరులమీద అధికారం చెలాయించడానికి కాదు. అది ఏపనయినా, చివరకు యుద్ధంలోనయినా ధర్మబద్ధంగా నడుచుకోవడమే నేర్పుతుంది. ప్రశాంతంగా ఉన్నవాళ్ళ శక్తి ఒక్కటే అర్ధవంతంగా పనిచేస్తుంది.*
_[—విశ్వనాథ్ పటేల్ గారి *"మనం కాని మనం"* పుస్తకం లోనిది ఈ విషయం...]_
🟰➖🟰➖🟰➖🟰
*_¦¦-{ఈ అంశాన్ని మరోసారి ప్రశాంతంగా చదివితే బాగుంటుందని నాకు అనిపించింది. నేను మూడు సార్లు చదివాను..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా}-¦¦_*

No comments:

Post a Comment