Friday, July 24, 2026

 ఆది శంకరాచార్యులు పది ఉపనిషత్తులకు భాష్యములు వ్రాసారు. అందులో బృహదారణ్యకోపనిషత్తు కూడా ఒకటి.

ఆ బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయమునందు రెండవ బ్రాహ్మణమునకు అగ్ని బ్రాహ్మణము అని పేరు. అందులో మొదటి మంత్రము, నైవేహ కిఞ్చనాగ్ర ఆసీన్మృత్యునైవేదమావృతమాసీదశనాయయాశనాయా[1] అని మొదలవుతుంది.

ఈ మంత్రములో 'నైవేహ కిఞ్చనాగ్ర ఆసీత్' అనే వాక్యమునకు 'ఇచట సృష్టికి పూర్వము ఏమీ లేకుండెను' అని అర్థము. ఈ వాక్యములో సృష్టి యొక్క కార్య-కారణ స్వభావాలు చెప్పబడుతున్నాయి. ఈ వాక్య విచారమును చేస్తూ శంకరుల భాష్యము కలదు. 'కిం శూన్యమేవ బభూవ?' అని మొదలై 'తస్మాత్ సదేవ కార్యం ప్రాగుత్పత్తేరితి సిద్ధమ్' అని ముగిసే ఆ వాక్య భాష్యంలో 102 వాక్యాలున్నాయి. ఈ 102 వాక్యాలలో 74 సార్లు 'ఘట' శబ్దము ప్రయోగింపబడినది. అందుకనే ఈ భాష్య భాగమునకు 'ఘట-భాష్యము' అనే పేరు వేదాంత వర్గములలో ప్రసిద్ధికెక్కింది.

'నైవేహ కిఞ్చనాగ్ర ఆసీత్' అనే వాక్యములో సృష్టి యొక్క కార్య-కారణ స్వభావాలు చెప్పబడుతున్నాయి. మన కంటికెదురుగా ఇంతటి జగత్తు కనిపిస్తోంది. ఈ జగత్తు ఉన్నదా, లేనిదా? సరే ఉన్నదే ఐతే, దీని కారణమేమి? ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు వివిధ భారతీయ దర్శన శాస్త్రములు పలు రకములుగా సమాధానము చెప్పినయి. ఐతే సృష్టిని దాని కారణమును నేరుగా విచారణ చేయడము కష్టము. అందుకని వేదాంతులు మట్టి-కుండ అనే దృష్టాంతమును తీసుకుని, మట్టి కారణము, కుండ కార్యము గనుక, వాటి స్వరూప స్వభావాలను విచారణ చేసి, ఆ విచారణ వలన తేలిన సిద్ధాంతమును జగత్తు-జగత్కారణమునకు అన్వయిస్తారు.

ఈ భాష్య పంక్తులలో చేసే విచారణ మట్టి-కుండ ఈ రెండిటితోనే ఉంటుంది. మట్టి-కుండ అనే సాధారణ దృష్టాంతమును తీసుకుని ఎంత గహనమైన విచారము చేయవచ్చునో, ఆ విచార పద్ధతేమిటో ఈ భాష్యము అధ్యయనము చేస్తే తెలుస్తుంది.

నైవేహ కిఞ్చనాగ్ర ఆసీత్ - ఇచట సృష్టికి పూర్వము ఏమీ లేకుండెను. మొదట ఈ వాక్యము శూన్యవాదము వలెనే అనిపిస్తుంది. కానీ శ్రుతి ప్రతిపాద్యమైన వేదాంతమునందు అటువంటి అసత్కారణమును (కారణము లేకుండుట, శూన్యమును) అంగీకరించరు. అందువలన శంకరులు మట్టి-కుండ దృష్టాంతము ద్వారా సత్కార్యవాదము (కారణము కలదు, అదియే సత్) సిద్ధాంతీకరిస్తారు.

ఇందులో ప్రధానముగా రెండు సిద్ధాంతములను నిరాకరిస్తారు. అసత్కారణవాదము - సృష్టికి పూర్వము కారణము ఏమియు లేదు (కాబట్టి సృష్టి కూడా లేనిదే) అని వీరి వాదన. బౌద్ధులందు శూన్యవాదులు, క్షణికవిజ్ఞానవాదులు ఈ కోవలోకి వస్తారు. అసత్కార్యవాదము - సృష్టికి పూర్వము కార్యము ఏమియు లేదు అని అనే వారు. నైయ్యాయికులు, వైశేషికులు, మొదలగు వారు ఈ కోవలోకి వస్తారు. ఈ రెండు సిద్ధాంతములను శంకరులు తప్పని నిరూపిస్తారు.

ఈ చర్చల వలన మనకేమి ఉపయోగము అనుకుంటారేమో. ఉంది. మనలను మనము దేహేంద్రియమనస్సంఘాతముగా తీసుకుంటాము. నేను పుట్టాను, నేను మరణిస్తాను, మధ్యలో నా బ్రతుకు అని మన ఆలోచన. పుట్టుకకు ముందు మనము ఉన్నామా అని అడిగితే లేము అనే మన సాధారణ సమాధానము. మరి మరణము తరువాతో? అప్పుడు కూడా ఉండము. కానీ ఈ అభిప్రాయము తప్పని శ్రుతి బోధ. సృష్టి యొక్క కారణము, మన స్వరూపము రెండూ ఒకటియే అని వేదాంత ప్రతిపాదన. అదెలా అని అడిగి తెలుసుకోవాలని విచారణ చేయదలుచుకున్నవారికి ఈ ఘటభాష్యము సాయం చేస్తుంది.

మట్టి కారణము, కుండ కార్యము. అలాగే సృష్టి అంటే జంతువులు, గ్రహాలు, మనుషులు అన్నీ కుండలాగ కార్యములేగా. ఈ సృష్టికి కారణము యొక్క స్వరూప స్వభావాలు కూడా తెలియాలి, మట్టిలాగ. ఒకరకంగా మనమందరం బోర్లించిన ఘటాకారములోనే కదా ఉండేది. మట్టి-కుండ విచారము ద్వారా వచ్చిన పరిష్కారములను, నిశ్చితములను మన జీవితాలకు కూడా అన్వయం చేసుకుంటే మన స్వరూపము కూడా తేటతెల్లమవుతుంది.

No comments:

Post a Comment