Saturday, July 25, 2026

కుండలినీ సాధన - అనాహత చక్రము 4

 కుండలినీ సాధన - అనాహత చక్రము 4
**********************************
ఈ అనాహత కమలం 12 దళాలు కలది. దీని తత్త్వం వాయుతత్త్వం. బుధ గ్రహం 
ఇది 600 నాడులు కలిగి, ఒక సారి ఊపిరి పీల్చి వదలేసరికి 600 సార్లు స్పందిస్తుంది. ఇది ప్రాణవాయువు సంచలనాలను నియంత్రిస్తుంది.
ఇది హృదయ స్థానమందుండి, ప్రాణ శక్తి స్పందనను, శ్వాస క్రియను నియంత్రించే వాయు తత్వంతో ఉంటుంది

లలితా సహస్రంలో ఈ చక్రంలో గల రాకిణి శక్తిని ఇలా నిర్వచించారు :

శ్లో|| అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదన ద్వయా
దంష్ట్రోజ్వలా ఽ క్షమలాది ధరా రుధిర సంస్థితా ||
శ్లో|| కాళ రాత్ర్యాది శక్తౌ ఘవృతా స్నిగ్దౌదన ప్రియా
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ ||

ఈ చక్రాధిష్ఠాన దేవత "వామ దేవి " రెండు ముఖములతో, శ్యామల వర్ణంతో " రాకిణి శక్తి " గా సప్త ధాతువులలోని " రక్త ధాతువుకు " అధి దేవతగా ఉంటుంది.
రాకిణి శక్తి నలుపురంగులో ఉంటుంది. ఈమెకు రెండు వదనములు ఉన్నాయి. ఈమె ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది.

 ‘అ’ నుండి, ‘క్ష’  వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది.
నాలుగు చేతులలో అక్షమాల, శూలము, కపాలము, డమరుకము దరించునది.

అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఈమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది.
ఈమె కం,  ఖం, గం, ఘం, ఙం, చం, ఛం, జం, ఝం, ఞం, టం, ఠం  అను యోగినులచే సేవించబడుచున్నది.

లలితా సహస్రమందు ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలదిగా వర్ణించబడినది.
ఈ అనాహత చక్రము " శర్వుడు " అను నామము గల శివునికి స్థానము.

ఈ చక్రం అచేతనావస్థ వలన ప్రేమ రాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రేలాపనలు, మానసిక ఒత్తిళ్ళు వస్తాయి.
ఈ చక్రం భేదనమ్ అయితే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియ విజయం, విశ్వజనీనత అలవడతాయి. 

అనాహతము అంటే చేయబడని నాదం. ఈ స్థానంలో విష్ణు గ్రంథి ఉన్నది.
మన ప్రమేయం లేకుండా, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రతిరోజూ 21, 600 సార్లు అనాహతనాదం జరుగుతూనే ఉంటుంది.
👉🏻 అదే "హంస" జపం. అదే అజపా జపం. అదే అజప గాయత్రి.

ఈ దళాలకు బీజ మంత్రాలు కం, ఖం, గం, ఘం, ఙం,చం,  ఛం,జం,ఝం,ఞం,టం,ఠం...ఈ పన్నెండు దళాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీకలు.
ఈ సంవత్సర కాలాన్ని 6 నెలలు ఉత్తరాయణం గానూ, 6 నెలలు దక్షిణాయణం గానూ విభాగించారు.

గాయత్రీ మంత్రం లోని సప్త వ్యాహృతులలో ఈ చక్రం యొక్క వ్యాహృతి "ఓం మహః". 
"మహా నిర్వాణ తంత్రం"లో యోగసాధకుడు, మానసిక ఉపాసన చేయుటకు సరియైన స్థానంగా ఇది చెప్పబడినది. శబ్ద బ్రహ్మముగా చెప్పబడే నాదం ఈ అనాహత చక్రమందు వినిపిస్తుంది.

👉🏻 ఈ అనాహత చక్రం ఉత్తేజ పరుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక చీకటి గుహలో"బంగారు వర్ణపు దీప కళిక"కనిపించిన అనుభూతి కలుగుతుంది. 

ఈ అనాహత చక్రం జాగృతమైనప్పుడు ఇతరుల గురించి తెలుసుకొనే లక్షణం పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి ఇంద్రియాలపై ఆధిపత్యం వస్తుంది. ప్రేమ తత్వం అలవడుతుంది.

ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషధములను వినియోగిస్తూ, ఈ చక్ర మధ్యమందు గల బీజాక్షరం "యం" ధ్యానించాలి 

 👉🏻 కుండలినీ శక్తి మేల్కొని అనాహత చక్రాన్ని తాకిన తరువాత ఆ చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. 
క్రమేణా " దీర్ఘ ఘంటానాదం " అనుభూతం అవుతుంది. నిరంతరం "ఓంకార నాదం" అనుభూతికి వస్తుంది.
ఈ అనాహత చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదనము...సమయాలలో వివిధ అనుభవాలు, అనుభూతులు వస్తాయి.

👉🏻 ఈ చక్ర సిద్ధి సమయంలో కొంత మంది ఉత్తమ సాధకులకు మహా కాలుడు మనో భూమికలలో అసంకల్పితంగా దర్శనమిస్తుంటాడు.

👉🏻 కొంత మంది గొప్ప సాధకులకు...ఈ చక్ర జాగృతి, సిద్ధి సమయాలలో మరణ భయం కలిగింది.
శ్రీ రమణులు వారు కూడా ఇలాగే అనుభూతి చెందారు.. అయితే భయపడకుండా సాధన ఆపకుండా ఉంటేనే కుండలినీ శక్తి పై చక్రాలకు ఉద్యమిస్తుంది. భయపడితే అధోగమిత్వం చెందుతుంది.
ఈ చక్రం జయింపబడకుండా ఉండడానికి...అనేక మాయలు అడ్డు తగులుతాయి.

తీవ్ర సాధనలో ద్వాదశ రేకుల " యం " బీజాక్షర యుక్తమైన ఆకుపచ్చని కమలం కనిపిస్తుంది. కొన్ని సార్లు...ఈ చక్ర సిద్ధి సమయంలో హృదయం మధ్యలో కల్పవృక్షం దర్శనం అవుతుంది. అనేక సిద్ధులు అనుభవం అవుతాయి. 

 మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి 
                                  స్వస్తి 🙏🏻



Sekarana https://www.youtube.com/@voiceofmaheedhar/community

No comments:

Post a Comment