*ఆమె కోసం ఒక క్షణం*
కాలం విచిత్రమైనది. అది ఎవరి కోసం ఆగదు. కానీ కొందరి జీవితాల్లో మాత్రం...ఆగకుండా పరుగెత్తేది కాలం కాదు,
బాధ్యతలు. మనిషి జీవితాన్ని వయసు కొలవదు. ఆమె తన కోసం జీవించిన క్షణాలే కొలుస్తాయి.
అందుకే కొందరు అరవై ఏళ్లకే జీవితాన్ని పూర్తిగా జీవిస్తారు.
మరికొందరు...ఎనభై ఏళ్లు బతికినా, తమను తాము ఒక్కసారి కూడా కలుసుకోలేరు.
ప్రతి ఇంటికీ ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం గోడలు కావు.
పైకప్పు కాదు. ఆ ఇంట్లో నిశ్శబ్దంగా తిరిగే ఒక మనసు.
అందరి అవసరాలను తన గుండెల్లో దాచుకుని, తన అవసరాలను చివరి మూలలో మడిచిపెట్టే ఒక మనసు.
ఆ మనసుకు పేరు... రమ. ఉదయం ఐదు గంటలు.
వెలుగు ఇంకా భూమిని తాకలేదు. కానీ రమ దినచర్య అప్పటికే మొదలైంది. ఆమె నిద్రను లేపింది అలారం కాదు.
పొయ్యి మీద పెట్టాల్సిన గిన్నె. మరిగించాల్సిన టీ. సిద్ధం చేయాల్సిన టిఫిన్లు. సమయానికి అందాల్సిన మందులు.
వాటికన్నా ముందు...అందరి జీవితాలను సవ్యంగా నడపాలనే ఒక మౌన బాధ్యత.
ఆమె చేతులు ఇల్లంతా తిరుగుతున్నాయి కానీ...
ఆరోజు కూడా ఆమె మనసు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు.
ఎందుకంటే... తన గురించి ఆలోచించుకునే సమయం లేదు
మనసు కూడా పూర్తి చేయవలసిన బాధ్యతల వెంటే పరుగు తీస్తుంది. ఆమె ఒక బాధ్యత గల గృహిణి.
కాలేజీలో చదువుకునే రోజుల్లో రమ అంటే చలాకీతనానికి మరో పేరు.
"ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది... ఈ అమ్మాయి ఉన్న చోట నిశ్శబ్దం ఉండదు," అని లెక్చరర్లు కూడా నవ్వుకుంటూ చెప్పుకునేవారు.
పాట పాడమంటే ముందుండేది. కవిత రాయమంటే కలం పరుగెత్తేది. పుస్తకం చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోయేది. చదువుపై అపారమైన ఆసక్తి, కళలపై మక్కువ, జీవితంపై ఎన్నో అందమైన ఊహలు, ఆకాశాన్ని తాకే ఎన్నో కలలు... ఆమె మనసంతా వెలుగులతో నిండిపోయి ఉండేది.
ఇంట్లో కూడా రమను ఏ పనికీ బలవంతం చేసేవారు కాదు.
"చదువుకో... నీకు నచ్చింది చేసుకో," అని అమ్మ ప్రేమగా చెప్పేది. ఇంటి పనులన్నీ తనే చేసుకుని, కూతురికి తన ఇష్టాలను ఆస్వాదించేంత సమయాన్ని ఇచ్చేది.
కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం, పాటలు వినడం, కవితలు రాయడం, స్నేహితులతో నవ్వుకోవడం... అదే ఆమె ప్రపంచం. జీవితం ఇలాగే అందంగా కొనసాగుతుందని ఆమె అమాయకంగా నమ్మింది.
కాలం కూడా ఆమె కోసం మంచి వరుడినే తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే యువకుడు. మంచి కుటుంబం. అత్తామామలు ఎంతో సాత్వికులు. ఒకే చెల్లెలు, ఆమెకూ అప్పటికే వివాహమైపోయింది.
"నీకు పెద్దగా బాధ్యతలేమీ ఉండవు అమ్మా... అక్కడ నువ్వు చాలా సుఖంగా ఉంటావు," అని ఇంట్లో వాళ్లు ఆనందంగా చెప్పారు.
ఆ మాటలు విన్నప్పుడు రమ పెదవులపై ఒక నిశ్శబ్దమైన చిరునవ్వు మెరిసింది.
కానీ...జీవితం మనకు చెప్పే పెద్ద అబద్ధాల్లో ఒకటి ఇదే.
"నీకు ఎలాంటి బాధ్యతలు ఉండవు."
ఎందుకంటే... ఒక స్త్రీ మెడలో మూడు ముళ్లు పడిన క్షణం నుంచి, ఆమె బాధ్యతలకు ఆరంభం ఉంటుంది. ముగింపు కాదు.
పెళ్లి ఘనంగా జరిగింది.
బంధువుల సందడి, మంగళవాయిద్యాల నాదం, ఆశీర్వాదాల మధ్య రమ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.
అందరూ చెప్పినట్టుగానే ఆ ఇల్లు మంచిదే.
అత్తామామలు ప్రేమగా మాట్లాడేవారు. భర్త ఆదరంగా చూసుకునేవాడు. ఎవ్వరూ ఆమెను బాధపెట్టేవారు కాదు.
కానీ...
జీవితంలో ప్రతి భారమూ మనుషుల వల్లే రావాల్సిన అవసరం లేదు. కొన్ని బాధ్యతలు ప్రేమ రూపంలోనే వస్తాయి.
"ఇది మన ఇల్లు" అనే ఒక్క మాటతో మొదలయ్యే ఆ బాధ్యతలు, నెమ్మదిగా ఆమె జీవితమంతా ఆక్రమించసాగాయి.
ఉదయం అందరికంటే ముందే లేవడం. అందరి అభిరుచులు గుర్తు పెట్టుకోవడం ఎవరికి ఏం కావాలో చెప్పకముందే సిద్ధం చేయడం.. ఇంటి చిన్నా పెద్దా విషయాలన్నీ తన బాధ్యతగా భావించడం...
ఇవన్నీ ఎవ్వరూ ఆమెకు ఆజ్ఞాపించలేదు.
"ఇది నా కుటుంబం" అనే ప్రేమే ఆమెతో చేయించింది.
రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయ్యాయి.
ఆమె రాసే కవితలు ఆగిపోయాయి.
ఎప్పుడో ప్రతి సాయంత్రం ఆమె గొంతులో జాలువారే పాటలు, ఇప్పుడు వంటగదిలో కుక్కర్ విజిల్‌లో కలిసిపోయాయి.
చదవాలని కొన్న పుస్తకాల మీద దుమ్ము పేరుకుంది.
ఒకప్పుడు డైరీలో తన మనసును రాసుకున్న చేతులు...
ఇప్పుడు కిరాణా లిస్టులు మాత్రమే రాయసాగాయి.
ఆ మార్పు ఒక్కరోజులో జరగలేదు. ప్రతిరోజూ...తనలోని ఒక చిన్న కోరికను వాయిదా వేస్తూ,
"రేపు చూసుకుందాం..."
అని అనుకుంటూ వెళ్లిన ప్రతిరోజూ...
రమకు తెలియకుండానే, తన కోసం జీవించే రమ...
తన కుటుంబం కోసం మాత్రమే జీవించే రమగా మారిపోయింది.
ఇద్దరు పిల్లలకు తల్లైంది రమ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత, "ఇంక పిల్లలు వద్దు" అని ఆమె మెల్లగా చెప్పినా...
"మన ఇంటికి ఒక మగ నలుసు కూడా లేదా ?" అంటూ అత్తగారి మాటలు ఆమె మనసును గుచ్చుకున్నాయి.
తనకు ఇష్టం లేకపోయినా...ఎవ్వరినీ బాధ పెట్టకూడదనే మనసుతో మరోసారి తల్లి అయింది.. దేవుడు కరుణించాడు.
కొడుకు పుట్టాడు.
ఇంట్లో ఆనందానికి అవధులు లేకపోయాయి.
అందరూ సంబరపడ్డారు. కానీ...ఆ సంబరాల మధ్య ఎవ్వరూ గమనించని ఒక విషయం ఉంది.
రమ భుజాల మీద మరో బాధ్యత చేరింది.
ఇప్పటికే ఇద్దరు చిన్నారుల పెంపకం...
వారికి చదువు, ఆరోగ్యం, అలవాట్లు...
అన్నీ ఆమె ఒక్కదానిదే.
ఇంతలో మంచానికే పరిమితమైన మామగారి సేవ.
వృద్ధాప్యంతో బలహీనపడిన అత్తగారి అవసరాలు.
వారికి సమయానికి మందులు...భోజనం...డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం...ఇవన్నీ కూడా రమ దినచర్యలో భాగమయ్యాయి.
అంతటితో ఆగలేదు. ఆడపడుచు పిల్లలతో కలిసి తరచూ పుట్టింటికి వచ్చేది. ఆమె రావడం రమకు ఇబ్బంది కాదు.
కానీ...ఇంట్లో మనుషులు పెరిగిన ప్రతిసారీ...
పనులు మాత్రం రెట్టింపయ్యేవి. వంటగదిలో మంటలు చల్లారకముందే మరో వంట మొదలయ్యేది. ఒకరి కోసం చేసిన పని పూర్తయ్యేలోపే మరొకరి అవసరం ఎదురుగా నిలబడేది.
అయినా...రమ ముఖంలో చిరునవ్వు మాత్రం తగ్గేది కాదు.
అది ఆనందం వల్ల కాదు. ఎదుటివాళ్లు తన అలసటను చదవకూడదనే ప్రయత్నం.
రోజు ముగిసేసరికి అందరూ ప్రశాంతంగా నిద్రపోయేవారు.
భర్తకు తాను అలసిపోయాననే భావన రాకూడదని...
పిల్లలకు అమ్మ ఎప్పుడూ బలంగానే కనిపించాలని...
అత్తామామలకు కోడలు ఎప్పటిలాగే నవ్వుతూ ఉండాలని...
తన అలసటను కూడా చిరునవ్వుతో కప్పిపుచ్చేది.
ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికీ విశ్రాంతి అనే సమయం ఉండేది.
కానీ...రమకు మాత్రం లేదు. ఆమెకు సెలవులు లేవు.
అనారోగ్యానికి అవకాశం లేదు. "ఈ రోజు నాకు ఏమీ చేయాలని లేదు" అని చెప్పే హక్కు కూడా లేదు.
ఎందుకంటే...ఆమె ఒక్కరోజు ఆగిపోతే...
ఆ ఇంటి దినచర్య మొత్తం తడబడిపోతుంది.
అందుకే...తన శరీరం అలసిపోయినా...మనసు ఖాళీ అయిపోయినా...ఆమె అడుగులు మాత్రం ఆగలేదు.
బాధ్యతలు మనిషిని బలంగా చేస్తాయని అంటారు.
కానీ...కొన్ని బాధ్యతలు...మనిషిని బలంగా కనిపించేలా మాత్రమే చేస్తాయి. లోపల మాత్రం...నెమ్మదిగా, ఆమెను ఖాళీ చేస్తూ ఉంటాయి.
కాలగర్భంలో అత్తగారు మామగారు కలిసిపోయారు. పిల్లలు చదువులు పూర్తయి ఒక ఇంటివాళ్ళు అయ్యారు.
ఇన్నాళ్ళు వేళ్ళు పట్టుకుని నడిపించిన పిల్లలకు, పిల్లల వేలు పట్టుకుని నడిచే పిల్లలు వచ్చారు. కూతురు నుంచి కోడలు, కోడల నుంచి అమ్మ, అమ్మ నుంచి అమ్మమైంది రమ్య.
అయినా ఇంకా బాధ్యతలు వెంట పరిగెడుతూనే ఉంది. కాదు కాదు పరుగులు పెట్టిస్తున్నారు. అయితే భర్త మటుకు గవర్నమెంట్ వారు నన్ను ఇంటిదగ్గర కూర్చోమన్నారు రేపటి నుంచి అంటూ తనకు నచ్చిన పనిలో గంటలు గంటలు కాలక్షేపం చేస్తున్నాడు.
పిల్లలు ఇంకా అమ్మా నాకు అది చేసి పెట్టవు. ఇది మీ అల్లుడు గారికి ఇష్టం అది పిల్లలకి ఇష్టం అంటూ అడిగే గొంతెమ్మ కోరికలకి మనసు, శరీరం కూడా సహకరించని వయస్సు వచ్చేసింది రమకి.
తన మీద తనకే జాలి వేసింది మొట్టమొదటిసారిగా. ఇన్నాళ్లు బాధ్యతలు పేరుతో వంటింటికి అంకితం అయ్యాను. నాకోసం ఒక్క క్షణం ఏది తీరికేది. బాధ్యతలు మనసును తొందర పెడుతుంటే ఆ తొందరలో నేను ఎవరనే సంగతి మర్చిపోయాను. నాకు కూడా కొంత విశ్రాంతి ఉండాలిగా. ఎన్నాళ్ళు ఇలాగా ఆ మాట పిల్లలు నోటి వెంట కానీ, భర్త నోటివెంట కాని వస్తుందేమో అని ఎదురు చూశాను. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి బాధ్యతలు వచ్చి మీద పడిపోతున్నాయి. నాకంటూ ఒక సమయం లేదు అని రోజు బాధపడుతూ ఒకసారి స్థిర నిశ్చయానికి వచ్చి భర్త దగ్గరికి వచ్చింది.
ఇప్పుడే పెద్దమ్మాయి ఫోన్ చేసింది అల్లుడు గారి పుట్టినరోజు వస్తోందట. ఆయనకి నీ చేతి లడ్డూలు ఇష్టము అని ఫోన్ చేసింది అన్నాడు.
మీరు వెంటనే స్వగృహ కి వెళ్లి రెండు కేజీలు లడ్డు కొని బస్సుకిచ్చిరండి అoది రమ. ఆ మాటలకు అయోమయంగా చూసాడు.
ఎప్పుడు ఇలా మాట్లాడలేదు రమ. ఆ మాటల్లో కోపం లేదు. బాధ్యతలు బరువుగా అనిపించే ఏదో అలసిపోయిన స్వరంలా ఉంది . అంతేకాదు పిల్లలకి పండగలకు రమ్మని ఎవరికి ఫోన్ చేయకండి. వాళ్లు వస్తానంటే మీరు వద్దని అనకండి. అప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అంది రమ.
సరే అలాగే చేస్తాను అన్నాడు రమ్య భర్త.
ఆ క్షణంలో అతనికి మొదటిసారి అర్థమైంది...
ఈ ఇంట్లో అందరూ రమ మీద ఆధారపడ్డారు.
కానీ...రమ మాత్రం ఎవరికి భారం కాలేదు.
బాధ్యతలు ఆమెను గొప్ప మనిషిని చేశాయి.
కానీ...తన కోసం జీవించే హక్కును మాత్రం నెమ్మదిగా దూరం చేశాయి.
ఒక స్త్రీకి కావలసింది గొప్ప బహుమతులు కాదు...
రోజులో కొంత సమయం. తన కోసం, తన మనసు కోసం, తన ఊపిరి కోసం. కొంత స్వార్థం కూడా ఉండాలి. ఒక స్త్రీ తన ఆరోగ్యం తన మానసిక తృప్తి కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవాలి.
ఎందుకంటే..తనను తాను కోల్పోయిన మనిషి, ప్రపంచాన్నంతా సంతోషపెట్టినా...
పూర్తిగా జీవించినట్టు కాదు.
మనం ప్రేమించేవాళ్ల కోసం జీవించడం గొప్పదే.
కానీ...మన కోసం కూడా కొంత సమయం జీవించడం...
అంతకంటే గొప్ప బాధ్యత.
ఎందుకంటే బాధ్యతలు ఎప్పుడూ పూర్తికావు.
కానీ జీవితం మాత్రం ఒకరోజు పూర్తవుతుంది.
అంతకంటే ముందే...మనలో మనం మిగిలి ఉండాలి.
మనల్ని మనం మళ్లీ కలుసుకోవాలి.
అదే జీవితానికి అసలైన అర్థం.
అదే బాటలో రమ ఇప్పుడు నడిచింది . బాధ్యతల ముసుగులో వయసు మీద పడినా ఇంకా తన కుటుంబం కోసం పాటుపడే ఎంతో మంది గృహిణిలు ఉన్నారు. అందరి అవసరాలు తీర్చారు. అందరిని గట్టెక్కించారు. మరి ఆమె గురించి ఆలోచించవలసింది ఎవరు. ఆలోచించవలసిన వాళ్ళు ఆలోచించకపోతే తనకు తానే సొంత నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతారు.. ఇది నేటి తరానికి సంబంధించిన వారికి కాదు. బాధ్యతల బరువులో వంగిపోయిన ఆ పాత తరం వారికి సంబంధించిన కథ..
రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బా రావు
No comments:
Post a Comment