Friday, July 24, 2026

*తండ్రి శుభరాత్రి 🙌రేపు ఉదయం కలుద్దాం*
🟡🔵🔴🟢🙏🟢🔴🔵🟡

*అగ్ని పురాణము నుండి ఈ కథ*

*వరాహావతారం*

మహావిష్ణువు మందిరం వద్ద ఎవరూ లోపలికి పోకుండా జయవిజయులు రెయ్యంబవళ్ళు కాపాలా కాస్తుండేవారు.

ఒకసారి సనకసనందాదులు, మరికొందరు మునివరులూ మహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠం వెళ్ళారు. అప్పుడు జయవిజయులు వారిని లోపలికి పోనివ్వకుండా అడ్డగించారు. మునులకు కోపం వచ్చి, ‘మీరిద్దరూ రాక్షసులుగా మారిపోతారని’ కాపలివాళ్ళను శపించారు. శాపాన్ని ఉపసంహరించవలసిందిగా జయవిజయులు ప్రార్థేయపడగా కరుణించి, ‘మహావిష్ణువు చేతిలో మూడుమార్లు హతులైతే తరువాత మీకు స్వర్గవాసం లభిస్తుందని’ మహర్షులు చెప్పారు.

ఆ సమయంలో కశ్యప మహర్షి సాయంకాలం సంధ్యావందనంలో నిమగ్నమై వున్నాడు. అదే సమయంలో ఆయన భార్య ‘దితి’ మదనపీడితురాలై అందంగా అలంకరించుకుని భర్తను సమీపించింది. కశ్యపుడు దైవప్రార్థనలోనూ, సాయం సంధ్యలోనూ వుండడం వల్ల కామవాంఛ తీర్చుకునేందుకు ఇది సమయం కాదని భార్యకు పలువిధాల నచ్చచెప్పాడు. దితి విన్నదికాదు. చివరికి భార్య కోరిక తీర్చక తప్పలేదు కశ్యపుడికి. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఇద్దరు మగబిడ్డల్ని కన్నది. జయుడు హిరణ్యాక్షుడిగాను, విజయుడు హిరణ్యకశిపుడుగానూ అవతరించారు. వీరిద్దరూ జనసవేళ చెలరేగిన ఉత్పాతాలను చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఇద్దరు రాక్షసోదరులు ప్రపంచాన్ని గడగడలాడించారు. వారు చెయ్యని అకృత్యంగాని, అగడంగాని లేదు. ప్రతి వినాశనానికి వారే మూలహేతువులయ్యారు.

ఒకసారి హిరణ్యాక్షుడికి, దేవతలకూ మధ్య భీకరయుద్ధం జరిగింది. యుద్ధం తారస్థాయికి చేరుకునేసరికి హిరణ్యాక్షుడు భూమిని బంతిలా గుండ్రంగా చుట్టి సముద్రం అడుగుకి తీసుకుని వెళ్ళాడు. భూమి లేకపోయేసరికి కేవలం నీరే మిగిలింది. అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి భూమిని తిరిగి తెవలసిందిగా ప్రార్థించారు.

ఆ సమయంలో విరించిపుత్రుడు స్వాయంభువ మనువు తండ్రికి సేవలు చేస్తూ ఆయన యోగక్షేమాలు చూస్తూ వున్నాడు. బ్రహ్మ కుమారుడి సేవలకు సంతోషించి ‘కుమారా! నీవు దేవిని ప్రార్థించు. ఆమె నిన్ను దీవిస్తుంది. ఆమె దీవెనలు వుంటే నీవు ప్రజాపతివి అవుతావు’ అని చెప్పాడు. స్వయంభువుడు నిర్మలభక్తితో, నిశ్చలదీక్షతో దేవిని గూర్చి కఠోరతపస్సు చేశాడు. జగదాంబ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమంది. ఎటువంటి అనాంతరాలు, అభ్యంతరాలు లేకుండా సృష్టి చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని స్వయంభువుడు దేవిని ప్రార్థించాడు. దేవి అనుగ్రహించింది. మనువు తండ్రి దగ్గరకు వెళ్ళి ‘తండ్రీ! నాకు జగదాంబ ప్రసన్నమైంది. నన్ను ఆశీర్వదించింది. సృష్టి సాగించేందుకు అనువైన ఏకాంత స్థలాన్ని చూపించు’ అని కోరాడు. భూమినంతటినీ ఉండలా చుట్టేసి హిరణ్యాక్షుడు తనవెంట తీసుకువెళ్ళడం వలన బ్రహ్మదేవుడికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఆదినారాయణుడు మాత్రమే దీనికి తగిన మార్గం చూపగలడనుకున్నాడు. బ్రహ్మ, మహర్షులూ, మానవులూ అందరూ కలిసి మహావిష్ణువును ప్రార్థించారు.

బ్రహ్మ నిట్టూర్పులకు ఆయన ముక్కునుంచి ఒక సూకరం బయటకు వచ్చింది. అది గాలిలో నిలబడి ఇంతింతై అన్నట్టు పెరిగి పెద్దదైంది. ఏనుగంత ఎత్తుకు ఎదిగింది. క్రమాలమీద పర్వతాలా మారిపోయింది. వరాహాన్ని చూసి బ్రహ్మకే ఆశ్చర్యం వేసింది. పెద్దపెట్టున భయంకరంగా ఫీంకరించింది. జనలోక, సత్యలోకవాసులు అది మహావిష్ణువు చేసిన పనేనని గ్రహించారు. వారందరూ నారాయణమూర్తిని కీర్తించి ఆయన లీల్ని మననం చేసుకున్నారు. సూకర రూపంలో వున్న మహావిష్ణువు అవన్నీ విని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసి మళ్ళీ భయంకరంగా రాదచేసి బలంగా సముద్రంలోకి దడదడదడదడదూకాడు. ఆ వేగానికి వరుణుడు తట్టుకోలేకపోయాడు. ‘రక్షించు తండ్రీ’ అంటూ విష్ణువును ప్రార్థించాడు.

ఆ దివ్య సూకరం భూమిని వెతికి పట్టుకునేందుకు సముద్రం లోపలికి వెళ్ళింది. చివరికి భూమిని పసిగట్టింది. మెల్లగా తన పొడుగాటి దంతాలతో దానిని గట్టిగా పట్టి బయటకు తెచ్చింది. మధ్యలో హిరణ్యాక్షుడు అడ్డపడ్డాడు. భీకరమైన పోరులో అసురుణ్ణి అణచిన వరాహావిష్ణువు భూమిని తీసుకుని సముద్రం పైకి తేలియాడుతూ వచ్చాడు. భూమి అడుగున నీరు వుండేలా మహావిష్ణువు నేలను గట్టి చేశాడు. నీటిపై తామరాకులా తేలిన భూమిలో బ్రహ్మ తన కుమారుడికి స్థానం కల్పించాడు.

🟡🔵🔴🟢🙏🟢🔴🔵🟡

No comments:

Post a Comment