Friday, July 24, 2026

 ఒక సంతకంతో సర్వ ఆస్తి దానం చేయవచ్చు 
ఒక అగ్గిపుల్ల సర్వం  దహనం చేయవచ్చు
అలాగే ఆత్మజ్ఞానంతో  సర్వ కర్మలు తొలగించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. 

ఎంత సంపాదించిన ఆస్తినైనా ఒక సంతకంతో దానం చేయవచ్చు. కొన్ని లారీల కట్టెలను 
ఒక చిన్న అగ్గిపుల్లతో దహనం చేయవచ్చు. అలాగే అనేక జన్మలుగా పేరుకుపోయిన కర్మబంధాలను ఆత్మజ్ఞానమనే జ్ఞానాగ్ని భస్మం చేయగలదు. 

భగవద్గీతలో కూడా
 "జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే" అని చెప్పబడింది. అంటే జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుందని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు.

ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి వేల ఎకరాల భూమి, ఇళ్లు, ధనం సంపాదించాడు. కానీ చివరికి ఒక సంతకం చేసి ఆ ఆస్తినంతా దానం చేయగలడు. సంపాదించడానికి దశాబ్దాలు పట్టినా, బదిలీ చేయడానికి ఒక సంతకం చాలు.

వందల క్వింటాళ్ల కట్టెలు పేర్చినా, వాటిని కాల్చడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. అగ్గిపుల్ల చిన్నదే అయినా దాని ప్రభావం అపారమైనది.

అనేక జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞానం వల్లే కర్మబంధం ఏర్పడుతుంది. ఒకసారి నిజమైన ఆత్మజ్ఞానం కలిగితే, ఆ అజ్ఞానం తొలగి కర్మబంధం నశిస్తుంది.

రాత్రంతా చీకటి ఉన్నా, సూర్యుడు ఉదయించగానే క్షణాల్లో చీకటి మాయమవుతుంది. అలాగే జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం అంతరించిపోతుంది.

ఏళ్ల తరబడి మూసి ఉన్న చీకటి గదిలో ఒక చిన్న లైటు వెలిగిస్తే చీకటి వెంటనే పారిపోతుంది. చీకటిని తరిమేందుకు కర్రలు అవసరం లేదు; వెలుగు చాలు.

భారీ ఇనుప తలుపును బలంతో కాకుండా చిన్న తాళంచెవితో తెరవవచ్చు. సరైన జ్ఞానం కూడా అలాంటి తాళంచెవిలాంటిదే

ఏళ్ల తరబడి కొనసాగిన శత్రుత్వాన్ని ఒక హృదయపూర్వక క్షమాపణ తొలగించగలదు.

చిన్న విత్తనం నుంచి పెద్ద వృక్షం పుడుతుంది. ఆ మహా వృక్షాన్ని కూడా క్షణాల్లో పడగొట్టొచ్చు

ఒక చెడు అలవాటును విడిచిపెట్టాలని తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది.

అలాగే గురువు చెప్పిన ఒక మహావాక్యం, ఒక ఉపదేశం శిష్యుని జీవితాన్నే మార్చి మోక్షమార్గంలో నడిపించగలదు.

ఈ ప్రపంచంలో గొప్ప మార్పులు ఎప్పుడూ పెద్ద పనుల వల్లనే రావు. సరైన సమయంలో చేసిన చిన్న చర్య కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. 

ఒక సంతకం ఆస్తిని మార్చగలదు. 
ఒక అగ్గిపుల్ల కట్టెల గుట్టను భస్మం చేయగలదు. అలాగే ఆత్మజ్ఞానమనే జ్ఞానాగ్ని అనేక జన్మల కర్మబంధాలను భస్మం చేసి జీవునికి ముక్తిని ప్రసాదిస్తుంది.

"జ్ఞానం లేనివాడు కర్మలకు బానిస; 
జ్ఞానం పొందినవాడు కర్మలకు అతీతుడు.
ఇదే ఈ ఉపమానాల పరమార్థం.

సేకరణ

No comments:

Post a Comment