Wednesday, July 15, 2026

 *జపము నియమాలు*  
 ************************
*భగవంతుడిని ఆరాధించే పలు విధానాల్లో చాలా ముఖ్యమైనది.., అందరూ సులభంగా* *చేయగలిగినది జపం. ఏదో మొక్కుబడిగా కాకుండా, కాలక్షేపానికి కాకుండా ఓ నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి... కానీ రోజుకు ఎన్ని సార్లు జపం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే నియమాలు చాలా ఉన్నాయి....* *అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం-*
 
వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్

వాచికము, ఉపాంశువు, మానసికము అనే మూడు విధానాల్లో జపం చేయవచ్చు. బయటకు వినిపించే విధంగా భగవంతుడిని స్మరిస్తే దాన్ని వాచికము అని, శబ్దాలేవీ బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ, నాలికతో చేసే జపాన్ని ఉపాంశువు అని అంటారు. నాలిక, పెదవులు రెండూ కదపకుండా, నిశ్చలంగా మౌనంగా మనస్సు లోపలే చేసే జపాన్ని మానసికము అంటారు.

హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ

ప్రాతఃకాలంలో జపం చేసేటప్పుడు చేతులను నాభి వద్ద పెట్టుకుని, మధ్యాహ్నం వేళ జపం చేసేటప్పుడు హృదయము వద్ద పెట్టుకుని చేయాలి. సాయంత్రం జపం చేసేటప్పుడు చేతులను ముఖానికి సమాంతరంగా ఉంచుకోవాలి. అలాగే చందన పూసలు, అక్షతలు, పువ్వులు, ధాన్యం, మట్టిపూసలతో చేసిన జపమాలను ఉపయోగించరాదు. సింధూరపూసలు, దర్భ, ఎండిన ఆవుపేడ పూసలు, రుద్రాక్షలు, తులసి పూసలు లేదా స్ఫటిక పూసలతో చేసిన జపమాల శ్రేష్టం అని పురాణాలు చెప్తున్నాయి. 
 
జపమాలలోని పూసలు ఖచ్చితంగా 108 ఉండేలా చూసుకోవాలి. జపమాల యొక్క రెండు కొసలను కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేసేటప్పుడు జపమాల కనిపించకుండా పైన ఒక పొడి వస్త్రాన్ని కప్పాలి. జపమాలను ఉంగరపు వ్రేలు పై నుండి చూపుడువ్రేలిని ఉపయోగించకుండా బొటనవ్రేలితో పూసలను లెక్కించాలి. సుమేరుపూసను దాటి ముందుకు పోకుండా మాలను వెనుకకు త్రిప్పి జపము చేయాలి.

జపం.. ఇది సర్వశ్రేష్ఠం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకొని జపం చేయాలి. శాస్త్రాలలో పేర్కొన్న కొన్ని అంశాలను తెలుసుకుందాం…

 తూర్పు ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపు లేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు కింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

“త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే”!!

అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాల ను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి చేసేటప్పుడు జపమాల కనిపించకుండా పైన ఒక పొడి వస్త్రాన్ని కప్పాలి..

ఏ ఆసనాల మీద చేస్తే ఏం ఫలమో తెలుసా!!

జపాన్ని చేయడానికి పైన పేర్కొన్న వాటితో పాటు ఆసనాలు కూడా చాలా ముఖ్యమే. ఆయా ఆసనాల వల్ల ఆయా ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు విద్యుత్‌ బాగా ప్రసరించాలంటే రాగి అత్యుత్తమం. తర్వాత వెండి.. ఇలా రకరకాల వాహకాల ద్వారా విద్యుత్‌ ప్రవహించే శక్తి ఆధారపడి ఉంటుంది. అలానే జపం చేసినప్పుడు కూడా మనం ఉపయోగించే ఆసనాలు కూడా ప్రధానమైనవనే పండితులు చెప్తున్నారు. ఆ వివరాలు చూద్దాం….

వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్య్రం, రాతి మీద రోగం, నేల మీద దు:ఖం, గడ్దిపరకల మీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం రుక్‌, సామవేదాలకు ప్రతినిధిగా పేర్కొంటారు.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధుల సారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం.., ముందు దర్భాసనం వేసుకొని, దాని మీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొని గాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాల నియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు.

జపం చేసుకోవడానికి గాను త

ులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ’పగడాల మాల’ కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.

శ్లోకం

*మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్ పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!*

మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును.అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును...

*సర్వేజనా సుఖినోభవంతు*
 *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment