నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవి అన్న శ్రీ శ్రీ గారి వాక్య అర్ధం?
శ్రీశ్రీ గారి పేరు వింటే కణకణాలు వైప్లవ్య గీతాల రుధిరాన్ని ప్రవహిస్తాయి. ముఖ్యంగా 1933 లో ఆ మహాకవి వ్రాసిన జయభేరి కవితలో "నేను సైతం భువనఘోషకు వెఱ్ఱిగొంతుక విచ్చి మ్రోసాను" అనే పంక్తులు అత్యంత శక్తివంతమైనవి. ఇందులో ‘భువనఘోష’ అంటే ఈ ప్రపంచంలో వినిపించే ఆర్తనాదాలు, ఆక్రందనలు అని అర్థం. సమాజంలో ఉన్న పేదరికం, ఆకలి, అన్యాయం, అణచివేతకు గురవుతున్న కోట్లాది మంది సామాన్య ప్రజల బాధల తాలూకు సామూహిక ధ్వని అది. ఇక ‘వెర్రిగొంతుక విచ్చి మ్రోసాను’ అంటే లోకం దృష్టిలో పిచ్చిగా అనిపించే అంతటి తీవ్రమైన ఆవేశంతో, ఆక్రోశంతో ఆ బాధలకు వ్యతిరేకంగా గొంతు విప్పి గట్టిగా అరిచాను/ మ్రోసాను అని అర్థం.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక కడుపులోంచి ఉప్పొంగిన ఆవేదనే ఆ వెఱ్ఱి గొంతుక. సమాజంలో మార్పు కోసం, పీడిత ప్రజల తరఫున జరిగే సామూహిక పోరాటంలో తాను కూడా భాగమయ్యానని, నా వంతుగా నా గొంతుకను కలిపి గట్టిగా నా నిరసనను వినిపించానని శ్రీశ్రీ చెప్తున్నారు.
మొత్తంగా ఈ వాక్యం ద్వారా శ్రీశ్రీ ఇచ్చే సందేశం ఏమిటంటే— సమాజంలో మార్పు కోసం జరిగే మహా యజ్ఞంలో ఒక కవిగా ‘నా వంతు పాత్రను నేను పోషించాను’ అని ప్రకటించుకుంటూనే, లోకంలోని అన్యాయాలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్పందించాలని, ఆ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రబోధిస్తున్నారు. మనిషిలో కలిగే భావ చైతన్యమే సమాజంలో వచ్చే పెనుమార్పుకి చిరు విత్తనం.
No comments:
Post a Comment